రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, జులై 2023, గురువారం

1348 : రివ్యూ!

 


రచన-దర్శకత్వం: అనిల్ కృష్ణ కన్నెగంటి
తారాగణం : అశ్విన్ బాబు, నందితా శ్వేత, సాహితీ అవంచ, విద్యుల్లేఖా రామన్, సంజయ్ స్వరూప్,రాజీవ్ కనకాల శుభలేక సుధాకర్, శ్రీనివాస రెడ్డి, రఘు కుంచె తదితరులు
సంగీతం: వికాస్ బాడిస, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్
సమర్పణ : అనిల్ సుంకర, బ్యానర్: ఎస్వీకే సినిమాస్, నిర్మాత: గంగపట్నం శ్రీధర్
విడుదల తేదీ :  జూలై 20, 2023
***

        వారం ట్రైలర్స్ తో, ప్రమోషన్స్ తో ఉత్కంఠ రేపిన హిడింబ అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజుగారి గది హార్రర్ కామెడీల్లో నటించి పరిచయమైన అశ్విన్ బాబు ఈ సారి వైవిధ్యమున్న సినిమాలో నటించడం, అదీ యాక్షన్ హీరోగా కొత్త మేకోవర్ రో ప్రత్యక్షమవడం ఆసక్తి కల్గించే విషయమే. అయితే ఈ ప్రయత్నంలో వైవిధ్యం ఎంత వరకూ వుంది? ప్రచార ఆర్భాటం ఎంతవరకూ సబబన్పించుకుంది? ఇవి పరిశీలిద్దాం...  

కథ

అభయ్ (అశ్విన్ బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీసు ట్రైనింగ్ పొందుతున్న సమయంలో ప్రేమలో పడి తర్వాత విడిపోతారు. అభయ్ నగరంలో ఎస్సైగా పని చేస్తూంటాడు. నగరంలో యువతులు సీరియల్ కిడ్నాప్స్ కి గురవుతూంటారు. ఈ కేసుని దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం కేరళ నుంచి ఆద్యాని పిలిపిస్తుంది. ఆద్య ఇప్పుడు ఐపీఎస్. కేసులో ఆమెకి సహాయంగా అభయ్ ని నియమిస్తుంది ప్రభుత్వం. ఇద్దరూ దర్యాప్తు చేసి కాలా బండలో బోయ అనే క్రిమినల్ ని పట్టుకుని యువతుల్ని విడిపిస్తారు.      

అయినా ఇంకో యువతి కిడ్నాప్ అయ్యేసరికి, మిస్సయిన 16 మంది యువతులు వేరని, బోయ బంధించిన యువతులు వేరనీ గుర్తిస్తుంది ఆద్యా. అంతే గాక ఆ కిడ్నాపర్ ఎరుపు దుస్తులేసుకున్న యువతుల్ని అపహరిస్తున్నాడని తెలుసుకుంటుంది. ఎవరా కిడ్నాపర్? ఎక్కడున్నాడు? అండమాన్ దీవుల్లో ఆదిమ జాతి హిడింబకి ఈ కిడ్నాప్స్ తో వున్న సంబంధమేమిటి? ఈ కేసుని ఎలా ఛేదించారు ఆద్యా, అభయ్? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

హార్రర్ జానర్ లో సబ్ జానర్ కిందికి కానబలిజం (నరమాంస భక్షణ) సినిమాలొస్తాయి. 1965 -1980 ల మధ్య హాలీవుడ్ నుంచి విపరీతంగా కానబలిజం సినిమాలొచ్చాయి. దాన్ని కానబలిజం బూమ్ అన్నారు.1965 లో నేకెడ్ ప్రే తో ఈ బూమ్ ప్రారంభమయింది. శ్వేత జాతీయుడ్ని ఆఫ్రికన్ నరమాంస భక్షక తెగ వెంటాడి పట్టుకుని తినేసే కథతో ఈ సినిమా తీశారు. తర్వాత ఈ టెంప్లెట్టే  నరమాంస భక్షక థ్రిల్లర్స్ కి బ్లూప్రింట్గా మారింది. అరణ్యంలో టూర్ కెళ్ళి నరభక్షకుల పాలబడి తప్పించుకురావడంగా, లేదా బలై పోవడంగా ఈ కథలుంటాయి.
       
