రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, మార్చి 2017, శుక్రవారం

రివ్యూ!





రచన - దర్శత్వం: కుమార్ ట్టి
తారాగణం: శ్రీ విష్ణు, చిత్రా శుక్లా , కాశీవిశ్వనాథ్, నా, జెమినీ  సురేష్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి, ఛాయాగ్రణం: శ్యామ్
బ్యానర్ : వెన్నెల క్రియేషన్స్
నిర్మాత:  బి. ప్రకాష్ రావు
విడుదల : మార్చి 17, 2017

***

        న్యూ జనరేషన్ హీరో శ్రీ విష్ణు ఉన్నట్టుండి పాత మూస కెళ్ళి పోయి షాకిచ్చాడు. మామూలు షాక్ కాదు న్యూజనరేషన్ ఆడియెన్స్ కీ, బాక్సాఫీసుకీ. అప్పట్లో ‘ఒకడుందే వాడు’ సెమీ రియలిస్టిక్ సక్సెస్ తో తన మీద పెంచుకున్న ఆశలన్నీ వమ్ము చేశాడు. అప్పట్లో శ్రీ విష్ణు అని ఒకడుండేవాడు అని చరిత్రలో తన చాప్టర్ రాసుకునేందుకు వెళ్ళిపోయాడు. తన మీద కొత్తగా ఆసక్తి పెంచుకుంటున్న న్యూ జనరేషన్ ఆడియెన్స్ లో నవ్వుల పాలయ్యేందుకూ సిద్ధపడ్డాడు. ఇలాటి సినిమాల కాలం అయిపోయిందబ్బాయ్ అని మహామహుల సినిమాలనే తిప్పికొడుతున్న ప్రేక్షకుల ముందు తగుదునమ్మాయని పేలవంగా ప్రత్యక్షమయ్యాడు. 

          
నగనగా పూరీజగన్నాథ్ తీసిన సినిమాలుండేవి. వాడేసి, అరిగిపోయిన అవే మాఫియా కథలతో ఒక యాక్షన్ సీన్ – ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట;  మళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా రంగులరాట్నంలా స్క్రీన్ ప్లే గిర్రున తిరుగుతూ, అవే సీన్లు జతకట్టి రిపీటవుతూ మనకళ్ళు తిరిగేలా చేసేవి. ఆహా, పేరొస్తే సినిమాకథ రాయడం ఎంత సులభం అన్పించేది. మహాత్మాగాంధీ చరఖా తిప్పుతూ నూలు వడికినట్టు, పదిహేను రోజులు బ్యాంకాక్  బీచిలో కూర్చుని రంగులరాట్నం తిప్పుతూ పై వరసక్రమంలో సీన్లు పడేసుకుంటూ పోతే అదే స్క్రీన్ ప్లే అయి కూర్చునేది చచ్చినట్టూ. పూరీ పేరొచ్చాక ధీమాగా చేసిన ఈ పనిని  కొత్త దర్శకుడు ఉత్సాహపడి ‘పూరీ నా  ఆదర్శం’ అని డిక్లేర్ చేసుకుంటున్నట్టు, తొలి సినిమాతోనే రంగులరాట్నం తిప్పి పూర్తిచేశాడు. ఈ దెబ్బతో తను కూడా కేరాఫ్ బ్యాంకాక్ బీచి అయిపోవాలని, రంగులరాట్నంతో స్క్రీన్ ప్లే గాంధీ అన్పించుకోవాలనీ వ్యూహం పన్ని  వుండొచ్చు. కానీ మోకాలొడ్డే న్యూజనరేషన్ ప్రేక్షకులు పొంచి వుండి ఠకీల్మని కిందపడేశారు. ఈ ప్రేక్షకులే పూరీని కూడా ఠపా ఠపా పడేస్తూ వచ్చారు ఈ మధ్య. ఇది తెలుసుకోలేదు పూరీ ఏకలవ్య శిష్యుడు!  నిర్మాత చేత శ్రీ విష్ణు మార్కెట్ కి మించిన అత్యంత  భారీ స్థాయిలో ఖర్చుపెట్టించి, బ్యాంకాక్ సముద్రంలో నిమజ్జనం చేశాడు. 

