రచన – దర్శకత్వం : ఆర్జే బాలాజీ
***
‘సింగం 2’ తర్వాత సూర్యకి అతి
పెద్ద బాక్సాఫీసు హిట్ గా (పది రోజుల్లో 236 కోట్లు) ‘కరుప్పు’ వార్తల కెక్కుతోంది. ఇందులో తెలుగు డబ్బింగ్
‘వీరభద్రుడు’ వసూళ్ళు 23 కోట్లు. బడ్జెట్
170 కోట్లు అంటున్నారు. ఈ అంకెలు ఇక ప్రేక్షకులు తామే తిరగ రాస్తున్న సినిమా
బాక్సాఫీసు రూల్స్ కి అద్దం పడుతున్నాయా? ఇక స్టార్లు, స్టార్ సినిమాల మేకర్లు
కంటెంట్ గురించి తలబద్దలు కొట్టుకోకుండా, ఏదో నామమాత్రపు విషయంతో, క్వాలిటీ
గురించి ఆలోచించకుండా సినిమాల్ని చుట్టేస్తే సరిపోతుందా? అవుననే చెప్తున్నాయి
‘కరుప్పు’ కి ప్రేక్షకులిస్తున్న
బాక్సాఫీసు అంకెల్ని చూస్తూంటే. ఈ సినిమా ఇంటర్వెల్ లోపే కథ అయిపోయిందంటే, ఐతే మాకేంటి
అనొచ్చు. ఫస్టాఫ్ 40 నిమిషాలగ్గానీ సూర్య ఎంట్రీ ఇవ్వడు అంటే, ఐతే మాకేంటనే
అనొచ్చు. అసలు సూర్య సెకండాఫ్ లో ఆరు సీన్లలో మాత్రమే కనిపిస్తాడ్రా నాయనా అంటే కూడా, అయితే
మాకేంటి- మా కరుప్పు దేవుడ్ని మాకు చూపించాడు, కరుప్పు దేవుడుగా గా నటించాడు
అనొచ్చు. విలన్ గా నటించిన దర్శకుడు ఫెయిలయ్యాడ్రా నాయనా అన్నా కూడా, మాకు మా దేవుడ్ని చూపించాడు,
దేవుడుగా మా సూర్య నటించాడు అనొచ్చు. అసలు సూర్య చేసిందేమీ లేదు, విలన్ గా
దర్శకుడే తనకి సీన్లు ఎక్కువ పెట్టుకుని చేశాడు అంటే, మా దేవుడు మాకు ఒక్క సీనులో
కన్పించినా చాలు అనొచ్చు. అసలా దేవుడికి ఒక ప్రాంతంలో వున్న పవర్ ఇంకో ప్రాంతంలో
వుండదటరా బాబూ చూసుకోండి అంటే కూడా, అయితే
మాకేంటి, మా కరుప్పు దేవుడ్ని మాకు చూపించాడు
అంతే చాలు అనొచ్చు.
బంగారాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి పోగొట్టుకునే కన్నా, చెన్నైలోనే అమ్మేసి ఆ
డబ్బు బ్యాంకులో వేసుకుని రావచ్చుగా అంటే, పోగొట్టుకున్న బంగారాన్ని మా దేవుడు ఇప్పించాడుగా అనొచ్చు.
అప్పటికామె చచ్చిపోయిందిగా- లాజిక్
లేకుండా సినిమాని బీ గ్రేడ్ క్వాలిటీతో చుట్టేశాడ్రా చూసుకో అని ఫైనల్ గా చెప్పి
చూసినా- నువ్వనుకునే బాక్సాఫీసు రూల్సు పనికి రావు, మేం కొత్త బాక్సాఫీసు రూల్సు
రాస్తున్నాం, నచ్చితే వుంచుకో- లేకపోతే
సినిమాల్ని మర్చిపో అని జడ్జిమెంటు పాస్ చేయొచ్చు. దేవుడ్ని మధ్యకి
తీసుకొస్తే ఇంతేనేమో! నో కామన్ సెన్స్, ఓన్లీ ఎమోషన్స్...
