రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 23, 2022

1161 : టిప్స్


 

        అంతిమంగా  తెరమీద సినిమా ఎలా కన్పిస్తుందో నిర్ణయించేది డైలాగ్ వెర్షనే అయినప్పుడు డైలాగ్ వెర్షన్ని తీసుకుని ఇదివరకు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు.  నిశ్శబ్ద వాతావరణం లో, మౌన ముద్రలో కెళ్ళి పోయి- మనసు తెర మీద డైలాగ్ వెర్షన్ని రన్ చేసుకుంటూ, దీన్ని శైలీ శిల్పాలతో తెరకెక్కించాలో మనసులో ముద్రించుకుని- శబ్ద ఫలితాలు  సహా తీవ్రమైన  పేపర్ వర్క్ చేసుకుని, సర్వసన్నద్ధులై సెట్స్ కి వెళ్ళేందుకు వచ్చేవాళ్ళని వినికిడి. ఇదేదో బావుంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ధ్యానించడమంటే సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకోవడమే.  ఒకసారి సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకున్నాక ఆ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలు చేయిస్తుంది.

తే ఒకసారి అజ్ఞాతంలోకంటూ వెళ్ళిపోయాక  బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోకూడదు. సోషల్ మీడియా జోలికి అసలు పోకూడదు. 24x7 తామేం చేస్తున్నారో  ఫేస్ బుక్ లో ప్రపంచానికి చెప్పుకుంటే గానీ కడుపు చల్లబడని చాంచల్యానికి పోకూడదు. మనసు మీద అదుపు లేని వాడు సగటు మనిషే - వాడు మేకర్, క్రియేటర్, ప్రొప్రయిటర్ కాలేడు.  మనమైతే  డైలాగ్  వెర్షన్ పూర్తి చేసుకున్నాక ఈ నియమాలు పాటించాలని చెప్పుకుంటున్నాం గానీ, హాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అయితే అసలెప్పుడూ ప్రపంచంతోనే  సంబంధాలు పెట్టుకోడు. ఫోన్ వుండదు, టీవీ వుండదు, కంప్యూటర్ వుండదు, ఈ మెయిల్ వుండదు, సోషల్ మీడియా వుండదు- ఏమీ వుండవు. ఆదిమ కాలంలో మునిలా ఎక్కడో మారు మూల కూర్చుని సినిమాల సృష్టి గావిస్తాడు. సబ్ కాన్షస్ మైండ్ తో అతడి చెలిమి అలాటిది. మునుల తపస్సు కూడా సబ్ కాన్షస్ మైండ్ తోనే. సృష్టి రహస్యమంతా సబ్ కాన్షస్ మైండ్ లోనే వుంది... 

2. స్క్రీన్  ప్లే కి చక్కగా  మూడంకాలు (త్రీ యాక్ట్స్) పెట్టుకుని, బిగినింగ్- మిడిల్ - ఎండ్ అనే మూడంకాలకి రెండు  ప్లాట్ పాయింట్స్ తో రెండు మూలస్థంభాలు పెట్టుకుని, వాటి మధ్య వాటికి దారి తీయించే  ఉత్సుకతని రేపే కథనాన్ని మాత్రమే చేసుకుంటేఆస్వాదించడానికి  సినిమా ఎంత హాయిగా వుంటుందో తెలిపే ఉదాహరణ ఇదే- కొరియన్ మూవీ మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టర్'

3. వేరే సినిమాల్ని భక్తిభావంతో పరమ పవిత్రంగా కాపీ కొట్టేటప్పుడు, లేదా నీతీ నిజాయితీలతో చట్టబద్ధంగా రుసుము చెల్లించి రీమేక్ చేసేప్పుడు, వాటిని కూలంకషంగా విశ్లేషించుకుని, కథా నిర్మాణం, పాత్రచిత్రణలు, వాటి దృశ్యీకరణల వెనకున్న ఉద్దేశాల్నీ, వ్యూహాల్నీ, అనుసరించిన విధానాల్నీ మదింపు చేసి, వీలయితే అందులోంచి కొంత నేర్చుకుని, మొత్తం సబ్జెక్టునీ ఓన్చేసుకుని ముందుకెళ్తే బాక్సాఫీసు బకాసుర ప్రమాదాలు కచ్ఛితంగా తప్పుతాయి.

