రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, డిసెంబర్ 2022, బుధవారం

1260 : రివ్యూ!


దర్శకత్వం : అమర్ కౌషిక్
తారాగణం : వరుణ్ ధావన్, కృతీ సానన్, దీపక్ దోబ్రియాల్, పాలిన్ కబాక్, అభిషేక్ బెనర్జీ తదితరులు.
రచన : నీరేన్ భట్, సంగీతం: సచిన్ - జిగర్, ఛాయాగ్రహణం : జిష్ణూ భట్టాచార్య
నిర్మాణం : జియో స్టూడియోస్, దినేష్ విజన్ ,
పంపిణీ : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
విడుదల : నవంబర్ 25, 2022

***
            ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో యువతరంలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో హిట్లున్నాయి, ఎక్కువగా ఫ్లాప్స్ వున్నాయి. ఈ సంవత్సరమే నటించిన జుగ్ జుగ్ జియో కుటుంబ వినోదం హిట్టయ్యింది. దీని తర్వాత ఇప్పుడు రూటు మార్చి ఫాంటసీ థ్రిల్లర్ భేడియా లో నటించాడు. ఇది పానిండియా మార్కెట్ లో విడుదలైంది. తెలుగులో తోడేలు గా డబ్ చేసి విడుదల చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. స్త్రీ’, ‘బాలా అనే రెండు విభిన్న సినిమాలు తీసి హిట్లు సాధించిన అమర్ కౌషిక్ దీని దర్శకుడు. ఇప్పుడు ఈ మూడో సినిమా కూడా విభిన్నమే. ఇందులో వరుణ్ సరసన హీరోయిన్ గా కృతీ సానన్ నటించింది. ఏమిటీ తోడేలు ఫాంటసీ? హార్రర్ కామెడీగా తీసిన ఈ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పిస్తుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో వుండే భాస్కర్ అలియాస్ భాస్కీ (వరుణ్ ధావన్), బగ్గా (సౌరభ్ శుక్లా) అనే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తూంటాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో అనే అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే పని మీద భాస్కీ కజిన్ జనార్థన్ (అభిషేక్ బెనర్జీ) తో కలిసి జీరోకి చేరుకుంటాడు. స్థానికుడైన జోమిన్ (పాలిన్ కబాక్) అక్కడ కలుస్తాడు. ఈ ముగ్గురితో పాండా (దీపక్ డోబ్రియాల్) కలుస్తాడు. అయితే గిరిజనులు తమ భూమిని వదులుకోవడానికి, చెట్లని నరికి వేయడానికీ ఒప్పుకోక పోవడంతో భాస్కీ కేం చేయాలో తోచదు. ఎలాగైనా రోడ్డు వేయాలన్న పట్టుదలతో వుంటాడు. గిరిజనులతో కొట్లాటకి దిగుతాడు. ఇంతలో అడవిలో తోడేలు అతడి మీద దాడి చేసి కరుస్తుంది. జనార్దన్, జోమిన్ కలిసి అతడ్ని పశువైద్యురాలు అనికా (కృతీ సానన్) దగ్గరికి తీసికెళ్తారు. ఆమె వైద్యంతో నయం కాదు. విషమించి భాస్కీ తోడేలుగా మారిపోతాడు. రాత్రి పూట తోడేలుగా మారుతాడు, పగటి పూట మనిషిలా వుంటాడు.

        ఏమిటీ పరిస్థితి? అడవి జోలికొచ్చినందుకు తోడేలు పగబట్టి ఇలా చేసిందా? అసలు కరిచింది నిజంగా తోడేలేనా? ఇప్పుడేం చేయాలి? తిరిగి మామూలు మనిషిగా ఎలా మారాలి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

హాలీవుడ్ లో వేర్వుల్ఫ్ సినిమాలని రెగ్యులర్ గా వస్తుంటాయి. మనిషి తోడేలుగా మారే ఈ సినిమాలు హార్రర్ సబ్ జానర్ లోకి వస్తాయి. ఈ కథలు గ్రీకు పురాణాల్లోంచి వచ్చాయి. ఆ పురాణాల ప్రకారం, లైకాన్ అనే వ్యక్తి ఆకాశానికి దేవుడైన జ్యూస్‌ కి మానవ మాంసంతో చేసిన భోజనాన్ని అందించినప్పుడు జ్యూస్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దానికి శిక్షగా, కోపోద్రిక్తుడైన జ్యూస్ లైకాన్‌ ని తోడేలుగా మార్చేశాడు. అలా తోడేలు మనిషిగా లైకాన్ నరకాన్ని అనుభవించాడు. ఇలా యూరోపియన్ జానపద కథల్లో రాత్రిపూట తోడేలుగా మారి జంతువుల్ని, మనుషుల్నీ, శవాల్నీ మింగేసి, పగటిపూట మానవ రూపంలోకి తిరిగి వచ్చే మనిషికి వేర్వుల్ఫ్ అని పేరు పెట్టి కథల్ని సృష్టించారు. ఈ గ్రీకు నేపథ్యంలోంచి లోంచి వచ్చిందే తోడేలు కథ.