ఇలా సముపార్జించుకున్న స్క్రీన్ ప్లే జ్ఞానంతో
కథల కూలంకష మూల్యాంకన చేపట్టారు. స్క్రిప్టులు చదవడానికి, విశ్లేషించడానికి, నిర్మాణాత్మకంగా
అభివృద్ధి చేయడానికీ క్రియేటివ్ టీమ్స్ ని నియమించుకున్నారు. ఈ టీమ్స్ లో రచయితల్ని
తీసుకోలేదు, స్క్రిప్ట్ డాక్టర్స్ నే తీసుకున్నారు. వీరితో స్క్రిప్టుల కూలంకష
విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికొచ్చేశారు. పేరున్న దర్శకుడు
వచ్చినా సరే,
ఇదే ప్రక్రియ.
కేవలం ఒక దర్శకుడు రెండు గంటలు కథ చెప్పినంత మాత్రాన వినేసిన నిర్మాత కోట్లాది
రూపాయలు గుమ్మరించడం అవివేకమని తెలుసుకున్నారు. స్క్రీన్ ప్లే వర్క్ షాపులకి
హాజరవుతూ వున్నాక,
నిర్మాత
క్రియేటివ్ గా కూడా ఇన్వాల్వ్ అవడం ఎంత
అవసరమో గుర్తించారు. ఏవీఎం లాంటి పెద్ద సంస్థల శైలిని తెలుసుకున్నారు. ఆ సంస్థల
అధినేతలు మొదట రచయితలతో కలిసి కూర్చుని కథ తయారు చేసుకుని, దాని ప్రకారం దర్శకుడు, హీరో, ఇతర తారాగణం వగైరా ఎవరైతే
బావుంటారో నిర్ణయించే వాళ్ళు.
ఇలా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత ఎస్ ఆర్ ప్రభు ఈ కొత్త పంథా ననుసరించే కార్తీతో ‘ఖైదీ’ తీసి సూపర్ హిట్ చేసుకున్నారు.
తర్వాత సుల్తాన్ ఓ2, వాట్టం, ఒకే ఒక జీవితం, ఫర్హానా, జపాన్ వంటి సినిమాలు తీసి,
తాజాగా ఇప్పుడు ‘కరుప్పు’ (వీరభద్రుడు) తీసి
ఆశ్చర్య పరచారు. ఆశ్చర్యం ఎందుకంటే, ఈ సినిమాలో తను ఒకప్పుడు స్క్రీన్ ప్లే కోర్సు చేసిన ఛాయలెక్కడా
కనిపించవు. కథని స్టార్ హీరో సూర్యకీ, దర్శకుడు బాలాజీ నిర్ణయానికే వదిలేసే పాత
పద్ధతిలోకే వచ్చేశారు. వచ్చేశాక, ఒక గజిబిజి గందరగోళ గాడిలోకి కథ పడిపోయింది...
ఆ బంగారాన్ని ఎలాగైనా తిరిగి పొందాలనే ఆత్రుతతో, మునిస్వామి లాయర్ బేబీ
కృష్ణ ఆర్జే బాలాజీ ని ఆశ్రయిస్తాడు. ఇతను నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్
మేజిస్ట్రేట్ కోర్టుని నియంత్రించే శక్తివంతమైన న్యాయవాది. ఇతను సహాయం చేయడానికి
బదులుగా, లంచగొండి మేజిస్ట్రేట్ తో కలిసి ఉద్దేశపూర్వకంగా కేసుని సాగదీస్తూ డబ్బు
లాగుతూంటాడు. ఈ అన్యాయాన్ని ఇంక భరించలేక, మునిస్వామి క్షేత్ర పాలకుడైన దైవం వీర భద్రుడి (కరుప్పు
స్వామి) ని కాపాడమని ప్రార్ధిస్తాడు. దీంతో లాయర్ రూపంలో వీరభద్ర (సూర్య)
ప్రత్యక్షమై మునిస్వామి కోర్టు కేసు చేపడతాడు...
