రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, జులై 2023, శనివారం

1349 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్
తారాగణం : సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ, గారీ ఓల్డ్ మాన్, కెనెత్ బ్రనగా, టామ్ కాంటీ తదితరులు
సంగీతం : లుడ్విగ్ గోరన్సన్, ఛాయాగ్రహణం : హయ్ట్ వాన్ హయ్టెమా 
బ్యానర్స్ : సింకాపీ ఇన్ కార్పొరేషన్, అట్లాస్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు: ఎమ్మా థామస్, ఛార్లెస్ రోవెన్, క్రిస్టఫర్ నోలన్
విడుదల : జులై 21, 2023
***

ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ఒపెన్ హైమర్ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా వాటిలో ఒక్క టెనెట్ (2020) తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు. అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ అంటూ అందించాడు.


దీంతో సహజంగానే జపాన్ ని ధ్వంసం చేసిన అణుబాంబు సృష్టికర్త ఒపెన్ హైమర్ గురించి దృశ్యాత్మకంగా చూసి తెలుసుకోవాలన్న జిజ్ఞాస నోలన్ ఫ్యాన్స్ కేర్పడింది. ఓపెనింగ్స్ తోనే 45-50 మిలియన్ డాలర్ల బాక్సాఫీసుతో విజయవంతంగా నిలిచిన ఈ మూవీ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు. ఇది లాభాలార్జించాలంటే 400 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు రాబట్టాలని అంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా? ఈ మూవీ మిగిలిన నోలన్ సినిమాల్ని తలదన్నేలా వుందా? అన్ని  వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే మేకింగ్ తో వుందా? ఈ విషయాలు పరిశీలిద్దాం...

కథ

రాబర్ట్ జే ఒపెన్ హైమర్ అలియాస్ ఒప్పీ (సిలియన్ మర్ఫీ) అమెరికాలో జన్మించిన యూదు. 1927 లో జర్మనీలో భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది, అమెరికా వచ్చి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా చేరుతాడు. ఇక్కడ క్వాంటం మెకానిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖల్లో చేస్తున్న కృషిని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో  మన్హట్టన్ ప్రాజెక్ట్లో సైంటిస్టుగా నియమిస్తుంది. ఇలావుండగా మరోవైపు జీన్ టట్లక్ (ఫ్లారెన్స్ పాగ్) అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూంటాడు. మన్హట్టన్ ప్రాజెక్టు నుంచి బదిలీ అయి న్యూ మెక్సికోలోని  లాస్ అలమోస్ లాబొరేటరీకి డైరెక్టర్గా నియమితుడవుతాడు. ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ లెస్లీ గ్రోవ్స్ (మాట్ డామన్) జర్మనీ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెలుగులోకి వచ్చిన సమాచారంతో,  ఒప్పీ ని  అణ్వాయుధ తయారీకి ఆదేశిస్తాడు.
        
దాంతో ఒప్పీ టీమ్ ని ఏర్పాటు చేసుకుని ఆటంబాంబు తయారు చేసి విజయవంతంగా పరీక్ష జరుపుతాడు. ఆ తర్వాత ఒప్పీకి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ (గేరీ ఓల్డ్ మాన్) 1945 ఆగస్టు 6 న, మళ్ళీ 9 న ఒకటి కాదు, రెండు ఆటం బాంబులు జపాన్ లోని హీరోషిమా, నాగసాకి లపై ప్రయోగించాలని ఆదేశించడంతో ఒప్పీ బెదిరిపోతాడు. జపాన్లో జరిగిన బీభత్సానికి ట్రూమన్ ని నిలదీస్తాడు. ఇక్కడ్నించీ ఒప్పీకీ ప్రభుత్వానికీ సంబంధాలు చెడి, ఒప్పీ మీదే కోర్టు విచారణకి దారితీస్తుంది.
        
