రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, అక్టోబర్ 2022, సోమవారం

1241 : కొరియన్ రివ్యూ!

    2000ల ప్రారంభంలో మ్యూజిక్, మూవీస్ సహా దక్షిణ కొరియా వినోద పరిశ్రమ కొంత మాంద్యాన్ని ఎదుర్కొంది. అయితే కాలం గడిచే కొద్దీ ఈ రెండు రంగాలు వాటి సొంత అస్తిత్వాలతో  ప్రపంచ సూపర్ పవర్‌లుగా మారే స్థాయికీ క్రమంగా అభివృద్ధి చెందాయి, ఆర్ధికంగా అపూర్వ విజయాలు సాధిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల సంఖ్యనూ అపారంగా పెంచుకున్నాయి. మన దేశంలోనైతే చెప్పనవసరం లేదు, ఇక తెలుగులో సరే- ఎన్నో కొరియన్ సినిమాలు తెలుగులో ఫ్రీమేకులు, రీమేకులు చేసేస్తున్నారు. ఇవాళ కొరియన్ సినిమా సాంకేతికంగానూ, సృజనాత్మకంగానూ గుణాత్మకమైన ఆవిష్కరణలు చేస్తూ పురోగమిస్తోంది. శాంసంగ్, ఎల్జీ వంటి టాప్ టెక్నాలజీ బ్రాండ్లని పక్కన పెడితే, దక్షిణ కొరియా అంతర్జాతీయంగా మిలియన్ల కొద్దీ గృహాలకు కె -పాప్ అంటూ మ్యూజిక్ ని, కె- డ్రామాలంటూ సినిమాలనూ అమోఘంగా ఎగుమతి చేస్తోంది.

          కె- డ్రామా అంటే కొరియన్ రోమాంటిక్ డ్రామాలు  ఒక తిరుగులేని బ్రాండ్ గా పాపులరయ్యాయి. కె- డ్రామాలు చూడకపోతే చిన్న చూపుకి గురయ్యే పరిస్థితి దాకా వెళ్ళింది. ఇవి చాలా వరకూ టీనేజీ రోమాన్సులుగానే వుంటాయి. అలాగని అసభ్య అశ్లీల వెకిలి తనాలతో వుండవు. చీప్ కామెడీలతో వుండవు. టీనేజీ సినిమాలని కూడా కొరియన్ సంస్కృతిని, విలువల్నీ ప్రతిబింబిస్తూ టీనేజర్లలో ఉత్తమాభిరుచిని ప్రోత్సహించేలా తీస్తారు. క్లాసిక్ అనే మూవీ చాలా పెద్ద ఉదాహరణ. ఈ కె- డ్రామా జానర్ లో తాజాగా ట్వెంటీయత్ సెంచురీ గర్ల్ విడుదలైంది.

        అక్టోబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ర్యాంకులో 7 వ స్థానం పొందింది. హిందీ ఆడియోతో అందుబాటులో వుంది. ఇందులో కొరియన్ పాత్రల పేర్లు ఇబ్బందికరంగా, ఫాలో అవడానికి తికమకగా వుండొచ్చని తెలుగు పేర్లుగా మార్చాం :సారిక (పాత్ర పేరు నబో-రా, నటి కిమ్ యో-జంగ్), దశ (పాత్ర పేరు యోన్-డు, నటి రోహ్ యూన్-సియో), ఆకార్ (పాత్ర పేరు బేక్ హ్యూన్-జిన్, నటుడు పార్క్ జంగ్-వూ), ఆకాష్ (పాత్ర పేరు పూన్ వూన్-హో, నటుడు బైయోన్ వూ-సియోక్). దీనికి దర్శకురాలు బాంగ్ వూ-రీ.

విషయంలోకి వెళ్తే...

    20వ శతాబ్దం ముగిసే ఒక సంవత్సరం ముందు, 1999లో ఈ ప్రేమ కథ. అథ్లెటిక్స్ లో ఆరితేరిన సారిక అనే 17ళ్ళ స్టూడెంట్ కి దశ అనే క్లాస్ మేట్ వుంటుంది. దశ హార్ట్ సర్జరీ కోసం యూఎస్ వెళ్ళాలి. అయితే తను ఆకార్ అనే స్టూడెంట్ ని తొలి చూపులోనే వలచినందున, ఇంకా అతడి గురించి తెలుసుకోకుండా హార్ట్ సర్జరీకి యూఎస్ వెళ్ళలేనని మొండికేస్తుంది. ఏం ఫర్వాలేదు, తను ఆకార్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఈ మెయిల్ చేస్తూంటానని సారిక హామీ ఇవ్వడంతో, నిశ్చింతగా యూఎస్ కెళ్తుంది దశ.

