రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, December 27, 2014

రివ్యూ

కమర్షియలా? క్రాసోవరా?
రచన – దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల 
తారాగణం : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, దీప్తీ సర్దేశాయ్, శైలేష్, రావురమేష్, ప్రకాష్ రాజ్, అలీ, రఘుబాబు తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్, కెమెరా : మణికందన్,  ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, యాక్షన్ : రామ్- లక్ష్మణ్
బ్యానర్ : లియో ప్రొడక్షన్స్
నిర్మాతలు :  ‘టాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్
విడుదల : 24, డిసెంబర్ 2014 ,  సెన్సార్ :   ‘U/A’
***
     మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వచ్చాడు! ఆశ్చర్యకరంగా డిఫరెంట్ గా వచ్చాడు. బయట పబ్లిసిటీ పోస్టర్లకీ, లోపల చూసే సినిమాకీ డిఫరెన్సే ఓ కుదుపునిస్తే, చైన్ రియాక్షన్ లా ఈ కుదుపుతో బాటు మరో కుదుపు నిస్తూ ప్రయోగాల బాట పట్టాడు. మెగా ఫ్యామిలీ హీరో తొలి సినిమా కాదుకదా, ఎన్ని  సినిమాలు చేసినా ప్రయోగాల జోలి కెళ్ళాకుండా, కమర్షియల్ చట్రం అనే  సేఫ్ జోన్ లోనే  ఉండడం ఇంతవరకూ చూస్తూ వచ్చాం. నిర్మాతగా ‘ఆరెంజ్’ తో ప్రయోగం చేసి తీవ్రంగా నష్టపోయిన నాగబాబే, అరంగేట్రం చేస్తున్న తనయుడు వరుణ్ తేజ్ తో మళ్ళీ నమ్ముకున్న సేఫ్ జోన్ ని బ్రేక్ చేసేందుకు అంగీకరించడం ఆశ్చర్యమే మరి. సంతోషం, ఇది ట్రెండ్ ని సెట్ చేసేదైతే, ఇతరులకీ కొత్త బాట వేసేదైతే, మీడియా అంతా ఒకటై రొటీన్ కి అలవాటైన ప్రేక్షకుల దృష్టి ని ఇటు మళ్ళించడానికి కృషి చేయాల్సిందే!

      అలాగే సాధారణ కమర్షియల్ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి తేడా గల సినిమాతో రొటీన్ ని బ్రేక్ చేసేందుకు చేసిన ప్రయత్నానికి, సాహసానికి అభినందించాల్సిందే- కొత్త మెగా వారసుణ్ణి తెలుగు ప్రేక్షకులకి- అందునా మెగా వారసులందరి అశేష ఫ్యాన్స్ అందరికీ పరిచయం చేస్తూ తీసే సినిమా ఏ తీరుతెన్నుల్లో ఉండాలో అందుకు పూర్తి భిన్నంగా తీసి, ముక్కుమీద వేలేసుకునేలా చేయడమంటే మాటలు కాదు!
       శ్రీకాంత్ అడ్డాల కోస్తా కథలకి కొత్త రక్తం, కొత్త స్టార్ వరుణ్ తేజ్ ఉడుకు రక్తం, ఈ రెండు రక్తాలు కలిసి ఏం రక్తి కట్టించాయో వరుసగా ఈ కింద చూసుకుంటూ పోదాం..

కృష్ణార్జునుల కథ?

