రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జనవరి 2018, మంగళవారం

579 : సందేహాలు - సమాధానాలు            Q :  సినిమాల్లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి కథలు చూపించడం అవసరమా? వాళ్ళు పెద్దయ్యాక ప్రేమికులే ఎందుకు  కావాలి? ‘దేవదాసు’  దగ్గర్నుంచీ ఇదే చూస్తున్నాం. ఈ పరిస్థితి మారదా? అసలు చిన్నప్పటి నుంచి కథ ప్రారంభించడం ఎంతవరకు అవసరం?
- కె. విధీర్, సహకార దర్శకుడు

          
A : దీనికి సమాధానం చెప్పుకోవాలంటే చాలా తవ్వుకోవాలి. సినిమాల్లో చిన్ననాటి హీరో హీరోయిన్ల సంగతులు ప్రధానంగా రెండు విభాగాలుగా వుంటున్నాయి : 1. జాయింటు కథలు, 2. సోలో కథలు. జాయింటు కథలు మూడు ఉప విభాగాలుగా వుంటున్నాయి : 1. తోబుట్టువుల కథలు, 2. స్నేహితుల కథలు, 3. బాలిక- బాలుడు కథలు. సోలో కథలు మూడు ఉప విభాగాలుగా వుంటున్నాయి : 1. మనస్తత్వాలు, 2. అనుభవాలు, 3. తీవ్రానుభవాలు. 

          జాయింటు ఉపవిభాగం 1. తోబుట్టువుల కథలే తీసుకుంటే - చిన్నప్పుడు తలోదారి పట్టిపోతారు. పెద్దయ్యాక చిన్నప్పుడు పాడుకున్న పాటేదో వాళ్ళల్లో ఎవరో ఒకరు పాడుకుంటే,  పరస్పరం గుర్తుపట్టుకుని ఒకటవుతారు. ఈ సినిమాలేవో చెప్పాల్సిన అవసరం లేదు. 

          జాయింటు ఉపవిభాగం 2. స్నేహితుల కథలే తీసుకుంటే- చిన్నప్పుడు విడిపోవచ్చు, విడిపోక పోవచ్చు. కానీ ఇద్దరి మనస్తత్వాల తేడాలు చూపించడానికి చిత్రిస్తూంటారు. 

          జాయింటు ఉపవిభాగం 3. బాలిక - బాలుడు కథలే తీసుకుంటే – ఇవి అన్నా చెల్లెళ్ళు, లేదా అక్కా తమ్ముళ్ళ కథలు కావొచ్చు. సిస్టర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటి మెంటు సినిమాల కోసం ఇవి. ప్రేమ కథలకైతే ఈ బాలిక, బాలుడు పెద్దయ్యాక హీరోహీరోయిన్ లవుతారు. కాబట్టి చిన్నప్పుడు వీళ్ళ మధ్య ఆకర్షణో, వికర్షణో, ఎడబాటోచూపించి, పెద్దయ్యాక వీటిని తీరుస్తారు. 

          ఇక సోలో ఉప విభాగం 1. మనస్తత్వాలే తీసుకుంటే, హీరో లేదా హీరోయిన్ ఒక్కరి గురించి ఈ చిన్నప్పటి కథ లేదా ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇందులో పెద్దవాళ్ళయి ఇప్పుడిలా జీవిస్తున్నం
దుకు కారణాలేమిటో ఆ చిన్నప్పటి కథలో లేదా ఫ్లాష్ బ్యాక్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది కామెడీకైనా కావొచ్చు, ఇంకెందుకైనా కావొచ్చు. 

          సోలో ఉప విభాగం 2. అనుభవాలే తీసుకుంటే – చిన్నప్పటి ఒక అనుభవం పెద్దయ్యాక ఎలా బాధిస్తోందో, పాత్రని సమూలంగా ఎలా మార్చేసిందో  చూపించడానికి ఉపయోగిస్తారు. 

