రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఆగస్టు 2016, గురువారం

స్క్రీన్ ప్లే సంగతులు!

పాత్రలేకుండా విడిగా కథ వుండదు, కానీ కథ లేకుండా పాత్ర ఉండగలదు. ఎందుకంటే కథని పుట్టించేదే పాత్ర. కథ వచ్చేసి ఎంత ప్రయత్నించినా పాత్రని పుట్టించలేదు. కథని – పాత్రని పక్కన పెడదాం : ఓ సంఘటన ఏదైనా తీసుకుందాం. ఓ మనిషో ఓ జంతువో లేకుండా ఓ సంఘటన జరుగుతుందా?  బస్సు దాని కదే వెళ్లి లోయలో పడిపోతుందా? డ్రైవర్ తీసికెళ్తేనే కదా వెళ్లి లోయ పడే సంఘటన  జరిగేది. కుక్క కరిస్తేనే కదా ఎవరైనా కుయ్యో మొర్రోమనే  సంఘటన జరిగేది. కాబట్టి జీవులు మాత్రమే సంఘటనల్ని  జరపగలవు. జీవుల్లాంటి చైతన్యమున్న ప్రకృతి సైతం సంఘటనలని జరిపించగలదు. పాత్రంటే జీవియే. అలా అది మాత్రమే కథని సృష్టించగలదు. కథ వచ్చేసి పాత్రని సృష్టించలేదు. కానీ కొందరు కథకులతో ఎలా ఉంటుందంటే- కుక్క కూర్చుని వుంటే మనిషే దాని దగ్గరి కెళ్ళి సరదాపడి కరిపించుకున్నట్టు, బస్సు దానికదే హుషారుగా వెళ్లి లోయలో పడిపోయినట్టు చిత్రిస్తూ కథని అల్లేస్తూంటారు. పర్యవసానం :  కథ (కథకుడు) నడిపించినట్టూ నడుచుకునే పాసివ్ పాత్రలు, దాంతో బలహీన కథనాలు. 

          ఇంకా వివరంగా చెప్పుకుంటే,  ధీరజ్ కుమార్ చెల్లెల్ని కిడ్నాప్ చేశారన్న వార్త గుప్పుమన్న దనుకుందాం. అప్పుడు ధీరజ్ కుమార్ బయల్దేరాడు. వీధిలో ఒకర్ని అడిగాడు- నా చెల్లెల్ని మీరు చూశారా అని. నీ చెల్లెల్ని ఎవరో కార్లోకి లాక్కుని వెళ్లిపోయారని ఆ పెద్ద మనిషి అన్నాడు. బాధతో విలవిల్లాడాడు ధీరజ్ కుమార్. తన చెల్లెలు ఎంత గుణవంతురాలో, ఆమె లేకపోతే తనెలా బతకలేడో  చెప్పుకుని వాపోయాడు. ఆ మనిషి జాలిపడి అలా వెళ్లి ఎంక్వైరీ చేయమన్నాడు. ధీరజ్ కుమార్ ముందుకెళ్ళి ఇంకొకర్ని అడిగాడు. ఆ కారు పంజగుట్ట వైపు వెళ్లి నట్టుందని ఆ మనిషి అన్నాడు. బోలెడు సిస్టర్ సెంటిమెంటు ఫీలవుతూ ధీరజ్ కుమార్ పంజగుట్ట చేరుకుని అక్కడ వచ్చేపోయే కార్లని చూస్తూ నిలవడ్డాడు. అతడి వాలకం చూసి జనాలు వాకబు చేశారు. విషయం తెలుసుకుని అయ్యో పాపమనుకుని, అయితే వెంటనే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇమ్మన్నారు. వెంట వాళ్ళు కూడా వచ్చారు. ఇంతమంది తోడ్పాటుతో ధీరజ్ కుమార్ పోలీస్ స్టేషన్ కెళ్ళి భోరుమన్నాడు. చెల్లెలు లేకపోతే  చచ్చిపోతానన్నాడు.  అతడి ఎమోషన్ కి బోలెడు ఫీలై పోయారు పోలీసులు కూడా...

