రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 29, 2016

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం:  ప్రదీప్‌ చిలుకూరి
తారాగణం: నారా రోహిత్‌, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘు కారుమంచి, శశాంక్‌, శివాజీరాజా తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: భాస్కర్‌ సామల
బ్యానర్‌ : వారాహి చలనచిత్రం, నిర్మాత : రజని కొర్రపాటి
విడుదల : ఏప్రిల్‌ 29, 2016
***
న సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు రోడ్డెక్కి ఆందోళన చేయకుండా, అకుంఠిత  దీక్షతో నెలకి రెండు మూడు  సినిమాలు చొప్పున యుద్ధ  ప్రాతిపదికన నటించేసి విడుదల చేయిస్తున్న నారా రోహిత్,  మండుటెండల్లో మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రేక్షకులకి- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా దయచేసి చూడమని. నారా వారబ్బాయి సినిమాలు అమరావతి అంత అద్భుతంగా వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకి ఏనాడో సడలిపోయినా, తనకి మాత్రం తన టాలెంట్ మీద విపరీతమైన నమ్మకం రోజురోజుకీ  పెరిగిపోతోంది. తరలి వస్తున్నకొత్త కొత్త దర్శకులు మొక్కు తీర్చుకోవడానికి తనే ఒక ఇలవేల్పులా అవతరించి ఆశీర్వదించేస్తున్నాడు.  గత నెలలోనే ‘తుంటరి’ ఇచ్చి, వెంటనే అర్జెంటుగా ఈ నెల ఫస్టున ‘సావిత్రి’ కూడా  ఇచ్చేసి, మళ్ళీ హడావిడిగా   ఈ నెలాఖర్లోనే  నారా - కాదు కాదు- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా సరఫరా చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకో ఆరు సినిమాలు  తన నారావారి  అమ్ముల పొదిలోంచి ప్రేక్షకుల మీదికి సంధించేందుకు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

         కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల వంటి ప్లస్ పాయింట్స్ కి నోచుకునే అదృష్టం దక్కడం మామూలు విషయం కాదు. నారా రోహిత్ ఎందుకు మంచి హీరో అంటే, కొత్త తరహా కథలకి తను ఒకప్పటి నాగార్జునలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అలా మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల దక్కిన దర్శకుడు ఇక చూసుకోవాల్సింది తను వెనకబడిపోకుండానే!  రోహిత్ లెవెల్లోనే తనూ ఉండిపోతే బ్యానర్, విడుదల వంటి ప్లస్ పాయింట్స్ వృధా చేసుకున్నట్టే అవుతుంది. ఈ రెండిటిని అడ్డు పెట్టుకుని రోహిత్ లాంటి ఫ్లాప్ హీరోతో సక్సెస్ కొట్టి దర్శకుడుగా తను ఒడ్డున పడిపోయే ప్రయత్నం చేయాలి. ఇది జరిగిందా? ఓసారి కథలోకి వెళ్లి చూద్దాం...

 క్రైం మసాలా!
         
రాజారాం (నారా రోహిత్) సినిమా రంగంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మూడేళ్ళలో దర్శకుణ్ణి అవుతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. కథలు రాసుకుని ప్రయత్నాల్లో ఉంటాడు. మాణిక్ (నందమూరి తారకరత్న) అని రాజకీయ నాయకుల కోసం హత్యలు చేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు. ఇతను బహిరంగంగా హత్యలు చేసినా సాక్ష్యం  చెప్పడానికి ఎ వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతారు. రాజారాం ఒక థ్రిల్లర్ కథ రాసుకుని నిర్మాతని కలుస్తాడు. నిర్మాత ప్రేమ కథ అడుగుతాడు. రాజారాం తన ప్రేమ కథే రాయడం మొదలెడతాడు. ఆప్రేమ కథలో,  ఒకసారి తను షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు ఒకమ్మాయి కెమెరాకి అడ్డొస్తుంది. ఆమెని చూసి పడిపోతాడు. కొంత తిప్పుకుని అతడికి ఓకే చెప్పేస్తుందామె. ఆమె పేరు చైత్ర (ఇషా తల్వార్). సాఫ్ట్ వేర్.  అలా అలా ప్రేమకథ పూర్తి చేసి పంపిస్తే,  క్లయిమాక్స్ లో విలన్ ని చంపిన తీరు బావుందని సమాధానం వస్తుంది. ఆ విధంగానే ఒకణ్ణి చంపమని, కొరియర్ లో  రివాల్వర్, ఫోటో అందుతాయి. ఆ ఫోటోలో వున్నది మాణిక్. ఇతణ్ణి  చంపకపోతే నువ్వు చస్తావ్, నీ లవర్ చస్తుంది – అనేసి  బెదిరిపులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో రాజారాం ఏం చేశాడు, మాణిక్ ని చంపాడా, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకున్నాడా, చంపడానికి గల కారణాలు తెలుసుకున్నాడా – అన్నవి ఇక్కడ్నించీ ద్వితీయార్ధంలో సాగే కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ
       