ఈ నేపథ్యంలో ఒప్పీపై ప్రభుత్వం చేసిన ప్రత్యారోపణ ఏమిటి? ఒప్పీ కమ్యూనిస్టు సానుభూతి పరుడనేది నిజమేనా? ఒప్పీ తను నిర్దోషియని ఎలా నిరూపించుకున్నాడు? అణుబాంబు ప్రయోగం తర్వాత ఒప్పీ ఎందుకు పశ్చాత్తాపం చెందాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

అమెరికన్ ప్రొమీథియస్ అని 2005 లో కై బర్డ్, మార్టిన్ షెర్విన్ లు రాసిన ఒపెన్ హైమర్ బయోగ్రఫీ ఈ మూవీ కాధారం. క్రిస్టఫర్ నోలన్ తన స్టయిల్లో బయోపిక్‌ని తెరపై చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా కథ అయినప్పటికీ క్లాసిక్ నోలన్ మూవీగానే కన్పిస్తుంది. నోలన్ ఇష్టపడే నాన్ లీనియర్ కథనం, విభిన్న కలర్ స్కీములు, ఒప్పీ  మానసిక స్థితిని చిత్రించడానికి మాంటేజ్‌లతో వివరణాత్మక కథనం మొదలైన నోలన్ నుంచి ఆశించే ప్రతిదీ వుంటాయి- ఒక్క కమర్షియల్ ఎలిమెంట్లు తప్ప.
        
సినిమా విడుదలకి ముందు ఇది హార్రర్ జానర్ అని ప్రకటించి సంచలనం రేపాడు నోలన్. ఇంత ప్రతిష్టాత్మక సినిమా చీప్ గా హార్రర్ ఏమిటని అభిమానులు నొచ్చుకున్నారు. చెప్పినట్టుగానే నోలన్ ఇష్టపడే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోబాటు, పొలిటికల్ డాక్యుమెంటరీ ఆనవాళ్ళు లేకుండా దాదాపు హార్రర్ గానే ఈ బయోపిక్ వుంది. జపాన్ మీద ప్రయోగించిన అణుబాంబు తాలూకు హార్రర్ కాదిది- దీని పర్యవసానంగా ఒప్పీ అనుభవించే హార్రర్. ఇది ఆటంబాంబు దాడి కథ కాదు. ఒప్పీ అనుభవించే భయానక మానసిక స్థితి కథ. అతడి మేధకీ, హృదయానికీ మధ్య సంఘర్షణ. లక్షల మంది అమాయకుల్ని బలిగొన్న ఆటంబాంబుని కనుగొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయాణం ఈ కథ.
        
అయితే సాంకేతికంగా ఇది కథ కాదు, గాథ. అందువల్ల రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా నాయకుడు- ప్రతినాయకుడు- సంఘర్షణ అనే యాక్షన్ థ్రిల్లర్ గా వుండదు. ఇది ఒక జీవిత చరిత్ర కావడంతో ఒప్పీ జీవితపు ముఖ్య సంఘటనల సంపుటిగా, డైరీగా  మాత్రమే ఇది వుంటుంది. ఇక్కడ నోలన్ అభిమానులు నిరాశపడతారు. ఇది ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ గాక, మూడు గంటల సేపు సాగే డైలాగు డ్రామా. క్యారక్టర్ స్టడీ. దీన్ని థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ కోరుకుని చూస్తే మాత్రం అణుబాంబు మీద పడ్డట్టే వుంటుంది. 
        
ఫస్టాప్ మందకొడిగా సాగుతుంది ఒప్పీ వృత్తిగత, వ్యక్తిగత జీవిత చిత్రణతో. దీన్ని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి శృంగార జీవితం కూడా కలుపుకుని పాయింటుకి రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆటం బాంబు తయారీ దగ్గర్నుంచి ఆసక్తి పెరిగేలా చేసి, ఆటంబాంబు ప్రయోగంతో అసలు కథలోకి తీసికెళ్ళాడు నోలన్.
        