        కాలేజీలో సారిక ఆకార్ ని ను అనుసరించడం మొదలెడుతుంది. ఒక రోజు ఆమె ఆకార్, అతడి క్లాస్ మేట్ ఆకాష్ ఇద్దరూ కాలేజీ బ్రాడ్‌కాస్టింగ్ క్లబ్‌లో చేరబోతున్నారని విని, తనుకూడా దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. క్లబ్‌  ఆడిషన్స్ లో ఎంపికవుతుంది. ఆకాష్ కూడా ఎంపికవుతాడు, కానీ ఆకార్ అప్లయి చేసుకోలేదని తెలుసుకుని నిరాశ చెందుతుంది.  

        దీంతో సారిక ఆకార్ ని నిశితంగా పరిశీలించడానికి ఆకాష్ కి దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆకాష్ తో సన్నిహితంగా మెలగడంలోని ఆంతర్యం గ్రహించిన ఆకార్, తననే ప్రేమిస్తోందని పొరబడి డేటింగ్ ప్రపోజ్  చేస్తాడు. దశ బాయ్ ఫ్రెండ్ తనని డేటింగ్ అడిగేసరికి కంగారు పడిన సారిక కాదు పొమ్మంటుంది. అయితే ఈమె ఆకాష్ తో ప్రేమలో వుందనుకుంటాడు ఆకార్. సారిక కూడా తనకి ఆకాష్ పట్ల ఫీలింగ్స్ పెరుగుతున్నాయని తెలుసుకుంటుంది. ఇది గ్రహించిన ఆకాష్ ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.  

        ఇక విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయి గుండెని పదిలంగా పట్టుకుని దిగిన దశ, ఇక్కడి పరిస్థితి చూసి ఢామ్మంటుంది. సారిక తప్పుడు అబ్బాయిని అనుసరించి వివరాలు పంపిందని గ్రహించి మంచాన పడుతుంది. తను ప్రేమించింది ఆకార్ ని కాదు, ఆకాష్ నే.  తను ఆకాష్ ని మొదటిసారి కలిసిన రోజు, అతను ఆకారే అనుకుంది. ఎందుకంటే అతను ఆకార్ పేరుగల  ట్యాగ్‌తో వున్న ఆకార్ జాకెట్‌ ని ధరించాడు!

        వార్నీ, కొంప మునిగిందనుకున్న సారిక, గుండాపరేషన్ దశని పరేషాన్ చేయకూడదని తను ఆకాష్ నే ప్రేమిస్తున్న విషయం దాచి పెడుతుంది. దాచిపెట్టి ప్రాణస్నేహితురాలి పట్ల విశ్వాసంతో ఆకాష్ ని దూరం పెడుతూంటుంది. అయితే ఆకార్ ద్వారా, ఆకాష్ - సారిక ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం దశ తెలుసుకుంటుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుని, తమ స్నేహం కోసం తనే ఆకాష్ మర్చిపోతానని అనేస్తుంది. ఇదీ విషయం.

స్నేహాలు- విశ్వాసాలు

   ప్రేమంటే స్వార్ధమనీ, స్నేహమంటే విశ్వాసమనీ ప్రేమ కంటే స్నేహమే ఉదాత్తమైనదనీ, త్యాగాలకి సిద్ధపడే టీనేజర్ల కథ ఇది. దర్శకురాలు ఇది తన జీవితానుభవమేనని చెప్పుకుంది. దీన్ని టీనేజర్ల ముందుంచింది. అయితే విషాదాంతం చేయకుండా వుండాల్సింది. టీనేజర్లకి  ప్రేమలు-పొరపాట్లు- దిద్దుబాట్లు వుంటాయి. దిద్దుబాటు చూపించి మార్పు తేవాలనుకోవాలేగానీ, మరణమే పరిష్కారమని కాదు. స్నేహంలో ప్రాణత్యాగం మిగిలున్న వ్యక్తికి జీవిత కాల శిక్షయి పోతుంది. టీనేజీ ప్రేమ కథల్ని ట్రాజడీ చేయాల్సిన  అవసరం లేదు.

        ప్రధాన పాత్ర సారికని పోషించిన నటి  కిమ్ యో-జంగ్ నటన చిలిపితనంగా ప్రారంభమై, గంభీరంగా మారుతుంది. సున్నితంగా బాగానే  నటించింది. స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తనని ప్రఫోజ్ చేయడంతో కంగారు పడి- ఏవేవో తన దురలవాట్లు, చెడ్డ గుణాలూ చెప్పుకుని తప్పించుకునే కామెడీ  సీను బావుంటుంది. నూడుల్స్ అసహ్యంగా తింటానని కూడా తింటూ చూపిస్తుంది.