మొదలెట్టింది ఒక క్రైం కథ, తిరగబెట్టింది మాత్రం పాత మూస మసాలా లోకి. ఈ మూసలో మదర్ సెంటి మెంట్, చైల్డ్ సెంటి మెంట్, లాలిపాట, మెలోడ్రామా, పూజలూ పురస్కరాలు వంటి వన్నీ తెచ్చి  పెట్టేశాడు దర్శకుడు. ఇక ఫ్రెండ్స్ తో రొటీన్ మూస  ఆవారా తనాలూ, తాగుళ్ళూ, కామెడీలూ వేరే. ఇవేవీ ఈ తరహా కథలో ఇమిడేవి కావు. చాలా చిరాకు  తెప్పిస్తాయి దర్శకుడి చాదస్తానికి. చిన్నప్పటి కోరికలన్నీ ఈ కొత్త దర్శకుడు అవకాశం దొరికింది కదాని తీర్చుకున్నట్టుంది. అసలు చెప్పాల్సిన క్రైం కథకి వుండాల్సిన ఎలిమెంట్స్ కోసం కృషి చేయకుండా, ఇలాటివన్నీ తెచ్చి అడ్డమేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్  తను రాసుకున్న కథతో  ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని చంపాల్సి వస్తే ఏం చేస్తాడు? అన్నసూటి ప్రశ్న దర్శకుడు వేసుకుని, దానికి కట్టుబడి వుంటే,  ఈ క్రైం కథ ‘క్షణం’ లా మరో ప్రొఫెషనలిజం తో కూడిన మంచి ప్రొడక్టు అయ్యేది.

ఎవరెలా చేశారు.
       