          పూరీ మేనియాలో దర్శకుడు తీస్తున్నది టెర్రరిజమా, మాఫియానా  సఅని కూడా చూసుకోవడం కుదర్లేదు- అచ్చు గుద్దినట్టు పూరీ మార్కు రిచ్ హై ఫై మాఫియాల్లా చూపించేశాడు టెర్రరిస్టుల్ని. ఏ సీను తీసినా పూరీయిజం ప్రకటితమయ్యే మాఫియా లుక్ తో బ్రహ్మాండంగా వుండాలనుకుని జానర్ మర్యాదని మర్చిపోయాడు. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ లో అంత జానర్ మర్యాదతో వున్న ‘మా అబ్బాయి’ శ్రీ విష్ణు కూడా జానర్ మర్యాదంతా కడిగిపారేసి, జోకర్ వేషం వేశాడు. 2015 నుంచి ఏ సినిమా జానర్ మర్యాదతో వుందో దానికే ఆచి తూచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులన్న సంగతి కూడా,  తన  ప్రొఫెషన్ లో తెలుసుకునే తీరిక లేదు తనకి. 

          టెర్రరిజం దేశం మీద దాడితో సమానమైన దుష్టత్వం. దేశద్రోహం. దీంతో కాంప్రమైజ్ అవడం కుదరదు. టెర్రరిస్టులుగా ముస్లిములు వుంటున్నట్టయితే ఆ పాత్రలనే టెర్రరిస్టులుగా చూపించాలి. ఎవరి మనోభావాలో దెబ్బ తింటాయని బ్యాలెన్స్ చేస్తూ హిందూ పాత్రల్ని చూపించినప్పుడు ఆ కథే విశ్వసనీయతని  కోల్పోతుంది. 

          ఒకప్పుడు హిందీ ఫార్ములా సినిమాల్లో  చెడ్డ ముస్లింని చూపిస్తే, బ్యాలెన్స్ చేస్తూ మంచి ముస్లింని కూడా చూపించే వాళ్ళు. చెడ్డ పోలీసుని చూపిస్తే మంచి పోలీసుని కూడా చూపించేవాళ్ళు. కాలక్రమంలో చెడ్డ పోలీసుని బ్యాలెన్స్ చేయకుండా చెడ్డ పోలీసు ఒక్కడ్నే చూపించే బెటర్ మెంట్ వచ్చింది అన్ని భాషల  సినిమాల్లో. కానీ చెడ్డ ముస్లిం కి బ్యాలెన్సింగ్ అలాగే కొనసాగుతోంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ లో రేపిస్టుల్లో ఒకణ్ణి  ముస్లింగా చూపించినందుకు, బ్యాలెన్సింగ్ గా మంచి ముస్లింని హృతిక్ కి ఫ్రెండ్ గా పెట్టారు. 

          ఇదే చెడ్డ ముస్లిం టెర్రరిస్టు అయితే కాంప్రమైజ్ వుండదు. టెర్రరిస్టు పాత్రల విషయంలో హిందీ సినిమాల్లో ఎప్పుడూ కాంప్రమైజ్ లేదు, బ్యాలెన్సింగ్ లేదు. అందుకే అవి వాస్తవ పరిస్థితికి దర్పణం పడుతున్నట్టు వుండి అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూంటాయి. మణిరత్నం ‘రోజా’ తీసినప్పుడు కూడా ఇంతే- దీని హిందీ వెర్షన్ కి కూడా అంత పేరొచ్చింది. 

