రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, నవంబర్ 2021, మంగళవారం

 

Wednesday, July 13, 2016

నాటి సినిమా!


సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే  అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే  గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు.  కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి  లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?


        ది లేడి కాబట్టి పచ్చని ప్రకృతిలో తిరుగాడుతుంది. గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తచ్చాడుతుంది. అడవుల్లో చెట్లే దారి  చూపుతాయన్నట్టు, జీవితాలకి అంతటి మట్టి వాసనల కథలే  మార్గం చూపుతాయి. అలాటి కమ్మటి నేటివ్ వాసనల కథలు సినిమాలకి అవసరపడతాయనుకున్న లేడి, ఫార్ములా పులి చంపిన లేడి నెత్తురై పోకుండా, కీకారణ్యం  లాంటి మూస మాస్ మసాలాల క్రియేషన్ల  మధ్య, తనదైన ఓ ప్రత్యేక ముద్రతో కూడిన బాణీని విన్పిస్తూ యావత్ప్రజానీకాన్నీ మంత్రముగ్ధుల్ని చేయడం సామాన్య విషయమా? 

         చాలామంది సాహితీపరులు సినిమా దర్శకులుగా కన్పిస్తారు. వాళ్ళు సినిమా దర్శకత్వానికి సరిపోరనే అభిప్రాయాన్నే కల్గించారు. ఒక జర్నలిస్టుగా మారిన రచయితని యుద్ధ రంగానికి పంపిస్తే, అతను యుద్ధ వార్తలు  రాయకుండా ఆ చుట్టూ ప్రకృతి అందాలని  అద్భుతంగా వర్ణిస్తూ పోయాడట. ఇలాకాక, చాప కింద నీరు లాంటి ఇలాటి చాపల్యాన్ని ఈదేసిన గజఈత గాడు కూడా అయ్యింది పైన చెప్పుకున్న లేడీ. లేకపోతే  అచ్చులో కథలు రాసుకునే వాడికి జన్మకి సినిమా డైరెక్షన్ అబ్బే పరిస్థితి లేదా రోజుల్లో.


        ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు.  తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980),  మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో  పోలియో చుక్క లాంటి  ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి  ఎవరు మొదట  బీజం వేసి,  ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల  క్రమాన్ని చూస్తే  తెలిసిపోతుంది.

        ‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత.  తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’  హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే.  అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో  ‘సితార’  విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.


          మరో కన్పించని మాంత్రికుడు ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు. గ్రామీణ అందాల్ని చూపించడంలో దిట్ట. అక్కడే తచ్చాడే వంశీలాంటి దర్శకుడ్ని ఈయన కాపేసి పట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు- వెండి తెరమీద సినిమా రీళ్ళు తిరగవు, రంగులరాట్నం తిరుగుతుంది.

        రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ  పరువు ప్రతిష్టలూ సమకూరడానికి  ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి.  ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో  వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా,  పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ -  ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న  పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు. 

        ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’  అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’  అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల  గౌరవమే వుంటే  హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం  కూడా చందర్ కి.

      గృహ నిర్బంధంలో వున్న కోకిలకి రాజు  (సుమన్) దగ్గరవుతాడు. వూళ్ళో జరుగుతున్న  జాతరకి పగటి వేషగాళ్ళ బృందంతో వచ్చిన కళా కారుడితను. ఇతడి ఆటా పాటా కోకిలలోని  నాట్యకళాకారిణిని  తట్టి లేపుతాయి. ఇక నాట్య విన్యాసాలే నాట్య విన్యాసాలు. విరహ గీతాలే గీతాలు ప్రేమలో. చందర్ కిది తెలిసిపోయి  రాజుని చంపించేసి, తండ్రి  మాట నిలబెట్టలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటాడు. 

        ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన  కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క  పరిష్కార మార్గంగా  వయసుమళ్ళిన  డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు. 

        ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు  ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి. 