        ఈ హార్రర్ కథని కామెడీగా చూపించాడు దర్శకుడు. ఈ హార్రర్ కామెడీకి పర్యా వరణ సమస్య సందేశం జోడించాడు. ఈ మధ్య ఆవాస వ్యూహం అని మలయాళంలో వచ్చింది పర్యావరణ సమస్యతో. అందులో కప్ప మనిషిని చూపించారు. పర్యావరణానికి హాని చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుందనే కథ తోడేలు లో కూడా వుంది.

        అయితే పర్యావరణ సమస్యకి తోడేలు రియాక్ట్ అవడంతో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమవుతుంది. దీన్ని కామెడీ చేయడంతో సీరియస్ నెస్ పోయి విషయం దెబ్బతింది. తోడేలుగా మారిన హీరో మనుషుల మీద కామెడీగా దాడులు చేయడం, మనుషులూ కామెడీగా చావడం విషయాన్ని పక్కదోవ పట్టించేదిగా, కేవలం హార్రర్ కామెడీని ఎంజాయ్ చేయాలన్నట్టుగా తయారైంది. తోడేలుతో హార్రర్ కామెడీయే చేయాల్సి వుంటే మధ్యలో పర్యావరణ సమస్యని లాగాల్సిన అవసరం లేదు. గిరిజనుల సమస్య కామెడీ కాదు.

        ఫస్టాఫ్ ఏదోలే కామెడీ చేశాడని సరిపెట్టుకున్నా సెకండాఫ్ లోనూ అదే వరస. క్లయిమాక్స్ ఒకటే ఆసక్తిని పెంచుతుంది. కథలో చాలా అవసరమైన ఎమోషన్సే లేవు. ఎమోషన్స్, స్ట్రగుల్, బాధ, ఆక్రోశం వుంటే తోడేలు రూపంలోంచి బయటపడాలనుకునే హీరోతోనే వున్నాయి. ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే, తోడేలుగా మనుషుల్ని కామెడీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడుగా- ఇంకేంటి బాధ?

నటనలు- సాంకేతికాలు

వరుణ్ ధావన్ హృదయాన్ని, ఆత్మనీ విప్పి పాత్రలో పోశాడని చెప్ప వచ్చు. మనిషిగా మామూలుగా వున్నప్పుడు, పదేపదే తోడేలుగా మారుతున్నప్పుడూ. తోడేలుగా మారేక అన్నీ కామెడీలే. కానీ తోడేలుగా మారేప్పుడు శరీరంలో జరిగే మార్పులకి అనుభవించే నరకాన్ని ఉద్విగ్నంగా ప్రదర్శించాడు. ఇంతవరకు తన గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ఏవైనా ఊపిరిబిగబట్టి చూసే సన్నివేశాలుంటే ఇవే.

        పశువుల డాక్టర్ గా కృతీసానన్ ది మామూలు పాత్ర. హీరోని ప్రేమించడం, వాదన పెట్టుకోవడం మామూలే. అయితే ఈ పాత్రకో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. దీంతో అసలు తోడేలుకథకి మూలాలు 1941 వేర్వుల్ఫ్ మూవీ ది వేర్వుల్ఫ్ మాన్లో వున్నాయని తెలిసిపోతుంది. ఇలా మామూలుగా కన్పించే కృతీసానన్ పాత్రతో అనూహ్యంగా ట్విస్టు రావడం క్లయిమాక్స్ కి బలాన్నిచ్చే ఎలిమెంట్.  ఇక హీరో ఫ్రెండ్ గా అభిషేక్ బెనర్జీ మంచి కమెడియన్. ఇతర నటులు సౌరభ్ శుక్లా సహా ఫర్వాలేదనిపించుకుంటారు –ఆ పాత్రల్లో అంతే నటించగలరు.

        సచిన్-జిగర్ ల  సంగీతం యావరేజ్‌గా వుంది. జిష్ణూ ట్టాచార్జీ ఛాయాగ్రహణం మాత్రం అద్భుతంగా వుంది. మునుపెన్నడూ చూడని లొకేషన్స్ ని అరుణాచల్ అందాలతో చూపెట్టాడు. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్ గా వుంది. సౌండ్ డిజైన్ బావుంది. కాస్ట్యూమ్స్ ఆకర్షణీయంగా వున్నా వాస్తవికంగా వున్నాయి.

        ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్. హీరో తోడేలుగా మార్పు చెందేటప్పటి దృశ్యాల గ్రాఫిక్స్ బలంగా వున్నాయి. సాంకేతికంగా రాజీ పడని ధోరణి కన్పిస్తోంది గానీ, విషయపరంగానే రంజింప జేసే ధోరణి కనిపించడం లేదు.
—సికిందర్