4. బయట ప్రపంచం చూస్తే యమ స్పీడందుకుని జోరుగా ముందుకు దూసుకు పోతూంటే, తలుపులు మూసిన చీకటి థియేటర్లో మాత్రం సినిమాలు ఇంకా తీరుబడిగా, పాత  కళా ప్రదర్శన చేస్తూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోలేవు. జీవించే కళే మారిపోయాక కళా ప్రదర్శనేమిటి? అందుకని 1990 నుంచీ ఇవాళ్టి దాకా హాలీవుడ్ కి కొత్త బైబిల్ సిడ్ ఫీల్డ్ పారడైం మాత్రమే. స్పీడు ఈ పారడైం లక్షణం.

        5. హై కాన్సెప్ట్ కథల పాయింటు ఒకవేళ ఇలాజరిగితే?’ (what if?) అన్న ప్రశ్నతో వుంటుంది. ప్రశ్నే కథకి ఐడియా నిస్తుంది. గ్రహాంతర వాసులు భూమ్మీదికి దండ యాత్ర కొస్తే? (‘ఇండిపెండెన్స్ డేఐడియా). డైనోసారస్ లని మళ్ళీ పుట్టిస్తే? (‘జురాసిక్ పార్క్ఐడియా). సముద్ర గర్భంలో రాజు సప్త సముద్రాల్ని జయించాలనుకుంటే? (‘ఆక్వామాన్ఐడియా). ఇలా చాలా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎప్పుడైనా ఇలా ట్రై చేసిన పాపాన పోయారా?

6. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రేక్షకులకైనా సింపుల్ గా అర్థమై పోతాయి హై కాన్సెప్ట్ కథలు. ఒక వేళ ఇలా జరిగితే? - అన్న ప్రశ్నే సాధించాల్సిన సమస్య వీటిలోని ప్రధాన  పాత్రకి. ఈ ప్రశ్నని ఎదుర్కోవడమే యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండే కథ. ప్రశ్నని ఎదుర్కోవడం గోల్,   ప్రశ్నని నిర్వీర్యం చేయడం గోల్ సాధన. సింపుల్  గా అర్ధమైపోతాయి ఈ కథలు మూడు ప్లాట్ పాయింట్ల పారడైంతో. ఇలా ప్రశ్నని పట్టుకుని కథ తక్కువ, తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ - ఇదే హై కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) అన్నమాట.

7. అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంటుంది సింబాలిక్ గా. ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టే వుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

8. పై చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు -  దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. ఒక అస్తమయంతో ఒక  సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... ఇలాటి భావుకతని  తెలుగు సినిమాల్లో కూడా సాధిస్తే బావుంటుందేమో? 

9. ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ  ప్రేక్షకులు నున్నగా తిన్నగా తయారై వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలోకి మేకర్లు వెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలూ జరగవు.

10.
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అనే జానరనేది ప్రేమల గురించి కానే కాదు, అవి నేర్చుకోవడం గురించి మాత్రమే. ప్రేమ సినిమాల్ని కాస్త స్టయిలిష్ గా తీస్తే ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అంటూ రివ్యూ రైటర్లు కూడా రాసి పారేస్తున్నారు. ఇలా వుంటే ఓ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీని తెలుగులో ఎప్పటికి చూడగలం.
11. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి, 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం అనే పాయింటు చుట్టూ వుంటాయి. హాలీవుడ్  లో ఏడాదికి 36 క్రమం తప్పకుండా తీస్తూంటారు. తెలుగులో అర్ధం లేని  హై స్కూలు ప్రేమలే  తీస్తారు. ఆ ఏజిలో వికసించే టాలెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, స్వభావ విరుద్ధంగా ప్రేమలు కాదు. ఒకసారి మనమీ వయసులో ఏం చేసేవాళ్ళమో గుర్తుచేసుకుంటే తెలుస్తుంది. 

12. తెలుగులో 13-19 ఏజి గ్రూపు టీనేజి ప్రేక్షకులు తమ నిజ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని కథలతో, తమకి సంబంధం లేని  అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలతో వస్తున్న సినిమాలకి కనెక్ట్ కాలేక, తమ మనసెరిగి సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి - ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో ఖాళీగా వున్న మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు.

        సరే, ఇక  నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ ఫైనాపిల్ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్