రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, మే 2018, శుక్రవారం

651 : స్క్రీన్ ప్లే సంగతులు!


 సినిమాల్లో సెకెండ్ యాక్టే ఫస్టాఫ్ లో ప్రారంభం కానప్పుడు సెకెండ్ యాక్ట్ స్లంప్ ఎలా ఏర్పడుతుంది? నీళ్ళే (కథే) లేనప్పుడు సుడిగుండం ఎలా ఏర్పడుతుంది? స్క్రీన్ ప్లేలో 50 శాతం వుండాల్సిన సెకెండ్ యాక్ట్,  ఇలా 25 శాతానికే కుంచించుకు పోతున్నప్పుడు. ఇంత తక్కువ నిడివిలో కూడా నడవలేక ఎలా చతికిల బడుతుంది కథ? స్క్రీన్ ప్లేలో కథని పావు వంతుకి  కుదించి కూడా దాన్ని నడపలేకపోతున్నారంటే – బిగ్ కమర్షియల్స్ ని సైతం బోల్తా కొట్టిస్తున్నారంటే, ఎక్కడ జరుగుతోంది లోపం?  స్క్రీన్ ప్లే ప్రారంభంలో పావు వంతు వుండాల్సిన ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ని సగం వరకూ సాగదీసి,  ఇంటర్వెల్ వేయడమంటే దేనికి ఇంటర్వెల్ వేస్తున్నట్టు – ఫస్ట్ యాక్ట్ కా? ఇంకా కథే ప్రారంభించకుండా ఇంటర్వెల్లా? ఇంటర్వెల్ కథనుంచి కాసేపు విశ్రాంతికి కోసమా, లేక కథే ప్రారంభం కాకుండా ఉపోద్ఘాతం (ఫస్ట్ యాక్ట్ ) నుంచి ఉపశమనానికా? చాలా విచిత్రంగా వుంటాయి బిగ్ కమర్షియల్స్ లెక్కలు. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఎలా వున్నా స్టార్  మోసేస్తాడు కదా... 

        స్టార్ ప్లేని మర్చిపోతున్నారు. స్టార్ ప్లే చేయడానికి కూడా స్క్రీన్ ప్లేలో సగం వుండాల్సిన కథని అందించడం లేదు. అత్తెసరు పావు వంతు కథని మీద పడేసి నిలబెట్ట మంటున్నారు. ఈ పావువంతు కథని కూడా స్లంప్ లో పడేసి మరీ లాగమంటున్నారు స్టార్ ని...ఈ సమ్మర్ కి స్టార్ సినిమాలన్నీ సెకెండ్ యాక్ట్ స్లంపుకి చూడ ముచ్చటేసే నమూనాలుగా కొలువు దీరిపోయాయి. 

        సెకెండ్ యాక్ట్ అంటేనే సినిమా కథ. స్క్రీన్ ప్లేకి వెన్నెముక. స్క్రీన్ ప్లే అనే మహా సౌధానికి రెండు మూల స్థంభాల (పిపి -1, పిపి -2) మధ్య పైకప్పు. ఈ పైకప్పుని పీకి పందిరేస్తే మిగిలేది మొండి గోడలే కదా? 


      సెకెండ్ యాక్ట్ ని ఫస్టాఫ్ లో ప్రారంభిస్తే, సెకెండాఫ్ లో వరకూ కావాల్సినంత నిడివి వుంటుంది. నిడివి ఎంత పెరిగితే కథ అంత వుంటుంది. కానీ సెకెండ్ యాక్ట్ ని ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ లో చూపించడం ప్రారంభిస్తే,  దాని నిడివి సగానికి – అంటే - స్క్రీన్ ప్లేలో పావు వంతుకి తగ్గిపోతుంది. ఫుల్ టికెట్ వసూలు చేసి, పావు టికెట్ కథ చూపిస్తే ఎట్లా? దాన్ని కూడా స్లంప్ బారిని పడేసి?

        ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ వన్ (పిపి -1)దగ్గర స్టార్ ఏం ప్రామీస్ చేస్తున్నాడో దాన్ని సెకెండ్ యాక్ట్ లో సక్రమంగా డెలివరీ చేయకపోతే, సెకెండ్ యాక్ట్ స్లంప్
(కథా మాంద్యం?) ఏర్పడు తుంది. (పిపి -1)దగ్గర స్టార్ కి గోల్ ఏర్పడుతూ కథ ప్రారంభమవుతుంది. ఈ కథ ప్రారంభమైన సెకెండ్ యాక్ట్ లో స్టార్ ఆ గోల్ ని డెలివరీ చేయాలి. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన అధికార పార్టీ ఆ వాగ్దానాల్ని సక్రమంగా డెలివరీ చేయకపోతే వూడి పోయినట్టే, సక్రమంగా తన గోల్ ని డెలివరీ చేయని స్టార్ కూడా కథ చివర డిస్మిస్ అయిపోతాడు. స్టార్ ఎత్తుకున్న ప్రేమ కథైనా, ఫ్యామిలీ కథైనా, ఫాంటసీ కథైనా, కామెడీ కథైనా, యాక్షన్ కథైనా – ఏ కథైనా – సెకెండ్ యాక్ట్ లో ఒకటే కార్యకలాపం పెట్టుకుంటాడు. అది ఆ కథకి తగ్గ జానర్ లక్షణాలతో, దాని తాలూకు గోల్  కోసం, అలాటి ఓడిడుడుకులని ఎదుర్కోవడం!


        ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం రెండు భాగాలుగా వుంటుంది. ఇక్కడే సెకెండ్ యాక్ట్ రెండుగా విభజన జరుగుతుంది. ఒక భాగం ఇంటర్వెల్ ముందు వరకూ వుంటుంది. రెండో భాగం ఇంటర్వెల్ తర్వాత వుంటుంది. ముందుగా ఇంటర్వెల్ ముందు ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే క్రమంలో దెబ్బలు తింటూ వుండే తంతే ఎక్కువ వుంటుంది. అంటే రియాక్టివ్ గా పాత్ర చిత్రణ వుంటుంది. వెంటనే ప్రత్యర్ధిని మట్టి కరిపించే యాక్టివ్ చర్యలకి దిగడు. అసలు తనకేం జరుగుతోందో అర్ధం చేసుకోవడానికే సమయం పడుతుంది. అర్ధం చేసుకుంటూ ప్రత్యర్ధి దాడుల్ని రియాక్టివ్ గా ఎదుర్కొంటూ, ఇంటర్వెల్ కొచ్చేసరికి అన్నీ అర్ధమైపోతాయి. అప్పుడు స్టార్ ప్రత్యర్ధి మీద పైచేయి సాధిస్తాడు. ఇదీ మొదటి భాగం సెకెండ్ యాక్ట్ స్టార్ బిజినెస్. అంటే రియాక్టివ్ స్టార్ ప్లే!

        దీన్తర్వాత సెకెండాఫ్ లో స్టార్ యాక్టివ్ గా ప్రవర్తించడం మొదలెడతాడు. ప్రత్యర్ధితో పూర్తిస్టాయిలో అమీతుమీకి దిగుతాడు. ఈ ఓడిడుకులు పార్ట్ టూ లో స్టార్ యాక్టివ్ గా మారిపోతాడు. ప్రత్యర్ధిని మట్టి కరిపిస్తూ కరిపిస్తూ వెళ్లి ప్రత్యర్ధి  పన్నే ఒక పెద్ద పద్మవ్యూహంలో పడిపోతాడు స్టార్. ఇది పిపి – 2 ఘట్టం.  స్క్రీన్ ప్లే కి రెండో మూల స్థంభం. అంటే సెకెండ్ యాక్ట్ కి ముగింపు!


       మొత్తం సెకెండ్ యాక్ట్  అంతా గోల్ కోసం స్టార్ కీ ప్రత్యర్ధికీ మధ్య జరిగే యాక్షన్ - రియక్షన్ల మయమే. కానీ,  అర్ధం జేసుకోవాల్సింది సెకెండ్ యాక్ట్ మొదటి భాగంలో స్టార్ కి ఈ యాక్షన్ -  రియక్షన్ల తంతు రియాక్టివ్ గా వుంటే, రెండవ భాగంలో యాక్టివ్ గా వుంటుంది. మానసిక ఎదుగుదలలో, తదనుగుణ ప్రవర్తనతో స్టార్ ఈ తేడాలు కనబర్చక పోతే, మొత్తం సెకెండ్ యాక్టే డొల్లగా మారిపోయి ఢామ్మని స్లంప్ లోపడుతుంది!!

        గోల్ ని ఏ ఎత్తుగడలతో, ఏవ్యూహాలతో తెలివిగా డెలివరీ చేస్తున్నాడనేదే సెకెండ్ యాక్ట్ కి ముఖ్యం. పిపి – 2  దగ్గర స్టార్ పద్మవ్యూహంలో పడడంతో కథ ముగిసి, ఇక ఉపసంహారమే మిగిలుంటుంది. అంటే మళ్ళీ పుంజుకుని గోల్ ని డెలివరీ చేసేందుకు థర్డ్ యాక్ట్ బిజినెస్ ఏకధాటిగా మొదలెడతాడమన్నమాట. 


        ఇంత కథ – బిజినెస్ వుండే సెకెండ్ యాక్టు వచ్చేసి, స్క్రీన్ ప్లేలో సగభాగం కాకుండా, ఇంకెప్పుడో సెకెండాఫ్ లో ప్రారంభమై, పావు వంతుకి మూలకి సర్దుకుంటే, ఇక స్టార్ పాల్పడాల్సిన రియక్టివ్ – యాక్టివ్ బిజినెస్సులకి ఏపాటి సమయం చిక్కుతుంది? అప్పుడేమని పిస్తుంది - నసేరా బాబూ నస! మన స్టార్ ఏమీ చేయలేదు - నస పెట్టాడ్రా బాబూ నస – అని కదూ?

సికిందర్