రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, మే 2021, ఆదివారం

1040 :రివ్యూ


 రచన- దర్శకత్వం : జిస్ జాయ్

తారాగణం : కొంచాకో బొబన్, సిద్దిఖ్, అనార్కలీ నాజర్, వినయ్ ఫోర్ట్, ముఖేష్ తదితరులు
కథ:బాబీ- సంజయ్
, సంగీతం : విలియం ఫ్రాన్సిస్, పాటలు : ప్రిన్స్ జార్జి, ఛాయాగ్రహణం : బహుళ్ రమేష్
బ్యానర్ : మ్యాజిక్ ఫ్రేమ్స్
నిర్మాత : లిస్టిన్ స్టీఫెన్
విడుదల : మార్చి 19
, 2021, అమెజాన్ : మే 19, 2019
***

         ఫీల్ గుడ్ సినిమాల మలయాళ దర్శకుడు జిస్ జాయ్ తనకి మాత్రమే జాయ్ వుంచుకుని, ప్రేక్షకులకి నస పంచే పథకం పెట్టుకున్నట్టుంది. ఈ ఫీల్ గుడ్ నస లైటర్ వీన్ ప్రేమ సినిమాల పేరుతో గతంలో తెలుగులో అనుభవించిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి మలయాళ రూపం తొడిగి ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- ఫీల్ గుడ్- అంటూ రెచ్చగొడుతోంది. నస ఫీల్ గుడ్ ఎలా అవుతుందో అర్ధం గాదు. ఇండియన్ ఫీల్ గుడ్ సినిమా అంటేనే నస. సినిమా లక్షణాలని పీకి పారేసి, పిప్పిని విప్పి చూపించే నసోపాఖ్యానం. ఫీల్ గుడ్ అంటున్న దర్శకుణ్ణి హాలీవుడ్ లో నిర్బంధించి, ముందు బేసికల్ గా సినిమాని ఫీలయ్యేలా సానబట్టాలి- ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి లో కత్తికి సాన మీ కత్తికి సాన సాంగేసి. 

       ‘మోహన్ కుమార్ ఫ్యాన్స్ ఒక పరిపూర్ణ నస పురాణం. షార్ట్ ఫిలింకి సరిపోయే కథని రెండు గంటలు తీస్తూ పోతూ వుంటే, బడ్జెట్ దాటి నానేసిన నసే అవుతుంది. షార్ట్ ఫిలిం కథగా కూడా అర్ధముండాలి. కథకి ఐడియానే నెగెటివ్ గా వుంటే పాజిటివ్ ఫలితాలు కూడా రావు. గుర్తింపు రావడం వేరు, నన్ను గుర్తించండీ అని అడుక్కోవడం వేరు. అవార్డులనేవి వరించి వస్తాయి. వెంటపడి వేటాడితే వచ్చేవి అవార్డు లన్పించుకోవు. డబ్బిచ్చి చేయించుకున్న సన్మానాలవుతాయి. అవార్డు కోసమే నటించాను, నాకు అవార్డు రావాలని ప్రకటించుకుంటే చులకనై పోవడం తప్ప మరేం వుండదు. సినిమా హిట్టవ్వాలని ప్రేక్షకుల్ని అడుక్కుంటూ ప్రచారం చేసుకుంటే అర్ధముంది గానీ, అవార్డు అడుక్కోవడమేమిటి.

        కానీ ఈ పనే చేస్తాడు మోహన్ కుమార్ (సిద్ధీఖ్) అనే మాజీ హీరో. ముప్ఫై ఏళ్ళ క్రితం ఇతను మమ్ముట్టి, మోహన్ లాల్ ల రాకతో తెరమరుగయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అద్భుత పాత్ర నటించి వార్తల కెక్కాడు. ఈ నేపథ్యంలో ఉత్తమ నటుడి జాతీయ అవార్డు ఆశిస్తాడు. ఇందుకు ఆ సినిమా తీసిన నిర్మాత ప్రకాష్ (ముఖేష్), డ్రైవర్ కృష్ణన్ ఉన్ని (కొంచాకో బొబన్) ఇంకా మరికొందరు సిబ్బందీ, మోహన్ కుమార్ కూతురు శ్రీ రంజని (అనార్కలీ నాజర్ -  వీళ్ళే మోహన్ కుమార్ ఫ్యాన్స్) నడుం కడ్తారు. ఇక అవార్డు ఎలా వచ్చిందీ, రావడానికి వీళ్ళేం చేశారు, వచ్చాక ఏం జరిగిందీఈ మొత్తం రెండు గంటల సినిమాలో ఓ అరగంట కథ మాత్రమే.