        ఎక్కడ చూసినా ధీరజ్ కుమార్ సానుభూతిని  పొందాలని చూస్తున్నాడు. చెల్లెలి గుణ గణాలని వర్ణిస్తూ సిస్టర్  సెంటి మెంటుని తెగ వెళ్ళబోసుకుంటున్నాడు. ఆపదలో వున్న సిస్టర్ క్షేమం కన్నా, ఆమెని కనుక్కోవాలన్న ఆదుర్దా కన్నా,  తన మీద జాలి పుట్టించుకునే ప్రయత్నమే  చేస్తున్నాడు...ఎందుకని?  తనుగాక కథకుడు ఏదో ఫీలైపోవడం వల్ల... కథకుడు ఫీలైపోయిన భావోద్వేగాలతో ధీరజ్ కుమార్ పట్ల ప్రేక్షకులు కళ్ళ నీళ్ళ పర్యంతమైపోతారని, బాగా ఏడ్చేసి  సిస్టర్ సెంటిమెంటు అద్భుతంగా పండించారని హర్షాధ్వనాలు చేస్తారనీ అనుకోవడం వల్ల.  ఆ సిస్టర్ అవతల ప్రమాదంలో ఉందన్న అర్జెన్సీ కన్నా- లాజిక్ కన్నా- ఇక్కడ ఆమె పేర సెంటిమెంటల్ డ్రామాతో  ఏడ్వడమే ముఖ్యం,  అవతల ఆమెని రేప్ చేసి పడేసినా ఫర్వాలేదు. రేప్  చేసి పడేస్తే భోరుమని  అదింకో సెంటిమెంటల్ ఎపిసోడ్. 

          ఇంకోటి జాగ్రత్తగా గమనించాలి : ధీరజ్ కుమార్ ఎక్కడా సొంత బుర్రని ఉపయోగించడం లేదు. వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ, లేదా అడిగించుకుంటూ,  వాళ్ళూ వీళ్ళూ ఇచ్చే  డైరెక్షన్స్ తో చెల్లెల్ని వెతుక్కుంటున్నాడు. 

          ఇదే ధీరజ్ కుమార్ చెల్లెలు కిడ్నాప్ అయిందని తెలుసుకుని ఇంకోలా రియాక్ట్ అయ్యాడనుకుందాం. వెంటనే లేచి పరిగెత్తాడు. సంఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశాడు. ఓ పక్క పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి ఎలర్ట్ చేశాడు. సంఘటనా స్థలంలో కారు నంబర్ సమాచారం దొరికించుకుని, అది పోలీసులకి అందజేస్తూ ఆ కారు వెళ్ళిన దిశలో దూసుకు పోయాడు.  ఓచోట ట్రాఫిక్ హెవీగా, స్లోగా వుంది. ఆ కారు కోసం ఎక్స్ రే కళ్ళతో చూస్తూ చివరికి కొన్ని కార్ల మధ్య పట్టుకున్నాడు. అతడి ధాటికి తట్టుకోలేక దుండగులు పారిపోబోయారు చెల్లెల్ని వదిలేసి.  వాళ్ళల్లో  ఇద్దర్ని పట్టుకుని చితకబాది, పోలీసులకి అప్పగించాడు ధీరజ్ కుమార్. చెల్లెల్ని హగ్ చేసుకున్నాడు...