          సోలో ఉపవిభాగం 3. తీవ్రానుభవాలే తీసుకుంటే - ఇవి హింసాత్మకమైనవి. యాక్షన్ – రివెంజి సినిమాలకి పనికొచ్చేవి.
***
        ఇప్పుడు వీటిలో ఏవి ఇప్పటికీ పనికొస్తాయో, ఏవి పనికిరావో  చూద్దాం : జాయింటు ఉపవిభాగం 1. తోబుట్టువులు చిన్నప్పుడు విడిపోయి పెద్దయ్యాక కలుసుకునే కథలు ఒకప్పుడు అలరించిన నవరసాల – నాటకీయతల - మెలో డ్రామాల సినిమాల్లో భాగం. ఇవి ఇప్పుడెందుకు పనికి రావో వేరే  చెప్పాల్సిన అవసరం లేదు. 

          జాయింటు ఉపవిభాగం 2. స్నేహితుల చిన్ననాటి కథల్లో మనస్తత్వాల తేడాలు చూపించడం కూడా పై చెల్లిపోయిన ఫార్ములా లాంటిదే. అల్లుఅర్జున్ – రాం చరణ్ లు ఫ్రెండ్స్ గా వుంటే,  వాళ్ళ మనస్తత్వాల్లో తేడాలు చెప్పడానికి వాళ్ళనీ,  వెండితెరకి చైతన్యం తీసుకొచ్చే వాళ్ళ స్టార్ డమ్ నీ పక్కన బెట్టి – ఎవరో ఇద్దరు బాలనటులతో సినిమా ప్రారంభించడం, లేదా మధ్యలో ఫ్లాష్ బ్యాక్ వేయడం ఖచ్చితంగా బాక్సాఫీసు అప్పీల్ కి ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక చర్యే. బాలనటులతో స్క్రీన్ టైం వేస్ట్ చేయడం, అంతసేపూ  అర్జున్ - చరణ్ లని తెర మీద కన్పించకుండా చేయడం ప్రేక్షకుల ఆశల మీద నీళ్ళు జల్లడమే. ప్రతీ క్షణం అర్జున్ –చరణ్ లేం చేస్తారో చూద్దామని డబ్బులు పెట్టుకుని వస్తారు గానీ, ఎవరో బాలనటులేం  చేస్తారో చూడాలనుకోరు. ఆ రోజులు పోయాయి. ప్రేక్షకుల మనీ, టైం – వీటికి విలువ ఇవ్వని చిత్రణలు బాక్సాఫీసు వ్యతిరేకమైనవి. 

          కానీ ఇటీవల ‘జవాన్’  లో ఇదే జరిగింది. సాయి ధరమ్ తేజ్, ప్రసన్న ఫ్రెండ్స్ ఇద్దరి తేడాలు చెప్పడానికి బాల నటులతో చిన్నప్పట్నుంచీ కథ నెత్తుకుంటూ సినిమా ప్రారంభించారు. ఇలా ప్రారంభమే బోరు కొట్టించారు. మనస్తత్వాలేమిటోచెప్పడానికి ప్రేక్షకులకి ఇంత స్పూన్ ఫీడింగ్ తో ట్యూషన్ చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్ – ప్రసన్నల మంచి బుద్ధి - దొంగ బుద్ధి చెప్పడానికి  ఓ అదిరిపోయే సంఘటనతో వీళ్లిద్దరితో ప్రారంభ సీనే వేసి,  తేడాలు చూపించెయ్య వచ్చు. ఇదెంతో లైవ్ గా, ఎఫెక్టివ్ గా ఈనాటి సినిమాలా వుంటే, చిన్నప్పటి సీన్లు నిన్నటి వార్తలా చప్పగా వుంటాయి. సినిమాలైనా, సాహిత్యమైనా నేడు విజువల్ రైటింగ్ ని, లైవ్ రైటింగ్ ని డిమాండ్ చేస్తున్నాయి. చిన్నప్పటి నుంచీ కథ చెప్పుకు రావడం విజువల్ రైటింగ్ / టేకింగ్, లైవ్ రైటింగ్ / టేకింగ్, క్రియేటివ్ రైటింగు / టేకింగులు కానే కావు – లేజీ రైటింగ్ / టేకింగ్, టైం వేస్ట్ చేసే పూర్ రైటింగ్ / టేకింగ్ లన్నమాట . 

