రచన - దర్శకత్వం : సుదర్శన్ సలేంద్ర
తారాగణం : రామ్ శంకర్, శరత్‌కుమార్, రేష్మీమీనన్, ఆదిత్యమీనన్, ఎం.ఎస్. నారాయణ, పృథ్వీ, హర్ష తదితరులు
సంగీతంః మహిత్ నారాయణ్, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ రామస్వామి
బ్యానర్ : వైబా క్రియేషన్స్
నిర్మాతః దేపా శ్రీకాంత్
విడుదల : మార్చి 17, 2017
***
పూరీ జగన్నాథ్ సోదరుడు
హీరో సాయి రామ్ శంకర్ మార్చి పరీక్షలన్నీ
పనికి రాకుండా పోయాక, రామ్ శంకర్
గా పేరు మార్చుకుని సెప్టెంబర్ పరీక్షకి సిద్ధమయ్యాడు. ఇది కూడా పరీక్ష జరగడమే బాగా
ఆలస్యమైపోయి సస్పెన్సులో పడ్డాడు. ఇందులో నటించిన ఎంఎస్ నారాయణే పరమపదించింది 2015
జనవరిలో అయితే, ఈ సినిమా ఎప్పుడు
ప్రారంభమై వుంటుందో వూహించవచ్చు. కాబట్టి అప్పటి మేకింగ్ కి తగ్గట్టే వుంది. పేరు మార్చుకున్నంత
మాత్రాన అన్నీ మారిపోతాయని లేదు. ఈ సినిమాలో ఏదీ మారలేదు. అసలు తనే మారలేదు, తనకో
తోడు అన్నట్టు తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కాంబినేషన్ తో వూరించి తనే సైడ్
అయిపోయాడు. ఈ సినిమా శరత్ కుమార్ ది, ఈ కథ శరత్ కుమార్ ది, ఈ ఆట శరత్ కుమార్ ది,
ఇదంతా శరత్ కుమార్ దే... ఇది కూడా తెలుసుకోకుండా హీరోని పెట్టి సినిమా తీస్తారా
అంటే, ఇలా తీస్తేనే తృప్తిగా వుంటుంది!
శరత్ కుమార్ క్యారక్టర్ బావుంది. ప్రేమల్లో పెరిగిపోతున్న మోసాలకి దర్శకుడు కొత్త సినిమాటిక్ పరిష్కారం కనిపెట్టి దాన్ని శరత్ కుమార్ భుజాన వేయడం మాత్రం బావుంది. రెండు వారాల క్రితం ‘చిత్రాంగద’ కథ కూడా బావున్నా, దాన్ని చెప్పడంలో విఫలమైనట్టు, శరత్ కుమార్ తో కూడా బావున్న పాయింటు చెప్పడం కుదరలేదు. కారణం? ఏ పాయింటు నైనా, ఏ కథనైనా ఈజీగా వుండే ఒకే టెంప్లెట్ లో పడేసి రుబ్బడం, అట్టు వేసెయ్యడం.
అనాధ హీరో అప్సరస కావాలనుకోవడం, అలాటిది కనపడగానే వెంటపడి టీజ్ చేయడం- చేసి చేసి ఇంటర్వెల్ కి దాన్ని లవ్ లో పడేసుకోవడం, అప్పుడు హీరోకీ- హీరోయిన్ కీ మధ్య ఎక్కడ్నించో విలన్ ఎంటర్ అయి విడదీయడం, ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ కోసం హీరో ఎమోషనల్ గా, ఎనర్జిటిక్ గా, డైనమిక్ గా, కాన్ఫిడెంట్ గా, డేరింగ్ గా, యాక్షన్ ఓరియెంటెడ్ గా, హైపర్ స్టామినాతో, సూపర్ బాడీలాంగ్వేజ్ తో ఫైట్ చేసి గెలవడం...లాంటి అద్భుత టెంప్లెట్ లో ఈ డిఫరెంట్ కథకూడా పడేసుకుని సారమంతా పిప్పి చేశాడు దర్శకుడు.