       ఇక్కడ జరిగిన సంఘటనకి తానేం చెయ్యాలో తనకి బాగా తెలుసు ధీరజ్ కుమార్ కి. ఎవర్నీ అడుక్కుంటూ తిరగలేదు. తనే ఆరా తీస్తూ బుర్ర నుపయోగించుకుని ఆఘమేఘాలమీద దూసుకుపోయాడు. కథకుడు  అడ్డుపడడం లేదు, ధీరజ్ కుమార్ ఎటు వెళ్తూంటే అటు తనూ పరుగులు తీస్తున్నాడు కథకుడు. చెల్లెల్ని కాపాడుకోవడానికి పరుగెత్తడమే చెల్లెలి సెంటి మెంటు అని ధీరజ్ కుమార్ తీసుకుంటున్న చర్యలే తెలియజేస్తున్నాయి. ఎవరో దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని  క్షేమంగా తనకి అప్పగించకుండా, తనే దుండగుల్ని  పట్టుకుని చెల్లెల్ని విడిపించుకున్నాడు. ఇది యాక్టివ్ పాత్ర- కథకుడు సృష్టించి దాని ఇష్టానికి వదిలేసిన పాత్ర. తనే కథని నడుపుకుంటూ పోయిన కథానాయక పాత్ర, నాల్గు డబ్బు లొచ్చే కమర్షియల్ సినిమాపాత్ర. 

          దీనికి ముందు పైన చెప్పుకున్న మొదటిది పాసివ్  పాత్ర. కథకుడు తన చాదస్తం కొద్దీ అడుగడుగునా అడ్డు పడుతూ నడిపించిన  డమ్మీ పాత్ర. కథ తానే నూ ముందు పుట్టినట్టు పోజు కొడుతూ నడిపిస్తే నడుచుకుంటూ పోయిన అనుత్పాదక పాత్ర. రూపాయి కూడా రాని ఆర్ట్ సినిమా పాత్ర.

          ఈ మొదటి తరహాలోనే పాసివ్ గా ఉంటున్నాయి అనేక సినిమాల్లో హీరోల పాత్రలు.  మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలని ఇందుకే గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. ఎన్ని సార్లు చెప్పుకున్నా ఎవరు పట్టించుకుని బాగుపడతారు గనుక. బాగు పడాలన్న కోరిక,  కమిట్ మెంట్ లేనివి ప్రపంచంలో తెలుగు సినిమాలే. యాక్టివ్ పాత్ర చిత్రణకి - పాసివ్ పాత్ర చిత్రణకి  వాటి స్పందనల రీత్యా  వున్న తేడాని తెలుసుకోకపోవడం వల్ల. 

          ఈ రెండూ కాక మూడోది పాసివ్- రియాక్టివ్  పాత్ర అనేదొకటుంది.  ఇది యాక్టివ్ పాత్ర లాగే ప్రవర్తిస్తుంది. వాళ్ళనీ వీళ్ళనీ ఎడా పెడా తిడుతుంది, తంతుంది- బోలెడు యాక్షన్ లోవుందే అన్నట్టు భ్రమ కల్గిస్తుంది. పైన చెప్పుకున్న మొదటి కేసులో లాగే ఇది పాసివ్వే. అయితే పాసివ్ గా ఉండక రియాక్ట్ అయి తంతుంటుంది. ఆఁ..నీ డబ్బా మొహం  చెల్లెలు అంత  గొప్పదేటి?-  అని ఎవడో అన్నాడనుకుందాం, నా చెల్లెల్నే అంటావురా!-  అని వీర లెవెల్లో రియాక్ట్ అయి బాదేస్తూంటాడు  మన ధీరజ్ కుమార్. మళ్ళీ ఇంకొకళ్ళని చెల్లెలి జాడ అడుక్కుంటూ  తిరుగుతూంటాడు. ఈ కోపం, ఈ ప్రతాపం  అసలు కిడ్నాపర్స్ మీద చూపించాలని మాత్రం అనుకోడు...ఇలా వుంటుంది  పాసివ్ రియాక్టివ్ పాత్ర చిత్రణ. 


