రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, November 26, 2019

892 : స్క్రీన్ ప్లే సంగతులు -2


   మరోసారి కథ : ముస్కాన్ అనే రిసెర్చర్ అమెరికా నుంచి వచ్చి, జార్జి రెడ్డి మీద తీయాలనుకుంటున్న డాక్యుమెంటరీ గురించి అతడి జీవితాన్ని శోధించడం మొదలెడుతుంది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా జార్జిరెడ్డి కథ వస్తూంటుంది. అతను కేరళలో జన్మించాడు. తల్లి వుంటుంది. చిన్నపుడే కర్రసాము, కత్తి సాము నేర్చుకున్నాడు. బ్లేడుతో గాయపర్చడం నేర్చుకున్నాడు. చదువులో ముందుంటాడు. ఇలా పెద్దవాడై, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరతాడు.  అప్పటికే యూనివర్సిటీలో రెండు విద్యార్ధి సంఘాలుంటాయి. వాటిలో ఒకటి ఎబిసిడి (ఎబివిపి పేరు మార్చారు. అప్పట్లో ఎబివిపి లేదు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ వుండేది). ఈ రెండు సంఘాలూ కొట్టుకోవడమే పని. హాస్టల్లో భోజనాల దగ్గర్నుంచీ ప్రతీదానికీ కొట్లాటలే. ర్యాగింగ్, ఈవ్ టీజింగులు, కుల వివక్ష, ఆర్ధిక అసమానతల అశాంతీ, ఇవన్నీ చూసి తిరగబడతాడు జార్జిరెడ్డి. విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఇంకో పక్క ఇతనంటే ప్రేమ పెంచుకున్న మాయా అనే నార్త్ అమ్మాయి వుంటుంది. ప్రత్యర్ధుల హింసకి హింసే సమాధానంగా చేసుకున్న జార్జి రెడ్డి పీడీఎస్ (అతడి మరణానంతరం పీడీఎస్ యూ - ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వెలిసి, జాతీయంగా విస్తరించి ఇప్పుడూ క్రియాశీలంగా వుంది) అనే విద్యార్ధి సంఘాన్ని స్థాపించి, ఎన్నికల్లో గెలుస్తాడు. దీంతో సదరు రెండు సంఘాలు కక్ష గడతాయి. అతణ్ణి చంపేందుకు ఒకసారి విఫలయత్నం చేసి, రెండో సారి చంపేస్తారు. ఇదీ కథ. 
          కేరళలో జార్జి రెడ్డి చిన్నప్పట్నుంచీ కథెత్తుకున్నారు. తల్లి, తను మాత్రం వుంటారు. చదువులో ముందుంటాడు. కర్రసాము, కత్తి సాము నేర్చుకుంటాడు. బ్లేడుతో ఒకడి మీద దాడి చేస్తాడు. పెద్దయ్యాక హైదరాబాద్ వచ్చినట్టు సిటీ బస్సులో చూపిస్తారు. బస్సులో ఆకతాయిలు హీరోయిన్ మాయని అల్లరి పెడుతూంటే అడ్డుకుని హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడు. ఆ నైట్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చేరతాడు. రూమ్మేట్స్ పరిచయమవుతారు. మెస్ లో రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. జార్జి రెడ్డి మీద తప్పుడు కంప్లెయింట్ ఇస్తారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో వుంటాడు. కంప్లెయింట్ ఇచ్చింది రైట్ వింగ్ ఎబిసిడి గ్రూపు. ఈ రైట్ వింగ్ గ్రూపు లీడర్ సత్య. ఇంకో గ్రూపు లీడర్ కౌషిక్. ఇతడికి అధికార పార్టీ ఎమ్మెల్యే అండ వుంటుంది.
          క్యాంపస్ లో మాయ జార్జి రెడ్డి ని చూసి అభిమానిస్తుంది. బస్సులో తనని కాపాడినందుకు ఈ అభిమానం. మళ్ళీ రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. సీనియర్లు జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తారు. జార్జి రెడ్డిని కూడా ఏదో అంటే కొడతాడు. కౌషిక్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తాడు. యూనివర్సిటీ డీన్ జార్జి రెడ్డిని సంవత్సరం పాటు బహిష్కరిస్తాడు. జార్జి రెడ్డి చదువు మీద శ్రద్ధ పెడతాడు. మళ్ళీ రెండు గ్రూపులు స్కాలర్ షిప్పుల గురించి కొట్టుకుంటాయి. మాయ జార్జి రెడ్డితో మాట కలుపుతుంది. క్లాస్ రూమ్ లోకి ఓ గ్రూపు జొరబడి వచ్చి స్టూడెంట్స్ ని కొడతారు. వాళ్ళు ఔట్ సైడర్స్ అని తెలుసుకుని జార్జి రెడ్డి వాళ్ళని కొట్టి తరుముతాడు. ఇంతలో ఒక స్టూడెంట్ ర్యాగింగ్ చేస్తున్నారని జార్జి రెడ్డికి కంప్లెయింట్ చేస్తే వెళ్లి కొడతాడు. జార్జి రెడ్డి ఇప్పుడు నోట్లో బ్లేడు వుంచుకుని తిప్పుతూంటాడు. 
