రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, September 30, 2023

1366 :

 


          హాలీవుడ్ లో భారీ బడ్జెట్‌తో దర్శకులు తమ కిష్టమైన సినిమా తీయడానికి స్టూడియోలు అంగీకరించడం లేదని ప్రసిద్ధ దర్శకుడు మార్టిన్ స్కార్సెసీ ధ్వజమెత్తడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్ స్టూడియోలు ఫ్రాంచైజీ లేదా కామిక్ బుక్ ఎంటర్ టైనర్లు ఉత్పత్తి చేసే కథల తయారీ కేంద్రాలుగా  మారిపోయాయనీ, సినిమాని రక్షించండనీ స్కార్సెసీ దర్శకులకి పిలుపు నిచ్చారు.
        స్కార్ విజేత దర్శకుడు స్కార్సెసీ జీక్యూ మేగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను 50 సంవత్సరాల క్రితం భాగమైన హాలీవుడ్ పరిశ్రమ ముగిసిపోయిన చరిత్ర అన్నారు. 50 సంవత్సరాల క్రితం 1970 లలో మూకీ సినిమాలు తీయడం గురించి మాట్లాడుకుంటే ఎలా వుండేదో ఇప్పుడు ఫ్రాంచైజీ, కామిక్ బుక్ సినిమాలు తీయడం గురించి అలా వుంటుందన్నారు. వ్యక్తిగత ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలూ వ్యక్తీకరించే దర్శకుల కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి స్టూడియోలు నిరాకరిస్తున్నాయనీ, అలాటి దర్శకులు ఇండీస్ అని పిలిచే ఇండిపెండెంట్ సినిమాలకి పరిమితమయ్యేలా స్టూడియోలు నెట్టి వేస్తున్నాయనీ విమర్శించారు.  
       
ప్రసిద్ధ మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న కామిక్ బుక్ సినిమాలు ప్రేక్షకుల్ని
థీమ్ పార్క్ లో  తిప్పినట్టు వుంటాయి తప్ప అవి సినిమాలు కావన్నారు. మార్వెల్ స్టూడియోస్ తీసిన ఎవెంజర్స్, ఐరన్ మాన్, యాంట్ మాన్, బ్లాక్ పాంథర్, థోర్ ...ఇవన్నీ స్కార్సెసీ చెప్పే చిన్న పిల్లల్ని అలరించే కామిక్ బుక్ (బొమ్మల కథ) ఆధార సినిమాలే.
       
2007 లో ప్రారంభించి 32 సినిమాలు నిర్మించింది మార్వెల్. ఒక కామిక్ బుక్ పాత్రతో సినిమా నిర్మిస్తే దాని ఫ్రాంచైజీ ( సీక్వెల్స్) గా మరెన్నో నిర్మిస్తుంది. తాజాగా నవంబర్ లో
కెప్టెన్ మార్వెల్ సీక్వెల్ వస్తోంది. ఇంకో 12 నిర్మాణంలో వున్నాయి. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ కూడా కామిక్ బుక్ సినిమాలు తీయడంలో పేరు పొందింది. స్కార్సెసీ 2019 లో తాను వెల్లడించిన అభిప్రాయానికి ఇప్పటికీ కట్టుబడి వున్నానన్నారు.
        
హాలీవుడ్ రూపొందించిన కామిక్ బుక్ సినిమాలకి, ఫ్రాంచైజీలకీ ఇప్పటికీ  థియేటర్ ప్రేక్షకుల ఆదరణ వుందా, ప్రేక్షకులు సినిమాలిలాగే వుండాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకి-  ప్రస్తుతానికి ఇలాగే అనుకుంటున్నారన్నారు.
        
దర్శకులు దీనిపై బలంగా పోరాడాలి. అది అట్టడుగు స్థాయి నుంచి రావాలి. ఇతర నిర్మాతల నుంచి కూడా రావాలి అన్నారు. స్టూడియోల ఒత్తిడి వున్నప్పటికీ తమ సినిమా నిర్మాణ శైలికి కట్టుబడి వున్నందుకు సఫ్డీ బ్రదర్స్, క్రిస్టఫర్ నోలన్‌ వంటి దర్శకుల్ని ప్రశంసించారు.
        
