రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 5, 2020

936 : జానర్ ఎగ్జాంపుల్స్


        జానర్లు ఎన్నో. తెలుగులో కొన్నే. ఆ కొన్నిట్లో ప్రధానంగా రోమాన్స్. ఈ రోమాన్స్ తో తెలుగులో రోమాంటిక్ కామెడీలు. ఈ రోమాంటిక్ కామెడీలు రోమాంటిక్ డ్రామాలే. ప్యూర్ రోమాంటిక్ డ్రామాలు గానీ, ప్యూర్ రోమాంటిక్ కామెడీలు గానీ తీయలేక. ఫస్టాఫ్ కామెడీలతో కడుపుబ్బ నవ్వించాలనుకుని రోమాంటిక్ కామెడీ, సెకండాఫ్ లో గుండెలుబ్బ ఏడ్పించాలనుకుని రోమాంటిక్ డ్రామా. ఫస్టాఫ్ నవ్వులతో గిటార్ సినిమా, సెకండాఫ్ ఏడ్పులతో వీణ సినిమా. వెరసి జానర్ అమర్యాదల జమిలిగా గిటార్వీణ వాయింపులు. ఈ టెంప్లెట్ పట్టుకుని ప్రతీ వొక్కరూ ఇవే వాయింపుల మీద వాయింపులు. తెలుగు బాక్సాఫీసు నేల ఇసుక వేస్తే పారిపోయే ప్రేక్షకులు. ప్రతీ యంగ్ హీరో, సినిమాకో కొత్త హీరోయినూ ఇవే నటించి వెళ్ళిపోవడం. దీనికే రోమాంటిక్ కామెడీలని పేరు. టీనేజర్లుగా ఇలాటి సినిమాలే చూసి పెరిగిన దర్శకులు ఇలాగే తీయాలి కాబోలనుకుని అలాగే తీయడం. అవే రాత తీతలు. అవే తల రాతలు. ఈ రాత తీతల్లో రెండు వాటమైన లీలలు. ఒక లీల ఏవో అపార్ధాలతో అవే విడిపోవడాలు, రెండో లీల ఆ ప్రేమేదో చెప్పుకోలేక అవే  మూగ బాధలు. ఈ రెండే పాయింట్లు పట్టుకుని రెండు దశాబ్దాలుగా వేలకొద్దీ అవే గిటార్వీణ యూత్ సినిమాలు. ఒక రోమాంటిక్ డ్రామా, విడిగా ఒక రోమాంటిక్ కామెడీ అంటూ చూడలేని దుస్థితికి ప్రేక్షకుల్ని నెట్టేశారు. మొత్తంగా ఇప్పుడు ఈ సోకాల్డ్ రోమాంటిక్ కామెడీల వ్యాపారం కాని వ్యాపారం బంద్ అయింది. 

       
క మూలాల్లోకి వెళ్లి కొత్తగా ప్రారంభమవచ్చా? అసలు రోమాంటిక్ డ్రామాలంటే ఏమిటో, రోమాంటిక్ కామెడీ లంటే ఏమిటో తెలుసుకునే ఓపికుండచ్చా? గిటార్ సపరేట్ గా, వీణ సపరేట్ గా వాయించాలన్నఆసక్తి వుండొచ్చా? వుంటే ముందు రోమాంటిక్ డ్రామాలతో మొదలెడదాం. దీని జానర్ మర్యాదలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. రోమాంటిక్ డ్రామాలు మూడు ఏజి గ్రూపులుగా వుంటాయి. టీనేజి గ్రూపు, టీనేజి దాటిన గ్రూపు, మిడిలేజి గ్రూపు. ఏజి గ్రూపుని బట్టి పాత్రలుంటాయి. టీనేజీ గ్రూపు అమాయకంగా, టీనేజీ దాటిన గ్రూపు మెచ్యూర్డ్ గా, మిడిలేజి గ్రూపు ఫిలాసఫికల్ గా వుంటాయి. మొదటిది కొరియన్ ‘ది క్లాసిక్’ లో, రెండోది ‘బాజీరావ్ మస్తానీ’ లో, మూడోది ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో చూడొచ్చు. లొకేషన్ గ్రామం, పట్టణం, నగరం ఏదైనా కావచ్చు. కథ మాత్రం ఒకే జానర్ మర్యాదలతో వుంటుంది. హీరో హీరోయిన్లు పరస్పరం పరిచయమవుతారు. పరిచయాన్ని ప్రేమగా మార్చుకుంటారు. ప్రేమలో ఆటంకాన్ని ఎదుర్కొంటారు. వియోగ బాధ అనుభవిస్తారు. మూడో పాత్ర వాళ్ళ ఆటంకాన్ని తొలగిస్తుంది. వాళ్ళు ఏకమవుతారు. ఈ ఆరు దశలుగా వుంటుంది కథ. డ్రామా జానర్ లో రోమాంటిక్ డ్రామా సబ్ జానర్. కాబట్టి డ్రామా ప్రధానంగా సాగే ఈ కథల్లో పాత్రలు పాసివ్ గా వుంటాయి. డ్రామాయే కథ నడిపిస్తుంది. చంటి, గీత్ గాతా చల్, జీవిత చక్రం లలో చూడొచ్చు. కథాబలం, బలమైన భావోద్వేగాలు ఈ డ్రామాని నిలబెడతాయి. 