***

        మోహన్ కుమార్ పాత్రలో ఆ పాత్రెలా వున్నా సిద్ధీఖ్ చాలా డీసెంట్ గా నటించాడు. ఈ సినిమా పేరు చెబితే తన నటనే మెదిలేలా ఫీల్ గుడ్ గా నటించాడు (ఈ సినిమాలో అన్ని పాత్రలూ ఫీల్ గుడ్ గా మనం ఫీలయ్యి తీరాలని కంకణం కట్టుకున్న పాత్రలే, నటనలే-  కథ ఓ కథలా లేకున్నా). అయితే సిద్దీఖ్ అవార్డు ఆశిస్తున్న సినిమాలో అసలెలా నటించాడో మనం చూసేందుకు సరైన అవకాశం కల్పించలేదు దర్శకుడు. ఆ నటించిన సినిమా థియేటర్లో వేసి చూపిస్తూంటే ఆ మినియేచర్ బొమ్మ స్పష్టంగా కనపడదు. అదేదో వైడ్ స్క్రీన్ మీద చూపిస్తే చూసి తెలుసుకునే వాళ్ళం.

        ఇక మోహన్ కుమార్ పాత్రలో సిద్ధీఖ్ చేసేదేమీ వుండదు. అవార్డు సంగతి ఇతర పాత్రలు చూసుకుంటాయి. తను అవార్డు కోసం ఎదురు చూస్తూ ఇంట్లో పాత వస్తువులతో ఆ రోజుల్ని నెమరేసుకోవడం, కాఫీ తాగడం, పార్టీలు చేసుకోవడం వంటివి మాత్రమే చేస్తూంటాడు. తను ముప్ఫై ఏళ్ళ తర్వాత గుర్తింపుకోసం నటించి అవార్డు కోరుకుంటున్నాడు. అదే సమయంలో కూతురు శ్రీ రంజని గాయనిగా ప్రయత్నిస్తోంది. అలాంటప్పుడు తను నటిస్తున్న సినిమాలో ఆమె చేత పాడించ వచ్చుగా. పాడించి వుంటే అవార్డు తనకి కాకుండా ఆమెకి వచ్చి - ఈ ట్విస్టుకి పుత్రికోత్సాహం కలిగేది కదా. ఒకసారి బాలీవుడ్ లో గాయకుడు కిషోర్ కుమార్ కి ఫిలిం ఫేర్ అవార్డు వస్తుందనుకున్నారు. కొడుకు అమిత్ కుమార్ కొచ్చింది!    
   
        అవార్డు ఆశిస్తున్న సిద్ధీఖ్ ఎవరో హేళన చేస్తూంటే కొడతాడు. ఇది వైరల్ అవుతుంది. తర్వాత అయ్యే తతంగాన్నిఫీల్ గుడ్ గా దాటవేశాడు దర్శకుడు. సత్యజిత్ రే తీసిన నాయక్ లో సినిమా నటుడుగా నటించిన ఉత్తమ్ కుమార్, ఒక పార్టీలో ఇలాగే ఎడాపెడా కొట్టి వార్తల కెక్కుతాడు. అయితే ఈ సంఘటన అవార్డు తనకి ప్రకటించాక, అది తీసుకోవడానికి ప్రయాణ మయే ముందు జరుగుతుంది. కాబట్టి అవార్డుకి ప్రమాదముండదు.

        సిద్దీఖ్ సీన్ వేరు. అవార్డుకి అప్లయి చేశాక కొట్టి సీన్ క్రియేట్ చేస్తాడు. ఈ స్టోరీ బీట్ ని దర్శకుడు డైల్యూట్ చేశాడు ఫీల్ గుడ్ పథకం కోసం. లేకపోతే, అలా కొడితే, అది వైరల్ అయి సమసిపోవడం కాదు, అతడి అవార్డుకి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ అయ్యేది. అవార్డు కమిటీకి ట్యాగ్ అయి అవార్డు గల్లంతయ్యేది. ఈ అనివార్య కథనాన్ని ఫీల్ గుడ్ కోసం దాటేశాడు దర్శకుడు. ఫీల్ గుడ్ అంటే కామన్ సెన్సు, లాజిక్ వదిలె య్యాలన్న మాట. 

