రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, మార్చి 2021, మంగళవారం

1030 : బాక్సాఫీసు


      త శుక్రవారం విడుదలైన నాల్గు సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. దేనికీ సరైన ప్రేక్షకులు లేరు. ఎంత అట్టహాసంగా పబ్లిసిటీ  చేసినా ప్రేక్షకులు స్పందించలేదు. ముఖ్యంగా మంచు విష్ణు -కాజల్ అగర్వాల్ లు నటించిన బిగ్ బడ్జెట్ మోసగాళ్ళు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఇక మరో క్రేజ్ వున్న హీరో కార్తికేయ చావు కబురు చల్లగా ని కార్తికేయ కోసం కూడా థియేటర్లకి వెళ్లలేదు యూత్. పోతే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన  శశి సంగతి కూడా ఇంతే. చివరగా మరో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ తేజ్ ఈ కథలో పాత్రలు కల్పితం  కనిపించకుండా గల్లంతయింది.

        నాల్గు సినిమాలకి దర్శకులు కొత్త వాళ్ళే. మోసగాళ్ళు కైతే అమెరికన్ దర్శకుడు! మోసగాళ్ళు శుక్ర శని ఆదివారం మూడు రోజులూ ఓవర్సీస్ కలుపుకుని అతి కష్టంగా కోటీ 32 లక్షలు వసూలు చేయగల్గింది. దీని బడ్జెట్ 50 కోట్లు! దీని ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు అని అంటున్నారు. బయ్యర్లకి భారీ నష్టం. నిర్మాతకి 20 కోట్లయినా  థియేటర్ కలెక్షన్లు రావాలి. ఇది అసాధ్యం.


        చావుకబురు చల్లగా బడ్జెట్ 9  కోట్లు. వసూళ్లు ఓవర్సీస్ కలుపుకుని 3 కోట్లు. భారీ నష్టం. శశి బడ్జెట్ 6 కోట్లు. వసూళ్ళు 34 లక్షలు. ఇక ఈ కథలో పాత్రలు కల్పితం అంకెలు లేవు. మోసగాళ్ళు’, చావుకబురు చల్లగా’, శశి  ఈ మూడూ 11 నుంచి 21 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో ప్రదర్శనలకి నోచుకున్నాయి.


        ఓటీటీల్లో విభిన్న కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, తెలుగు సినిమాల కంటెంట్ గురించి తెలిసిందే కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారని అర్ధం జేసుకోవాలి. జాతిరత్నాలు ని తప్పించుకోలేక పోతున్నారు. రెండో వారం కూడా ఓవర్సెస్ సహా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.


***