         మళ్ళీ గ్రూపులు కొట్టుకుంటాయి. ఎగ్జామ్స్ లో చీటింగ్ చేసి దొరికిపోయిన స్టూడెంట్ గ్రూపుతో ఇన్విజిలేటర్ ని కొట్టిస్తాడు. రిజల్ట్స్ వస్తాయి. జార్జిరెడ్డి పాసవుతాడు. రిజల్ట్స్ దగ్గర మళ్ళీ రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. ఇన్విజిలేటర్ ని కొట్టినందుకు జార్జి రెడ్డి ఫైర్ బాల్ ఫైట్ చేసి గ్రూపుని కొడతాడు. జార్జి రెడ్డి విద్యార్హతల్ని గుర్తించి బాంబే (ముంబాయి) నుంచి ఒక పెద్ద ఆఫర్ వస్తుంది. నువ్విక్కడే వుండి  స్టూడెంట్స్ ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాడాలని ఫ్రెండ్ అంటే వుండి పోతాడు. స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగించడానికి జార్జి రెడ్డి మీటింగ్ పెడుతోంటే 50 మంది కూడా రారు. మీటింగ్ ని అడ్డుకోవడానికి ఎబిసిడి గ్రూపు వాళ్ళు ప్రయత్నిస్తారు. మీటింగ్ పెడితే ఐదువేల మంది వస్తారు. అన్యాయాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రసంగిస్తాడు జార్జి రెడ్డి. దీంతో ఇంటర్వెల్ పడుతుంది.
ఉపోద్ఘాత విఘాతం
         ఇదీ ఫస్టాఫ్ కథ. ఈ ఫస్టాఫ్ అంతా  కథలో బిగినింగ్ విభాగమే అనుకున్నాకూడా ఇంటర్వెల్లో జార్జి రెడ్డి చేసిన ప్రసంగం సీను ప్లాట్ పాయింట్ వన్ సీను కాలేదు, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటూ కాలేదు. జార్జి రెడ్డికి ప్రత్యర్ధులతో ఒక ప్రధాన సమస్య గురించి సంఘర్షణ కూడా ఫస్టాఫ్ లో ఎక్కడా ప్రారంభం కాలేదు. అన్నీ చిల్లర దొమ్మీలే. ఇక సమస్యే ఏర్పాటు కానప్పుడు దాన్ని సాధించాలన్న గోల్ కూడా జార్జి రెడ్డి కేర్పడలేదు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా, ఇంటర్వెల్లో కూడా ఈ ‘బయోపిక్’ కథే ప్రారంభం కాలేదు. 

          ఇలా ఈ ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో చూపించిన సీన్లన్నీ ప్రారంభమవాల్సిన కథకి  ఉపోద్ఘాతమే. ఈ ఉపోద్ఘాతానికి ఉపోద్ఘాత లక్షణాలు కన్పించవు. ఒక దిశా గమ్యం లేకుండా ఏవో సీన్లు ఎందుకో పేర్చుకుంటూ పోయారు. ఈ కాన్సెప్ట్ కి సంబంధంలేని బోలెడు అనవసర సీన్ల మీద బడ్జెట్ దండగైంది. బిగినింగ్ విభాగంలో  ఉపోద్ఘాతపు లక్షణాలేమిటి? 1. కథా నేపథ్యపు ఏర్పాటు, 2. పాత్రల పరిచయాలు, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 4. దీంతో సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్), 5. తద్వారా హీరో పాత్రకి  గోల్ - ఇంతేగా? 