3. కాన్సెప్ట్
ఏమిటి?
కోర్టుల్లో సామాన్యులకి న్యాయమందని
పరిస్థితులు, అవినీతి, వేల సంఖ్యలో పేరుకుపోయిన పెండింగ్ కేసులూ, ఫేక్ డిగ్రీలతో
కోర్టుల్లో రాజ్యమేలే లాయర్లూ మొదలైన అవలక్షణాలతో కోర్టుల పనితీరుని ప్రశ్నించే కథ
ఇది. దీనికి దేవుడి పాత్రతో పరిష్కారం. ఒక సోషియో ఫాంటసీగా తీర్చిదిద్దే ప్రయత్నం.
ఈ ఫాంటసీకి తమిళనాడులో ప్రసిద్ధ దైవం, ప్రజారక్షకుడు కరుప్పు స్వామి ఇమేజిని
వాడుకోవడం.
పురాణాల పరిశోధకుడు దేవదత్ పట్నాయక్ ప్రకారం,
12 వేల సంవత్సరాల క్రితం వేదపూర్వ కాలంలో సామాన్యులు విగ్రహాల ద్వారా కాకుండా, ముసుగులు ధరించిన
నృత్యకారుల ద్వారా దైవశక్తులతో అనుసంధానమయ్యేవారు. కరుప్పు స్వామి గొప్ప వీరుడు.
దండయాత్రల నుంచి భూమిని, స్థానిక పశువుల్ని రక్షించి కాపాడిన గిరిజన వీరుడు. ఆ రోజుల్లో చారిత్రాత్మకంగా, భూమిని కాపాడుతూ, సమాజాన్ని రక్షిస్తూ
మరణించిన వారిని తరచుగా ఖననం చేసేవారు. ఆ సమాధుల దగ్గర సాధారణంగా రాళ్ళని నిలబెట్టేవారు. దక్షిణ
భారతదేశం అంతటా కనిపించే వివిధ వీరశిలలు ఇవే.
కరుప్పు అంటే నలుపు. అతను నల్లటి ఛాయ, కండరాల శరీరం, దట్టమైన
మీసాలూ గల వీరుడిగా విగ్రహలుంటాయి. కుడి చేతిలో ప్రకాశించే కత్తి వుంటుంది. ఇది అపారమైన బలానికి, న్యాయానికీ ప్రతీక. అతను రంగురంగుల
పూలమాలలతో నిండుగా అలంకరించుకుని, తరచుగా తెల్ల
గుర్రం మీద గానీ,
నల్ల దున్నపోతు
మీద గానీ స్వారీ చేస్తూ కనిపిస్తాడు. తమిళులు అత్యంత భక్తితో పూజించే కరుప్పు
స్వామిని కావల్ దైవం (సంరక్షక దేవత) గా
పిలుస్తారు.
కరుప్పు స్వామికి ఇంత ఆకర్షణీయ విజువల్
నేపథ్యం, వ్యక్తిత్వం, వీరత్వం వున్నాయి. దీన్ని కుళ్ళిన న్యాయ వ్యవస్థ కథతో కలిపి యాక్షన్ ప్రధాన సోషియో ఫాంటసీగా రూపొందించే
ప్రయత్నం చేశారు.
మునిస్వామి పోలీస్ కంప్లేయిట్ ఇస్తాడు. పోలీసులు దొంగల్ని పట్టుకుని 45 సవర్ల బంగారమే సీజ్ చేశామని చెప్తారు. మిగిలిన 15 సవర్లు నొక్కేసి. మునిస్వామి కూతురి అత్యవసర చికిత్స గురించి చెప్పి, దొరికిన ఆ 45 సవర్ల బంగారాన్నే ఇమ్మంటాడు. అది పొందాలంటే కోర్టు ద్వారా పొందాలని చెప్తారు పోలీసులు.