          తెలుగు సినిమాల్లోనే హాస్యాస్పదంగా ఏ గొడవా లేకుండా హిందువుల్ని టెర్రరిస్టులుగా చూపించేసి తప్పించుకోవచ్చనుకుంటున్నారు. ‘ఆది విష్ణు’, ‘బసంతి’ ఇలాంటివే. వీటికి ఏ గతి పట్టిందో తెలిసిందే. హిందువు టెర్రరిస్టు ఎలా అవుతాడన్న ఇంగితజ్ఞానం ప్రేక్షకులకి వుండ దనుకుంటున్నారు. శ్రీ విష్ణు బాంబు పేలుళ్ళలో ఎవడో పంకజ్ అని తెలుసుకుని వాడి కోసం వెతకడం మొదలెడతాడు- ఇక్కడే విశ్వసనీయత ఏమిటో తెలిసిపోయింది. పంకజ్ బదులు ఫారుఖ్ అని ఎందుకు  పెట్టలేకపోయారు?  టెర్రరిస్టులుగా హిందువుల్ని కూడా చూపించ వచ్చు.  చాపకింద నీరులా హిందూ  టెర్రరిజం కూడా వుందని భావిస్తే ఆ బాపతు కథతో. 

          మాఫియాలతో ప్రజలు ఇబ్బంది పడరు. ఆ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించ వచ్చు. టెర్రరిస్టులతో సామూహికంగా ఇబ్బంది పడుతున్నారు. టెర్రరిజం ఆ మతం ఈ మతం అని లేకుండా ఇంటి గడపల దాకా వచ్చేసి ఇళ్ళల్లో శోకాలు పెట్టిస్తోంది. ఇలాంటప్పుడు ఈ కథల్ని ఎంటర్ టైనింగ్ గా చూపించలేరు. వేరే భాషల్లో చూపించడం లేదు, తెలుగులోనే చూపిస్తున్నారంటే- ఏ మాత్రం బాధ్యత లేకుండా ఈ కథల్ని మామూలు మూస కథల్లా మసాలాలేసి సొమ్ములు చేసుకోవాలన్న యావతోనే. ఇందులో సందేహం లేదు. ఇది టెర్రరిజం కంటే పెద్ద ద్రోహం. ఇందుకే ఇలాటి సినిమాలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నారు ప్రేక్షకులు కూడా. అయినా ఈ సినిమాలతో వచ్చే నష్టాలకి వేరే కారణాలున్నాయని ఆత్మవంచన  చేసుకుంటున్నారు. 

      జానర్ మర్యాదని పక్కన బెడదాం, ఈ కథ జోకర్ విన్యాసాలతో ఎలా వుందంటే, ప్రారంభమే అట్టహాసంగా ‘గబ్బర్ సింగ్’ టైటిల్ సాంగ్ ని కాపీ కొట్టే చిత్రీకరణతో మా అబ్బాయి గ్రాండ్ ఎంట్రీ. ఆ వెంటనే ఎక్కడిదో పురాతన సినిమా సీనులా ఇంట్లో అమ్మ అక్క నాన్నలకి పనీపాటా లేని మా అబ్బాయితో ముద్దూ మురిపాలు. అక్కపెళ్ళి చూపులు. మా అబ్బాయే ముప్ఫై దగ్గర పడుతున్నట్టు వుంటే, ముప్ఫై దాటిపోయి వుండాల్సిన మా అక్క పెళ్లి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందో తెలీదు (తర్వాతి  సీన్స్ లో బాంబు దాడులున్నాయి కాబట్టి పెళ్ళికి రెడీ చేస్తున్నట్టుంది, ఇన్నాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టూ వుంటుంది, పైగా బాంబు దాడుల్లోపోతే పెళ్లి ఖర్చు తప్పించుకున్నట్టూ అవుతుంది). అక్క వయసు గురించి ఆడియెన్స్ తేడాగా ఫీలవకూడదని, పాత్రధారిని కాన్వెంట్ అమ్మాయిలా వుండేట్టు చూసి తీసుకుని, కళ్ళద్దాలు పెట్టేశారు. ఇక ఆ కాబోయే బావతో  మా అబ్బాయి తుగ్లక్ ఇంటర్వ్యూ. అక్క పెళ్ళికి తన పేరుమీదున్నకోటి రూపాయల ఫ్లాట్ కట్నంగా కూడా  ఇచ్చేసి, మంచబ్బాయి అన్పించుకునే సీను కూడా ఒకటి మర్చిపోకుండా వేసుకోవడం మాఅబ్బాయి. 

