రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, August 21, 2015

నాటి సినిమా



ప్పుడు 2008 వ సంవత్సరం..
          పగబట్టి ఒకటే కుండపోతగా వర్షం.. ఆ కుండపోతని లెక్క చెయ్యకుండా అభిమానుల ఒకటే పరుగులు..ప్రముఖుల బారులు..అందరివీ విషణ్ణ వదనాలే. ..తీరని యమ శోకమే అందరి కళ్ళల్లో..కుండపోతకంటే కంటిపోత శివాలు!
         
ఇంకా అప్పుడు 1969 వ సంవత్సరం..
          తట్టుకోలేనంత  విషాదం..కొంగు నోట్లో కుక్కుకుని ఆడవాళ్ళ ఒకటే ఏడ్పులు.. కన్నీళ్ళతో తడిసి ముద్ద ముద్దయి అలాగే ఇళ్ళకి పరుగులు..మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి అవే ఏడ్పులు మళ్ళీ మళ్ళీ.. అవే కన్నీటి జలపాతాలు జడివానలా!

        ఎక్కడ శోభన్ బాబుతో కలిసి విషాదముంటుందో అక్కడ జనసముద్రం పెల్లుబుకుతుంది. శోభన్ బాబుతో విషాదం, అయస్కాంతమూ ఒకటే. జనం ఇనుప రజను.

          పై 2008 నాటి దృశ్యం ఆయన అంతిమ యాత్రా ఘట్టాన్ని ఆవిష్కరిస్తే, 1969 నాటి దృశ్యం ఆయన తొలి  సిల్వర్ జూబ్లీ ‘మనుషులు మారాలి’ చరిత్రకి సాక్ష్యం పలుకుతుంది.

          సత్యజిత్ రే శాంతి నికేతన్ వదిలేసి వెళ్ళిపోయారు. బయటి ప్రపంచంలో కొత్త కొత్త సంగతులు కుతూహలం రేపుతోంటే, పాశ్చాత్య సంగీత బాణీలు రారమ్మని పిలుస్తూంటే, ఇంకా ఆ రవీంద్రుడి శాంతి నికేతన్లో  బొమ్మలేసుకుంటూ కూర్చోవడం వ్యర్ధమనిపించి, సరాసరి సినిమా ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నారు.

          శోభన్ బాబు శాంతి నికేతన్ కే తిరిగి వచ్చారు - తన సొంత శాంతి నికేతన్ కి. వయసు మీరాక సినిమాలేమిటని అన్పించి, ప్రాపంచిక రణగొణ ధ్వనులకి సుదూరంగా తనదైన శాంతి నికేతన్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ విశ్రమించారు. కళాకారులు ఎప్పుడు ఎక్కడ ప్రశాంతతని కనుగొంటారో తెలీదు. ఒకరు నిష్క్రమించిన లాంటి వాతావరణం లోకే మరొకరు ప్రవేశిస్తారు. ఇది కాదు పాయింటు- పన్నెండేళ్ళూ ఎవరికీ కన్పించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన శోభన్, ఎక్కడో చెన్నైలో కన్నుమూస్తే, ఇక్కడ తెలుగు గడ్డ మీంచి తండోప తండాలుగా అభిమాన జనం ఇంకా తమ అందాల నటుణ్ణి గుర్తుపెట్టుకుని, గుండెలు బాదుకుంటూ ఆయన అంతిమయాత్రలో కలిసిసాగడం!  ఆ వర్ష బీభత్సంలో శోభన్ మహాప్రస్థానాన్నికనీవినీ ఎరుగని సంఘటన చెయ్యడం!


          2008- 1969 రెండూ అంతటి చరిత్రలే శోభన్ కి. శోభన్ తో విషాదం హిట్టవుతుందని మొట్టమొదటిసారిగా తెలిసింది ‘మనుషులు మారాలి’ తోనే. అంతటి  విషాదాన్ని సత్యజిత్ రే సైతం తీసి వుండరు. అభినేత్రి శారదతో కలిసి విషాదాన్ని పరాకాష్ఠకి చేర్చిన శోభన్ కిది మరో సంసార గొడవల సినిమా కాదు. సామాజిక రుగ్మతల సారాంశం. ఇవాళ్టికీ దీన్ని సీడీ వేసుకు చూడండి- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఆత్మహత్యలు ఎంత మతిమాలినవో తెలుస్తుంది.