          ఒక్క విషయం  చెప్పడానికి పది సీన్ల కథ చెప్తున్నారు. ఒక్క సంఘటనతో – ఒక్క సీనుతో - ఆ విషయం చెప్పెయ్యొచ్చు. విషయం చెప్పడానికి సీన్లకి సీన్లు తీస్తూ పోతున్నారే గానీ, అన్ని సీన్లకి బదులు ఒక్క ముఖచిత్రం లాంటి సీను కనిపెట్టలేకపోతున్నారు. సీన్లు కాదు కావాల్సింది - ఆ ఒక్క ముఖచిత్ర సీనేమిటో, ఆ ఒక్క సంఘటనేమిటోకనిపెట్టడం కావాలి. ఇదే జరగడం లేదు. ప్రేక్షకుల్ని వెంటనే కట్టిపడేసే విజువల్ రైటింగ్ / టేకింగ్ అంటే, లైవ్ రైటింగ్ / టేకింగ్ అంటే ఇదీ నిజానికి. సీన్లు రాసేవాళ్ళు ఇవ్వాళ్ళ అవసరం లేదు – విషయానికి ఒక్క ముఖచిత్ర సీను కనిపెట్టేవాళ్ళు కావాలి. కాబట్టి ఈ మనస్తత్వాల ఉప విభాగానికి కూడా చిన్నప్పటి చిత్రీకరణలు ఇప్పుడు కాలం చెల్లినవని అర్ధంజేసుకుని జాగ్రత్తపడాలి.
***
                ఇక జాయింటు ఉపవిభాగం 3. బాలిక - బాలుడు కథలే తీసుకుంటే – వీటికి కూడా చిన్నప్పటి చిత్రీకరణలు పనిచెయ్యవు.  అన్నా చెల్లెళ్ళ కథలతో,  అక్కా తమ్ముళ్ళ కథలతో ఇప్పుడు సినిమాలు తీయవచ్చు, కానీ పై మనస్తత్వాల ఉపవిభాగంలో చెప్పిన షరతులతోనే అయితే బావుంటుంది. అన్నగా అల్లు అర్జున్ - చెల్లెలుగా అంజలి వుంటే, బాక్సాఫీసు అప్పీల్ కోసం వీళ్ళిద్దరి సీన్లతో అనుబంధాన్ని స్థాపించాలే గానీ, వీళ్ళని పక్కన బెట్టి  ఏనాటిదో నవరసాల కాలంనాటి  చైల్డ్ సెంటిమెంటు తెచ్చిపెట్టుకుని,  చాదస్తంగా బాల నటుల్ని పెట్టి తీస్తూపోతే మొత్తం పోతుంది. అల్లుఅర్జున్  తమ్ముడుగా,  నయనతార అక్కగా వున్నాఇంతే. వీళ్ళతో ఇప్పటి లైవ్ టెలికాస్ట్ అవసరం గానీ, బాల నటులతో ఎప్పటివో పాత న్యూస్ పేపరు తాలూకు రద్దీ వార్తలు కాదు. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోకపోతే సినిమాలు తీయడం చీకట్లో బాణాలేయడం లాంటిది. 

          ప్రేమ కథలకైతే ఈ బాలిక, బాలుడు పెద్దయ్యాక హీరోహీరోయిన్ లవుతారు. కాబట్టి చిన్నప్పుడు వీళ్ళ మధ్య ఆకర్షణో, వికర్షణో, ఎడబాటోచూపించి, పెద్దయ్యాక వీటిని తీరుస్తారు. ఇది ఒకప్పటి నవరసాల మసాలాలో భాగం. ఇప్పుడు మూడే మసాలాలున్నాయి  : లవ్, కామెడీ, యాక్షన్. లవ్ కి హీరో హీరోయిన్ల నడుస్తున్న కథే ప్రాణం. చిన్నప్పటి కథలు కాదు. ఇక్కడ కూడా అల్లు అర్జున్ – రకుల్ ప్రీత్ సింగ్ లు చిన్నప్పటి ఫ్రెండ్స్ అని చెప్పడానికి డిటోపధ్ధతి  : లైవ్ గానే అర్జున్నీ – రకుల్నీ చూపిస్తూ వాళ్ళ మాటల్లో, చర్యల్లో వీళ్ళు చిన్నప్పటి ఖాతా అని తేల్చేస్తే సరిపోతుంది. ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నారు. ఇప్పుడు ఫిలిం లేదని ఈ సూత్రం లేదనుకోకూడదు. డిజిటల్ లో నైనా బిహేవియర్ తోనే విషయం చెప్పాలి. ఎటొచ్చీ లైవ్ సంఘటనలతోనే  దృశ్య మాధ్యమమైన సినిమా అని ఈ సూత్రం కూడా చెబుతోంది. ఇలా కాక సినిమాకి మాంచి యూత్ అప్పీల్ – రోమాంటిక్ అప్పీల్ - బాక్సాఫీసు అప్పీళ్ళని సరఫరా చేసే అర్జున్ – రకుల్ లని పక్కన పెట్టేసి,  ఎవరో చైల్డ్ ఆర్టిస్టులతో ఎప్పటివో వాళ్ళ చిన్నప్పటి కథలు  చెప్తే – 1. ‘మళ్ళీ రావా’ లాగా వుంటుంది, 2. ‘హలో’ లాగా కూడా వుంటుంది. 

          ఈ రెండు సినిమాల్లో రోమాంటిక్ జంటలైన సుమంత్ - ఆకాంక్షా సింగ్ లని, అఖిల్ –
కళ్యాణీ ప్రియదర్శన్ లనీ  పక్కన పెట్టేసి, బాలనటుల కథే ప్రాణమైనట్టు వాళ్లకి విలువైన స్క్రీన్ టైంని ఉదారంగా కేటాయించారు. చిన్నప్పటి అచ్చిబుచ్చి ముచ్చట్లు చెప్పాలన్న చాపల్యాన్ని తెలుగు సినిమాల చరిత్రలోనే పతాక స్థాయికి తీసికెళ్ళారు. ‘హలో’ లో ఏకబిగిన అరగంట దాకా సాగదీస్తే, ‘మళ్ళీ రావా’ లో చివరి దాకా సాగదీస్తూనే పోయారు. 

          పోనీ ఈ చూపించే చిన్నప్పటి కథలకి ఆకర్షితులై పిల్లలేమైనా  సినిమాలకి వస్తున్నారా? అదేం లేదు. మరెవవరి కోసమిప్పుడు చిన్నప్పటి కథలు? యూత్ కోసమే అనుకుంటే, యూత్ తమ అభిమాన తారల ప్రేమాయణాలు చూసి ఎంజాయ్ చేయాడానికొస్తారా, లేక  ఏక్ తారా  వాయించుకునే చిన్న పిల్లల స్నేహాల్ని స్టడీ చేయడానికొస్తారా?  సినిమాల్ని చూసేది ఎక్కువగా యూతే అయినప్పుడు,  ఆ యూత్ కి అడ్డంకులు సృష్టించే కళా సృష్టులు సుష్టుగా చేసుకుపోతే  సినిమాలెలా ఆడతాయి? భుక్తాయాసంతో నిద్రపోతాయి.
***
ఇప్పుడు కూడా సినిమాల్లో  పిల్లలని చూపించ వచ్చు, చూపించి పిల్లల్ని కూడా ఆకర్షించ వచ్చు – ఎప్పుడు? ఒక ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’, ఒక ‘పసివాడి ప్రాణం’ లాంటివి తీసినప్పుడు. ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’ లో బేబీ షామిలి లాంటి, ‘పసివాడి ప్రాణం’ లో బేబీ సుజిత లాంటి పూర్తి నిడివి హీరోతో సమాన ప్రాతినిధ్యంగల,  హీరో వెంట వుండే, అద్భుతరస ప్రధాన పాత్రలైనప్పుడు. ఇప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ టికెట్లు కూడా తెగుతాయి. బాల పాత్రల్ని హీరో హీరోయిన్ల చిన్న నాటి వెర్షన్లుగా చిన్నప్పటి స్నేహాలు, ప్రేమలు, ఎడబాట్లు చూపిస్తే పిల్లలకేం అర్ధంగావు. పిల్లలకి అర్ధమై ఎంజాయ్ చేసే భాష – రసం – ఒక్కటే, అద్భుతరసం. పూర్తి నిడివి పాత్రలుగా అవి ప్రమాదంలో పడితేనో, అడ్వెంచర్లు చేస్తేనో, విలన్ని ముప్పుతిప్పలు పెడితేనో పిల్లలకి బాగా కనెక్ట్ అయి ఆ స్టార్ సినిమాలు  పిల్లల సినిమాలు  కూడా అవుతాయి. పైన చెప్పుకున్న  రెండు సినిమాలు ఆనాడు ఇదే సాధించాయి. ఏడాది పిల్లవాడితో ‘సిసింద్రీ’  కూడా  ఇదే సాధించింది. 