జపాన్ మీద అణుబాంబు ప్రయోగానికి ఎదురుతిరిగే ఒప్పీతో సెకండాఫ్ కథ వుంటుంది. కమ్యూనిస్టు అనే అనుమానంతో అతడ్నే ప్రభుత్వం దోషిగా నిలబెట్టడంతో డ్రామా ఊపందుకుంటుంది. అధికారులు చుట్టు ముట్టి జరిపే ఈ విచారణ భావోద్వేగ భరితంగా వుంటుంది. మరోపక్క అణుబాంబు కనిపెట్టిన పాపిగా ఒప్పీ అనుభవించే మనోవేదన గుండెల్ని కదిలిస్తుంది. ముగింపు భావోద్వేగాల పతాక సన్నివేశాలతో కట్టి పడేస్తుంది. అణుబాంబు పితామహుడు ఒపెన్ హైమర్ సంక్షుభిత మనస్థితిని దర్శించాలంటే ఈ బయోపిక్ ని ఒక దృశ్యమాధ్యమం రూపంలో తన మేధస్సుతో అనితర సాధ్యంగా అందించాడని చెప్పాలి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్.

నటనలు -సాంకేతికాలు

ఒపెన్ హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీకి ఆస్కార్ నామినేషన్‌ తప్పనిసరి అని అప్పుడే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నామినేషనే కాదు, ఆస్కార్ ప్రతిమనూ సొంతం చేసుకుంటాడు. మరే ఇతర నటుడూ సాధించలేని ఔన్నత్యాన్ని అతను దాదాపు సాధించినట్టు కన్పిస్తాడు. ఎందరో నటులకి అతనొక గైడ్ గా కన్పించినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అతడి హావభావాల్ని, ముఖకవళికల్ని కెమెరా జూమ్ చేసి పట్టుకున్న తీరు ఇంతవరకు ఏ సినిమాలోనూ చూసి వుండం. అతడి నిస్సహాయత, ఆక్రోశం, ఆందోళన, పాప భీతి... ఒకటేమిటి, ప్రతీదీ హార్రర్ గా చేసి ప్రేక్షకుల మీదికి విసిరేదే. ఇది జపాన్ మీద అణుబాంబు దాడి కథ కాదు, అణుబాంబులా విస్ఫోటించే  సిలియన్ మర్ఫీ అభినయపు గాథ.
        
ఇంకా ఇందులో ఎన్ని పదుల పాత్రలున్నాయో చెప్పలేం. ఏ పాత్రలో ఎవర్ని చూస్తున్నామో కూడా పట్టుకోవడం కష్టం. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గా టాం కోంటీ, మరో శాత్రవేత్త నీల్స్ బోర్ గా కెన్నెత్ బ్రనగా (ఈయన 2018 లో అగాథా క్రిస్టీ నవల మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్ ని దర్శకుడుగా తెరకెక్కించాడు), అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూ మన్ గా గేరీ గోల్డ్ మాన్, లెఫ్టినెంట్ జనరల్  లేస్లీ గ్రోవ్స్ గా మాట్ డామన్‌ మాత్రం  గుర్తుంటారు.
        
సాంకేతికంగా లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం థియేటర్ సౌండ్ సిస్టమ్ లో కట్టిపడేస్తుంది. సన్నివేశాల్లో సంగీతం ఇంకి పోయి, ఎదురుగా నిజంగానే సంఘటనలు జరుగుతున్నాయా అన్నట్టు వుంటుంది. రిచర్డ్ కింగ్ సౌండ్ డిజైన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హయ్ట్ వాన్ హయ్టెమా ఛాయాగ్రహణం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా క్లోజప్ షాట్లు కథనాన్ని మనస్సుల్లో ముద్రించేస్తాయి. రూత్ డి జోంగ్ పీరియడ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకో అద్భుతం. ఎల్లెన్ మిరోజ్నిక్ రూపొందించిన దుస్తులు ఇంకో హైలైట్. ఇక జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ మాత్రం ఈ పూర్తి స్థాయి డైలాగ్ డ్రామాని గేట్లు తెరిచి వదిలేసి నట్టుంది మూడు గంటల సేపూ.
        
పోతే, అణుపరీక్ష నిర్వహించే సీను గ్రాఫిక్స్ వాడకుండా నిజదృశ్యం చూస్తున్నట్టు క్రియేట్ చేయగల్గడం క్రిస్టఫర్ నోలన్ కళాదృష్టికి ఓ చిన్న మచ్చు తునక.
—సికిందర్