రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 21, 2020

945 : గొప్ప సీను సంగతులు


 

         సీనుకి కూడా స్ట్రక్చ వుంటుంది. మొత్తం కథ స్క్రీన్ ప్లేకి బిగినింగ్, మిడిల్, ఎండ్ లెలా వుంటాయో, అలా కథ లోపల సీన్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో స్ట్రక్చర్ వుంటుంది. ఈ స్ట్రక్చర్ ని ‘జస్టిస్ చౌదరి’ లో ఎన్టీఆర్ - సత్యనారాయణలు నటించిన ఒక సీన్లో ఎలా వుందో చూద్దాం. సీను ఇలా ప్రారంభమవుతుంది...
        బిగినింగ్ విభాగం:
       
చౌదరి : ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? (1)
        పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ
  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) - (ప్లాట్ పాయింట్ వన్, బిగినింగ్ విభాగం సమాప్తం) 
         మిడిల్ విభాగం :
       
మళ్ళీ చౌదరి :
  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (ప్లాట్ పాయింట్ టూ, మిడిల్ విభాగం సమాప్తం)
      ఎండ్ విభాగం:
        చౌదరి : మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )

       ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్, తర్వాతి 4 సంభాషణలు మిడిల్, మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయం, నేపధ్య వాతావరణం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా

       
బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- పాపారావు న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

        ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీ, పాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై, 4 వ డైలాగుతో ముగిసింది. 

       
దీనికి మండిపోయి చౌదరి- గెటవుట్, ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయి, బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

        ఇప్పుడు మిడిల్ చూద్దాం- మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్లే కాబట్టి, ఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

       
దీనికి  7 వ డైలాగులో  పాపారావు - మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...  అనడం రియాక్షన్ చూపడం.  

       
దీనికి 8 వ డైలాగులో  చౌదరి - ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి  అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

       
దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం.