రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, అక్టోబర్ 2022, ఆదివారం

1228 : స్పెషల్ రివ్యూ!


    నెట్ ఫ్లిక్స్ నిర్మించిన అథెనా ఫ్రెంచి మూవీ (సెప్టెంబర్ 2022 విడుదల) ఓటీటీలో వైరల్ అయింది. అంతర్జాతీయ దృష్టినాకర్షిస్తూ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచి దర్శకుడు రోమైన్ గ్రావాస్ ఆశ్చర్యపర్చే సినిమా నిర్మాణం గావించాడు. మొదటి క్షణం నుంచీ ముగింపు వరకూ దృష్టి తిప్పుకోలేని భావోద్వేగాలతో పరుగులు తీసే రెబెల్- యాక్షన్ సామాజిక థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుంచాడు. ఫ్రాన్సులో జాత్యాహంకారం, అసమానతలు, పోలీసు హింస, ప్రజల తిరుగుబాటు మొదలైన అంశాలు జోడించి -ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగే, జరుగుతున్న చరిత్రగా తెరకెక్కించాడు.

        రెండేళ్ళ క్రితం అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి గొంతు మీద తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి బహిరంగంగా ప్రాణాలు తీసిన పోలీసు ఉదంతం ఎలాటి ప్రజాగ్రహానికి దారితీసిందో తెలిసిందే. అలాటి జాత్యాహంకార హత్యని, దాని పరిణామాల్నీ ఘాటుగా చిత్రించాడు దర్శకుడు రోమైన్.

అది ప్యారిస్ శివారు అథెనా అనే ఏరియాలో నివసించే అల్జీరియన్ ప్రవాసుల కుటుంబం. తల్లి, నల్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆర్మీలో పనిచేసే అబ్దుల్ చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తి. రెండో కొడుకు కరీం నిరుద్యోగి. వ్యవస్థని పడగొట్టి సమూలంగా రాడికల్ గా పునర్నిర్మిస్తే తప్ప అందరికీ న్యాయం జరగదని నమ్మే తీవ్రవాద భావాలున్న యువకుడు. మూడో కొడుకు ముక్తార్ అవకాశవాది, డ్రగ్ స్మగ్లర్. నాల్గో కొడుకు పదమూడేళ్ళ ఇదిర్.

ఇదిర్ ని ఇద్దరు పోలీసులు బలిగొంటారు. ఆ వీడియో వైరల్ అయి ప్రజలు తిరగబడతారు.  పోలీసు అధికారులు న్యాయం చేస్తారని శాంతపర్చే ప్రయత్నం చేస్తాడు అబ్దుల్. తమ్ముడి మరణానికి అసలే ఉడికిపోతున్న కరీం అన్న మాటలు నమ్మకుండా రెచ్చిపోయి బాంబు పేలుస్తాడు. అంతే, ఇక విధ్వంసం మొదలైపోతుంది. కరీంతో కలిసి ప్రజలు వూరు మీద పడి భారీ యెత్తున దాడులకి పాల్పడతారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కరీం నాయకత్వంలో పోలీసుల మీద యుద్ధంగా మారిపోతుంది. అదే సమయంలో అబ్దుల్- కరీంలు ఒకరికొకరు బద్ధ శత్రువులైపోతారు. కరీం నాపడానికి అబ్దుల్ చావుకి కూడా సిద్ధపడతాడు. డ్రగ్ స్మగ్లర్ ముక్తార్ ఇదే అవకాశామని ప్రజల్ని పోలీసుల మీద హింసకి రెచ్చగొడతాడు.

కాల్పులు, పేలుళ్ళు, అరుపులు, చావుకేకలు...అగ్నిగోళంలా మారిపోతుంది అథెనా. పోలీసుల వల్ల కాదు. ఇక సైన్యం దిగేసరికి పతాకస్థాయికి చేరుకుంటుంది పోరాటం. తమ్ముడ్ని చంపిన ఇద్దరు పోలీసుల్ని కిడ్నాప్ చేయాలన్నదే కరీం ప్లాన్. అయితే ఒక పోలీసు అధికారి దొరికిపోతాడు...