        ఇవన్నీ ఒకెత్తయితే, ఇప్పుడు ‘శ్రీరస్తు శుభమస్తు’ లోకొస్తే, హీరోయిన్ ని ఈ పాసివ్- రియాక్టివ్ క్యారక్టర్ గా ముస్తాబు చేయడం కొత్తేమీ కాకపోతే- కొత్తగా వున్న దేమిటి? ఏమిటంటే హీరో పాసివ్ కాదు, రక్షించారు. పోనీ యాక్టివా అంటే  పూర్తి యాక్టివూ కాదు. ఎందుకంటే దీనికి పూర్తి జ్ఞానం లేదు. లేకపోవడం వల్ల రాంగ్ రూట్లో గోల్ ప్రయాణం కట్టింది. గోలే రాంగై పోయింది, చేయాల్సిన పని ఒకటుండగా ఇంకోటి చేసుకుపోయింది...

          చేయాల్సిన పని : తనింట్లో ఆల్రెడీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వదిన ఐదేళ్లుగా హీనంగా బతుకుతోంది. ఇంట్లో పరిస్థితిని, ఈమె జీవితాన్నీ చక్కదిద్దాలి. 

          చేసిన పని : ఆల్రెడీ వదిన వున్న కూపంలోకి ఇంకో మధ్యతరగతి అమ్మాయిని తన భార్యగా తీసుకురావాలనుకోవడం.

          మనకి కథాప్రారంభంలోనే బాగా ధనవంతుడైన ప్రకాష్ రాజ్ ఇంట్లోకి పెద్ద కొడుకు మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే మధ్యతగతి పట్ల ఏహ్య భావమున్న ప్రకాష్ రాజ్  ఆమెని హీనంగా చూడ్డం  మొదలెడతాడు. ఇది అయిదేళ్ళూ కొనసాగాక, ఇప్పుడు చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని ప్రేమించానంటాడు. ప్రకాష్  రాజ్ వ్యతిరేకిస్తాడు. మధ్యతరగతి వాళ్ళు గొప్పింటి సంబంధం  చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని చూస్తారనీ, వాళ్ళు మనల్ని చూసి గాక, మన డబ్బు ని చూసి వస్తారనీ పాత పాటే పాడతాడు. దమ్ముంటే నువ్వు గొప్పింటి కొడుకువని ఆ అమ్మాయికి చెప్పుకోకుండా, పెళ్ళికి ఒప్పించుకోడానికి ట్రై చెయ్ నీకే తెలుస్తుంది-  అంటాడు ప్రకాష్ రాజ్. అల్లు శిరీష్ ఈ ఛాలెంజిని స్వీకరించి, అలా ఒప్పించలేకపోతే  నువ్వు చూసిన గొప్పింటి సంబంధమే చేసుకుంటా నంటాడు...

          ఇదీ  ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం . అంటే హీరో కి ఒక గోల్ ని ఏర్పాటు చేసే మలుపు. ఈ గోల్ లో వున్న బలమెంత? ఎందుకంటే,  ఐదేళ్లుగా ఇంట్లో వదినతో పరిస్థితి చూస్తూ ఇంకో మధ్య తరగతి అమ్మాయిని తెస్తానంటున్నాడు అల్లు శిరీష్. అంటే ఆ అమ్మాయిని కూడా తండ్రి రాచి రంపాన పెట్టడానికా? ఒక హీరో పాత్ర తన ప్రేమ తప్ప ఇంకేదీ ముఖ్యం కానట్టు స్వార్ధంతో ఉంటుందా ? 

        ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రకరకాల కథల్లో రకరకాల సమస్యలు పుడతాయి. ఎన్ని రకాల కధలున్నా ఆ సమస్యలు ఉండేవి ఏడు రకాలే. వీటిలో  సమస్య మిస్టరీగా వుంటే ఆ రహస్యాన్ని ఛేదించడం  గోల్ గా వుంటుంది. ఏదైనా ప్రమాదం సమస్యగా వుంటే రక్షణ కోసం ప్రయత్నించడం గోల్ గావుంటుంది, కన్ఫ్యూజన్ సమస్యగా వుంటే స్పష్టత కోసం ప్రయత్నించడం గోల్ అవుతుంది. అలాగే డోలాయమాన స్థితి సమస్యైతే ఓ నిర్ణయం తీసుకోవడం గోల్ గా వుంటుంది, అజ్ఞానమే సమస్యయితే  జ్ఞానం గోల్ అవుతుంది, సమస్య ఓ ప్రశ్నని లేవనెత్తితే దానికి జవాబు గోల్ గానూ, ఇక ఆఖరిదైన సంక్షోభం తలెత్తితే శాంతిని నెలకొల్పడం గోల్ గానూ వుంటాయి.