           ఈ క్లాసిక్ చాలా కామన్ సెన్సు శ్రమైక జీవన సౌందర్యం గురించి చెప్తుంది. శోభన్- శారదల పాత్రలిందులో నేటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల లాంటి పాత్రలే. కాకపోతే ఆ రోజుల్లో పారిశ్రామిక వేత్తల పాలిట వరంగా యంత్రాలొచ్చేసి శోభన్- శారద పాత్రల జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసింది - ఇవాళ్ళ ఆర్ధిక మాంద్యమనే పెను భూతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పాలిట బెడదగా మారినట్టు.

          1957 లోనే ఇలాటి కథతో బీ ఆర్ చోప్రా హిందీలో నయా దౌర్ (కొత్త యుగం) తీశారు. దిలీప్ కుమార్ -వైజయంతీ మాలా ప్రధాన పాత్రలు. పనిచేస్తున్న రంపం మిల్లులో కొత్తగా యంత్రం తెచ్చి బిగించడంతో, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు తిరగబడతారు ( హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ రోడ్లు ఊడ్చే స్వీపింగ్ యంత్రాలు ప్రవేశపెట్టినప్పుడు స్వీపర్లు చీపురు కట్టలతో పటపట కొట్టి వాటిని అడ్డుకున్నట్టు)  ‘మనుషులు మారాలి’ లో షుగర్ ఫ్యాక్టరీని కొత్త యంత్రాలతో ఆధునీకీకరీంచడంతో టోకున కార్మికులు రోడ్డున పడతారు. అంతమాత్రాన ఆత్మ హత్యలే శరణ్య మనుకోవాలని లేదు.  ప్రత్యాన్మాయ ఉపాధి మార్గాలని వెతుక్కోవచ్చు. దీనికి సహకరించాల్సిన బాధ్యత మళ్ళీ సమాజం మీదే వుంటుంది. ఇదే ‘మనుషులు మారాలి’ లో చెప్పదల్చుకున్నది. అలాగని  యంత్రంతో మనిషి పోరాటం గురించి ఈ సినిమా కాదు. యంత్రాల కారణంగా ఉపాధిని కోల్పోయిన ఆకలి బాధల గురించి అంతకన్నా కాదు. ఇలాటి అగ్నిపరీక్షలకి అలమటిస్తూ వచ్చి బంతిని సాటి మనుషుల కోర్టులో పడేస్తే, అప్పుడా సాటి మనుషులు ఏం చేశారనే దాని గురించే.

          ఈ పరిస్థితి సృష్టికర్త కన్నింగ్ పారిశ్రామికవేత్త పాత్ర వేసిన నాగభూషణమే. తన షుగర్ ఫ్యాక్టరీలో భాగస్వామిగా వున్న గుమ్మడిని నిండా ముంచి, ఆయన చావుకి కారకుడవుతారు మొదట. దీంతో వీధిన పడ్డ గుమ్మడి ఏకైక కుమార్తె శారద, కార్మికుడైన శోభన్ ని వివాహం చేసుకుని అలా స్థిమిత పడ్డారో లేదో, నాగభూషణం తన ఫ్యాక్టరీలోకి  కొత్త కొత్త యంత్రాలు దింపుతారు. దింపడమే గాక శోభన్ బాబు సహా రెండు వందల మంది కార్మికులని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. వీళ్ళందరికీ శోభన్ నాయకత్వం వహించి సమ్మెకి దిగుతారు. ఆ తదనంతర పరిణామాల్లో గూండాల చేతలో హత్యకి గురవుతారు.

