రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, అక్టోబర్ 2022, మంగళవారం

1230 : సందేహాలు - సమాధానాలు

Q :    మీ బ్లాగులో పొన్నియన్ సెల్వన్ రివ్యూ రాలేదు. ఎవాయిడ్ చేసినట్టున్నారు. మీ విశ్లేషణ మేం తెలుసుకో వద్దా?
—దర్శకుడు
A : దాన్ని విశ్లేషించాలంటే చాలా చిక్కులు విడదీయాలి. అది మన వల్ల కాదన్పించింది. ఒక ఇంటర్వూ లో మణిరత్నం మాట గుర్తు చేసుకోవాలి. ఆ నవల చదివి పక్కన పడేయ్, అందులోంచి లైను లాగి కథ చెయ్- అని రైటర్ కి చెప్పినట్టు ఇంటర్వ్యూలో వుంది. నవల లోంచి లైను లాగినట్టుందా? ఒక ఇంజను, అది లాగే బోగీలూ వుంటే లైను అన్పించేది. ఇంజనే (ప్రధాన పాత్ర) లేదు, అన్నీ బోగీలే (వివిధ పాత్రలు) వున్నాయి. ఒక్కో బోగీతో అక్కడిక్కడే ఒక్కో కథ. ఎపిసోడిక్ కథనం. డాక్యుమెంటరీలకి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ బాపతు ఎపిసోడ్ల వారీ కథనం. పేర్లే గుర్తుండని అధిక పాత్రలు, వాటి బంధుత్వాలూ.

లైను లాగితే సినిమా కథ లా వుండాలి. ప్రధాన పాత్ర - అది ఎదుర్కొనే సమస్య- పరిష్కారమనే ఏర్పాటు. అప్పుడు కథ స్పష్టంగా అర్ధమవుతుంది. నవల్లో సినిమాకి కావాల్సిన కథని పట్టుకోలేక పోయారు. విషయాన్ని యూనివర్సల్ అప్పీల్ కి దూరంగా తమిళ ప్రాంతీయానికి పరిమితం చేస్తున్నామని గుర్తించ లేకపోయారు. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు యూనివర్సల్ గా అర్ధమయ్యేట్టు, సింపుల్ కథతో వుంటాయి. దీని మీద హై యాక్షన్ డ్రామా క్రియేట్ చేస్తారు. బ్రహ్మాస్త్ర లో కూడా ఇది కన్పిస్తుంది. ఈ మెగా బడ్జెట్ మూవీలో ఆరే ఆరు పాత్రలతో, సూటిగా వుండే సింపుల్ కథతో, యాక్షన్ హెవీగా వుంటుంది. మణిరత్నం పానిండియా తీస్తున్నామనుకుని తీసింది తమిళ ప్రేక్షకులకి పరిమిత మయ్యే ప్రాంతీయాన్ని.

పానిండియా లేదా యూనివర్సల్ మూవీగా తీయాలనుకున్నప్పుడు  సరైన కథా పరిచయం చేయకుండా, ఇది తమిళులకి తెలిసిన చోళుల చరిత్రే కాబట్టి, తమిళ ప్రేక్షకుల కుద్దేశించినట్టుగా కథా రచన సాగింది. దీంతో ఇతరులకి ఈ కథ, పాత్రలు ఏ మాత్రం అర్ధంగాకుండా పోయాయి. ఒక మ్యాపు వేసి చూపిస్తూ, ఫలానా చోళ రాజ్యం ఫలానా ఈ కాలంలో, తమిళనాడులో ఫలానా ఈ ప్రాంతంలో వుండేదన్న అవగాహన కూడా ఏర్పర్చకుండా, చోళ వంశాన్ని వర్ణించకుండా, ఏ వివరాలూ అందించకుండా, నేరుగా కథలో కెళ్ళిపోతే ఏమర్ధమవుతుంది?