          ఈ సినిమాలో కుటుంబంలో వున్న  సంక్షోభమే సమస్యగా వుంది. అంటే ఇక్కడ శాంతిని నెలకొల్పడం గోల్ గా వుండాలి. ఇక్కడ శాంతిని నెలకొల్పకుండా తనవరకూ తన ప్రేమని తెచ్చి స్థాపించుకోడం  సంక్షోభాన్ని రెట్టింపు చేయడమే. 

          అంటే ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుతూ మరో వైపు హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండమని కాదు. తండ్రి అలా షరతు పెట్టినప్పుడు తను కూడా ఇలా అని వుండాలి : నువ్వన్నట్టే నేనా  ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే ఆ అమ్మాయితోబాటు వదినని కూడా నువ్వు బాగా చూసుకుంటావా- ఈ కౌంటర్ ఛాలెంజిని ఒప్పుకుంటావా?

          తండ్రి పెట్టిన షరతు తండ్రికే బూమరాంగై వదిన జీవితమూ తన ప్రేమా ఒడ్డున పడి  తద్వారా ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలన్న ద్విముఖ వ్యూహంతో హీరో గోల్ ని సెట్ చేసుకుని వుంటే అప్పుడు తానొక హీరో అన్పించుకునే వాడు.

          ఇలా కాకుండా వదిన ఎలా ఏడిస్తే నాకెందుకు- తండ్రి మీద గెలిచి మధ్యతరగతి అమ్మాయినే తెచ్చుకుంటా అని బయల్దేరతాడు హీరో. తన మీద గెలిచాడన్న కసితో ఆ తండ్రి ఈ అమ్మాయిని కూడా వదిన పక్కన పడేసి ఇద్దర్నీ కలిపి నంజుకు తింటే? అప్పుడది సీక్వెల్ గా ఇంకో సినిమా తీయవచ్చనా?

          కానీ మధ్యతరగతి అమ్మాయిని పరీక్షిస్తూ మధ్యతరగతి వాడిలా నటించే ఈ పాయింటు కూడా వెంటనే చీలిపోయింది. ఎందుకంటే అసలు ఏ తరగతి వాణ్ణీ ప్రేమించే మూడ్ లో హీరోయిన్ లేదు. చదువు తప్ప ఆమె కింకో ఆలోచనే లేదు. అతడి మీద విరుచుకు పడుతూ, తిడుతూ, వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తూ, జాడించి తంతూ వుంటుంది కథ ముగిసే వరకూ. కాబట్టి ఇక్కడ ప్రేమే లేనప్పుడు అంతస్తుల అంతరాల ప్రశ్నెక్కడిది? అంతస్తుల అంతరాల ప్రశ్నే లేనప్పుడు మధ్య తరగతి వాడి వేషం హీరో కెందుకు? అసలు హీరోయిన్ ప్రేమిస్తోందో లేదో, ప్రేమించకపోతే ప్రేమించేలా చేసుకుని, అప్పుడు తండ్రికి చెప్పి వుంటే-  అప్పుడేర్పడాలి  నిజానికి పైన చెప్పుకున్న ప్లాట్ పాయింట్ వన్.

          అసలు హీరోయిన్ తనని ప్రేమిస్తోందా, తన డబ్బుని ప్రేమిస్తోందా అని మధ్యతరగతి వాడిలా నటిస్తూ గూఢచర్యం నెరపడమే ఆమెపట్ల అపచారం. ఇలాటి వాడు రేపు ఆమె శీలాన్ని కూడా శంకించి ఇంకెలాటి మారువేషాలేస్తాడో. 