        అసలింకో బుర్ర బద్దలు చేసుకున్నా అర్ధం గాని ఫీల్ గుడ్ సంగతేమిటంటే, క్రోనాలజీ... సినిమా విడుదలయింది, జాతీయ అవార్డుకి అప్లయి చేశారు, తర్వాత సినిమా శతదినోత్సవం కూడా అయ్యింది. ఇక అవార్డు నందుకునే శుభకార్యం కోసం ఎదురు చూపులు. ఈ సంవత్సరం ఇచ్చే అవార్డులకి ఈ సంవత్సరం ఎలా అప్లై చేసి ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం తీసిన సినిమాకి ఈ సంవత్సరమే జాతీయ అవార్డు వస్తుందా -ఇలా వుంది ఫీల్ గుడ్ కథ!

        కూతురు శ్రీరంజని పాత్రలో కొత్త నటిగా పరిచయమైన అనార్కలీ నాజర్ సింగర్ పాత్రలో ఒక ఆడిషన్ ఇచ్చాక ఇక  ప్రయత్నాలుండవు. వాణీ జయరామ్ ని సుమధురంగా ఆలపించిన ఆమెని మెచ్చుకుని వదిలేస్తాడు సంగీతదర్శకుడు. ఇక ఆ తర్వాత ఆమె కథలో ఏం చేయాలో తెలీక అన్నట్టు ఆందోళనగా కనిపిస్తూ, ఫాదర్ సెంటి మెంటుతో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడానికి సెటిలై పోతుంది. ఆ హీరో అయిన ఫాదర్ కి తన అవార్డే గానీ, ఈమె సింగింగ్ స్ట్రగుల్ అస్సలు పట్టదు.

***

       కారు డ్రైవర్ గా కొంచాకో బొబన్ ఇంకో ఫీల్ గుడ్ నమూనా. ఇతనసలు సిద్దీఖ్ నటించిన సినిమా కంపెనీ కారు డ్రైవర్. సిద్దీఖ్ తో వుంటాడు. ఇతడికి సింగర్ నవ్వాలని కోరిక. ఆడిషన్ లో జేసుదాస్ ని కమనీయంగా గానం చేసిన ఇతణ్ణి కూడా సంగీత దర్శకుడు మెచ్చుకుని వదిలేస్తాడు. ఇక ఇతను సిద్దీఖ్ తో ఫీల్ గుడ్ సన్నివేశాల్లో పాలు పంచుకోవడం కోసం నమ్మిన బంటుగా సెటిలై పోతాడు. ఇతనే కాదు, ఇంకో రైటర్ వుంటాడు. ఇతను కథలు వినిపిస్తూ ట్రయల్స్ లో వుంటాడు. ఇంకో యంగ్ స్టార్ వుంటాడు. ఇతడికి ప్రైవసీ లేకుండా సోషల్ మీడియాతో డిస్టర్బ్ చేసే సీన్లూ, వాళ్ళకి బుద్ధి చెప్పే ఇతడి మెసేజిలూ వుంటాయి. ఇంకో దర్శకుడు వుంటాడు. ఇతను సినిమా తీసే దృశ్యాలుంటాయి... శ్రీరంజనితో మొదలుకొని ఇవన్నీ సబ్ ఫ్లాట్స్. టచ్ చేసి అసంపూర్ణంగా వదిలేసిన సబ్ ఫ్లాట్స్. పిసరంత మోహన్ కుమార్ అసలు కథకి, ఈ సబ్ ఫ్లాట్స్ తో సినిమా భర్తీ.