పోనీ గాథలా వుందా అంటే గాథ కూడా కాదు. గాథ పాత్ర- సమస్య- సమస్యతో సంఘర్షణ లేని కథనంగా ముగిసి పోతుంది. మరెలా వుంది? ఎపిసోడిక్ గా వుంది. ఒక పాత్రతో ఒక సమస్య పుట్టడం తగ్గిపోవడం, మళ్ళీ ఇంకో పాత్రతో ఇంకో సమస్య పుట్టడం తగ్గిపోవడం - ఇలా రిపీట్ అవుతూ వుంటుంది ఎపిసోడిక్ కథనం.

ఫస్టాఫ్ ప్రధాన కథలేదు, సెకండాఫ్ దాని కొనసాగింపూ లేదు. ఎన్నో పాత్రలు, ఎందరో నటీనటులు, భారీ హంగామా, విషయం మాత్రం శూన్యం. ఏం చెబుతున్నాడో, ఏం చూస్తున్నామో మూడు గంటలూ అర్ధం గాదు. ఈ సందర్భంగా 2010 లో ప్రకాష్ ఝా తీసిన హిందీ రాజనీతి గుర్తుకొస్తుంది. మహాభారతాన్ని నేటి రాజకీయాలకి అన్వయిస్తున్నానని చెప్పి తీసిన ఈ భారీ మల్టీ స్టారర్ లో, ఎన్నో పాత్రలూ వాటి బక్వాస్ (వాగుడు) తప్ప ఏమీ అర్ధంగాక ఫ్లాపయ్యింది.

కాల్పనిక చరిత్ర తీస్తున్నప్పుడు హిస్టారికల్ ఫిక్షన్ జానర్ లో ఇలాటి సినిమాలు ఏమేం వచ్చాయీ, వాటినెలా తీశారూ రీసెర్చి చేయనట్టుంది. చేసి వుంటే ఇన్నేసి పాత్రల కలగూరగంప నెత్తికెత్తుకునే వాళ్ళు కాదు. చోళ వంశంలో ఒక పాత్ర తీసుకుని, అది ఏ ఘట్టం ద్వారా ప్రసిద్ధి చెందిందో అది మాత్రమే తీసుకుని, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ చేసేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే- 2012 లో స్టీవెన్ స్పీల్ బెర్గ్ లింకన్తీసినప్పుడు సినిమా కథ గానే తీశాడు. అంతేగానీ అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ జీవితాన్నంతా కామెంటరీ చేస్తూ తీయలేదు.

ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం -అగ్నిపరీక్ష లాంటిది - 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాని మాత్రమే స్క్రిప్టు చేశాడు. ఈ డ్రామాలో లింకన్ పాత్ర, 13 వ రాజ్యాంగ సవరణ అనే సమస్య, దాని కోసం సంఘర్షణ, విజయం, ఇంతే వున్నాయి. ఎందరో రచయితలు లింకన్ జీవితాన్ని పుట్టిన దగ్గర్నుంచీ ఎపిసోడ్లు రాసుకొస్తే వాటిని పక్కన పడేశాడు స్పీల్ బెర్గ్. ఈ బయోపిక్ కి డొరిస్ కీర్న్స్ గుడ్విన్ రాసిన పుస్తకం ఆధారం. 500 పేజీల ఈ లింకన్ జీవిత చరిత్రలో స్పీల్ బెర్గ్ కేవలం నాలుగు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. దాంతో కసరత్తు చేస్తే కుదరదన్పించింది. రెండు నెలల కాలం మీద ఫోకస్ చేశాడు. ఇది కరెక్ట్ అన్పించింది. ఈ రెండు నెలల కాలంలో చోటు చేసుకున్న 13 వ రాజ్యాంగ సవరణ పరిణామాలనే బాక్సాఫీసు అప్పీలున్న పాయింటుతో, ప్రపంఛ వ్యాప్తంగా సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమయ్యేట్టు, సింపుల్ గా తీసి పెద్ద విజయం సాధించాడు.
 