          కాబట్టి హీరోహీరోయిన్ల ప్రేమకథని బాల నటులతో చిన్నప్పట్నుంచీ చెప్పుకురావడం స్టార్ల స్క్రీన్ స్పేస్ ని దురాక్రమించడం అవడమే గాక, అలా చిన్నప్పట్నుంచీ - చందమామ రావె, జాబిల్లి రావె అని జోల పాడుతున్నట్టు సినిమా ప్రారంభించడం ఇప్పుడు పరమ వెనకబాటు తనం కూడా. అనాగరికం కూడా. ఇది అర్ధం జేసుకుని ప్రాప్తకాలజ్ఞాతని ప్రదర్శించుకోవాలి. గత యేడాది ఊ అంటే ఇలాటి సినిమాలు వచ్చి పడ్డాయి. చూడలేక, రివ్యూలు రాయలేక చచ్చాం. 

          ఇక సోలోల విషయానికొద్దాం. సోలో ఉప విభాగం 1. మనస్తత్వాల విషయానికొస్తే – దీని చిన్నప్పటి చిత్రణ హీరో లేదా హీరోయిన్ ఒక్కరికే వుంటుంది. మానసికంగా ఒకరకంగా వుండే హీరో లేదా హీరోయిన్ పాత్రని ఇక్కడ కూడా చిన్నప్పటి కథతో ఆ మానసికావస్థ అంతా  చూపించుకొస్తారు. ప్రయోజనం? శూన్యం. ఈ సందర్భంలో కూడా ఆ హీరో లేదా హీరోయిన్ స్క్రీన్ స్పేస్ ని బాల నటులు తినేస్తారు. ఇది కూడా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకమే. నేరుగా ఆ హీరో లేదా హీరోయిన్నే చూపిస్తూ సంఘటనలతో లైవ్ గా చూపించడంలో వుండే వూపు పిల్లలతో రాదు. ‘మెంటల్ మదిలో’ లో వచ్చిందా? హీరో ఏదీ ఎంపిక చేసుకోలేని బలహీనత గలవాడని ఎస్టాబ్లిష్ చేసందుకు,  బడి దగ్గర్నుంచీ వాడి కథ నెత్తుకుని చెప్పుకొచ్చారు. అవసరమా? ‘భలే భలే మగాడివోయ్’ లో నాని మతిమరుపు గలవాడని చెప్పడానికి  చిన్నప్పట్నుంచీ కథ నెత్తుకున్నారా? లేదే? అది లైవ్ టెలికాస్ట్ లాంటి చిత్రణ.  ‘మెంటల్ మదిలో’ లో  పాత న్యూస్ పేపరు వడ్డన. 

