రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 5, 2022

1206 : రివ్యూ!


దర్శకత్వం : ఆర్. అజయ్ జ్ఞానముత్తు
తారాగణం : విక్రమ్, శ్రీనిథీ శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కెఎస్ రవికుమార్, రోషన్ మాథ్యూ
రచన : ఆర్. అజయ్ జ్ఞానముత్తు, నీలన్ కె, శేఖర్ కణ్ణ శ్రీవస్తన్, అజరుద్దీన్ అల్లావుద్దీన్, ఇన్నాసి పాండియన్, భరత్ కృష్ణమాచారి
సంగీతం : ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : హరీష్ కణ్ణన్
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
విడుదల :  ఆగస్టు 31, 2022
***

వితికి చియాన్ విక్రమ్ కానుకగా  కోబ్రా విడుదలైంది. కేజీఎఫ్‌ హీరోయిన్ శ్రీనిధీ శెట్టి, క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ లతో జత కట్టి వచ్చాడు విక్రమ్. శ్రీనిధికి ఇది తమిళంలో ఎంట్రీ. ఇర్ఫాన్ కి నటనలో ఎంట్రీ. ఇంకో ఇద్దరు హీరోయిన్లు వున్నారు- మీనాక్షి, మృణాళిని. విక్రమ్ 10 వివిధ గెటప్స్ తో కనిపిస్తాడని బాగా ప్రచారం జరిగింది. వీటితో బాటు భారీ బడ్జెట్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇవన్నీ కలిసి 5 భాషల్లో పానిండియా మూవీగా విడుదలైంది. ఇంతవరకూ గత జూన్ లో ఒకే ఒక్క తమిళ పానిండియా కమల్ హాసన్ తో విక్రమ్ మాత్రమే హిట్టయ్యింది. ఇప్పుడు ఇంత ఆర్భాటంతో కోబ్రా ఏ మేరకు పానిండియా అర్హతతో వుంది? ఫ్లాపయిన ఇతర తమిళ పానిండియాల్లాగే తమిళనాడులో ఇది తమిళులకే పరిమితమయ్యే అవకాశముందా? ఇది తెలుసుకుందాం...

కథ
మది (విక్రమ్) గణిత మేధావి. టీచర్ గా పని చేస్తూంటాడు. ఇతడ్ని భావన (శ్రీనిధి) ప్రేమిస్తూంటుంది. కానీ తీవ్రమానసిక సమస్యలతో వున్న మది పెళ్ళికి ఒప్పుకోడు. అతను ఏవేవో చిత్త భ్రాంతులకి లోనవుతూంటాడు. ఇంకో పక్క ఉన్నతస్థాయి రాజకీయ హత్యలు జరుగుతూంటాయి. కోయంబత్తూరులో ఒరిస్సా ముఖ్యమంత్రి హత్య, స్కాట్ లాండ్ లో పెళ్ళి చేసుకుంటున్న రాకుమారుడి హత్య, రష్యాలో బహిరంగ సభలో పాల్గొంటున్న రక్షణ మంత్రి హత్య. ఈ హత్యల్ని ఒకే హంతకుడు వివిధ గెటప్స్ తో చేస్తూంటాడు.

ఈ హత్యల్ని యుద్ధ ప్రాతిపదికన ఇంటర్ పోల్ కాప్ అస్లన్ ఇన్మజ్ (ఇర్ఫాన్ పఠాన్) దర్య్యాప్తు చేస్తూంటాడు. ఇతడి టీములో తెలివైన జుడిత్ శాంసన్ (మీనాక్షీ) వుంటుంది. ఈమె ఈ హత్యల్ని విశ్లేషించి ఇవి ఎవరో గణిత మేధావి ఘన కార్యాలని చెప్తుంది. ఈ హత్యలకి గురైన నేతలు రుషి (రోషన్ మాథ్యీవ్) అనే దుష్ట కార్పొరేట్ అధిపతికి వ్యతిరేకులని తెలుస్తుంది. ఆ హంతకుడు లెక్కల మాస్టారు మది అని తెలీదు. కానీ ఒక హ్యాకర్ తెలుసుకుని, వాడి నిజస్వరూపం బయటపెడతానంటాడు. దీంతో మది అప్రమత్తమవుతాడు.

ఎలావుంది కథ
        మది ఎందుకీ హత్యలు చేస్తున్నాడు? ఇతడి గతమేమిటి? మానసిక సమస్యలేమిటి? తనకి ప్రమాదకరంగా వున్న హ్యాకర్ ని పట్టుకున్నాడా? హత్యలతో రిషి కేమైనా సంబంధముందా? మదికి భావనతో పెళ్ళయ్యిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కథ. కొత్తగా అన్పించే కథ (మొత్తం కాదు). గణిత మేధావి గణిత శాస్త్ర అంచనాలతో పథకాలు రచించి గొప్ప గొప్ప నేతల్ని మతిపోయే విధంగా అంతమొందించడం. అయితే వచ్చిన సమస్యేమిటంటే, విక్రమ్ పాత్రకంటే ఈ సినిమాకి పని చేసిన దర్శకుడితో బాటు ఆరుగురు రచయితలే పనిగట్టుకుని మేధావులై పోవడం. ప్రేక్షకుల మెదళ్ళపై బుసలు కొట్టడం. వీళ్ళ గణితమేమిటో, ఆల్జీబ్రా ఏమిటో, ఎక్కాలేమిటో  అస్సలు అర్ధం గాకపోవడం. ఫస్టాఫ్ ఎలాగో అర్ధమైనా, సెకండాఫ్ చూడాలంటే పాము పుట్టలో తల పెట్టడమే. అక్కడున్న కోబ్రాతో కాట్లేయించుకోవడమే.