   ఆపదలనుంచి అర్జునుణ్ణి రక్షించేందుకు ఈ ముకుందుడు పుట్టాడు- అంటూ హీరో ముకుంద ( వరుణ్ తేజ్) ని కార్యోన్ముఖుడ్ని చేసే(!) ఈ కథలో కురుక్షేత్రం తిరగబడినట్టు, హైదరాబాద్ లో ఓ ఘాతుకానికి పాల్పడి అమలాపురం బయల్దేరతాడు ముకుందా. ఈ ప్రయాణా నికి మధ్యలో అవాంతర మేర్పడి, బస్సులో కలిసిన మిత్రుడికి తన కథ చెప్పుకొస్తూంటాడు. 
ఆ కథ ప్రకారం ముకుందా అమలాపురంలో ఓ ఉల్లి వ్యాపారి ( పరుచూరి వెంకటేశ్వరరావు) కుమారుడు. ఫ్రెండ్స్ వుంటారు. వాళ్ళల్లో ఒకడు అర్జున్ (శైలేష్). ఇతను ఆ వూరి మున్సిపల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం (రావు రమేష్) తమ్ముడి కూతురు( దీప్తీ సర్దేశాయ్) ని ప్రేమిస్తూంటాడు. పాతికేళ్ళుగా ఛైర్మన్ గా ఎంపికవుతున్న సుబ్రహ్మణ్యం కర్కోటకుడు. అతడి అన్యాయాలు ఇన్నీ అన్నీ కావు. వాటిలో హత్యలు కూడా. దీంతో అర్జున్ ని చంపెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. ఆ దాడిని ముకుంద తిప్పికొట్టి అర్జున్ ని కాపాడుకుంటాడు. అక్కడ్నించీ ముకుందా మీద సుబ్రహ్మణ్యానికి మంట రేగిపోతూంటుంది. ఇక ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలవుతుంది. ఇది చాలనట్టు ముకుందా సుబ్రహ్మణ్యం సొంత కూతురు పూజ (పూజా హెగ్డే) నే ప్రేమిస్తాడు. ఆమే ప్రేమిస్తుంది. ఇద్దరి  మధ్యా ఇది మాటలు లేని మూకీ  ప్రేమ. దీంతో సుబ్రహ్మణ్యం ఇంకా రెచ్చిపోతాడు. ఇంతలో మున్సిపల్ ఎన్నికలొస్తాయి. వూళ్ళో ఇల్లూ వాకిలీ లేకుండా దేశం గురించి ఉపన్యాసాలిస్తూ తిరిగే వ్యక్తి ( ప్రకాష్ రాజ్) ఒకడుంటాడు. ఇతన్ని నిలబెట్టి సుబ్రహ్మణ్యాన్ని ఓడిస్తాడు ముకుందా. మళ్ళీ అర్జున్ ని లేపేసేందుకు వెంటాడిన సుబ్రహ్మణ్యం ముఠాని, ముకుందా ఎదుర్కొని ఒక అఘాయిత్యం చేస్తాడు...ఇలా సాగుతూంటుంది కథ.


ఎవరెవరెలా ... 

ఈ కథలో హీరో వరుణ్ తేజ్ ది సీరియస్ పాత్ర. నవ్వడంగానీ, కామెడీ చేయడంగానీ వుండని ఈ డార్క్ మూడ్ పాత్రకి మాటలు కూడా తక్కువే. కాబట్టి నటుడుగా తానేమిటో పూర్తి స్థాయిలో ప్రదర్శించుకునే అవకాశం చిక్కలేదు. డాన్సులు, ఫైట్లు ఫర్వాలేదు. యాక్షన్ హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ వున్నాయి. మున్ముందు కలర్ఫుల్ పాత్రల్నిపోషించడంలో ఎలా ఉంటాడో ఈ సినిమా చూసి చెప్పలేం. ఇది నవరసాల కమర్షియల్ పాత్ర కాదు.
   ‘ఒక లైలా కోసం’ హీరోయిన్ పూజా  హెగ్డే కి చాలా స్క్రీన్ ప్రెజెన్స్ వుంది, ముఖం బావుంది. ఇదే ఆమెకి ఎస్సెట్. హీరోతో మాటల్లేని, టౌను నేపధ్యపు అణకువగల పాత్రవడంతో, రకరకాల కాస్ట్యూమ్స్ తో క్యాట్ వాక్ చేస్తూండమే ఆమెకి సరిపోయింది. ఈమెమీద చిత్రీకరించిన సోలో సాంగ్ బావుంది. 