          ఈ కనీసావసరా లేవీ ఫస్టాఫ్ లో లేవు. అంటే స్క్రీన్ ప్లేనే లేదన్న మాట. మరేముంది? చైల్డ్ ప్లే వుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చిన్న పిల్లల స్థాయికి దిగజారి చిల్లర పంచాయిలతో తూతూ  - మై మై అని కొట్టుకోవడమే వుంది. ఈ ఫస్టాఫ్ 70 నిమిషాల్లో ఇలా ఒకటీ రెండూ కాదు, ఏకంగా పన్నెండు సార్లు తొండి పంచాయితీలతో ఒకటే తన్నుకుంటారు! అంటే సగటున 6 నిమిషాలకో కొట్లాట! ఇది ఒక పద్ధతైన సినిమా కథ చెప్పడంలా వుండదు. పక్కా యాక్షన్ సినిమా కూడా ఇన్ని ఫైట్లతో వుండదు. 

         తెలంగాణాలో ఆ రోజుల్లో వుండిన బకాల్వాడీ బడుల్లో పిల్ల కాయలు పలక కోసం, బలపం పెట్టుకునే తొండి తగాదాలూ, చిల్లర కొట్లాటల్లా వుంది యూనివర్సిటీ స్థాయి స్టూడెంట్స్ తో చిత్రీకరణ. కోట శ్రీనివాసరావు స్టయిల్లో - శవ్వ! శవ్వ! - అని ఉస్మానియా పరువంతా పోయింది. ఒక కాలంలో - ఒక వీసీ జమానాలో - ఉస్మానియా డిగ్రీలంటే విశ్వసనీయత కోల్పోయి నవ్వులాటగా మారిందిగానీ, ఉస్మానియా స్టూడెంట్లంటే చిల్లర వ్యవహారమని ఎప్పుడూ పేరుబడ లేదు. సినిమాలో చూపించిన విధానం ఇలాగే  వుంది. 

         చెబుతున్న కథ జార్జి రెడ్డి లెఫ్ట్ ఓరియెంటేషన్ గురించై నప్పుడు, సరీగ్గా ఆ కాలంలో శ్రీకాకుళం నుంచి నక్సల్బరీ ఉద్యమ ప్రభావం ఉస్మానియా మీద పొడసూపుతున్నప్పుడు, ఆ సంబంధిత వాతావరణం ప్రతిఫలించే ఉస్మానియా బ్యాక్ డ్రాప్ లో కథా నేపథ్యం ఏర్పాటు చేయాల్సింది పోయి, బకాల్వాడీ బడి సిగపట్ల లపాకీ వ్యవహారం చేశారు.  
పాత్ర చిత్రణ వైఫల్యం
        జార్జి రెడ్డి జార్జి రెడ్డిగా తయారయ్యింది ఉస్మానియాలో అడుగు పెట్టాకనే. అంతకి ముందు అతడికే భావజాలమూ లేదు. ఒక బ్రిలియెంట్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే. సినిమాలో చిన్నప్పుడే భావజాల బీజం పడినట్టు అదేదో అనాలోచిత కల్పన చేశారు. చిన్నప్పుడు తల్లి పనిగట్టుకుని భగత్ సింగ్ పుస్తకం చూపించి చెబుతుంది. అది అప్పుడే అతడి లెఫ్ట్ భావజాలానికి బీజం కాదు. ఆ తల్లికి అతనొక్కడే సంతానం కాదు. ఇంకా నల్గురున్నారు. తల్లి కేరళకి చెందిన క్రిస్టియన్ లీలా వర్ఘీస్. ఆమె తల్లి ప్రధానోపాధ్యాయురాలు, తండ్రి న్యాయమూర్తి. జార్జి రెడ్డి తండ్రి చిత్తూరుకి చెందిన రఘునాథ రెడ్డి. వాళ్ళ మతాంతర వివాహం చాలా కష్టాలు తెచ్చి పెట్టింది వెలివేత సహా. జార్జి రెడ్డి ఎనిమిదేళ్ళప్పుడు తండ్రి విడిపోవడంతో, పిల్లల్నితీసుకుని తల్లి ఊరూరా తిరిగేది ఉదర పోషణకు. అప్పుడు సమాజం నుంచి చాలా కుల వివక్షా, అవమానాలూ చవి చూశాడు. అదే అతడిలో బీజాన్ని నాటింది.  ధిక్కార స్వభావాన్ని పెంచింది. అలాటి దుర్భర పరిస్థితుల్లోనూ చదువులో ముందున్నాడు.  
         
          అప్పుడు పడ్డ ఈ  బీజం ఉస్మానియాలో ఎంటరయ్యాక, నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో మెల్లగా మొలకెత్తడం ప్రారంభించింది. భగత్ సింగ్, చేగు వేరాలు అప్పుడే తెలిశారు, చిన్నప్పుడు కాదు. కానీ అతడి స్ఫూర్తికి ఈ సుదూర విప్లవకారులు కాక, సమీప శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమం కారణమైంది.  