మునిస్వామి లాయర్ బేబీ కృష్ణ (దర్శకుడు ఆర్జే
బాలాజీ) ని కలిసి చెప్పుకుంటాడు. బేబీ కృష్ణ ఈ కేసు తీసుకుంటాడు. ఇతను నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుని గుప్పెట్లో పెట్టుకుని
ఇష్టారాజ్యం చేస్తూంటాడు. మేజిస్ట్రేట్ (నట్టి సుబ్రహ్మణ్యం) ని లోబర్చుకుని కేసుల్ని తారుమారు చేస్తూంటాడు. కోర్టు నుంచి బంగారాన్ని
ఇప్పిస్తానని చెప్పి మునిస్వామి నుంచి డబ్బు లాగుతూంటాడు. మూడు నెలలు గడుస్తున్నా
తేల్చడు.
న్యాయవ్యవస్థలో అక్రమాలని, సామాన్యులకి అందని
న్యాయాన్నీ చూపిస్తున్నప్పుడు, ముందు కథలో
ప్లే చేసే లీగల్ పాయింట్లు కరెక్టుగా వుండాలి. అసలు దొంగతనానికి గురైన వస్తువుని
పొందాలంటే కోర్టు కెళ్ళాలి నిజమే. అయితే
ముందు పోలీసులు ఆ పట్టుకున్న దొంగల మీద కేసు నమోదు చేయాలి. కోర్టు విచారణకి ఆ కేసు తీసుకున్న తర్వాత, దొంగిలించిన వస్తువు
పొందడం కోసం దాని యజమాని కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు. కోర్టు ఆ వస్తువుకి చెందిన
యాజమాన్య పత్రాలు సరైనవేనని ధృవీకరిస్తే, దొంగిలించిన వస్తువుని విడుదల చేయొచ్చు. అయితే ఒక్కటే షరతు : ఆ దొంగతనం
కేసులో తీర్పు వచ్చేవరకూ ఆ వస్తువుని యజమాని దాని రూపు రేఖలు మార్చేయడానికి గానీ, అమ్మేయడానికి
గానీ, కుదువ బెట్టడానికి గానీ, ఎవరికైనా గిఫ్టు ఇవ్వడానికి గానీ వీల్లేదు!
ఇక్కడే ఇరుక్కున్నారు స్క్రీన్ ప్లే రైటర్స్ . అంటే
మునిస్వామి కోర్టు నుంచి ఆ బంగారాన్ని పొందినా కూతురి చికిత్స కోసం చట్టప్రకారం అమ్ముకోలేడన్న
మాట! కుదువ బెట్టలేడు కూడా. ఇక కథ ఎక్కడుంది? ఇలా న్యాయవ్యవస్థ కథ లీగల్ పాయింట్లు
ఎగేసి ఎక్కడికక్కడ తూట్లు పడిపోతూంటే చూడాలని ఎందుకనిపిస్తుంది? పైగా కూతురి
చికిత్స కోసం బంగారం అర్జెంటుగా అవసరముంటే, లాయర్ బేబీ కృష్ణ నెలలకి నెలలు
తేల్చకుండా సాగదీస్తూంటాడు. కాలేయ మార్పిడంత
సీరియస్ సమస్యతో వున్న కూతురు, మూడు నెలలు గడుస్తున్నా దిట్టంగా ఎలా
వుంటుంది? వాళ్ళు హైదరాబాద్ కొచ్చారంటేనే ఇక్కడి హాస్పిటల్లో చికిత్సకి డేట్
ఇచ్చేవుంటారు. కాలేయ మార్పిడికి ఇంకో వ్యక్తీ కాలేయం అవసరం. అంటే ఒకరికి కాదు
ఇద్దరికీ ఆపరేషన్ జరుగుతుంది. దీని ఖర్చు 15-17 లక్షల మధ్య వుంటుంది.