    రావు రమేష్ కిది అవార్డులొచ్చే పాత్ర. ఒకే చైర్మన్ పదవిని పాతికేళ్ళుగా వెలగబెడు  తూండడంతో, దాంతో విసుగూ అలసటా వచ్చేసినట్టు ముఖం పరమబోరుగా పెట్టి, భృకుటి ముడిచి మాట్లాడే నటన నిజంగా ఓ వెరైటీ ఈ విలనిజానికి. డైలాగులు కూడా అచ్చ తెలుగులో బావున్నాయి. సినిమాలో ఏది గుర్తున్నా గుర్తుండక పోయినా రావురమేష్ ప్రదర్శించిన ఈ నటన చాలా కాలం గుర్తుండిపోయి తీరుతుంది.
    అలీ, రఘుబాబు వున్నారు. కానీ కామెడీ లేదు. ఇతర పాత్రల్లో అర్జున్ పాత్ర పోషించిన శైలేష్ ఫేసు, స్పీడు అతను ప్రయత్నిస్తే హీరో పాత్రలకి కొత్త రకంగా సూటవుతాయి. ఇక పరుచూరి వెంకటేశ్వర రావు, నాజర్, ప్రకాష్ రాజ్ లు సహాయపాత్రల్లో కన్పిస్తారు. ప్రకాష్ రాజ్ కయితే, ఇదే దర్శకుడి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లోని మంచివాడుగా అన్పించుకుంటూ తిరిగే పాత్రలాటిదే ఇదీ. దేశం గురించి చెప్పుకుంటూ తిరిగే కరివేపాకు పాత్ర. 
     మిక్కీ జె మేయర్ సంగీతం, మణికందన్ ఛాయాగ్రహణం, రామ్- లక్ష్మణ్ ల ఫైట్స్, మార్తాండ్  వెంకటేష్ ఎడిటింగ్ వగైరా సాంకేతిక హంగులన్నీ ఫర్వాలేదు. అయితే లేని ఎమోషన్ ని ఎలివేట్ చేయడానికి నేపధ్యంలో రీ-రికార్డింగ్ తో మిక్కీ జె మేయర్ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది  కూడా లేకపోతే, అరగంటలో ఈ సినిమా ఈ కాస్తా చూడగలిగే స్థాయిలో కూడా వుండేది కాదు.   

స్క్రీన్ ప్లే సంగతులు  

    దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసారి మూసలోకి వెళ్ళకుండా డిఫరెంట్ గా – వినోదాత్మక విలువలు లేని, యమ సీరియస్ గా వుండే, తేడా గల సినిమా  తీయాలనుకుని ఈ ప్రయత్నం చేసినట్టుంది. అలా చేసివుంటే బాగానే వుండేది. ‘బ్లాక్ ఫ్రైడే’ లాగానో, ఈవారమే విడుదలైన ‘అగ్లీ’  లాగానో ఒక శైలికి కట్టుబడి సిన్సియర్ గా చేసిన ప్రయత్నంగా మిగిలేది, బాక్సాఫీసు ఫలితాలెలా వున్నాసరే! కానీ రూల్స్ ని బ్రేక్ చేయాలనుకుంటే అసలంటూ రూల్స్ తెలిసి ఉండాలిగా? ఇది గ్రహించక పోతేనే ఈ గందరగోళం. అటో కాలు ఇటో కాలేసి, ఆర్ట్ సినిమాని కమర్షియల్ సినిమాతో కలిపి తీసినట్టు, లేదా కమర్షియల్ కథని ఆర్ట్ సినిమాలా తీసినట్టు- రెండు భిన్న శైలుల (genres) మేకింగ్ లని కలిపేసి, కమర్షియల్ కీ- క్రాసోవర్ కీ మధ్య త్రిశంకు స్వర్గంలో ప్రేక్షకులు కచ్చితంగా ఊగిసలాడేలా చేసి వదిలాడు! బిర్యానీలో ఆవకాయ (విజయవాడ హోటల్లో బిర్యానీతో పాటు సాంబార్ పెడతారు, అది వేరే విషయం) వడ్డిస్తే ఎలా వుంటుందో అలా తయారయ్యిందీ సినిమా! 
     కమర్షియల్ గా చూద్దామంటే - చక్కటి హీరో ఉన్నాడు, కామెడీ లేదు; చక్కటి హీరోయిన్లున్నారు, రోమాన్స్ లేదు (ఇందులో కూడా ప్రయోగమే!) చక్కని కమెడియన్లున్నారు, నవ్వులేదు; చక్కటి విలన్ వున్నాడు, తగిన క్లైమాక్స్ లేదు; చక్కటి పాటలున్నాయి, డాన్సు ల్లేవు; చక్కటి ఫైట్లున్నాయి, బలమైన కారణం లేదు.