రామ్ శంకర్ అనాధ (తెలుగు రాష్ట్రాల్లో యూత్ అనాధ లెందుకై పోతారో అర్ధంగాదు- చంద్రబాబు, కేసీఆర్ లు దీని మీద దృష్టి పెట్టి బడ్జెట్లో కేటాయింపులు చేయడం లేదు). రొటీన్ గా ఇతను ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంటుగా వుంటాడు, ఇలా వుంటేనే ఫైట్లు చెయ్యొచ్చు కాబట్టి. బాకీ వసూలుకి పోతే ఒకింట్లో భర్త లేడనుకుని బాకీ కింద భార్యని వాడుకుందామనుకునే ‘చిలిపితనం’ ఇతడిది. ఇది కామెడీ అనుకోవాలి. మరి తనకి ‘జాతి అమ్మాయి’ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వుంటుంది. ఆ జాతి అమ్మాయి ఎలా వుంటుందో వర్ణనలుంటాయి. వర్ణిస్తూండగానే సినిమా హాలు దగ్గర కనపడుతుంది జాతి అమ్మాయి రేష్మీ మీనన్. వెంటనే ఆమెని డిసైడ్ చేసుకుని మాయమాటలతో పడెయ్యాలని చూస్తూంటాడు. బోటనీ చదివిన జాతిఅమ్మాయి నర్సరీ నడుపుకుంటూ పూల మొక్కల్ని మితిమీరిన సెంటిమెంట్లతో పెంచుతూ, పూలకీ మనసుంటుందని లెక్చర్లిస్తూ జాతీయంగా వుంటుంది.
ఈమె
వెంట కామెడీ హర్ష కూడా పడతాడు. హర్ష తండ్రి ఎమ్మెస్ నారాయణతో ఏదో కన్ఫ్యూజన్
ఏర్పడి సంబంధం మాట్లాడడానికి రేష్మీ మీనన్ ఇంటికి వెళ్తాడు. అది కాస్తా బెడిసికొడుతుంది.
కన్ఫ్యూజన్ తీరి జాతిఅమ్మాయి రామ్ శంకర్ వైపు మొగ్గుతుంది. తనకి అబద్ధాలు చెప్పి
నమ్మించాడని అతడ్నీ తిరస్కరిస్తుంది. ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందో బుల్లెట్
షాట్స్ లాంటి డైలాగ్స్ చెప్తాడు. ఆమె
బుట్టలో పడిపోయి వచ్చేస్తూంటే, ఎక్కడ్నించో ఒక వ్యాను దూసుకొచ్చి ఎత్తుకెళ్ళి
పోతుంది. ఇంటర్వెల్.
రేష్మీ మీనన్ ని బందీగా పెట్టుకున్న శరత్ కుమార్, రామ్ శంకర్ ని బెదిరించి పనులు చేయించుకుంటూంటాడు. ఏమిటా పనులు? ఎందుకు చేయించుకుంటున్నాడు? అతడి కథేమిటి? ఆ కథ ఎలా ముగిసింది?...ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘నేనోరకం’ చూడాల్సిందే.
చూశాక కలిగే అనుమానమేమిటంటే ‘నేనోరకం’ అనే టైటిల్ రామ్ శంకర్ మీదే వుందా, లేక శరత్ కుమార్ మీద వుందా? - అని! ఎందుకంటే, రామ్ శంకర్ నేనోరకం అన్పించుకోవడానికి అలాటి క్యారక్టరైజేషన్ ఏమీ లేదు. శరత్ కుమార్ కే వుంది- అతను అదోరకంగా రివీల్ అయి, అదోరకం పనులు చేయిస్తూంటే. మరి రామ్ శంకర్ ఏం చేసినట్టు? పది నిమిషాల్లో ఈ పనిచెయ్యకపోతే నీ హీరోయిన్ని లేపేస్తా అని శరత్ కుమార్ అనగానే, ఆ పని చెయ్యడానికి పరుగులు తీయడం; చేశాక మళ్ళీ శరత్ కుమార్- ఈ పని చెయ్యకపోతే నీ హీరోయిన్ చస్తుంది అనగానే మళ్ళీ పరిగెత్తడం, ఇంతే!