          సినిమాలో చిన్నప్పుడు కర్రసాము, కత్తి సాము, బ్లేడుతో దాడులు నేర్చుకున్నట్టు చూపించారు. కారణం లేకుండా చూపించారు. దీంతో క్యారక్టర్ నెగెటివ్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఈ చర్యల వెనుక మానసిక కారణాలు చూపించి వుంటే నెగెటివిటీకి ప్రేక్షకుల నుంచి ఎమోషనల్ సపోర్టు లభించేది. వివక్షతో, వెలివేతతో గడిచిన అతడి దుర్భర బాల్యం చూపించకుండా - అందమైన కేరళ ప్రకృతి దృశ్యాల మధ్య పోయెటిక్ గా, హాయిగా గడిచినట్టు అతడి బాల్యాన్ని తప్పుగా చూపించారు. అతడి బాల్యం పోయెటిక్ గా, హాయిగా ఏమీ గడవలేదు. అదే అతను పెద్దవాడయ్యాకా వెంటాడింది. అతను దుర్భర బాల్యంతో రాజీ పడలేదు, దాన్ని మర్చి పోలేదు. అతడ్ని చిన్నప్పటి ఈ కసి పుట్టిన జార్జి రెడ్డియే పెద్ద వాడయ్యాకా డ్రైవ్ చేశాడు. అందుకే ఆవేశం తప్ప ఆలోచన లేకుండా ప్రవర్తించాడు. యూనివర్సిటీలో ప్రతీ ఒక్కడ్నీ తన్నడం చేశాడు. తన బాల్యానికి న్యాయం చేసుకోవాలన్న బేసిక్ ఇన్ స్టింక్ట్ తో వుండిపోయాడు. లెఫ్ట్ భావజాలాన్ని ఒంట బట్టించుకున్నా, బాల్యాన్ని మర్చిపోలేక పోయాడు. బాల్యాన్ని క్షమించుకుని వుంటే, విద్యార్ధి నాయకుడుగా మెచ్యూరిటీతో ప్రవర్తించే వాడు. ఆలోచనలేని - అర్ధంలేని ఆవేశమే ఆయుధంగా తన చావు తనే తెచ్చుకునే వాడు కాదు. జార్జి రెడ్డి గురించి ఎక్కడెక్కడి సమాచారం కూడేసి చదివితే, అతడి గురించి చాలా పూర్వం క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించిన సినిమా మిత్రుడ్నీ సంప్రదిస్తే, జార్జి రెడ్డి క్యారక్టర్ గురించి మనకందే అంచనా ఇది. 
           ఈ సర్కిల్ ఆఫ్ బీయింగ్ జార్జి రెడ్డి ది. అతడి పాత్ర ఈ మానసిక, భౌతిక నేపథ్యాల సర్కిల్ ఆఫ్ బీయింగ్ లోంచి ప్రారంభమయింది చిన్నప్పుడు. ఈ బాల్యాన్ని ఎప్పుడు చూపించాలి? బయోపిక్ అంటే బాల్యం నుంచీ కథ ఎత్తుకోవడం కాదు. కానీ ఈ సినిమాలో బాల్యం నుంచే రొటీన్ టెంప్లెట్ ఫార్ములాగా చూపించారు. దీనివల్ల బయోపిక్ జానర్ మర్యాద తప్పడమే గాక, సినిమా నిడివి పెరిగిపోయింది. సినిమాల నిడివి రెండున్నర గంటలు దేనికి? ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ శరవేగంగా తగ్గిపోతున్నప్పుడు సినిమా నిడివి రెండు గంటల పది నిమిషాలు చాలు. కానీ ఈ మధ్య లపాకీ సినిమాలు కూడా రెండున్నర గంటలు పైబడి వుంటున్నాయి. వాటిలో ఏదో అమృత రసమున్నట్టూ, ప్రేక్షకులు బాగా జుర్రుకుని అమరత్వం సాధించాలన్నట్టూ, కిలోమీటర్ల పొడవుతో  చీకుడు సినిమాలు తీసి పడేస్తున్నారు. తీసెదే అట్టర్ ఫ్లాప్స్, అందులో బడ్జెట్ దుబారా!
         బయోపిక్ అంటే ఆ వ్యక్తి దేని గురించి చరిత్రలో నిలిచాడో ఆ అంశం సమీప, సంబంధిత సంఘటనలతో కథ నెత్తుకోవడం. సంఘటనల్ని చకచకా ఆ అంశం దగ్గరికి చేరేసి, సమస్యా - గోల్ - సంఘర్షణా చూపించెయ్యడం. ఇంత సింపుల్. ఆ అంశంతో బాల్యానికి సంబంధముంటే, మధ్యలో ఎక్కడైనా మాంటేజ్ వేసి కనెక్ట్ చేసి చేతులు దులుపుకోవడం, అంతే. లాలి పాటతో ఉయ్యాల్లో బయోపిక్ నెత్తుకుని స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారంటే అది అచ్చ అమూల్ బేబీ సినిమా. 