      క్రాసోవర్ గా చూద్దామంటే- సమాంతర సినిమా హీరో వున్నాడు, కానీ కమర్షియల్ హీరో స్టయిల్ లో పాటల్లో కన్పిస్తాడు; ప్రయోగాత్మకంగా మాటల్లేని ప్రేమ వుంది, కానీ ఆమె గోపికలా పాడుకునే ఫార్ములా పాటలున్నాయి; రియలిస్టిక్ గా విలన్ వున్నాడు, కానీ పాత మూసలో ఎన్నికల ఎపిసోడ్ అంతా నడుస్తుంది; టేకింగ్ డార్క్ మూవీ టోన్ లో వుంది, కానీ కథనం కోనసీమ అందాలతో నడుస్తుంది; హీరో పాత్ర అర్జునుణ్ణి కాపాడే కృష్ణుడిగా సీరియస్ యాక్షన్ mode లో వుంది; కానీ ‘ముకుందా’ అనే టైటిల్ మిస్ లీడ్ చేస్తూ హోమ్లీ- రోమాంటిక్- అల్లరి కృష్ణుడనే అర్ధంలో వుంది పబ్లిసిటీ సహా! అసలేం తీసి ఏం చెప్పాలనుకున్నాడు దర్శకుడు ఇంత ప్రతిష్టాత్మక సినిమాతో? విప్లవ సినిమా తీస్తూ భావ కవిత్వం చెప్తే ఎలా వుంటుంది? అలా వుందీ సినిమా.
  ఇలా ద్వంద్వాలతో గజిబిజిగా వున్న కథని ఎలా చెప్పారంటే, మొత్తం ఫ్లాష్ బ్యాక్ (డ్రీం టైం )లో! దీంతో వర్తమాన (ప్రెజెంట్ టైం) కథకి స్కోపు లేకుండా పోయింది. కథా ప్రారంభంలో హీరోకి బస్సు ప్రయాణంలో అవాంతరం వచ్చి దిగిపోయి చెప్పడం మొదలెట్టిన ఫ్లాష్ బ్యాక్ కథ, అది ముగియగానే, మరో బస్సెక్కి హీరో వెళ్లిపోవడంతో సినిమాకి శుభం పడుతుంది. మొదట్లో ఎక్కిన బస్సు దిగడం, చివర్లో మరో బస్సెక్కడం ఈ రెండు చర్యలే వర్తమాన కాలపు ( ప్రెజెంట్ టైం) కథ! ఇంకో మాటలో చెప్పాలంటే- హీరో ఒక బస్సెక్కి దిగాడు, మరో బస్సెక్కి వెళ్ళిపోయాడు -ఇదే సినిమా కథ. 
     ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ అసలు కథ కానే కాదు. అది ఎత్తుకున్న అసలు కథకి అవసరమైన  సమాచారాన్ని అందించే వనరు- డేటా బ్యాంక్ మాత్రమే! 
    కానీ ఫ్లాష్ బ్యాకే కథగా భ్రమించి, మొత్తం సినిమా నడిపించేస్తే ఆ సినిమా కష్టమే. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఏ వర్తమాన (ఎత్తుకున్న) కథైతే కారణమయ్యిందో- అది కథ కాకుండా పోయే ప్రమాదముంది కాబట్టి.  ఎలా కథ కాకుండా పోతుందంటే-  దానికి బిగినింగ్, ఎండ్ లే తప్ప, మధ్యలో ఉండాల్సిన మిడిల్ వుండదు కాబట్టి ! దీనికీ దిద్దుబాటు  చర్యలున్నాయి. కానీ అంత ఆలోచించే అవసరం ఎవరికుంది? పోయేది ఓ పది కోట్ల రూపాయలే కదా!
       ఎత్తుకున్న వర్తమాన కథకి తగిన స్కోపు- స్ట్రక్చర్  చూసుకోకపోవడం వల్ల, 2003 లో హిందీ కమర్షియల్ దర్శకుడు ఎన్. చంద్ర క్రాసోవర్ సినిమాల ట్రెండ్ కి ప్రభావితమై తీసిన అలాటి ‘కగార్’ ఇలాగే కంగాళీ అయ్యింది.  నందితా దాస్, ఓం పురిలు నటించిన ఈ పోలీస్ ఎన్ కౌంటర్ కథ కి, అతికించింది సాంతం వేరే ఫ్లాష్ బ్యాక్ కథే! ఈ ఫ్లాష్ బ్యాక్ (అంటే దాన్ని భరించే ప్రేక్షకుల భాషలో ‘సోది’) ఎప్పుడు ముగించి  అసలు కథలోకి వస్తాడ్రా బాబూ అని ఎదురుచూసి ఎదురుచూసి విసిగిన ప్రేక్షకులు దాన్ని అట్టర్ ఫ్లాప్ చేసి వదిలారు. ఎన్ కౌంటర్ చేసేందుకు  క్రిమినల్ ని జీపెక్కించుకుని  బయల్దేరిన ఇన్స్పెక్టర్, తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడం  ప్రారంభించి ముగించేసరికి సినిమా అయిపోతుంది- ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న క్రిమినల్ కథ, ఓ రెండు తూటాల ఎన్ కౌంటర్ తో సరి! క్రిమినల్ జీపెక్కాడు ( బిగినింగ్), మరణించాడు (ఎండ్). వీడితో ఎత్తుకున్న  అసలు కథకి తగిన ‘మిడిల్’ అనేది  లేకపోతే అదొక కథే ఎలా అవుతుంది? 