        స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ వివరాలు కూపీలాగే పనులు కూడా హాస్యంగా  వుంటాయి. తను కనుగొన్న ప్రతిదాన్నీ శ్రద్ధగా ఈ - మెయిల్ చేస్తూంటుంది - అతడి షూ సైజు దగ్గర్నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఇంటి చిరునామా వరకూ- కష్టపడి సేకరించి పంపుతుంది. అతను ఒక సినిమా సీడీ కోరితే అది తీసుకొచ్చి ఇస్తే, ఏం సీడీ తెచ్చిందో బయటపడి- ఆ అడల్ట్ సీడీని పైకెత్తి పట్టుకుని అందరికీ కనిపించేలా గోడకుర్చీ వేసుకోమని పనిష్ చేస్తాడు ప్రిన్సిపాల్. ఆమె అలా సీడీ పట్టుకు కూర్చోవడాన్ని బాయ్ ఫ్రెండ్ కూడా చూసేసరికి – నిన్ను నాశనం చేస్తా- అని తిట్టుకుంటుంది. ఇతన్నే తన టెక్వాండో విద్యతో రౌడీల బారి నుంచి కాపాడుతుంది. కానీ తన కాలే విరిగి ప్లాస్టర్ వేయించుకుంటుంది. ఇలాటివన్నీ ఎంటర్టయిన్ చేస్తూ నటించింది.  

        దశ పాత్రలో నటి, ఆకార్, ఆకాష్ పాత్రల్లో నటులూ ప్రతిభ గల వాళ్ళే. దర్శకురాలు అలా నటింపజేసుకుంది. ఈ నల్గురు తప్ప వీళ్ళ మధ్య కథలోకి ఇంకెవ్వరూ రారు. ఈ ఫిల్టరింగ్ ఫ్రెష్ గా వుంటుంది. రెండు గంటల రన్నింగ్ టైమ్ ఉన్నప్పటికీ, కొన్ని కీలక పాత్రల్ని ముందుకు తీసికెళ్ళకుండా వదిలేసింది దర్శకురాలు. పైన చెప్పుకున్నట్టు ముగింపు మాత్రం జనాదరణ పొందక పోవచ్చు. 20వ శతాబ్దం చివర్లో కూడా టీనేజర్ల మనస్తత్వాలు, విలువలతో వాళ్ళ అయోమయం, వాళ్ళ అనాలోచిత నిర్ణయాలూ వుండేవని చెప్పదల్చుకుందేమో. 20వ శతాబ్దపు అమ్మాయి కథ కాబట్టి. 

నిర్మాణ విలువలు - కాలీన స్పృహ

        1999 నాటి నేపథ్య వాతావరణ సృష్టి బాగా జరిగింది. ఆనాటి వీహెచ్ఎస్  టేపులు, పేజర్లు, పబ్లిక్ ఫోన్‌బూత్‌లతో సహా 90ల నాటి సైన్‌ బోర్డులూ దర్శన మిస్తాయి. అప్పటి కంప్యూటర్లు సరే. ఈమెయిల్ ఇంటర్ఫేస్ కూడా. అప్పటి ప్రసిద్ధ కె-పాప్ వీడియోలు, టీవీ  డ్రామాలూ  జ్ఞాపకాలని ళ్ళీ పునరుజ్జీవింపజేస్తాయి. టీనేజీ కథాలోకానికి వాడిన కలర్స్, లొకేషన్స్, సెట్స్ ఎక్కడా రఫ్ గా వుండవు. నేపథ్య సంగీతం సహా ప్రతీదీ నిర్మాణ విలువల పరంగా, టీనేజీ వయస్సంత సౌకుమార్యంతో వుంటాయి. కంటికి, వొంటికి ఆరోగ్యకరంగా.

        హాలీవుడ్ లోనైనా సరే, కొరియాలో నైనా సరే, టీనేజీ రోమాన్సులన్నాక 17 - 19 మధ్య వయస్కులతోనే తీస్తారు. మనలాగా 20-25 ఏళ్ళ ముదురు శాల్తీలతో, ఇంకా గడ్డాలూ మీసాలేసుకున్న బెరడు ఫేసులతో తీయరు. అందుకని వయస్సుకి తగ్గ టీనేజీ ఇన్నోసెన్స్ తో, వాళ్ళకి నప్పే చేష్టలతో అవి సహజంగా వుంటాయి. టీనేజీతో మన జ్ఞాపకాల్లోకి తీసికెళ్తాయి. అందుకే కె- డ్రామాలు అంత పాపులరవుతున్నాయి. మన మేకర్లు టీనేజీలో వాళ్ళు చూసిన జీవితాన్ని పాతికేళ్ళ పోకిరీ రూపాలతో రోమాంటిక్ కామెడీలుగా డ్రామాలుగా తీసి పరమానందం పొందుతారు. ఇంకా మాట్లాడితే మెడిసిన్ చదివే లవర్స్ ని పదహారేళ్ళ టీనేజర్ల మాటలతో, చేష్టలతో చూపించి దురదానందం అనుభవిస్తారు.

—సికిందర్