        పైగా మూడు గంటల భారమైన సినిమా. కథ ఎలా నడపాలో, ఎలా ముగించాలో తెలీక అనేక మలుపులు, అనేక ఫ్లాష్ బ్యాకులు, ఏం చెప్తున్నారో అర్ధంగాని కన్ఫ్యూజన్. సింపుల్ గా చెప్తే అయిపోయే కథని అష్టవంకర్లు తిప్పారు. పైన చెప్పుకున్న ఫస్టాఫ్ కథ హత్యలతో, విక్రమ్ తెలివి తేటలతో చకచకా సాగిపోయినా, సెకండాఫ్ వచ్చేసరికి తలపోటు వచ్చేస్తుంది. లైగర్ సెకండాఫ్ ఎలా కుప్పకూలిందో ఇదీ అంతే. ఇదే సంవత్సరం వచ్చిన విక్రమ్ గత ఫ్లాప్ మూవీ మహాన్ ఎంత టార్చరో,కోబ్రా అంతకన్నా టార్చర్. దీన్ని శ్రీనిధీ, ఇర్ఫాన్ లని పరిచయం చేస్తూ పానిండియాగా విడుదల చేయడం ఓవరాక్షన్.


నిడివి 20 నిమిషాలు తగ్గించినా ప్రేక్షకుల కన్ఫ్యూజన్ పోవడం లేదు. కన్ఫ్యూజన్ కి క్షమాపణ చెప్పుకుంటూ, మరోసారి చూస్తే కన్ఫ్యూజన్ వుండదని, తప్పకుండా మరోసారి చూడమని దర్శకుడి వినమ్ర సలహా. ఇంకోసారి బెటర్ సినిమా తీస్తానని ప్రామీస్. ఐతే బెటర్ సినిమా చూస్తామని ప్రేక్షకుల టాటా. ఆరుగురు రచయితలు + దర్శకుడు = భయపడి బుట్టలో దాక్కున్న కోబ్రా! ఈ కథ కోబ్రాలకే అవమానం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద దర్శకుడ్ని, ఆరుగురు రచయితల్ని శిక్షించాలి.

నటనలు- సాంకేతికాలు  

మానసిక సమస్యలతో, ఓ పది గెటప్స్ తో   కోబ్రా ఇంకో అపరిచితుడు అన్పించి వుంటుంది విక్రమ్ కి. పది గెటప్స్ తో రహస్యంగా హత్యలు చేయడం, ప్రైవేటుగా టీచరుగా పనిచేయడం, పర్సనల్ గా గతంతో బాధపడడం. ఇన్ని షేడ్స్ వున్న క్యారక్టర్ అపూర్వమే విక్రమ్ కి. వీటిలో తను ఎంత బాగా నటించినా కథకి అర్ధం పర్ధం లేక నష్టపోయాడు.

 పైగా సెకండాఫ్ లో గతం గురించి చెప్పడానికి ఎంతకీ ముగియని పరమ బోరు ఫ్లాష్ బ్యాక్. తన మానసిక సమస్య ష్కీజో ఫ్రేనియా అని తెలుస్తుంది. అది చెప్పి వూరుకోవడమే తప్ప దాని ఆద్యంతాలేమిటో వుండవు. అలాగే తన శాడ్ క్యారక్టర్ తో శ్రీనిథితో రోమాన్స్ కూడా ఎంటర్ టైన్ చేయలేదు.

        కేజీఎఫ్ శ్రీనిథి పాత్ర తక్కువే. మధ్యతరగతి అమ్మాయి,. అతడ్ని ప్రేమించి అతడ్నే పెళ్ళి చేసుకోవాలని వుండిపోవడం. ఓ పాటలో గ్లామరస్ గా వుంది. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కి నటన నేర్పించి నటింప జేశారు. ఇంటర్ పోల్ కాప్ గా ఫర్వాలేదన్పించాడు.

        సాంకేతికంగా చాలా వ్యయం చేశారు. స్కాట్ లాండ్ లో యువరాజు పెళ్ళి – హత్యా దృశ్యాలు, రష్యాలో రక్షణ మంత్రి బహిరంగసభ – హత్యా దృశ్యాలూ టాప్ క్లాస్ గా వున్నాయి. హై టెక్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ దృశ్యాలు కూడా పకడ్బందీగా వున్నాయి. కాకపోతే లాజిక్ అనేది ఎక్కడా వుండదు. ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో పాటలు హిట్ కాలేదు. నేపథ్య సంగీతం హోరెక్కువ వుంది. సన్నివేశాలే కన్ఫ్యూజన్ గా వుంటే సంగీతమెలా కుదురుతుంది.

        మొత్తానికి లైగర్ తర్వాత ఇంకో పానిండియా కోబ్రా సౌత్ సినిమాల ప్రతిష్ట మసక బార్చాయి. విక్రమ్ కూడా అపరిచితుడు లాంటి ప్రయోగాలు గాకుండా నాన్న లాంటి అర్ధవంతమైన సినిమాలు అడిగి తీయించుకుంటే గౌరవం పెరుగుతుంది.

—సికిందర్