          హీరో హీరోయే అయితే,  ఉన్నదున్నట్టు తన అంతస్తు తెలిసిపోయేలా ప్రేమిస్తూ,  ఆమె తన అంతస్తుని ప్రేమిస్తోందా- లేక మనసుని ప్రేమిస్తోందా పారదర్శక ప్రవర్తవతో తెలుసుకుంటే ఎవరికీ నష్టం లేదు. 


           చివరికి హీరోయిన్ పెళ్లింట్లో తన గుట్టురట్టయి, అల్లరై ఇంటికి తిరిగి వచ్చేస్తాడు హీరో- వచ్చేసి తండ్రితో సుదీర్ఘ మోనోలాగ్ తో నోర్మూయించేస్తాడు- నేను ఓడిపోయి రాలేదు, ఈ ఇంట్లో వదిన పరిస్థితే నేను ప్రేమించినమ్మాయి పరిస్థితి కాకూడదని వదిలేసి వచ్చానంటాడు!!!

          ఇది పెద్ద జోకులా వుంది. అవతల తనకి శృంగభంగమైతే తప్ప  ఇవతల వదిన పరిస్థితి గుర్తుకు రానట్టుంది. హీరోయిన్ ని ప్రేమించాలని శ్రీకారం చుడుతున్నప్పుడు హీనమైన వదిన బతుకు కళ్ళముందు మెదల్లేదేమో. ఒక హీరో అనే వాడు ఇంట్లో ఒక అన్యాయాన్ని సహిస్తూ- ఏళ్ల పాటూ ఎలావుండగల్గుతాడు? 

          ఈ మొత్తం అసహజత్వానికి ఒక్కటే కారణం : కథా ప్రారంభం. ప్రకాష్ రాజ్ పెద్ద కొడుకు సామాన్యమైన కోడల్ని ఇంటికి తీసుకురావడం, దాని మీద ప్రకాష్ రాజ్ తిరగబడి అలాటి వాళ్ళమీద తన నీచమైన అభిప్రాయం చెప్పి- ఆ కోడల్ని పనిమనిషి కంటే హీనంగా చూడ్డమనే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లే – ఆ తర్వాత అల్లు శిరీష్ క్యారక్టర్ ని కలగాపులగం చేసేశాయి. ఈ పెద్ద కొడుకు -కోడలు అనే ఎపిసోడ్ లేకపోతే, కథలో ఈ పాత్రలే లేకపోతే అల్లుశిరీష్ పాత్రకి తోకలా వదిన వుండేది కాదు. అల్లు శిరీష్ ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ఏంటో బయటపెడితే  సరిపోయేది. ఒక పాత్ర ఫలానా ఇలాంటిది అని చెప్పడానికి రెండేసి మూడేసి  ఉదాహరణలతో పునరుక్తిగా, ప్రేక్షకులకి స్పూన్ ఫీడింగ్ చేస్తూ చెప్తూ పోతే- ఇదిగో  ఇలాగే అర్ధం లేకుండా తయారవుతాయి  పాత్రలూ- కథా.

          హీరో యాక్టివ్వే, కాకపోతే అతడి ఇంటి పరిస్థితుల సమాచారాన్ని బ్లాకవుట్ చేశాడు దర్శకుడు- దాన్ని చివర్లో చెప్పించి బ్యాంగ్ ఇద్దామనుకున్నాడు. అది బూమరాంగైంది. ఒక్క సారిగా పాత్ర పడిపోయింది. పాత్ర పెరిగిపోయిందని చాలా మంది ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు... మంచిదే,  లాజిక్ అలోచించడం కంటే  ఎమోషన్ లో కొట్టుకుపోయి సముద్రంలో కలవడంలోనే అదో సుఖం!

-సికిందర్
http://www.cinemabazaar.in