ఆట శరత్ కుమార్ ది, అడే వాడు రామ్ శంకర్. టోటల్లీ పాసివ్ క్యారక్టర్ అన్నమాట. కథ- కథనం- డైలాగులు- గోల్ -ఆర్డర్లు -అన్నీ శరత్ కుమార్ వే. రామ్ శంకర్ కి కనీసం తిరగబడి హీరోయిన్ని విడిపించుకోవాలన్న ఆలోచనగానీ, గోల్ గానీ వుండవు. ఏమంటే హీరోయిన్ ప్రాణాలతో వుండాలని పరుగులు తీస్తున్నాననుకోవడం. దాంతో తన లవ్ చాలా బలమైనదని అన్పించుకునే ప్రయత్నం చెయ్యడం. ఇదంతా ఎమోషనే కదా అనుకోవడం. ఈ ఎమోషన్ తో ప్రేక్షకుల సానుభూతి పొందుతున్నాను కదా అనుకోవడం.
ఎక్కడైనా
ప్రేమించినమ్మాయి వాడెవడో చెయ్యమన్న పనులన్నీ చేస్తూ తనని కాపాడుకోవాలనుకుంటుందా? తెలివితో వాణ్ణి
ఎదిరించి పైచేయి సాధించేవాడు తన నిజమైన ప్రియుడనుకుంటుందా? ఎవరిక్కావాలి బానిసల
ఎమోషన్? ఎక్కడికి పోతున్నాయి తెలుగు హీరోల పాత్రచిత్రణలు? ఏది ఎమోషన్? ఏది ఫీలింగ్?
అసలేమైనా తెలుస్తోందా?
అసలీ
శరత్ కుమార్ కథ అయినా ఏంటో ఎంతకీ తెలీక –
సినిమాలో ఏది ఎందుకు జరుగుతోందో అర్ధంగాక- మనం పాసివ్ గా చూస్తూంటే, చివరి
పది నిమిషాల్లో కథ చెప్తాడు దర్శకుడు.
శరత్ కుమార్ ఇలా చేయడానికి కారణం ఇప్పుడు ఈ ఆఖరి నిమిషాల్లో మనకి తెలిసి హుషారు
తెచ్చుకుంటాం. ఎందుకంటే, కారణం అంత బావుంటుంది. ఈ కారణాన్ని కథలో సకాలంలో ఎప్పుడు
ఎలా ఓపెన్ చేసి, దీన్నొక ఆకట్టుకునే బలమైన
సినిమాగా తీర్చి దిద్దవచ్చో దర్శకుడు తెలుసుకోలేకపోయాడు. ఈ కథ డిమాండ్ చేసే
స్ట్రక్చర్ ని తెలుసుకోకుండా, మూస టెంప్లెట్ ని నమ్ముకోవడం ఒకటి, ఎండ్ సస్పెన్స్ కథనం చెయ్యడం
ఒకటీ- ఈ రెండూ కలిసి ఒక మంచి బర్నింగ్ పాయింటుని మంటగలిపాయి.
ఈ టెంప్లెట్ లో ఫస్టాఫ్ తిరగమోత లవ్ ట్రాక్ అంతా వేస్ట్. ఫస్టాఫ్ లేకపోయినా సరిపోతుంది. ఈ టెంప్లెట్ కుంపట్ల వల్ల ఎంత నష్టం జరుగుతోంటే తెలుసుకోకపోతే ఎవరేం చేయగలరు. ఎక్కడైనా హీరోకి కథ లేకుండా కమర్షియల్ సినిమా వుంటుందా? చేసిన కథలో ఇది కూడా చూసుకోకుండా చేస్తే ఎవరేం చేయగలరు.
ఫస్టాఫ్ లోనే అంతోటి ప్రేమకథకి నాల్గు పాటలు. దాదాపు ఫస్టాఫ్ అంతా ప్రేక్షకులు స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ బిజీగా వుంటున్నారు. అయితే ఒకటి- ఏనాడో మొదలెట్టిన సినిమా ఈనాడు విడుదలైంది కాబట్టి దీన్ని ఆనాటి ప్రమాణాలతోనే చూడాలి. కానీ ఆనాటి ప్రమాణాల మధ్య ఇంత మంచి యూత్ బర్నింగ్ పాయింటు నాశనమయ్యిందే అన్నదే బాధ!
-సికిందర్