          ఇంకో తెల్లారి పొద్దున్నే ఎదురింటి ముందు ముగ్గులేసుకుంటూ తెలుగు సంస్కృతిని ద్విగుణీకృతం చేస్తూ ఐటీ ప్రొఫెషనల్ హీరోయిన్ ఎంట్రీ. మా అబ్బాయి మదర్ మొదటిసారిగా చూస్తున్న ఈ  హీరోయిన్ ముక్కు బావుందని  కీర్తిగానాలు  చేస్తూంటే, సిగ్గు మొగ్గయి పోవడం ఐటీ హీరోయిన్. ఓ తెల్లారి పొద్దునే ఫలహారం తీసుకొచ్చి సత్యనారాయణ  వ్రతం చేశామని అనడం. ఇంత పొద్దునే సత్యనారాయణ వ్రతం చేసుకునే అర్భక ఫ్యామిలీ ఎక్కడిదిరా అని మనం కన్ఫ్యూజ్ అవుతూంటే, తొలిసారి ఇంట్లో కొచ్చిన ఈ కొత్తమ్మాయి చేతికి కాఫీ ఇచ్చి, నిద్రపోతున్న  కొడుక్కి ఇచ్చిరమ్మని పంపుతుంది  మా అబ్బాయి మదర్.  ఈ మదర్ ఆడదేనా అని మనకింకో డౌటు! ఇలాటి మదర్స్ తో జాగ్రత్తగా వుండాలి కొత్తమ్మాయిలు. 

          జానర్ మర్యాదని పక్కన పెడదాం, కథా మర్యాదనే చూద్దాం...ఇక పెళ్లి ఫిక్స్ అయి షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ చేసుకుని వస్తూ సాయిబాబా గుడి కెళ్తారు. అక్కడ ఎడాపెడా బాంబులు పేలి తను చెక్కుచెదరకుండా, అమ్మా నాన్నా అక్కా  మాత్రం దారుణంగా చచ్చిపోతారు. కట్ చేస్తే, దరిద్రం వదిలింది అన్నట్టు వుంటుంది సీను. ఇంకా ఆ విషాదం వంకాయా ఎవడిక్కావాలి- ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లోకి వచ్చెయ్యాలి సినిమా! లేకపోతే ఆడదు! 

       కట్ చేయగానే, ఐటీ హీరోయిన్ టిఫిన్ పట్టుకొస్తుంది. మా అబ్బాయి ఫ్రెష్ గా వుంటాడు, టిఫిన్ తినేస్తూంటాడు. ఇంత  జరిగితే నీకు బాధ లేదా?  అని అనాలి కాబట్టి అంటున్నట్టు ఆమె  అంటే, బాధ ఇక్కడ వుంటుంది ఈ గుండెల్లో- ఆ నాకొడుకుల్ని  పట్టుకు చంపుతున్నప్పుడు బయటి కొస్తుంది ఆ బాధ-అని డిక్లేర్ చేసేస్తాడు.  అంటే ఇక నుంచి కథలో జాలీగా వుండాలి కాబట్టి- జోకర్ లా ఆడిపాడి ఎంటర్ టెయిన్ చేయాలి కాబట్టి, బాధ గురించి ఇలా చెప్పేసి- ప్రేక్షకుల్ని సిద్ధం చేశాడన్న మాట తనని చూసి ఎంజాయ్ చేయడానికి. ఇదీ మాఅబ్బాయి అద్భుత క్యారక్టరైజేషన్ ఇంత ఓవర్ బడ్జెట్ సినిమాలో. 

          క్యారక్టర్ ని చంపి కథలో ఎమోషన్ని తీసి పారేశాక- ఇక స్వేచ్చా జీవి అయిపోయాడు మా అబ్బాయి. కానీ  ప్రేక్షకులు మాత్రం ఆ చావుల దగ్గరే ఆలోచిస్తూ వుండిపోతారు. ఇంకా ముందుకెళ్ళి సినిమా చూడ్డానికి మనసంగీకరించదు. సినిమా ఎక్కడో ఫ్లాప్ అవలేదు, ఇక్కడే సీన్ దగ్గరే  ఫ్లాప్ అయిపోయింది ఈ ప్లేటు ఫిరాయింపుతో. ఇంకా మా అబ్బాయి యేమిటి, చనిపోయిన అక్క మా అమ్మాయి అయితే? మా అమ్మాయి చావుకి లెక్క తేలాలన్న ఎమోషన్ లోకి ప్రేక్షకులు జారుకుంటే, మా అబ్బాయి ఎవడు? వీడి వేషాలతో మాకేం పని?