బ్యాక్ డ్రాప్ ట్రబుల్
          ఒక కార్య క్షేత్రంలోకి పాత్ర ఎంటరవుతోంటే సీను రక్తి కట్టాలంటే, విజువల్ గా వుండాలంటే, ముందా కార్య క్షేత్రాన్ని కాంట్రాస్ట్ గా లేదా యాంటీగా ఎస్టాబ్లిష్  చేస్తారు. దీన్నే సిడ్ ఫీల్డ్ against the grain అన్నాడు. ‘శివ’ లో శివగా నాగార్జున కాలేజీలో  ఎంటరయ్యే ముందే కాలేజీ మీద మాఫియా భవానీ ప్రాబల్యాన్ని చూపిస్తారు. విద్యాలయం విద్య కోసం వుంటుంది, మాఫియాల కోసం కాదు. ఈ కాంట్రాస్ట్ అన్నమాట. మాఫియాల అడ్డా అయిన కాలేజీలోకి తెలియక చదువుకోవడానికి శివ ఎంటరవడం. దీనికిదే ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుందీ సీను.

           జార్జి రెడ్డి ఇలా ఎంటరవడు. రాత్రిపూట నడుచుకుంటూ వచ్చి హాస్టల్లోకి మామూలుగా వెళ్ళిపోతాడు. చాలా బలహీన దృశ్యం. బలహీనంగా హాస్టల్ కాదు ఇక్కడ చూపించాల్సింది - బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణాన్నిఎస్టాబ్లిష్ చేయాలి. జార్జి రెడ్డి రాకముందే ఉస్మానియాలో మతవాద రైట్ వింగ్ సంఘం ప్రాబల్యముంది. ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళదే హవా. అలాటి కార్యక్షేత్రంలోకి జార్జి రెడ్డి ఎంటరవుతున్నాడు. ఏ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లోంచి వచ్చి ఎంటరవుతున్నాడు? కుల వివక్ష నెదుర్కొన్న బాల్యపు దురనుభవాల్లోంచి ఒక మెరిట్ విద్యార్థిగా ఎంటరవుతున్నాడు. కాంట్రాస్ట్ కుదిరిందా? కథా నేపథ్యం ఏర్పాటైపోయిందా? కథా ప్రాంగణం - కథా రంగం అర్ధమైపోయిందా? అందులోకి జార్జి రెడ్డి పాత్ర ప్రవేశించిందా? ఈ పాత్ర కథా నాయకత్వానికి సవాలు ఎదురైందా? 
          అంటే ఎబిసిడి గ్రూపు లీడర్ ని, రెండో గ్రూపు లీడర్ నీ ఓ సీనుతో  మొదట ప్రముఖంగా ఎస్టాబ్లిష్ చేసేసి, వాళ్ళ మధ్యకి జార్జి రెడ్డిని ప్రవేశ పెట్టినప్పుడు - వాళ్ళ దృష్టి అతడిమీదే వుంటుంది. అతన్నే వాచ్ చేస్తూంటారు. ఇది ఆటోమేటిగ్గా వచ్చేసే కథనం. ఈ మూడు కీలక పాత్రల మీదా, కథ మీదా ఫోకస్ వచ్చేస్తూ. బలాబలాల సమీకరణ స్పష్టంగా తెలుస్తూ. కథ అర్ధమవుతూ. కానీ జరిగిందేమిటంటే, జార్జి రెడ్డి హాస్టల్లో నైట్ చేరింది లగాయత్తూ  మొదలైపోతాయి భోజనాల దగ్గర్నుంచీ చిల్లర కొట్లాటలు. ఆరు నిమిషాలకో కొట్లాట. ఎవరే గ్రూపో, ఎవరెందుకు కొట్టుకుంటున్నారో అస్సలు దృష్టి కందని కొట్లాటలు. హీరో సహా ఏ పాత్రా ఎస్టాబ్లిష్ కాకుండా. కథేమిటో అంతుబట్టకుండా. కథా నాయకత్వం గల్లంతై పోయి. అసలు కథానాయకుడు చాలా సీన్లలో కనపడడు. అతనున్నాడని మర్చిపోయే పరిస్థితి! ఈ ‘బయోపిక్’ చిల్లర విద్యార్ధులదా, జార్జి రెడ్డిదా?