అన్ని వైపుల నుంచి ఎదురు తిరగాలి. ఆగవద్దు. ఏం జరుగుతుందో చూద్దాం. మనం సినిమాల్ని రక్షించుకోవాలి. వాళ్ళ మీద ఫిర్యాదులు చేయ వద్దు. ఎదురు తిరగాలి, అంతే  అన్నారాయన. తను తీసిన ది డిపార్టెడ్ సినిమాకి కి వార్నర్ బ్రదర్స్ ఒక ఫ్రాంచైజీ తీయాలని కోరినట్టు, అయితే అలాటి తయారీ చేసిన (మాన్యుఫ్యాక్చర్) కంటెంట్ నిజంగా సినిమా కాదని తాను తిప్పికొట్టినట్టు చెప్పారు.
       
ఇది దాదాపుగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చేసి సినిమాని రూపొందిస్తున్నట్టుగా వుంది. అంటే మనకి అద్భుతమైన దర్శకులు, సమర్ధులైన స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణులు లేరనుకోవాలా? తీసిన సినిమానే పొడిగించి ఫ్రాంచైజీలు తీయడానికి వీళ్ళందరూ టాలెంట్ ని వృధా చేసుకోవాలా? ఈ సినిమాలు ఏమిస్తాయి? కాసేపు మానసికానందాన్నిచ్చి, ఆపైన మనసుల్లోంచి, మొత్తం శరీరాల్లోంచి ఆనవాళ్ళు లేకుండా తుడిచి పెట్టుకు పోయేవేగా?’ అని మండి పడ్డారు.
        
స్కోర్సెసీ ప్రకారం, డికాప్రియో- మాట్ డామన్ లు నటించిన ది డిపార్టెడ్ (2007) లో ఇద్దరు హీరోల్లో ఒకరినైనా తర్వాత వినియోగించుకోవచ్చా అని వార్నర్ బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ లు అడిగారు. అంటే అర్ధం ఫ్రాంచైజీ కోరుకుంటున్నారు. అయితే నేను పనిచేయలేనన్నాను. వాళ్ళు బాధగా వెళ్ళిపోయారు. ఆ బాధ సినిమా గురించి కాదు, ఫ్రాంచైజీ గురించి! అన్నారు స్కార్సెసీ (ది డిపార్టెడ్ ని 2008 లో జగపతి బాబు- జేడీ చక్రవర్తిలతో ఫ్రీమేకుగా హోమం తీశారు దర్శకుడు జేడీ చక్రవర్తి).
        
సినిమా మేకింగ్‌లో సాంకేతిక ప్రయోగాలకు విముఖత చూపనన్నారు స్కార్సెసీ. అయితే దర్శకుడు కంటెంట్ ని పుర్రెలోంచి లాగి బయటికి తియ్యాలనీ, వయసు రీత్యా జీవితంలో తానున్న దశలో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పితీరాలనీ, లేకపోతే ఆ జీవితపు దశకి అర్ధం లేదనీ, చెప్పలేక పోతే సినిమా తీయడం ఎందుకనీ ప్రశ్నించారు.   

సినిమాని కాపాడాలన్న స్కార్సెసీ బాధ చాలా తక్కువ మందికి వుంటుంది. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే వాళ్ళే ఎక్కువ. వాళ్ళు తీసే సినిమాలు మొదటి వారం దాటితే జ్ఞాపకముండవు. తర్వాత వాటిని చూసి నేర్చుకోవడానికి స్టడీ మెటీరీయల్ గానూ పనికిరావు. స్కార్సెసీ 1967-2022 మద్య 26 సినిమాలకి దర్శకత్వం వహించారు.
టాక్సీ డ్రైవర్’, రేజింగ్ బుల్’, గుడ్ ఫెల్లాస్’, ది డిపార్టెడ్ వంటి ప్రసిద్ధ సినిమాల్ని తనదైన శైలిలో రూపొందించారు. ది డిపార్టెడ్ కి ఆస్కార్ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు.
       
80 ఏళ్ళ మార్టిన్ స్కార్సెసీ తాజాగా దర్శకత్వం వహించిన
ది కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అక్టోబర్ 20 న విడుదల కాబోతోంది. ఇందులో లియోనార్డో డీ కాపిరో, రాబర్ట్ డీ నీరో, లిల్లీ గ్లాడ్ స్టోన్ నటించారు. ఇదే పేరుతో
డేవిడ్ గ్రాన్ రాసిన న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా దీన్ని నిర్మించారు.
—సికిందర్