      ఇలాటి సినిమాలు ఇంకా వున్నాయి. పాత రోజుల్లో పల్లె ప్రేక్షకులు ఫ్లాష్ బ్యాక్ ముగియగానే ‘ఒరే ఇదంతా కల రోయ్!’  అని అరిచి అందులోంచి తేరుకునే వాళ్ళు. ఈ ‘కల’ అని అనాలని వాళ్ళకెందు కన్పించిందో గానీ వాళ్ళు నిజంగా సినిమా జ్ఞానులే. సినిమా జాతకం ప్రేక్షకులే నిర్ణయిస్తారని అంటారు గానీ, ఆ ప్రేక్షకుల కామన్ సెన్స్ ని గౌరవించేది ఎప్పుడు?  ‘కల’ అని చెప్పేసి టెక్నికల్ గా వాళ్లెప్పుడో కరెక్ట్! ఎందుకంటే జోసెఫ్ మసెల్లీ (1917 – 1985)  అనే సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు 1965 లో రాసి ప్రచురించిన, సినిమా దర్శకులకి ఎంతో పనికొచ్చే, The 5 C’s of Cinematography  అన్న గ్రంధంలో ఫ్లాష్ బ్యాక్ కి వాడిన టెక్నికల్ పదం డ్రీం టైమే (కలే)! ..ఇదే స్థిరపడింది..              
     పైన ప్రస్తావించుకున్న  దిద్దుబాటు చర్య ఎలా ఉంటుందంటే- ఉదాహరణకి తెలుగు డబ్బింగ్  ‘1947- ఏ లవ్ స్టోరీ’ ( తమిళ- ‘మద్రాస పట్టినం’- 2010) నే తీసుకుంటే, ఇందులో ‘టైటానిక్’ లో ముసలావిడ లా, కథా ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళిన ముసలావిడ( ఈవిడ పూర్వం హీరో ఆర్య ని ప్రేమించిన ప్రేయసే- హీరోయిన్ అమీ జాక్సనే) –ఆ ఫ్లాష్ ముగించేసరికి, క్లయిమాక్స్ లో లండన్ నుంచి అర్జెంట్ కాల్ వస్తుంది, ఆమెకున్న తీవ్ర జబ్బుకి ఆపరేషన్ చెయ్యాలి వెనక్కి రమ్మని. కానీ  ఆమె ఇక్కడ తన ఆనాటి ప్రేమికుణ్ణి  ఇప్పుడు అరవై ఏళ్ల తర్వాత చూసి తీరాలన్న పట్టుదలతోనే వుంటుంది. ఈమె ఆర్య పేరు చెబుతూండే సరికి, బహుశా ఫలానా ఛారిటీ సంస్థకి వెళ్ళాలేమో అనుకుని టాక్సీ వాలా  అక్కడికి తీసికెళ్తాడు. తీరా చూస్తే  ఆ ఛారిటీ సంస్థ ఈవిడ పేరే వుంటుంది. అనేక సామాజిక కార్యక్రమాలతో అది ప్రసిద్ధిగాంచి వుంటుంది. ఆమె ఖిన్నురాలవుతుంది. తీరా తెలుసుకుంటే, అతనెప్పుడో చనిపోయాడని తెలుస్తుంది. విషణ్ణ వదనంతో ఆ సమాధిని సందర్శిస్తుంది...
   ఇక్కడ తెలుసుకోవాల్సిందేమిటంటే, ఆర్య తో తన గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఆమె ఇప్పుడు అతణ్ణి చూడాలని ఆరాటపడింది. ఇండియాకి వచ్చిందే  అతణ్ణి చూడ్డం కోసం. ఇప్పుడు అతణ్ణి వెతుక్కోవడంలో ఆమె పడే సంఘర్షణతో, సినిమా ప్రారంభంలో ఈమెతో ఎత్తుకున్న(బిగినింగ్) అసలు కథకి, ఇక్కడ ఉత్కంఠభరితంగా   ‘మిడిల్’ ఏర్పాటయింది. దీనితర్వాత సమాధిని సందర్శించడంతో ‘ఎండ్’ వచ్చింది. ఇదీ సినిమాకి క్లైమాక్స్. అంతే గానీ ఫ్లాష్ బ్యాక్ లో చూపించే దెప్పుడూ సినిమాకి క్లైమాక్స్ కాదు. 
     అంటే ఇక్కడ ప్రారంభించిన అసలు కథకి బిగినింగ్-మిడిల్- ఎండ్ అనే కథాంగాలు మూడూ వున్నాయి. ‘కగార్’ లో, ‘ముకుందా’ లో బిగినింగ్, ఎండ్ లు మాత్రమే  వున్నాయి. మిడిల్ లేదు. అందుకే ఇవి అర్ధరహితంగా, బలహీనంగా వున్నాయి. ‘కగార్’ స్టార్స్ లేని లో-బడ్జెట్ సినిమా, మాది మెగా హీరోతో హై-బడ్జెట్ సినిమా-కనుక మా స్క్రీన్ ప్లే ‘కగార్’ స్క్రీన్ ప్లేలా వుంటే మాకేం నష్టం?- అనుకుంటే, స్క్రీన్ ప్లేని కాపాడేది బడ్జెట్లూ స్టార్సూ కాదనీ, స్క్రీన్ ప్లేనే బడ్జెట్స్ నీ స్టార్స్ నీ కాపాడుతుందనీ చెప్పుకోవాల్సి వుంటుంది. రెండుగంటల ఫ్లాష్ బ్యాక్ తో ‘లింగా’ స్క్రీన్ ప్లేని రజనీ కాంత్ ఎందుకు కాపాడ లేకపోయారు? 
   పైన చెప్పుకున్న ‘1947- ఏ లవ్ స్టోరీ’ సినిమాలో గమనించాల్సిన ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే-ఆ  ఫ్లాష్ బ్యాక్ కూడా నిరంతరాయంగా చివరివరకూ ఏకధాటిగా సాగదు.  మధ్యమధ్యలో అది కట్ అవుతూ, వర్తమానంలో ఆమె మూవ్ మెంట్స్ ని చూపిస్తూ, వర్తమానం- ఫ్లాష్ బ్యాక్ రెండిటి సరిజోడు నడకలా వుంటుంది. అంటే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో గతం లో జరిగింది చెప్పారన్నమాట. దీనివల్ల చివరంటా ఫ్లాష్ బ్యాకే చూపించారన్న బోరు ఫీలింగ్ ప్రేక్షకులకి ఏర్పడలేదు.