        వంశీ విజువల్ సెన్స్ కి శృంఖలాల్లే

వనడానికి ఓ మూడు సీన్లు చూస్తే చాలు-  1. పంజరాల్లో చిలుకలు తల్లడిల్లే షాట్లు, 2. ఎగిరే చిలుకని పట్టుకుందుకు సుమన్- భాను ప్రియల రాపాడే చేతుల శృంగారభరిత విజువల్స్, 3. హాలు నిండా వాద్య పరికరాల మధ్య సుమన్- భానుప్రియలతో వుండే ఒక సన్నివేశం ...ఇక పాటల చిత్రీకరణ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చాలా సూపర్ హిట్  పాటలే ఇప్పటికీ. 


        ఇంత కళాఖండంలోనూ  లోపాలూ లేకపోలేదు. లోపాలతోనే కళాఖండాలకి  అందం వస్తుందేమో. ఇందులో భానుప్రియ పాత్ర ఎంతకీ ఎదగదేమిటి? సుమన్ ఆమె చెర విడిపించాక ఆమె పూర్తి స్వేచ్ఛా జీవియే. ఇంకా తన స్వేచ్ఛని హరించిన వంశప్రతిష్ట గురించి ప్రాకులాట ఎందుకు? తన అన్న సుమన్ ని చంపించాడని  తెలిసీ అన్నంటే సెంటి మెంట్లు ఎందుకు? బాధపడాల్సింది చనిపోయాడనుకున్న సుమన్ గురించి కాదా? అంతలోనే ముక్కలైన అతడితో తన ప్రేమ గురించి కాదా? ఇంకా అన్న గురించీ, సాంప్రదాయాల గురించీ ఆలోచిస్తే ముందు కెళ్ళిపోయిన పాత్ర ఎలా ఎదుగుతుంది? ఎదగ వద్దన్న ఫ్యూడలిజాన్ని బోధిస్తున్నట్టా ఈ పాత్రతో? 

        ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ  బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!

         అసలు బిగినింగ్, మిడిల్, ఎండ్ అంటే ఏమిటో తెలిస్తేగా అవి వుండడానికి. ఈ చిన్న విషయం  వంశీకి తెలీదనుకోలేం. నవలని సినిమాగా మారుస్తున్నప్పుడు ఆ  నవలా కథనమే స్క్రిప్టులో జొరబడినట్టుంది. కానీ కెరీర్ కొత్త లోనే ఇంత సాహసమూ సృజ నాత్మకతా  ప్రదర్శించినందుకు వంశీని అభినందిద్దాం. వంశీ మరో ‘సితార’ లాంటిది తీయడు, తీయలేడు కూడా- పర్సనల్ డైరీ అనేది ఒక్కటే వుంటుంది కాబట్టి.

పట్టపగలే చుక్కలు!

          వాళ్ళందరికీ ‘సితార’ ని చూసి పట్టపగలే చుక్కలు కన్పించాయి... వాళ్ళందరూ-  నిర్మాత, దర్శకుడు, ఫైనాన్షియర్లూ- ప్రివ్యూ థియేటర్లో కొలువుదీరారు ‘సితార’ చూద్దామని. ఇంకా రీ రికార్డింగ్ మిగిలి వుంది. ముందు డబుల్ పాజిటివ్ పోస్ట్ ప్రివ్యూ చూద్దామనుకున్నారు. అంతాకలిసి చూశారు. ఇదేం సినిమా? డైలాగులేవీ? ఆ కళ్ళు, చేతులు, కాళ్ళూ చూపించడమేమిటి మాటిమాటికీ? ఆ నీడలేంటి?  ఆ పడవ లేంటి? ఐపోయింది! పనైపోయింది! పూర్ణోదయా వారి పని గోవిందా! పదండి వెళ్లి పోదాం,  చెక్కేద్దాం- అనేసి ఫైనాన్షియర్లు చెక్కేశారు. వంశీ బొమ్మలా నిలబడిపోయాడు. 

        రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది.  ఈయన కూడా పారిపోతే?  అలా చేయలేదు ఇళయరాజా.  సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి  వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!

        12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.



-సికిందర్
(“సాక్షి” –నవంబర్ 2009)