          సోలో ఉప విభాగం 2. అనుభవాల చిత్రణ కొస్తే, చిన్నప్పటి ఒక అనుభవం పెద్దయ్యాక కూడా ఎలా బాధిస్తోందో, పాత్రని సమూలంగా ఎలా మార్చేసిందో  చూపించడానికి ఉపయోగిస్తారు. ఈ చిన్నప్పటి చిత్రణ చాలా అవసరం. బాక్సాఫీసుకి బలం కూడా.  ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ చిన్నప్పటి దుర్భర అనుభవాల చిత్రణ లేకపోతే  స్మగ్లర్ గా పాత్రతో ఎమోషనల్  ఎటాచ్ మెంట్ వుండదు ప్రేక్షకులకి. ‘ఛత్రపతి’ లో ప్రభాస్ పాత్రకికూడా. పాత్రతో ప్రేక్షకులకి ఎమోషనల్ ఎటాచ్ మెంట్ కోసం వాటి చిన్నప్పటి జీవితం చూపించడం చాలా అవసరం. కాకపోతే దీన్నిప్పుడు ఇన్నోవేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే, ఇక్కడ కూడా బాల నటుడు, లేదా హీరోయిన్ విషయంలోనైతే బాల నటిని పెట్టి స్క్రీన్ స్పేస్ ని తిననివ్వకుండా ఒక పనిచెయ్యవచ్చు. ‘ఫ్యాన్’ ఫార్ములా : అంటే అల్లు అర్జున్ ని ఓ పద్దెనిమిది - ఇరవై ఏళ్ల టీనేజర్ గా సీజీ చేసి చూపించడం. షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ లో సూపర్ స్టార్ గా నటించే మిడిలేజి పాత్ర అతనే, అతణ్ణి అభిమానించే టీనేజి ఫ్యాన్ పాత్రలోనూ అతనే. షారుఖ్ ఖాన్ ని సీజీ ద్వారా ఇరవై ఏళ్ల వాడిగా చూపించారు. ఇది అపూర్వ ప్రయోగం.

***
                   ఆ మధ్య ఒక రివెంజి కథ చర్చ కొచ్చినప్పుడు ఈ వ్యాసకర్త ఈ సూచనే చేశాడు. మరీ చిన్నప్పటి హీరో కథ కాకుండా, ఓ టీనేజర్ గా వున్నప్పుడు జరిగిన అన్యాయం చూపిస్తే చాలని - దీనికి ‘ఫ్యాన్’ ఫార్ములా వాడవచ్చనీ. అప్పుడు అల్లు అర్జున్ అయితే ఫ్లాష్ బ్యాక్ లో టీనేజర్ గానూ అల్లు అర్జునే కన్పిస్తాడు. రెండు కాలాల్లో స్క్రీన్ స్పేస్ అంతా అతడిదే. అలా బాల నటుడితో స్క్రీన్ టైం తినేసే ముప్పుతప్పుతుందని. 


          ఇలా చేసినప్పుడు ఇంకో లాభం ఏమిటంటే, ఈ టీనేజర్ ఫ్లాష్ బ్యాక్ తో యూత్ వెంటనే కనెక్ట్ అవుతారు. బాల్యం నాటి బాధలతో అవరు. సుదూరపు బాల్యం నాటి  చిత్రణ కంటే, సమీప టీనేజీ జీవితం ఎక్కువ ఆకర్షిస్తుంది. పైగా ఇక్కడ 18 - 20 ఏళ్ల టీనేజర్ గా అల్లు అర్జునే కన్పిస్తాడు. చిన్నప్పటి కథల బాధకి విరుగుడు ఇదొక్కటే. వున్న వాటినే కాలానుగుణంగా ఇన్నోవేట్ (నూతన కల్పన) చేసినవాడే సక్సెస్ లో వుంటాడు. కానీ ఈ సూచన పనికి రాలేదు, పాత మూసకే ఓటు పడింది.

          సుదూర బాల్య జీవితం, సమీప టీనేజి జీవితం – దీని గురించి చెప్పుకోవాలి. హాలీవుడ్ సినిమాల్లో మరీ చిన్నప్పటి కథలతో ప్రారంభించకుండా, లేదా అప్పటి ఫ్లాష్ బ్యాకులు వేయకుండా, టీనేజి జీవితంనుంచీ చూపించే ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ అనే  సబ్ జానర్ ఎప్పట్నుంచో వుంది. సుదూర బాల్యం నుంచి తీసుకోకుండా, సమీప టీనేజి జీవితంలో అనుభవాలు  మాత్రమే హీరో పాత్రని ఎలా తీర్చిదిద్దాయో చూపే చిత్రణ. ఇది లైవ్ గా అన్పిస్తుంది. ప్రపంచంలో ఇన్ని జరుగుతూండగా ఇంకా పాతనే పట్టుకుని ఎందుకు దెబ్బతినాలి? 