          దర్శకుణ్ణి బ్యాంకాక్ బీచికి ప్రమోట్ చేయాలన్న  ఏకైక లక్ష్యంతో మా అబ్బాయి చక్రం తిప్పడం మొదలెడతాడు- రంగులరాట్నం. ఈ రంగులరాట్నంలో నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్ – ఖుషీ కే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట;  మళ్ళీ నాంకే వాస్తే ఒక యాక్షన్ సీన్- ఖుషీకే వాస్తే ఒక కామెడీ సీన్- మస్తీ కే వాస్తే ఒక లవ్ సీన్- మజాకే వాస్తే ఒక పాట; మళ్ళీ నాంకే వాస్తే ఒక... తిప్పి తిప్పి ఇదే తంతు! 

      ఇలా నాంకే వాస్తే, అదికూడా అప్పుడప్పుడు మా అబ్బాయి టెర్రరిస్టులు అనుకుంటున్న వాళ్ళతో యాక్షన్ సీన్స్, ఇక మిగిలినదంతా హీరోయిన్ తో ఖుషీ కోసమే, మస్తీ కోసమే, మజా కోసమే సీన్లు.  

          ఆమె ప్రతీ మాటకీ అబ్బాయ్ అంటుంది- లేకపోతే శ్రీ విష్ణు గ్రాండ్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నాడని మనమెక్కడ మర్చిపోతామో అని. ప్రతీ యాక్షన్ సీన్ అయిపోయిన వెంటనే- అబ్బాయ్ అంటూ సెక్సీగా వచ్చి ఒళ్ళు విరుచుకుంటుంది. ఎంత కసిగా వుందీ....దీన్నీ ...అని ఒర్చుకోలేక పోతాడు మా అబ్బాయి. ఇక కామ ప్రకోపిత విప్రలంభ శృంగార విరహతాప కామెడీ. తాళలేక సాంగేసుకుని ఉష్ణ మంతా స్వేదబిందువులయ్యే కేళీ విలాసాలు. చిట్ట చివర్లో ఫార్ములా ప్రకారం విధిగా ఫోక్ సాంగ్ కూడా వేసుకుని మూస మాస్ కి పూర్తి  న్యాయం చేయడం. 

          మనకెలా వుంటుందంటే, ఆ టెర్రరిస్టులు వీళ్ళిద్దర్నీ కాల్చి చంపాలన్పిస్తుంది. ఇలా తమాషా కింద మారిపోయిన మా అబ్బాయి పాత మూస కథ శ్రీవిష్ణుకి గుణపాఠం నేర్పకపోతే ఇంకేదీ నేర్పదు. అసలు మా అబ్బాయి యేంటి? మా అమ్మాయి కాదా? అక్క పెళ్లి కూడా అయిపోయి, మర్నాడు భర్తతో గుడికెళ్ళి టెర్రరిస్టు దాడిలో భర్తతో పాటూ  చనిపోయివుంటే,  అది బలమైన కథ కాదా?  మా అబ్బాయి యేంటి? ఏం పీకాడని? ‘మా అమ్మాయి’ యే నిలబడుతుంది ఈ కథనీ, నిర్మాతనీ.

          దర్శకుడు ఇంకో పని చెయ్యలేదు, తన ఈ మానస పుత్రికని పూరీ జగన్నాథ్ కి అంకిత మివ్వలేదు.

-సికిందర్
http://www.cinemabazaar.in













          

రివ్యూ!