నారా రోహిత్ ఏం చేయగలడని  ఆశిస్తాం. అదే స్థూలకాయం, అదే భావాలు పలకని ముఖారవిందం, అదే రాయల్ గా నవ్వే  ఫేసు- ఏ పాత్రకైనా ఇంతేగా? సాయంత్రం పూట ఏ పేజ్ త్రీ పార్టీకో  వెళ్లినట్టు వుంటుంది గానీ, షూటింగ్ కి వెళ్తున్నట్టు వుంటుందా వాలకం? పాత్ర ప్రకారం తానొక సినిమా ప్రయత్నాల్లో వున్న దర్శకుడిగా కొంతైనా  డిఫరెంట్ గా కనపడాలిగా? వాడిలా నేనెందుకుంటాను, నేను నారావాణ్ణి అనుకుంటే ఎలా? చంద్రబాబే నిత్యం జనాల్లో పడి నిద్ర పోనివ్వడం లేదు.
        తను వెరైటీ కథల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు తన వైపు నుంచి హోం వర్క్ లేకపోతే వెరైటీ కథలన్నీ ఇలాగే మట్టి కొట్టుకు పోతాయి. కొత్తగా దర్శకత్వ ప్రయత్నాల్లో వుండే ఔత్సాహికుల్ని ఏ కాస్తా తను పరిశీలించినా ఆ క్యారక్టర్ వచ్చేసేది.  కానీ ప్రతీ సినిమాలో ప్రతీ పాత్రలో  ఒకేలా కనపడ్డం, ఒకేలా ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం అనే అశ్రద్ధ, అలసత్వాలతో తను ఎంత దూరం ప్రయాణించగలనను కుంటున్నాడో తనకే తెలియాలి. కనీసం సెకండాఫ్ లోనైనా ఒక థ్రిల్లర్ కథకి అతికే హీరో పాత్రలా కన్పించే ప్రయత్నం చేయలేదు. పైగా వొళ్ళు పెంచేసి అలాగే వదిలెయ్యడం చాలా విజువల్ టార్చర్ ప్రేక్షులకి.
        నారా వారసుణ్ణి పక్కన పెడితే,  ఇందులో నందమూరి వారసుడు కూడా నటించడం ఆసక్తి రేపింది. నందమూరి తారకరత్న ఇక లాభంలేదని విలన్ గా వచ్చేశాడు. ట్రూ ప్రొ ఫెషనలిజాన్ని ప్రదర్శించాడు. విలన్ గా తను కంటిన్యూ అవొచ్చు. అయితే ఈ సినిమాలోలా కాకుండా పాత్రకి కాస్త డెప్త్, అర్ధవంతమైన పగా ఉండేట్టు చూసుకోవాలి. నిజానికి నారా - నందమూరి వారసులతో మంచి అవకాశం కొత్త దర్శకుడికి. ‘బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్’ లా ఓ సంచలన, క్రేజీ ఘట్టం దర్శకుడికి. దీన్ని కూడా జా రవిడుచుకుని, ఇద్దరి మధ్యా  సంఘర్షణని ఈ స్పాట్ లైట్ లో హైలైట్ చేసి ప్రత్యేకాకర్షణగా నిలబెట్ట లేకపోయాడు.
        హీరోయిన్ ఇషా తల్వార్ కత్తిలా వుంది. ఈమె టాలెంట్ ని కూడా పాత్ర సరిగ్గా లేక వృధా చేసుకున్నాడు దర్శకుడు. పాటల విషయం చెప్పుకోనవసరం లేదుగానీ, కెమెరా, ఇతర సాంకేతిక హంగులు బ్యానర్ హోదాకి తగ్గట్టు వున్నాయి. కానీ నిర్మాతగా సాయి కొర్రపాటి విషయపరంగా ఓ క్వాలిటీ మూవీని మాత్రం అందించలేదు. 

 చివరికేమిటి?
         
స్టాఫ్ లో  ప్రేమ కథ రాసే పేరుతో  చూపించిన,   అమ్మాయిని లవ్ లో పడేసే స్టోరీ - ప్రతీ సినిమా ఫస్టాఫ్ లో వుండే అరిగిపోయిన పాత రొటీనే.  దీన్నుంచి రిలీఫ్ నివ్వలేకపోయాడు దర్శకుడు. ఈ లవ్ స్టోరీలో అనాధ శరణాలయం సన్నివేశం ఒక్కటే  కాస్త హాస్యభరితంగా వుంది. హీరో కుక్కని దొంగిలించే సీను అనవసర సాగతీతతో ‘బి’ గ్రేడ్ సినిమా బిట్ లా అభాసు అయ్యింది. ఫస్టాఫ్ లో కథలోకి వెళ్ళకుండా ప్రేమ కథనే  లాగించి ఎలాగో ఇంటర్వెల్ కి చేర్చినా అక్కడి మలుపు పేలవంగానే వుంది. దీని  తర్వాత సెకండాఫ్ అంతా చాలా పాత చాదస్తంతో వుంది. విలన్ ని ఎందుకు చంపాలో కారణం చెప్పేందుకు వేసిన ఫ్లాష్ బ్యాక్, అందులో లాలిపాట  మరో మైనస్. ఇంతా  చేస్తే ఆ పగా హీరోది కాదు, ఆ లక్ష్యమూ హీరోది కాదు- ‘ఊసరవెల్లి’ లో ఎన్టీఆర్ టైపు విఫలమైన హీరో పాత్ర. ఇక తర్వాతంతా  లాజిక్ లేని కథా కథనాలే. ఈ కథా కథనాలు, నటనలు పక్కన పెడితే, కొత్త కాంబినేషన్ ని కనీసం బాక్సాఫీసు అప్పీల్ కోసం ప్లాన్ చేసుకోవాలని కూడా ఆలోచన చేయలేదు. బ్యానరూ నారా రోహితూ కంటిన్యూ అవగలరు. ఈ సినిమాని ఇలా అమెచ్యూరి ష్ గా తీసిన ఈ  కొత్త దర్శకుడు???


-సికిందర్