రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, అక్టోబర్ 2015, గురువారం



రచన- దర్శకత్వం : క్రిష్ 

తారాగణం : వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్, నికితాన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి మారుతీ రావు. షావుకారు జానకి, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, అనూప్ పురీ, తదితరులు
సంగీతం : చిరంతాన్ భట్, పాటలు :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్, మాటలు : సాయినాథ్ బుర్రా, ఎడిటింగ్ : సూరజ్ జగ్ తాప్- రామ కృష్ణ అర్రం,
కళ  : సాహి, యాక్షన్ : డేవిడ్ కబువా, బ్యానర్ : ఫాస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు : జె సాయిబాబు, వై రాజీవ్ రెడ్డి
విడుదల :   22 అక్టోబర్ 2015


భిన్న కథా చిత్రాల దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్) తన క్రియేటివిటీనీ, గుణాత్మకంగా తెలుగు సినిమా స్థాయినీ, ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి ప్రతిష్టించారు. విషయం లేని  అదే పాత  మసాలా సినిమాల మధ్య కాస్త క్వాలిటీ సినిమా కోసం మొహం వాచిపోయి వున్న ప్రేక్షకులకి ‘కంచె’  తో ఆ కొరత తీర్చేశారు. ‘కంచె’ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే నేటివిటీ చట్రంలో ఇరుక్కుపోయే మరో కమర్షియల్ కాదు- దీని నేటివిటీ సార్వజనీనం. దేశంలోనే కాదు, విదేశాల్లో ఎక్కడ ప్రదర్శనకి నోచుకున్నా దీనికి ప్రశంసల జల్లులే కురుస్తాయి. ఏ కాలంలోనైనా స్థానిక- అంతర్జాతీయ నేపధ్య పరిస్థితులు రెండూ ఒకటేననీ చెబుతూ, ఒక ప్రేమ కథ- ఇంకో యుద్ధకథ అనే యూనివర్సల్ ఫార్మాట్ మీదికి తన అసామాన్య క్రియేటివిటీని రంగరించి ఒక కమర్షియల్ కానుకగా ఇచ్చారు క్రిష్. ఈ దసరా పండగ రోజున  ఒక పవర్ఫుల్ పీరియడ్ సినిమా చూసి ఆనందించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకి కల్గించారు.