           జార్జి రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ప్రకారం అతడి పాత్ర పరిచయ క్రమంలో ఏముండాలి? మొదట అతడి విద్యా ప్రావీణ్యం మీద ఫోకస్ చేస్తూ సీన్లు రావాలి. అతడిది అసాధారణ ఇంటలిజెన్స్. అతను వేసే ప్రశ్నలకి ప్రొఫెసర్లే సమాధానం చెప్పలేక పోయే వాళ్ళు. విద్యార్థులు  అతడ్ని చాలా రెస్పెక్ట్ తో చూసేవాళ్ళు. అతను ఉస్మానియాలో పీ హెచ్ డీ చేస్తూనే, బయట కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పని చేసే వాడు. ఇప్పుడు చూడండి - ఢిల్లీ జే ఎన్ యూలో పది రూపాయల ఫీజు 300 కి పెంచారని గతకొన్ని రోజులుగా విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరుపేదలైన తమ తల్లిదండ్రులు కాయకష్టం చేసి తమని చదివిస్తున్నారని వాపోతున్నారు. కానీ ఒక్కరూ కూడా జార్జి రెడ్డి లాగా  పార్ట్ టైం జాబులేవో  చూసుకుని ప్రభుత్వానికీ, తల్లి దండ్రులకీ భారం తగ్గించాలని ఆలోచించడం లేదు. ఈ సమయంలో ఈ సినిమాలో జార్జి రెడ్డి పార్ట్ టైం జాబ్ చిత్రణ గనుక చేసి వుంటే ఎలా వుండేది? కాలం లోంచి ఒక వ్యక్తిని తీసి చూపిస్తున్నప్పుడు రెలవెన్స్ వుండాలిగా? జార్జి రెడ్డిని పక్కన పెట్టేసి చిల్లర పాత్రల దొమ్మీలు చూపిస్తే బయోపిక్ అయిపోతుందా?  
          ఆ తర్వాత ఏం చూపిస్తూ సీన్లేయాలి? జార్జిరెడ్డి విద్వత్తుని యూనివర్సిటీ పట్టించుకుంది. విద్యకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు అతణ్ణి సంప్రదించే తీసుకునే వాళ్ళు. ఇక్కడే రైట్ వింగ్ తో  ఘర్షణ మొదలైంది. అంటే మొదట స్టడీస్ లో అతడి టాలెంట్ ని, విద్యార్ధుల్లో, ప్రొఫెసర్స్ లో  రెస్పెక్ట్ నీ, యూనివర్సిటీ యంత్రాంగంలో మన్నననీ చూపాక పాత్రేమిటో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అమ్మాయిల మీద అతడికి దృష్టి వుండేది కాదు. హీరోయిన్ ని కల్పన చేసి ఏక పక్ష ప్రేమగా చూపించారు, ఇది ఓకే యూత్ అప్పీల్ కోసం. 
          ఇలా పాత్ర పరిచయమయ్యాక, ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన వస్తుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ యంత్రాంగంలో మన్నన పెరగడం మొదటి పరిణామం, రైట్ వింగ్ లో ఈర్ష్యాసూయలు రగలడం రెండో పరిణామం...తర్వాత యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు చూసి చలించడం, అదే సమయంలో నక్సల్బరీ పట్ల ఆసక్తి పెంచుకోవడం, చేగువేరాని చదవడం...ఇలా ఇలా అతనొక రెబెల్ గా మారి అన్యాయాలకి వ్యతిరేకంగా మొదటి ఎటాక్ జరపడం. వీలయితే ఈ ఎటాక్ కి మౌలిక మోటివేషన్ గా బాల్యపు సంఘటనలతో ఒక మాంటేజ్ మధ్యలో వేయవచ్చు. ఇక్కడ మాత్రమే రివీలవుతుంది బాల్యంలో పడ్డ అసలు బీజం. ఇది పాత్రపట్ల ఒక సానుభూతిని, ఎమోషన్ నీ సృష్టిస్తుంది. పాత్ర డెప్త్ పెరుగుతుంది. 