     ఫ్లాష్ బ్యాకే అసలు కథ అనుకుని చెప్పిన ‘ముకుందా’ స్క్రీన్ ప్లేలో కూడా అంక విభజన కనపడక- ఏదో కథ నడుస్తోందిలే, మనం చూస్తున్నాం-అన్నట్టుగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చెయ్యని తనంతో తేలింది. ఫ్లాష్ బ్యాక్ కథకి కూడా స్క్రీన్ ప్లే లేదు. ఎక్కడ బిగినిగ్ ముగిసింది, ఎక్కడ మిడిల్ ప్రారంభంయ్యిందీ అంక విభజన చెయ్యడం బ్రహ్మతరం కూడా గాదు. దీనికి కారణం,  ఎక్కడా ఒక ప్రథాన సంఘటనతో, కథని  ఒక ప్రధాన మలుపు తిప్పాలన్న ధ్యాస లేకపోవడమే. మంచు విష్ణు నటించిన ‘అనుక్షణం’ లో లాగా లేడికి లేచిందే పరుగన్నట్టు,  ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం నుంచీ దాని కథ చిల్లర దాడులూ ఎదురు దాడులతో మార్పు లేకుండా సాగుతూనే వుంటుంది!
     ఇలా ఎందుకు జరిగిందంటే, కథని హీరో పాత్ర నడపకుండా, కథకుడు పూనుకుని అతడి కోసం నడపడం వల్ల. సృష్టించిన పాత్ర, అది నడుస్తున్న విధానం యాక్టివా, పాసివ్వా తెలుసుకోకపోతే, ఎంత స్టార్ అయినా ఆ పాత్రని ఎలా నిలబెడతాడు? మొత్తంగా సినిమాని ఎలా కాపాడతాడు?
     హీరో వరుణ్ తేజ్ పోషించిన ఈ పాత్ర యాక్టివ్ కాని, పూర్తి స్థాయి రియాక్టివ్ (పాసివ్) క్యారక్టర్ అన్నమాట. అదెలాగో ఈ కింద చూద్దాం.