ఫ్రాన్సులో వలసదారులు, అట్టడుగు వర్గాలు తమ కోసం పనిచేయని అధికార వ్యవస్థల్ని ఎలా చూస్తారో కరకుగా, హెచ్చరికలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రోజంతా జరిగే సంఘటనలతో, రోడ్ల మీదే పరుగులు దీస్తూంటుంది కథ. విధ్వంసాలతో అట్టుడుకుతూంటాయి దృశ్యాలు. ఆద్యంతం యాక్షనే ఈ కథ. ఈ కథకి ఫస్ట్ యాక్ట్ వుండదు. కథ, పాత్రల పరిచయం, వాటి జీవితం, సమస్యకి దారి తీసే పరిస్థితులు, సమస్య ఏర్పాటు- అనే ఫస్ట్ యాక్ట్ కథాంగాలు వుండవు. నేరుగా సెకెండ్ యాక్ట్ తో ప్రారంభమైపోతుంది కథ.

అంటే సమస్యతో పోరాటంతో ప్రారంభమై పోతుంది కథ. తమ్ముడి మరణానికి పోలీసు అధికారులు  తప్పక న్యాయం చేస్తారని ప్రజలకి అబ్దుల్ చెప్తూ వుండే దృశ్యంతో సెకెండ్ యాక్టే కథా ప్రారంభంగా వుంటుంది. ఇది ప్రయోగాత్మకమే అనుకోవాలి. రొటీన్, రెగ్యులర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి భిన్నంగా, రాడికల్ గా. తమ్ముడెవరు, ఎలా చనిపోయాడు వివరాలు ఈ దృశ్యంలోనే సంభాషణల్లోనే వెల్లడవుతాయి తప్ప, ఇది తెలియజేయాడానికి పనిగట్టుకుని ఫస్ట్ యాక్ట్ కథనం చేయలేదు.

అలాగే అన్నదమ్ముల పాత్రల పరిచయాలు పరుగులు దీస్తున్న సెకెండ్ యాక్ట్ యాక్షన్ తో పాటే జరిగిపోతాయి. సెకెండ్ యాక్ట్ తో ప్రారంభమైపోయే కథలో ఎక్కడా ఫ్లాష్ బ్యాక్స్ కూడా వుండవు. ఒకచోట తమ్ముడ్ని అబ్దుల్ ఖననం చేసే దృశ్యంతో మాంటేజ్ తప్ప. కథ వెనక్కి వెళ్ళదు. కదనం రంగం నుంచి పక్కకి కూడా వెళ్ళదు. వేరే కార్యాలయాల్లో పోలీసు అధికారుల చర్చలు, ఆదేశాలు, నియంత్రణ వంటి కార్యకలాపాల  సీన్లు కూడా వుండవు. పోలీసులూ ఆందోళనకారులూ రోడ్లమీదే వుంటారు పోరాడుతూ. రణరంగంలోనే పోరాట వ్యూహాలు.

ఈ సెకెండ్ యాక్ట్ కరీం మరణంతో ముగుస్తుంది. పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన కరీం, అబ్దుల్ అభ్యర్ధనలకి విసిగిపోయి, రాజీపడలేక నిప్పంటించుకుని ఆత్మ హత్య చేసుకుంటాడు. దీంతో వ్యవస్థ పట్ల కనువిప్పయిన అబ్దుల్, కరీం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కిడ్నాప్ చేసిన పోలీసు అధికారితో క్లయిమాక్స్ (థర్డ్ యాక్ట్) మొదలెడతాడు. అయితే అతను దాక్కున్న ఫ్లాట్ ని పేల్చేసి చంపేస్తారు పోలీసు అధికారులు.

నేరం చేసినా సరే, తమ సిబ్బందిని కాపాడుకునే మనస్తత్వంతోనే వుండే పోలీసు అధికారులు, అవతలివాడు సైనికుడైనా సరే, అంతం చేసి న్యాయం అందకుండా చేయగలరని  చెప్తున్న దర్శకుడు - ఆ సైనికుడు ముస్లిం కాకపోతే? -అన్న పరోక్ష ప్రశ్న కూడా వదులుతాడు.

ఒకే రోజు ముగ్గురు సోదరులు బలైపోయి, నాల్గవ వాడు డ్రగ్ స్మగ్లర్ ముక్తార్ మిగలడం కూడా సింబాలిజమే. నెట్ ఫ్లిక్స్ లో ఇది తెలుగు ఆడియోతో అందుబాటులో వుంది.  

—సికిందర్