వాదాల వివాదం
         ప్రత్యర్ధి పాత్రల విషయాని కొస్తే, ఎబిసిడి సత్య, ఇంకో సంఘం కౌషిక్ వున్నారు (ఈ రెండో సంఘం నిజానికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంస్థ – ‘ఎన్ ఎస్ యూఐ’). సత్య రైట్ వింగ్ లీడర్, కౌషిక్ అధికార పార్టీ ఎమ్మెల్యే అండగల నాయకుడు. అధికార పక్షం, ప్రతిపక్షంగా వీళ్ళిద్దరూ వుంటే, మధ్యలో థర్డ్ ఫ్రంట్ గా జార్జి రెడ్డి దూరాడు. సినిమా కోసం ఆ నాటి యూనివర్సిటీలోని వివాదాస్పద విద్యార్థి రాజకీయాలతో జాగ్రత్త వహించి, పైపైన తడిమి వదిలేశామని చెప్పుకున్నారు గానీ, అది బయోపిక్ కి, ఈ తరానికి జార్జి రెడ్డి అర్ధమవడానికీ ఎంత నష్టం చేసిందో గమనించినట్టు లేదు. బహుశా ఇందుకే కాబోలు భావజాలాల ‘వివాదాస్పద విద్యార్ధి రాజకీయాల’ జోలికి పోకుండా - చిల్లర మల్లర  కొట్లాటలతో సరిపెట్టారు. 
         వివాదాస్పదం ఎలా అవుతుంది?  అభిప్రాయాలేర్పర్చు కుంటేనే వివాదాస్పద మవుతుంది. ఈ పక్షం వాదం ఇది, ఆ పక్షం వాదం ఇదీ అని రిపోర్టింగ్ చేస్తున్న చందాన చిత్రిస్తే వివాదమేమీ వుండదు. అభిప్రాయం ఏర్పర్చుకుని ఒక పక్షం కొమ్ముకాస్తేనే సమస్య వస్తుంది. పైపైన తడిమి వదిలేయడం ఎక్కడ జరిగింది? రైట్ వింగ్ సత్యని విలన్ గానే చూపించారు. దీంతో లెఫ్ట్ వింగ్ జార్జి రెడ్డి కొమ్ము కాసినట్టయింది. సత్య చేసే మంచిని కూడా చూపించాలి. ప్రేక్షకుల్ని ఒక పక్షానే తోసేయకూడదు. జడ్జిమెంటల్ ధోరణి పని చెయ్యదు. సినిమా అనే మాధ్యమం పక్షపాతంతో వుండదు. ఈ బయోపిక్ లో పాత్రల్ని సినిమా కాబట్టి రొటీన్  హీరో- విలన్ అన్న దృష్టికోణంలో విభజించి ఎలా చూస్తారు? ఎవరి వాదంతో వాళ్ళు కరెక్ట్ అన్నప్పుడు సమస్య వుండదు. సత్య హిందూ వాది కావచ్చు, జార్జి రెడ్డి కమ్యూనిస్టు వాది కావచ్చు. ఇది ఖుల్లాగా చెప్తే అపాయ మేముంది- వాస్తవం ఇదే అయినప్పుడు? 
           సత్యది సాంస్కృతిక చైతన్యం, జార్జి రెడ్డిది సామాజిక చైతన్యం. ఇద్దరూ కరెక్టే. కానీ ఇద్దరి మధ్య మొదలైన ఘర్షణలు ఆధిపత్యం కోసమే. ఎక్కడైనా నాయకుల భావజాలాల కోసం కాక రాజ్యాధికారం కోసం ఘర్షణలు జరుగుతాయి. భావ జాలాలని మనమనుకుంటాం. మన కులం గెలిచిందని, మన మతం గెలిచిందని జబ్బలు చరచుకుంటాం. నాయకులు కుల మతాలకి చేసే మేలేమీ వుండదు. కుల మతాలు ఒకరి మీద ఆధారపడి వర్ధిల్లవు. అవి స్వతంత్రంగా వాటికవి వర్ధిల్లుతూనే వుంటాయి ఎవరున్నా లేకపోయినా. ఏం ప్రమాదం లేదు, నాయకులకి కత్తీ డాలు అప్పగించడానికి. సామాజిక భక్తి లేకుండా దేశభక్తి లేదని జార్జి రెడ్డి వాదించ వచ్చు. దేశాన్ని రక్షించకపోతే సమాజమే వుండదని సత్య ప్రతి వాదం చెయ్యొచ్చు. ఒకళ్లది సూక్ష్మ దృష్టి, మరొకళ్ళది స్థూల దృష్టి. ఏం ఫర్వాలేదు, సబ్ చల్తాహై. ఇంతమాత్రాన సత్య, జార్జి రెడ్డిలవి  భావజాలాల కోసం పోరాటమవుతుందా? యూనివర్సిటీలో ఆధిపత్యం కోసమే పోరాటం. భావజాలాలు అధికార కేంద్రానికి సోపానాలు మాత్రమే. ఇద్దరూ ఎన్నికల్లో గెలవడం కోసమే ఘర్షించుకున్నారు, ఇంతకి మించి ఏ గొప్పా దీనికాపాదించ నవసరం లేదు, సన్నివేశాల్లో ఈ అర్ధాన్ని సేఫ్ గా క్యారీ చేస్తే. 