        ప్రేమలో ఆటంకం ఈ కాలంలో అపార్ధాలతోనే వుండదు, మూగ ప్రేమలతోనే వుండదు. పెద్దల అభ్యంతరాలు, అంతస్తుల తారతమ్యాలు, జాతి కుల మత భాషా ప్రాంతీయ విభేదాలు, హీరో లేదా హీరోయిన్ కి మానసిక నిషేధాలు (‘గీత్ గాతా చల్’ లో గాయకుడూ డాన్సర్ అయిన సచిన్, పెళ్లి చేసుకుంటే పంజరంలో ఇరుక్కుంటానని - పాట కోసం, నృత్యం కోసం - సారికని వదిలి పారిపోతాడు), ప్రమాదం, వ్యాధి, రెండో హీరో లేదా రెండో హీరోయిన్ పాత్ర అసూయ, ఇలా విడదీయడానికి ఎన్నైనా వుంటాయి. రోమాంటిక్ డ్రామా అంటేనే విడిపోయి కలుకోవడం. రోమాంటిక్ కామెడీలంటే విడిపోకుండా అవతలి వాళ్ళ పనిబట్టడం. ఇంకా ఈ అంతస్తుల తారతమ్యాలు, జాతి కుల మత భాషా ప్రాంతీయ విభేదాలేంటి - అనుకోవచ్చు. మనుషులున్నంత కాలం ఈ అనువంశిక జాడ్యం వుంటుంది. కాలాన్ని బట్టి ఇన్నోవేట్ చేసి తీయాలి. ‘టూ స్టేట్స్’ లో (హిందీ) బాగా తీశాడు. 

        ఇతర పాత్రల్లో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఒక ప్రతినాయక పాత్రా వుంటాయి. ప్రతినాయక పాత్ర అంటే మాఫియా విలన్ కాదు. పాత సినిమాల్లో నాగేశ్వర రావు ప్రేమకి జగ్గయ్య అనే టెంప్లెట్ వున్నట్టు. తెలుగులో స్టార్స్ తో హృదయాల్ని మీటే ప్యూర్ రోమాంటిక్ డ్రామాలు తీయడం ఎందుకు సాధ్యం కాదంటే, వాళ్ళకో మాఫియా విలన్ వుండాలి, లేదా ఫ్యాక్షన్ విలనుండాలి. అవయవాలు తెగిపడి, రక్తాలు పారాలి. స్టార్స్ తో ఏ జానర్ సినిమా అయినా ఒకేలా వుంటుంది. ‘డియర్ జాన్’, ‘నోట్ బుక్’ లాంటి కల్తీలేని అద్భుత రోమాంటిక్ డ్రామాలకి వాళ్ళు నోచుకోలేరు. చిన్న హీరోలతోనే సృజనాత్మకంగా తీయడానికి స్వేచ్ఛ వుంటుంది. ఈ అవకాశాన్ని ఇకనైనా వదులుకోకూడదు. 