1980 లలో బూమ్ ముగిసినా
, తర్వాత  అడపాదడపా ఈ తరహా సినిమాలు వస్తూనే వున్నాయి. తమిళంలో 2010 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ (వెయ్యి మందిలో ఒక్కడు) వచ్చింది. దీన్ని చోళ రాజుల నాటి చారిత్రక నేపథ్యంలో తీశారు.
       
నరమాంస భక్షణతో జుగుప్స
, వికారం, గగుర్పాటు కల్గించే కానబలిజం సినిమాలన్నీ హార్రర్ సబ్ జానర్స్ కి  పరాకాష్ఠ. మన దేశంలో కేవలం అండమాన్ దీవుల్లోని ఒక దీవిలో జరావా అనే తెగ ఏకైక నరభక్షక తెగగా వుంది. నిజానికి అండమాన్ దీవుల్లో వున్న ఆదిమవాసులు పదివేల సంవత్సరాల క్రితం మానవావిర్భావం జరిగిన ఆఫ్రికా నుంచి ఒక పాయగా విడిపోయి వచ్చి అండమాన్స్ లో స్థిరపడ్డారు. మరి కొందరు వివిధ ఖండాలకి వలస పోయారు. అండమాన్స్ కి వచ్చిన సమూహాలు  ఉపఖండమంతా విస్తరించారు. కాబట్టి మన పూర్వీకులు ఇప్పుడు అండమాన్స్ లో నివాసమున్నఆదిమ తెగలేనని శాస్త్రవేత్తలు తేల్చారు. మనమంతా వాళ్ళమే!!
        
అక్కడ వుంటున్న సంతతి నాగరిక ప్రపంచంలోకి రారు. నాగరికులు వెళ్తే ప్రతిఘటిస్తారు. ప్రభుత్వాలు వాళ్ళని నాగరిక ప్రపంచంలోకి తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ ప్రయత్నాల్లో కొందరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాటి ప్రయత్నం చేస్తే తెగలు చంపేస్తాయి. ప్రభుత్వం ఆ ప్రాంతం టూరిస్టులకి నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది.
       
ఇప్పుడు నరభక్షక జరావా తెగకి హిడింబా అనే కల్పిత పేరు పెట్టి ఈ సినిమా తీసినట్టున్నారు. అయితే జరావా తెగ పరాయివాళ్ళు తమవైపు వస్తే ప్రాణాలు తీస్తారేమోగానీ
, వాళ్ళు నాగరిక ప్రపంచంలోకి వచ్చి మనుషుల్ని ఎత్తుకుపోయి తినరు. ఈ దృష్ట్యా ఈ కథ అసహజంగానే గాక, జరావా తెగపట్ల, మన మూలాల పట్లా అన్యాయంగానూ అన్పిస్తుంది.
       
కాన్సెప్ట్ ఇలావుంటే దీంతో చేసిన కథ అమెచ్యూరిష్ గా వుంది. పైగా గతంలో జ రిగింది
, వర్తమానంలో జరిగింది నాన్ లీనియర్ కథనం (మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్) తో చెప్పడం చాలా గందరగోళానికి దారితీసింది. ఫస్టాఫ్ కేవలం కిడ్నాపులు, దర్యాప్తు- వీటితోనే సాగుతూ, ఈ దర్యాప్తు కూడా పేలవంగా, అర్ధరహితంగా, లాజిక్ లేకుండా సాగడంతో, మధ్యమధ్యలో ఆసక్తి కల్గించని లవ్ ట్రాక్ వచ్చి జొరబడడంతో -ట్రైలర్స్, ప్రమోషన్స్ హంగామా అంతా తాటాకు చప్పుళ్ళేనని స్పష్టమైపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ఏ మాత్రం వైవిధ్యంలేని పాత మూస ఫార్ములా చిత్రణగా తేలిపోతుంది.
       