పాత్రోచితానుచితాలు

     ఈ కథ కాన్సెప్ట్ ఏమిటంటే, ఆపదలనుంచి అర్జునుణ్ణి రక్షించేందుకు ముకుందుడు (హీరో) పుట్టాడని! దీనికి కురుక్షేత్రం ( వూళ్ళో మున్సిపల్ చైర్మన్, అతడి ముఠాతో పోరాటం) బ్యాక్ డ్రాప్ లో కథనమిచ్చారు. కానీ కురుక్షేత్రంలో కృష్ణుడు శ్రీకృష్ణుడు గా ఉంటాడు, ముకుందుడు గా కాదు ( ‘ఓమై గాడ్’ హిందీ సినిమాలో కన్ఫ్యూజన్ లో వున్న కథా నాయకుడ్ని  దార్లో పెట్టడానికి  శ్రీ కృష్ణుడు గా హీరో అక్షయ్ కుమార్ ‘కృష్ణ యాదవ్’ అనే కన్సల్టెంట్ గా చెప్పుకుని వస్తాడు, ముకుందా యాదవ్ అనీ కాదు, మురారీ యాదవ్ అని కూడా కాదు) కురుక్షేత్రంలో అర్జునుడు కూడా కృష్ణా, కేశవా, మధుసూదనా, జనార్దనా, మాధవా మొదలైన పర్యాయ నామాలతోనే పిలుస్తాడు. ఆ కృష్ణుడు కూడా ఆపదలనుంచి అర్జునుణ్ణి కాపాడడు. కథలో చూపించి నట్టుగా అర్జునుడి కోసం తను యుద్ధం చెయ్యడు. యుద్ధం చెయ్యలేక కునారిల్లిన్న అర్జునుణ్ణి  తన గీతోపదేశంతో మోటివేట్ చేస్తాడు. అలాగే కథలో చూపించినట్టుగా అర్జునుడు ( ఫ్రెండ్) కి బాడీగార్డులా కూడా వుండడు శ్రీ కృష్ణుడు. కాబట్టి కాన్సెప్ట్ దశలోనే ఈ కథ ఫెయిలయ్యింది. కనుక ముకుందుడు, అర్జునుడు, కురుక్షేత్రం-ఈ గొప్ప మాటలతో బిల్డప్పుల్ని తీసిపక్కన పెట్టి, ఓ సాధారణ యాక్షన్ కథగా పాత్రల్ని, వాటి నడకనీ చూద్దాం...
    మున్సిపల్ చైర్మన్ కుటుంబంలో అమ్మాయిని హీరో ఫ్రెండ్ ప్రేమిస్తే, మున్సిపల్ చైర్మన్ వాణ్ణి చంపి పారేసే లక్ష్యంతో హత్యా ప్రయత్నాలూ, నక్సలైటుగా అరెస్టు చేయించడాలూ వగైరా పనులు  చేస్తూంటాడు. కానీ అమ్మాయిని కట్టడి చెయ్యడు. ఆమె వాణ్ణి కలవకుండా చూడడు. ఆమెకి నాల్గు తగిలిస్తే మొత్తం దారికొస్తుంది. ఈ నేపధ్యంలో పదే  పదే  విలన్ బారిన పడుతున్న ఫ్రెండ్ ని హీరో కాపాడ్డమే సరిపోతుంది. చివరిదాకా ఈ ఫ్రెండ్ సిల్లీగా ఏదో ఒకటి చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం, అతన్ని కాప్పాడ్డం కోసమే హీరో బతకడం అన్నట్టుగా తయారయింది పాత్ర. అంతే  గానీ, ఎక్కడా తానుగా  రంగం లోకి దిగి, చర్య తీసుకుని ఫ్రెండ్ సమస్యని పెళ్ళితో పరిష్కరించాలని అనుకోడు. ఇందువల్లే కథలో ప్రధాన మలుపు రాలేదు. ఆ ప్రధాన మలుపుతో మిడిల్ ఏర్పడి, విలన్ తో ఇంకో  అర్ధవంతమైన పోరాటంగా కథ వేడెక్క లేదు. ఎంత సేపూ ఆ ఫ్రెండ్ ఆ అమ్మాయిని గిల్లుతూంటే, విలన్ చర్య తీసుకోవడం, ఆ చర్య తీసుకున్నప్పుడు హీరో ప్రతిచర్య కి పాల్పడ్డం అనే రియాక్టివ్ (పాసివ్) ధోరణిగల బలహీన పాత్ర అయిపోయాడు. ఇందుకే భారీ ఎత్తున ఫైట్లు చేస్తూంటే ఎందుకీ పాట్లు అనిపిస్తుంది. 