           వివాదం ఎక్కడొస్తుందంటే జార్జి రెడ్డిని రైట్ వింగే చంపినట్టు చూపిస్తే. అలా చూపించలేదు కూడా. కోర్టు కేసు కొట్టేసినప్పుడు చూపించలేరు కూడా. మరొకటేమిటంటే జార్జి రెడ్డికి కాంగ్రెస్ విద్యార్ధి సంఘం ఎన్ ఎస్ యూఐ సపోర్టు వుండేది. దీంతో రైట్ వింగ్ కంటే అతనే ఎక్కువ దాడులకి పాల్పడేవాడు. చాలా క్రూరంగానూ. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ క్యారెక్టర్ గా. ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేసుకోవచ్చు. సమస్య ఎక్కడొస్తుందంటే, సెంట్రల్ పాయింటు లేదా కీలక సమస్య గుర్తించడం దగ్గరే. జార్జి రెడ్డి దేని గురించి చరిత్రలో నిలిచాడో ఆ అంశం గుర్తించడం దగ్గర. ఎందుకంటే స్క్రీన్ ప్లే పరంగా ఇది లేకపోతే సినిమా కష్టం.
ఎర్ర జండా ఎజెండా 
        ఈ సినిమా విడుదల రోజు ఒక దర్శకుడు అన్నారు, “ ఆఁ... ఏముంటుంది ఈ సినిమా చూడ్డానికి. ఎర్రజెండా సినిమానే కదా. టి కృష్ణ  టైపులో వుంటుంది” అని. కానీ సినిమాలో ఎర్ర జండానే లేదు. కానీ సినిమా ఎర్ర జండా గురించే. ఇది చూపించడానికి మొహమాట పడ్డారు. దీంతో ఏమిటోగా తయారయ్యింది సినిమా. 8 కోట్ల బడ్జెట్ కి కంటెంట్ కి ఎక్కడికక్కడ నిషేధం విధించుంటూ పోయారు. కథని సెంట్రల్ పాయింటు కిందికి తేవడానికి ఏ పాయింటుని ఎత్తుకుంటారు? జార్జి రెడ్డి ఎన్నిటికో వ్యతిరేకంగా వున్నాడు : కుల వివక్ష, మత వివక్ష, భూస్వామం, సామ్రాజ్య వాదం, వ్యాపారీ కరణ, ప్రైవేటీ కరణ, స్త్రీల అణిచివేత, విద్యా రంగంలో మత ప్రమేయం...ఇలా చాలా వున్నాయి. సినిమాకి ఒక్కటి కావాలి. ఆ ఒక్కటి దేన్నీ తీసుకుంటారు? ఈ వ్యతిరేకతలన్నీ ఏ మూలంలోంచి వున్నాయో దాన్ని గుర్తిస్తే పాయింటు వస్తుంది. ఆ మూలం కమ్యూనిజం. కాబట్టి అతను యూనివర్సిటీలో ఎర్ర జెండా ఎగరేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకని సెంట్రల్ పాయింటు ఎర్ర జెండా ఎగరేయడమే. దాన్ని గెలిపించడమే. ఇక మొదలైంది జెండాల పతంగుల ఆట. దారానికి ఎవరెక్కువ మాంజా పూస్తే వాళ్ళ చేతిలో కటింగ్ పవర్. అవతలి పతంగి పుటుక్కు. ఇక కత్తుల ఖణ ఖణలు, కటార్ల ఫటఫటలు. ఇంతకంటే ఏమీ లేదు. గోల్ ఏర్పాటైంది. ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసింది. 

            ఫస్టాఫ్ అంతా విషయం చెప్పకుండా కొట్లాటలతో గడిపేశారు. ఇంటర్వెల్లో మీటింగ్ హడావిడీ, అన్యాయాలపై ప్రసంగం. ఇది కాదు టర్నింగ్ పాయింట్. కార్యాచరణ చెప్పి ఓ జెండా పాతేస్తే టర్నింగ్ పాయింట్. రణభేరి. పాత్ర ఆశయం, గోల్. ఇవేవీ తేల్చకుండా ప్రసంగంతో ఇంటర్వెల్ వల్ల వచ్చిన లాభమేమిటి?
(రేపు సెకండాఫ్ సంగతులు) 
సికిందర్