       దీంతో మళ్ళీ వీధిన పడ్డ శారద, ఇప్పుడు తన ముగ్గురు పిల్లలతో నానా కష్టాలూ పడతారు. అయినా నిరాశచెందక- పిల్లల్ని పోషించుకోవాలి, మీ పిల్లలకి ట్యూషన్లు చెప్పుకునే అవకాశ మివ్వండంటే, ఆమె మాసికల చీరని చూసి హేళన చేస్తారు. పోనీ కూలీ పని ఇప్పించమని ఇంకో దగ్గర అడిగితే, చదువు కున్నదానివి మా నెత్తికే ఎక్కుతావు పొమ్మంటారు. ఇలా ఎక్కడా ఆదాయం పుట్టదు. ఆఖరికి ఇహ ఉంటున్న పూరి పాకనే అమ్మేద్దామంటే, బంధు వొకడు వచ్చి రంకు అంటగడతాడు. ఇలావుంటే, అటు ఆకలికి నకనకలాడుతున్న పిల్లలు, అమ్మని వదిలేసి బయట ఆహార పదార్ధాలని దొంగిలించి తింటూంటారు. ఇంట్లో వస్తువులు కూడా అమ్మేసుకోబోయి పోలీసులకి పట్టుబడతారు. చిట్టచివరికి పిల్లలు ముష్టెత్తు కోవడం చూసి చలించిపోతారు శారద. ఇహ లాభంలేదు, కనాకష్టమైపోయిన ఈ జీవితంతో అవిసిపోయాయి ప్రాణాలు- బక్క చిక్కి, బొగ్గులా నల్లబడి- దెయ్యంలా తయారయ్యింది తను. పిల్లలు పుచ్చిపోయారు. ఇవాళ్ళ ఇలా తయారైన వీళ్ళు- రేపింకేం చేస్తారో. లేదు- ఇంకోలా వీళ్ళు తయారవడానికి వీల్లేదు. అలా తయారవకూడదంటే...

          ‘యువరానర్..ముగ్గురు పిల్లల్ని చంపుకున్న హత్యానేరం రుజువయ్యింది గనుక ఈ ముద్దాయికి...’  చెప్పలేక పోతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాంచనకి, బోనులో నిలబడ్డ స్నేహితురాల్ని చూస్తూంటే  కడుపు తరుక్కుపోయే బాధ. మరణ శిక్ష విధించమని తనే వేడుకుంటున్నారు శారద. పిల్లలకి విషమిచ్చి తనూ మింగింది కానీ, ఇంకా ప్రాణాలతో తను మిగిలిందిలా.. ఈ పాపానికి ఈమెని నెట్టిందెవరు? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళని వదిలేసి ఈమెకేమిటీ శిక్ష?.. అని కాంచన వాదన. న్యాయమూర్తి తీర్పు వాయిదా వేసి వెళ్ళిపోతాడు. ఈమెని శిక్షించి చట్టం తానూ పాపం మూట గట్టుకోకూడదనేమో. ఈమెని ఈ స్థితికి తీసుకొచ్చిన పాపుల సరసన చట్టం తానూ చేరకూడదనేమో.  కానీ ఈ చట్టాలకీ, సాటిమనుషుల నిర్వాకాలకీ, సర్వ భ్రష్టత్వాలకీ అతీతంగా ఒకే ఒక్కటుంది-  అది ఆ భర్త పిలుపు. దానికి మించింది లేదు. దాని ముందు ఈ లోకమెంత! లాలించని లోకులెంత! నమస్కారం పెట్టి, పైలోకాల్లోంచి పిలుస్తున్న ఆ శోభన్ దగ్గరికి వెళ్ళిపోతారు తనే శారద.

         మనుషుల్లో పరోపకార గుణం పెరిగితే ఇలాటి అఘాయిత్యాలు ఆగుతాయి. ఈ చరాచరా సృష్టిని ఎవరివో ఆక్రందనలు వినడానికి ఉద్దేశించలేదు సృష్టికర్త- ఆక్రందన కేవలం సొసైటీ మిస్ మేనేజ్ మెంట్ ఫలితమే!

          సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ఇది. అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాక, కాస్త నాటకీయత, చలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, ‘తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో’ , ‘ పాపాయి నవ్వాలి పండగే రావాలీ’ ..లాంటి స్వీట్ సాంగ్స్ తో, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ( ఈ దేశంలో నాయకులు ఉపన్యాసాలు, ప్రజలు ఉపవాసాలు పంచేసుకున్నారు),  ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించి, అన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఖంగు మనే ఘంటసాల గొంతుతో ‘ చీకటిలో కారు చీకటిలో ‘ పాట ఒకటి మార్మోగిన చరిత్ర ఉండనే వుంది. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ కి సైతం ఈ సినిమా ఘన విజయంలో సింహ భాగముంది.