    ఇక సెకండాఫ్ లో విలన్ కూడా డల్ అయిపోయాడు. ఎంతసేపని తనే యాక్షన్ తీసుకుంటూ విసిగిపోతాడు? హీరో తన మీద ఏదో తిరుగు మంత్రం ప్రయోగిస్తే, అప్పుడు కొత్త ఉత్సాహం వచ్చి చేతి నిండా కొత్త పని వుంటుంది. 
    ఇలా పరంపరగా పాసివ్ పాత్రల బాగోతం తెలుగుసినిమాలకి ఎవరో పెట్టిన శాపమేనేమో !

      చివరగా- హీరో హీరోయిన్ల మాటల్లేని, చూపుల, చిరునవ్వుల మూకీ ప్రేమ అనే ప్రయోగం గురించి...ఈ ట్రాక్ లో కూడా బిగినింగ్, ఎండ్ లే తప్ప మిడిల్ లేకపోవడంతో అర్ధరహితంగా, చప్పగా తేలింది. చూసుకుంటున్నారు, చిరునవ్వు లిచ్చు కుంటున్నారు, కానీ ఎంత సేపూ ఆ చూపులకి, ఆ చిరునవ్వులకీ  సమస్యలే రావా? చూపుల్లో ఆందోళన, చిరునవ్వుల్లో నిస్తేజం తెచ్చిపెట్టే  ప్రతికూల సంఘటనలే జరక్కుండా, మూకీ గానే వాటిని జయించి ఒక్కటై,  హమ్మయ్యా అనిపించే మిడిల్ కథనమే లేకుండా అదో ప్రేమకథా?
     అసలు కథ, ఫ్లాష్ బ్యాక్, ప్రేమట్రాకు- ఎందులోనూ మిడిల్ అంటే ఎలర్జీ అన్నట్టు సాగింది దర్శకుడి తీరు!
    
సికిందర్