పొన్నియన్ సెల్వమ్ కి ఇంతకంటే రివ్యూ అవసరం లేదేమో. హిస్టారికల్ సినిమా ఎలా తీయకూడదో నేర్చుకోవడానికి మాత్రం ఈ సినిమా చూడాలి. ఒక గైడ్ లా ఉపయోగపడుతుంది. నమస్తే అండి.

Q :    నమస్కారమండి. మలయాళం భీష్మ పర్వం తెలుగు డబ్బింగ్ హాట్ ‌స్టార్ లో ఉంది.లూసిఫర్ లాగానే చిరంజీవి గారు ఈ మూవీని కూడా రిమేక్ చేస్తున్నారని టాక్. రివ్యూ చేయగలరా?
—అశ్వత్ శర్మ, నల్లగొండ
A :   నమస్కారం. ఇలాటి అభ్యర్ధనలు వస్తూ వుంటాయి. అడిగిన వాళ్ళందరికీ సినిమాలు చూసి రివ్యూలు రాయడం సాధ్యం కాదు. ఇచ్చిన రివ్యూలు చూసుకోవడమే. రేయికి వేయి కళ్ళు కూడా మీరడిగారు. అది ఆ వారం విడుదలయ్యింది కాబట్టి మీరు అడగకపోయినా రాసేవాళ్ళం. ఈ సినిమాలు వదలండి. మేకింగ్ కి, రైటింగ్ కి పనికొచ్చే, స్పూర్తినిచ్చే, నేర్చుకోనిచ్చే హాలీవుడ్ క్లాసిక్ సినిమాల స్క్రీన్ ప్లే సంగతులు ఒకటొకటిగా రాసుకుపోదామంటే కుదరడం లేదు. ఒక మేకర్ మరీమరీ అడిగిన అపొకలిప్టో చాలా కాలంగా పెండింగులో వుంది. వచ్చే వారం నుంచి దీని సంగతి చూడాలి.

Q :   మీ ఒకే ఒక జీవితం రివ్యూ బాగుంది. సైన్సు ఫిక్షన్ లో హెవీ మదర్ సెంటిమెంట్. బ్యాక్ టు ది ఫ్యూచర్ చూసుంటే మదర్ సెంటిమెంట్ ఎంతలో ఉండాలో, ఎలా ఉండాలో  తెలిసేది. అన్నట్టు, నేను ఒక సైన్సు ఫిక్షన్ (టైం లూప్) రోమాంటిక్ స్టోరీ ట్రీట్మెంట్  రాసి రిజిస్టర్ చేసి, ఇప్పుడు స్క్రీన్ ప్లే రాస్తున్నాను. పూర్తయిన తరువాత మీకు కాక ఎవరికి ఇస్తాను ఫీడ్ బాక్ కోసం.
—ఆర్సీ ఎస్, దర్శకుడు
A :   థాంక్స్. మీ యాక్టివిటీస్ బావున్నాయి. ఇలాగే ప్రొసీడవండి, ఎక్కడో తగుల్తుంది. సైన్స్ ఫిక్షన్ భాషలోనే చెప్పుకుంటే స్ట్రగుల్ అనేది లో- ఫ్రీక్వెన్సీ థాట్, యాక్టివిటీస్ అనుకుంటే అది హై ఫ్రీక్వెన్సీ థాట్. దీంతో యూనివర్స్ కి కనెక్ట్ అవుతాం. త్వరగా గమ్యం చేరతాం. ఒకే ఒక జీవితం కోసం జానర్ రీసెర్చి చేయలేదు దర్శకుడు. అసలు టైమ్ ట్రావెల్ జానర్ మర్యాదలన్నీ బ్యాక్ టు ది ఫ్యూచర్ లో సమకూర్చి పెట్టాడు దర్శకుడు రాబర్ట్ జెమెకిస్. దీని వివరణ అంతా స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ రాసిన స్టీలింగ్ ఫైర్ ఫ్రమ్ ది గాడ్స్ పుస్తకంలో వుంది.

—సికిందర్ 
(మరికొన్ని ప్రశ్నలు ఆదివారం)