        రోమాంటిక్ డ్రామాల చిత్రీకరణ క్లాస్ గా వుంటుంది. యశ్ చోప్రా తీసేలాంటి కలర్ఫుల్ గా, పీచు మిఠాయిలా తియ్యగా వుంటాయి. అందమైన లొకేషన్స్ లో, భవనాల్లో ఆర్గానిక్ చిత్రీకరణ వుంటుంది. సూరజ్ బర్జాత్యా ‘మై ప్రేంకీ దీవానీ హూ’ తీశాడు. అదంతా గ్రాఫిక్స్ తో డిజైనర్ ప్రేమలా కృత్రిమంగా అన్పించేట్టు తీశాడు. నితిన్ నటించిన ‘అ ఆ’ లో పంటపొలాల దృశ్యాల్ని అతిగా డీఐ చేసి కళ్ళు చేదిరేట్టు చేశారు గానీ, ఆ వరిపొలాల సహజ సౌందర్యాన్ని అనుభవించనీయలేదు. 

        ప్యూరిటీ ముఖ్యం. హీరో హీరోయిన్లని ఎంత ప్యూరిటీతో చూపిస్తారో నిర్మాణ విలువలు అంత ప్యూరిటీతో వుండాలి. లొకేషన్స్ గానీ, సెట్ ప్రాపర్టీస్ గానీ, కథా కథానాలుగానీ, అన్ని పాత్రల తీరుతెన్నులు గానీ, మాటలు గానీ, ఆహార్యంగానీ ప్రతీదీ...  అలాగని ప్యూరిటీ పేరుతో సుత్తిలా, చాదస్తంలా తీయకూడదు. 

        హాలీవుడ్ రోమాంటిక్ డ్రామాల్లో సంగీతానికి పియానో ఎక్కువ వాడతారు. తెలుగు రోమాంటిక్ డ్రామాలకి ‘ఆనంద్’ లోలాంటి సెమీ క్లాసికల్ సాంగ్స్ వుంటే ఎలా వుంటుందో ఆలోచించవచ్చు. సెమీ క్లాసికల్ మాస్ ని కూడా కట్టి పడేస్తుంది. 

        హీరోహేరోయిన్లకి క్లోజప్స్ ఎక్కువ వేస్తారు. ఇక్కడ క్లోజప్స్ కి అర్ధం ప్రేమ. ఇతర పాత్రలకి క్లోజప్స్ వేయరు. వాళ్ళది ప్రేమ కాదు, వాళ్ళు ప్రేమికులూ కాదు. ప్రతినాయక పాత్ర ఎంత కళ్లురిమినా వాడికి మిడ్ షాటే గతి. ప్రేమని హైలైట్ చేసే క్లోజప్స్ హీరోహీరోయిన్లకే సొంతం. హీరో హీరోయిన్ల మధ్య అందమైన బొకేలు, గిఫ్టులు చేతులు మారే దృశ్యాలుంటాయి. స్మూత్ ఎడిటింగ్ తో మాంటేజెస్, ఫేడిన్ ఫేడవుట్స్ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ కూడా వుండొచ్చు.

         ప్రేమ కథలకి ఎప్పుడూ మార్కెట్ వుంటుంది. లొట్టపీసు ప్రేమలకి వుండదు. ఈ వివిధ జానర్ మర్యాదల్ని పట్టుకోవడం కోసం హాలీవుడ్ రోమాంటిక్ డ్రామాలెన్నో వున్నాయి. నెట్ లో కొడితే లిస్టులకి లిస్టులు వస్తాయి, సెలెక్టు చేసుకుని చూడొచ్చు. వీలయితే వీటి స్క్రీన్ ప్లేల్ని డౌన్ లోడ్ చేసుకుని చదవచ్చు, అన్ని జానర్లకి మూలం డ్రామా జానర్. కనుక ముందుగా రో    మాంటిక్ డ్రామా గురించి. దీని
తర్వాత రోమాంటిక్ కామెడీల గురించి...

        సినిమాలు చూసేప్పుడు జానర్ కన్వెన్షన్స్ కూడా చూడాలి. హాలీవుడ్ గుండుగుత్తగా సినిమాలు తీయదు. ఏ జానర్ సినిమాకా జానర్ మర్యాదని పాటిస్తుంది. జానర్ మర్యాదల మీద యూనివర్సిటీ అధ్యయనాలున్నాయి. కాబట్టి రోమాంటిక్ డ్రామాలు చూస్తున్నప్పుడు ఏఏ జానర్ మర్యాదల పాటింపు వాటిలో కామన్ గా వున్నాయో పసిగట్టి దృష్టితో చూస్తేనే సినిమాలు చూడాలి, సరదాగా చూస్తే కాదు.

సికిందర్