రచన - దర్శత్వం : సుదర్శన్ సలేంద్ర
తారాగణం : రామ్ శంకర్, త్కుమార్, రేష్మీమీనన్, ఆదిత్యమీనన్, ఎం.ఎస్. నారాయణ, పృథ్వీ,  హర్ష దితరులు
సంగీతంః హిత్ నారాయణ్, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
బ్యానర్ :
వైబా క్రియేషన్స్
నిర్మాతః దేపా శ్రీకాంత్
విడుదల : మార్చి 17, 2017
***

        పూరీ జగన్నాథ్ సోదరుడు హీరో సాయి రామ్ శంకర్ మార్చి పరీక్షలన్నీ  పనికి రాకుండా పోయాక, రామ్  శంకర్ గా పేరు మార్చుకుని సెప్టెంబర్ పరీక్షకి సిద్ధమయ్యాడు. ఇది కూడా పరీక్ష జరగడమే బాగా ఆలస్యమైపోయి సస్పెన్సులో పడ్డాడు. ఇందులో నటించిన ఎంఎస్ నారాయణే పరమపదించింది 2015 జనవరిలో అయితే, ఈ  సినిమా ఎప్పుడు ప్రారంభమై వుంటుందో వూహించవచ్చు. కాబట్టి అప్పటి మేకింగ్ కి తగ్గట్టే వుంది. పేరు మార్చుకున్నంత మాత్రాన అన్నీ మారిపోతాయని లేదు. ఈ సినిమాలో ఏదీ మారలేదు. అసలు తనే మారలేదు, తనకో తోడు అన్నట్టు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కాంబినేషన్ తో వూరించి తనే సైడ్ అయిపోయాడు. ఈ సినిమా శరత్ కుమార్ ది, ఈ కథ శరత్ కుమార్ ది, ఈ ఆట శరత్ కుమార్ ది, ఇదంతా శరత్ కుమార్ దే... ఇది కూడా తెలుసుకోకుండా హీరోని పెట్టి సినిమా తీస్తారా అంటే, ఇలా తీస్తేనే తృప్తిగా వుంటుంది!

         
రత్ కుమార్ క్యారక్టర్ బావుంది. ప్రేమల్లో పెరిగిపోతున్న  మోసాలకి దర్శకుడు కొత్త సినిమాటిక్ పరిష్కారం కనిపెట్టి దాన్ని శరత్ కుమార్ భుజాన వేయడం మాత్రం బావుంది. రెండు వారాల క్రితం ‘చిత్రాంగద’ కథ కూడా బావున్నా, దాన్ని చెప్పడంలో విఫలమైనట్టు, శరత్ కుమార్ తో కూడా బావున్న పాయింటు చెప్పడం కుదరలేదు. కారణం? ఏ పాయింటు నైనా, ఏ కథనైనా ఈజీగా వుండే ఒకే టెంప్లెట్ లో పడేసి రుబ్బడం, అట్టు వేసెయ్యడం. 

          అనాధ హీరో అప్సరస కావాలనుకోవడం, అలాటిది కనపడగానే వెంటపడి టీజ్ చేయడం- చేసి చేసి ఇంటర్వెల్ కి దాన్ని లవ్ లో పడేసుకోవడం, అప్పుడు హీరోకీ- హీరోయిన్ కీ మధ్య ఎక్కడ్నించో విలన్ ఎంటర్ అయి విడదీయడం, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ కోసం హీరో ఎమోషనల్ గా, ఎనర్జిటిక్ గా, డైనమిక్ గా, కాన్ఫిడెంట్ గా, డేరింగ్ గా, యాక్షన్ ఓరియెంటెడ్ గా, హైపర్ స్టామినాతో, సూపర్ బాడీలాంగ్వేజ్ తో ఫైట్ చేసి గెలవడం...లాంటి అద్భుత టెంప్లెట్ లో ఈ డిఫరెంట్ కథకూడా పడేసుకుని సారమంతా పిప్పి చేశాడు దర్శకుడు.