          దీని మాతృక మలయాళమే అయినా, పూర్తిగా తెలుగు స్థానికత అలరారింది విఖ్యాత వి. మధుసూదన రావు దర్శకత్వంలో. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారాయన. దీన్ని నిర్మించిన ఇదే జెమినీ సంస్థ, మధుసూదన రావుతోనే తెలుగు తర్వాత హిందీ లో ‘సమాజ్ కో బదల్ డాలో’ అని రీమేక్ చేస్తే, అదీ సంచలన విజయమే ఉత్తర భారతాన.

          సృజనాత్మకత విషయానికొస్తే, ఒక విశిష్ట శిల్పం ఈ స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదు, అవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద, ఆ తర్వాత శోభన్, ఇంకా తర్వాత తిరిగి శారద, ఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా, ఏ అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది ఈ విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు ఆ కాలంలోనే వున్నారు.

     అయితే శారద పాత్ర తన మొదటి ట్రాకులో, అర్జెంటుగా ఎవరో ఒకరి ఆశ్రయం పొందాలన్న బేలతనంతో ప్రవర్తించడమే అసహజంగా తోస్తుంది. ఆ క్లిష్ట సమయంలో ఆమె ప్రదర్శించే బేలతనం కన్నా-  కాంచన పాత్ర మనోబలం, వ్యక్తిత్వం ఆకర్షణీయంగా వుంటాయి. పెళ్లి కాకుండా మిగిలిపోయిన తను -‘ నేను పెద్ద ప్లీడర్ని, నన్ను పెళ్లి చేసుకోవాలని సామాన్యులకి అన్పించదు. తోటి వాళ్లకి నా ఉద్యోగం, హోదా తప్ప నేను స్త్రీగా కన్పించను. నాకు కూడా స్త్రీ సహజమైన కోరికలుంటాయని ఈ లోకమే కాదు, నా కన్న తండ్రి కూడా మర్చిపోయాడు..’  అని ఒక్కసారే వెళ్ళ బోసుకుంటారు కాంచన. కానీ అంత ఆప్తమిత్రురాలైన శారదకి, తను తలచుకుంటే మంచి ఉద్యోగమే ఇప్పించగలరు. ఆ పని చేయకుండా, చిన్న చిన్న అవసరాలు తీర్చడానికి వచ్చి తిరస్కారం పొందుతూ వుంటారు.

           ‘ఉగ్గు పెట్టడానికి ఆముదమే లేనప్పుడు బంగారు ఉగ్గు గిన్నెందుకు చెప్పు?’  అన్నది శారద పాయింటు. తిండికి లేని స్థితిలో కూడా శారద పాత్ర సామాజిక దృక్పథం ఎలాంటిదంటే- ‘ఈ కూలి పేటలో ఎక్కడా పొయ్యి రాజెయ్య లేదు, పొగ లేవలేదు, ఇప్పుడు మా ఇంట్లో మాత్రం, పొయ్యి రాజేస్తే, చూసే వాళ్లకి ఎలా వుంటుంది? తోటి వాళ్ళ కడుపులు మాడుతోంటే మా కడుపులు నింపుకోవడం బావుంటుందా?’ అని కాంచన ఇవ్వబోయిన రూపాయల్ని తిరస్కరిస్తారు.

వి. మధుసూదన రావు 

          సెకండాఫ్ లో, చనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటే, కథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని, ఆ రెపరెపలాడే కథ అనే పతాకాన్ని, రెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోబన్ నించి ఆ పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతంసమ్మె చేస్తారు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తారు, ప్రభుత్వమే తిరిగి ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే, నిస్సహాయుడై పోతారు. లంచం ఎరజూపితే తిప్పికొడతారు. ఓ రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతారు.

          ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివే, వాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు, యుధిష్టరుడు, ధృతరాష్ట్రుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసే, వాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చి, పెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని - ఆర్ధిక నిపుణుడు, కాలమిస్టు గురుచరణ్ దాస్ తాజాగా ఆర్టికల్ రాశారు. ఈ సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతే, రావికొండలరావు యుధిష్టరుడు, హరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ఈ ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- ఏ నాటికైనా ఈ సినిమా ఓ హెచ్చరిక, కనువిప్పు.



సికిందర్ 
(సెప్టెంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)