ఇక సెకండాఫ్ లో అసలు కథలో కొచ్చాకైనా కథనం దారిలో పడదు. రెండు ట్విస్టులు మాత్రం బావుంటాయి.
అండమాన్ దీవుల్లోని హిడింబా తెగ కథకి ముడిపెడుతూ చూపించిన ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత క్లయిమాక్స్ కి ముందు అంతరించిపోయిన హిడింబ తెగ మిగిలున్న వారసుడు రివీలయ్యే ట్విస్టూ మంచి బ్యాంగ్ నిస్తాయి. వీటితో ఈ కానిబాలిజం థ్రిల్లర్ మంచి థ్రిల్ నిస్తుంది. ఈ రెండు బలమైన పాయింట్లు చేతిలో వుంచుకుని వీటిని ప్లే చేసే విషయంలో దర్శకుడు ఎందుకు ఫెయిలయ్యాడో హిడింబాలకే తెలియాలి.
       
ఈ కాన్సెప్ట్ లో విషయముంది. ఎలా చెప్పాలో తెలియక వీగిపోయింది. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు
, కాలా బండలో కేజీఎఫ్ టైపు యాక్షన్ సీన్లు, సెకండాఫ్ లో యాక్షన్ సీన్లూ- వీటితో హడావిడి చేస్తే లోపాలు కవరై పోతాయనుకున్నట్టుంది- ఇంకా చూడడానికి జుగుప్స కల్గించే దృశ్యాల వల్లా – ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకూ రాని సినిమా చూసినట్టు ప్రేక్షకులు ఫీలై పోతారనుకున్నట్టుంది- అంత సీను మాత్రం లేదు. ఈ బీభత్సాన్ని బోయపాటి శ్రీను తీసివుంటే ఇంకోలా వుండేది. అన్నట్టు ఈ సినిమాలో బోయపాటిని అనుకరించడమూ వుంది.

నటనలు-సాంకేతికాలు

అశ్విన్ బాబు మేకోవర్ తో యాక్షన్ సీన్స్ కి తప్ప, ఎమోషనల్ సీన్స్ కి సరిపోలేదు. క్లయిమాక్స్ ట్విస్ట్ ని మాత్రం బాగా హేండిల్ చేయగలిగాడు. కానీ క్లయిమాక్స్ యాక్షన్ సీన్లు అతడితో చాలా అతి అన్పిస్తాయి బోయపాటి లెవెల్ తో. ఇక పోలీసు అధికారిగా ఫస్టాఫ్ లో నటన ఫరవాలేదుగానీ, ఆ దర్యాప్తులో విషయం లేక తేలిపోయాడు.  అలాగే రోమాంటిక్ సీన్స్ లో. ఐపీఎస్ గా నందితది మాత్రం పాత్రని నిలబెట్టే నటన. టాలెంట్ వున్న నటి.
       
ఇతర నటుల్లో మకరంద్ దేశ్పాండే పాత్ర
, నటన బలమైన ముద్ర వేస్తాయి. సహాయ పాత్రల్లో ఇతర నటులు కథకి తగ్గట్టు వుంటారు- అది కథ అనుకుంటే. సంగీతం లౌడ్ గా బి గ్రేడ్ సినిమా టైపులో వుంటే, ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వుంటాయి.
       
తొలిసారిగా కానబలిజం సినిమా చూపిస్తున్నప్పుడు జానర్ మర్యాదలు పాటించకుండా మూస ఫార్ములా ధోరణిలో చుట్టేయడం
, క్లయిమాక్స్ తో కాన్సెప్ట్ నిలబడినా ముగింపుని నిర్లక్ష్యం చేయడం వంటి కారణాలతో హిడింబ  చేజారిన యూనిక్ జానర్ గా మిగిలింది...

—సికిందర్