        ఈ సబ్ ఫ్లాట్స్ ఆంతర్యమేమిటా అంటే, దర్శకుడు పూర్వం డబ్బింగ్ ఆర్టిస్టు, తర్వాత లిరిక్ రైటర్, ఆ తర్వాత దర్శకుడయ్యాడు. ఇందుకేనేమో ఈ సబ్ ఫ్లాట్స్ వేసి తన బయోపిక్ ని చూసుకునే ముచ్చట తీర్చుకున్నాడు ఫీల్ గుడ్ గా. ఇంతటితో వదల్లేదు, సినిమాలో దర్శకుడి పాత్ర తనే నటించాడు! ఇంకో ముచ్చట కూడా బలవంతంగా ఇరికించాడు - సింగర్ ప్రయత్నాలు చేసే కొంచాకో బొబన్ ఏడని సిద్ధీఖ్ నిర్మాతని అడుగుతాడు. డాన్స్ ప్రాక్టీసు చేస్తున్నాడని నిర్మాత చెప్తాడు. అతను డాన్సర్ కూడానా అని సిద్దీఖ్ న  అనేసరికి- జామ్మని పాట వచ్చేస్తుంది. కొంచాకో బొబన్ విరగదీసి డాన్స్ పాటేసుకుంటాడు (ఫోటో చూడండి)!  

***

    ఫీల్ గుడ్ కోసం కష్టాలు ఇట్టే తీరిపోతూంటాయి. అవార్డు కోరుకుంటున్న మోహన్ కుమార్ ఫ్యాన్స్ కి రేపే అప్లికేషను ఆఖరు తేదీ అని తెలీదు. దాంతో ఉరుకులు పరుగులు. ఇందులో ఆటంకాలు. ఆటంకం ఎదురైన ఘట్టంలోనే ఎవరో ఒక ఆపద్బాంధవుడు / బాంధవురాలు ప్రత్యక్షమై ఆదుకోవడం! జీవితం జీవించడం చాలా ఈజీ. ఎందుకంటే ఇలా డీఫాల్టుగా మనల్ని ఆదుకునేస్తూ వుంటారు సూపర్ మేన్లు. డోంట్ వర్రీ, లైఫ్ ఈజ్ ఇలాటి ఫీల్ గుడ్ మూవీ.

        ఫీల్ గుడ్ కోసం ఆరు పాటలు. సిద్దీఖ్ కి గుండె పోటు వచ్చినా కూడా పాటే. మొదటి గంట సినిమా సబ్ ఫ్లాట్స్ నిండిపోయి ఎటు పోతోందో అర్ధం గాదు. ఇంటర్వెల్ ముందు అవార్డుకి అప్లయి చేసే ఉరుకులు పరుగులతో కాసేపు అసలు కథ చూపించాడు. సెకండాఫ్ మళ్ళీ సబ్ ఫ్లాట్స్ వేసుకుని, అరగంట తర్వాతే మిగతా అసలు కథ చూపించాడు. గుండెపోటు ఎపిసోడ్. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, అవార్డుకి ఢిల్లీకి అప్లికేషన్ పంపినప్పుడు నిర్మాత అఫిడవిట్ మిస్సయిందిట. ఇక అప్లికేషన్ అడ్మిట్ అవదు. అందుకని గుండెపోటుతో హాస్పిటల్లో చేరిన తమ హీరో గార్ని నమ్మిస్తూ అవార్డు వచ్చినట్టు డ్రామా సృష్టిస్తారు. చాలా ఇల్లాజికల్ డ్రామా. ఇంతకంటే ఫీల్ బ్యాడ్ డ్రామా వుండదు.

        లైటర్ వీన్ ఫీల్ గుడ్ తెలుగు ప్రేమ సినిమాలు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో వుండేవి. కాసేపు బిగినింగ్, చివర్లో ఎండ్ విభాగంలో కథా దాని ముగింపూ తప్ప, మిడిల్ వుండేది కాదు. ఇదే ఇక్కడ చూడొచ్చు. గుండె పోటు ఎపిసోడ్ తో ఎండ్ విభాగం వచ్చేస్తుంది. ఇందులో అర్ధం పర్ధం లేని ట్విస్టులు. ఈ ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తూ పోతాడు. విషయం తేల్చడానికి ఒకటే నస పెడతాడు ఎండ్ లో కూడా. ఈ ఫీల్ గుడ్ నసతో కథ దాని కథా లక్షణాలు కోల్పోయి దిక్కులేనిదై పోయింది.

సికిందర్