          రామ్ శంకర్ అనాధ (తెలుగు రాష్ట్రాల్లో యూత్ అనాధ లెందుకై పోతారో అర్ధంగాదు- చంద్రబాబు, కేసీఆర్ లు దీని మీద దృష్టి పెట్టి బడ్జెట్లో కేటాయింపులు చేయడం లేదు). రొటీన్ గా ఇతను ఫైనాన్స్  కంపెనీ రికవరీ ఏజెంటుగా వుంటాడు, ఇలా వుంటేనే ఫైట్లు చెయ్యొచ్చు కాబట్టి. బాకీ వసూలుకి పోతే ఒకింట్లో భర్త లేడనుకుని బాకీ కింద భార్యని వాడుకుందామనుకునే ‘చిలిపితనం’ ఇతడిది. ఇది కామెడీ అనుకోవాలి. మరి తనకి  ‘జాతి అమ్మాయి’ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వుంటుంది. ఆ జాతి అమ్మాయి ఎలా వుంటుందో వర్ణనలుంటాయి. వర్ణిస్తూండగానే సినిమా హాలు దగ్గర కనపడుతుంది జాతి అమ్మాయి రేష్మీ మీనన్. వెంటనే ఆమెని డిసైడ్ చేసుకుని మాయమాటలతో పడెయ్యాలని చూస్తూంటాడు. బోటనీ చదివిన జాతిఅమ్మాయి నర్సరీ నడుపుకుంటూ పూల మొక్కల్ని మితిమీరిన సెంటిమెంట్లతో   పెంచుతూ, పూలకీ మనసుంటుందని లెక్చర్లిస్తూ జాతీయంగా వుంటుంది.

       ఈమె వెంట కామెడీ హర్ష కూడా పడతాడు. హర్ష తండ్రి ఎమ్మెస్ నారాయణతో ఏదో కన్ఫ్యూజన్ ఏర్పడి సంబంధం మాట్లాడడానికి రేష్మీ మీనన్ ఇంటికి వెళ్తాడు. అది కాస్తా బెడిసికొడుతుంది. కన్ఫ్యూజన్ తీరి జాతిఅమ్మాయి రామ్ శంకర్ వైపు మొగ్గుతుంది. తనకి అబద్ధాలు చెప్పి నమ్మించాడని అతడ్నీ తిరస్కరిస్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో బుల్లెట్ షాట్స్ లాంటి డైలాగ్స్  చెప్తాడు. ఆమె బుట్టలో పడిపోయి వచ్చేస్తూంటే, ఎక్కడ్నించో ఒక వ్యాను దూసుకొచ్చి ఎత్తుకెళ్ళి పోతుంది. ఇంటర్వెల్.

          రేష్మీ మీనన్ ని బందీగా పెట్టుకున్న శరత్ కుమార్, రామ్ శంకర్ ని బెదిరించి పనులు చేయించుకుంటూంటాడు. ఏమిటా పనులు? ఎందుకు చేయించుకుంటున్నాడు? అతడి కథేమిటి? ఆ కథ ఎలా ముగిసింది?...ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘నేనోరకం’ చూడాల్సిందే.

          చూశాక కలిగే అనుమానమేమిటంటే ‘నేనోరకం’ అనే టైటిల్ రామ్ శంకర్ మీదే  వుందా, లేక శరత్ కుమార్ మీద వుందా? - అని! ఎందుకంటే,  రామ్  శంకర్ నేనోరకం అన్పించుకోవడానికి అలాటి క్యారక్టరైజేషన్ ఏమీ లేదు. శరత్ కుమార్ కే వుంది- అతను అదోరకంగా రివీల్ అయి, అదోరకం పనులు చేయిస్తూంటే. మరి రామ్ శంకర్ ఏం చేసినట్టు? పది నిమిషాల్లో ఈ పనిచెయ్యకపోతే నీ హీరోయిన్ని లేపేస్తా అని శరత్ కుమార్ అనగానే, ఆ పని చెయ్యడానికి పరుగులు తీయడం; చేశాక మళ్ళీ శరత్ కుమార్- ఈ పని చెయ్యకపోతే నీ హీరోయిన్ చస్తుంది అనగానే మళ్ళీ పరిగెత్తడం, ఇంతే! 