          పోతే చివరిగా,  సోలో చివరి ఉపవిభాగం తీవ్రానుభవాలే తీసుకుంటే - ఇవి హింసాత్మకమైనవని,  యాక్షన్ – రివెంజి సినిమాలకి పనికొచ్చేవని చెప్పుకున్నాం. వీటిక్కూడా ఇప్పుడు అదే చిన్న పిల్లల వేషాలవసరమా? చిన్నప్పట్నుంచీ కథలు  చెప్పుకురావడం నవరసాలతో కూడిన ఆనాటి  సినిమాల్లో వుండేది. అప్పటి యాక్షన్ సినిమాలు నాటకీయతే  ప్రధానంగా కూడా వుండేవి. హీరో ఒకడి చేతికి ఉంగరమేదో చూస్తాడు. వెంటనే ఫ్లాష్ బ్యాక్ లో తన చిన్నప్పటి సంఘటన కెళ్ళిపోతాడు. ఆ సంఘటనలో  ఇలాటిదే ఉంగరమున్న హంతకుడు తన తల్లిదండ్రుల్ని చంపివుంటాడు. అంతే, ఇక ఇప్పుడు పగ రగుల్కొంటుంది. అప్పుడీ ఉంగరంతో వున్న విలన్ పనిబడతాడు. ఇది నాటకీయత. అంటే ఇన్నాళ్ళూ హీరో తన తల్లిదండ్రుల సంగతే  మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఉంగరం చూస్తేనే తల్లిదండ్రుల హత్యలు గుర్తొచ్చాయా? ఇప్పటికి పగ రగిలిందా?  లేకపోతే  లేదా? ఇంకో యాభై ఏళ్ళు టపోరీ క్యారక్టర్ లా ఆటా పాటలతో ఎంజాయ్ చేస్తూనే వుండేవాడా?... అన్న ప్రశ్నలకి తావులేదు. నాటకీయతని ప్రేక్షకులు ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే అప్పట్లో ఇది నవరసాల్లో ఒక భాగం. కానీ ఇటీవల ‘కేశవ’ లో ఇదే ఎదురయ్యేసరికి ప్రశ్నలు తలెత్తాయి. చాలా ఓల్డ్ ఫార్ములా అనుకున్నారు ప్రేక్షకులు. ఈ దర్శకుడు ఎక్కడ్నించి పట్టుకొచ్చాడీ కథని అనుకున్నారు. ఈ నాటకీయతని ఒప్పుకోలేదు. కాబట్టి ఇలాటి చిన్నప్పటి తీవ్రానుభవాల చిత్రణలకి ఇప్పుడు తావులేదు. 

          ఇవీ మొత్తం చిన్నప్పటి కథల సంగతులు. కథకి కూర్చుంటే మనసు వెనకటి సంగతులకే లాగుతూంటుంది. గతకాలమే దానికి ఇష్టకాలం. ఎందుకంటే అదో పెద్ద సోమరి కాబట్టి. దీన్ని కాచుకోవాలి. లొంగ కూడదు. వర్తమానంలోకి లాగి - ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో....తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ...అన్న పద్దతిలో ఎక్కడా ప్రేక్షకులకి దొరికిపోకుండా, కామన్ సెన్స్ తో, సిక్స్త్ సెన్స్ తో దాని నడుం విరగ్గొట్టి – చిన్ననాటి చిత్రణలకి పై జాగ్రత్తలు తీసుకోవాలి. 

          మీ ప్రశ్నలో చిన్నప్పటి ఫ్రెండ్స్ పెద్దయ్యాక లవర్సే ఎందుక్కావాలనే దాని గురించి : మరి హీరో హీరోయిన్లు లవర్స్ కాక ఫ్రెండ్స్ గానే వుండిపోతే ఎలా? అప్పుడు హీరోకి చిన్ననాటి ఫ్రెండ్ గా హీరోయిన్ ని పెట్టకూడదు, సెకెండ్ హీరోయిన్ ని పెట్టాలి. ఈమె అయితే జీవితాంతం ఫ్రెండ్ గా పడున్నా, చచ్చిపోయినా, సన్యాసినుల్లో కలిసిపోయినా,  గొడవ చెయ్యరు ప్రేక్షకులు.

-సికిందర్