          ఆట శరత్ కుమార్ ది, అడే  వాడు రామ్ శంకర్. టోటల్లీ పాసివ్ క్యారక్టర్ అన్నమాట. కథ- కథనం- డైలాగులు- గోల్ -ఆర్డర్లు -అన్నీ శరత్ కుమార్ వే. రామ్ శంకర్ కి కనీసం తిరగబడి హీరోయిన్ని విడిపించుకోవాలన్న ఆలోచనగానీ, గోల్ గానీ వుండవు. ఏమంటే హీరోయిన్ ప్రాణాలతో వుండాలని పరుగులు తీస్తున్నాననుకోవడం. దాంతో తన లవ్ చాలా బలమైనదని అన్పించుకునే ప్రయత్నం చెయ్యడం. ఇదంతా ఎమోషనే కదా అనుకోవడం. ఈ ఎమోషన్ తో ప్రేక్షకుల సానుభూతి పొందుతున్నాను కదా అనుకోవడం. 

        ఎక్కడైనా ప్రేమించినమ్మాయి వాడెవడో చెయ్యమన్న పనులన్నీ చేస్తూ  తనని కాపాడుకోవాలనుకుంటుందా? తెలివితో వాణ్ణి ఎదిరించి పైచేయి సాధించేవాడు తన నిజమైన ప్రియుడనుకుంటుందా? ఎవరిక్కావాలి బానిసల ఎమోషన్? ఎక్కడికి పోతున్నాయి తెలుగు హీరోల పాత్రచిత్రణలు? ఏది ఎమోషన్? ఏది ఫీలింగ్?  అసలేమైనా తెలుస్తోందా?

        అసలీ శరత్ కుమార్ కథ అయినా ఏంటో ఎంతకీ  తెలీక – సినిమాలో ఏది ఎందుకు జరుగుతోందో అర్ధంగాక- మనం పాసివ్ గా చూస్తూంటే, చివరి పది  నిమిషాల్లో కథ చెప్తాడు దర్శకుడు. శరత్ కుమార్ ఇలా చేయడానికి కారణం ఇప్పుడు ఈ ఆఖరి నిమిషాల్లో మనకి తెలిసి హుషారు తెచ్చుకుంటాం. ఎందుకంటే, కారణం అంత బావుంటుంది. ఈ కారణాన్ని కథలో సకాలంలో ఎప్పుడు ఎలా ఓపెన్ చేసి, దీన్నొక  ఆకట్టుకునే బలమైన సినిమాగా తీర్చి దిద్దవచ్చో దర్శకుడు తెలుసుకోలేకపోయాడు. ఈ కథ డిమాండ్ చేసే స్ట్రక్చర్ ని తెలుసుకోకుండా, మూస టెంప్లెట్ ని   నమ్ముకోవడం ఒకటి, ఎండ్ సస్పెన్స్ కథనం చెయ్యడం ఒకటీ- ఈ రెండూ కలిసి ఒక మంచి బర్నింగ్ పాయింటుని మంటగలిపాయి. 

          ఈ టెంప్లెట్ లో ఫస్టాఫ్ తిరగమోత లవ్ ట్రాక్ అంతా వేస్ట్. ఫస్టాఫ్ లేకపోయినా సరిపోతుంది. ఈ టెంప్లెట్ కుంపట్ల వల్ల ఎంత నష్టం జరుగుతోంటే తెలుసుకోకపోతే ఎవరేం చేయగలరు. ఎక్కడైనా హీరోకి కథ లేకుండా కమర్షియల్ సినిమా వుంటుందా? చేసిన కథలో ఇది కూడా చూసుకోకుండా చేస్తే ఎవరేం చేయగలరు. 

          ఫస్టాఫ్ లోనే అంతోటి ప్రేమకథకి నాల్గు పాటలు. దాదాపు ఫస్టాఫ్ అంతా ప్రేక్షకులు స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ బిజీగా వుంటున్నారు. అయితే ఒకటి- ఏనాడో మొదలెట్టిన సినిమా ఈనాడు విడుదలైంది కాబట్టి దీన్ని ఆనాటి ప్రమాణాలతోనే చూడాలి. కానీ ఆనాటి  ప్రమాణాల మధ్య ఇంత మంచి యూత్ బర్నింగ్ పాయింటు నాశనమయ్యిందే అన్నదే బాధ!

-సికిందర్