కాలేయాన్నిచ్చే ఆ డోనార్ ఎవరు? ఇది తెలీదు. లేదా మరణించిన వ్యక్తి కాలేయం తీసుకోవచ్చు. దీనికి 35 లక్షలు
ఖర్చవుతుంది. ఆ మరణించిన వ్యక్తి ఎవరు? ఇది కూడా తెలీదు. ఇలా వాస్తవాల పునాది
లేకుండా గాలిలో రాసుకుని గాలిలో తీసేశారు సినిమా.
ఇంత నాసిరకం కథలో మునిస్వామి ఇక బంగారం
చేతికొచ్చే సూచనలు కన్పించక, కరుప్పు స్వామి (తెలుగులో వీరభద్రస్వామి) ని ఆశ్రయిస్తాడు.
నువ్వే కాపాడాలని వేడుకుంటాడు. ఆ గుడి కోర్టు కాంపౌండు లోనే వుంటుంది. మునిస్వామి
కోరిందే ఆలస్యం కరుప్పు స్వామి లాయర్ వీరభద్ర
(సూర్య) రూపంలో వచ్చేస్తాడు కేసు వాదించడానికి!
ఇదీ ప్లాట్ పాయింట్ వన్ సీను. సూర్య ఎంట్రీ
కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తూంటే 40 నిమిషాలకి తీరిగ్గా వస్తాడు. బిగినింగ్ ఈ 40
నిమిషాల సేపూ ఆ తండ్రీ కూతుళ్ళ సమస్యతోనే, కోర్టులో బేబీ కృష్ణ బిల్డప్పులతోనే వృధాగా సాగుతుంది. హీరోగా ఫస్టాఫ్
లో సూర్యకి సరైన స్పేసే లేదు. ఈ 40 వ నిమిషంలో ప్లాట్ పాయింట్ వన్ ని ఎలా ఏర్పాటు
చేశారో చూద్దాం...
విజువల్
యాక్షనా, లేజీ రైటింగా?
బిగినింగ్ ని ముగించే ప్లాట్ పాయింట్ వన్ అంటే కథని, కథలో ప్రధాన పాత్రకి సంబంధించిన గోల్ నీ ఏర్పాటు చేసే ఒక మొదటి మలుపు. ఇది విజువల్ యాక్షన్ తో వుండాలి. డైలాగుతో ‘అయ్యా వాడు నన్ను కొట్టాడు’ అని వచ్చి చెప్పుకుంటే, ఆ అయ్య ఆ కొట్టిన వాడిని పిలిచి తిట్టే ఇంకో డైలాగుతో వెర్బల్ గా వుండదు విజువల్ మీడియా అన్నాక సినిమాకి. యాక్షన్ తో ఒక సంఘటన జరగాలి, అందులోంచి ప్రధాన పాత్రకి గోల్ పుట్టుకురావాలి. సినిమా కథంటే సంఘటనలతో సాగే కథనం. డైలాగులతో కాదు. డైలాగులు సంఘటనల్లో అంతర్భాగంగా వుంటాయి.
కోర్టు కాంపౌండులో అన్నేళ్ళుగా గుడిలో వుంటున్న కరుప్పు స్వామికి కోర్టులో జరుగుతున్న అన్యాయాలే తెలియవా? కరుప్పు స్వామి అంటే కోర్టులో అక్రమాలకి పాల్పడుతున్న ఎవ్వరికీ భయభక్తులే లేవా? మరి అతను క్షేత్ర పాలకుడు ఎలా అయ్యాడు. మునిస్వామి చెప్పుకుంటేనే తెలిసిందా? అప్పుడు వెంటనే లాయర్ వేషంలో వచ్చేశాడా? ఇందులో యాక్షన్ ఎక్కడుంది? థ్రిల్ ఏముంది? కథలో డెప్త్ ఎక్కడుంది? అసలు కరుప్పు స్వామి చరిత్ర, పరిచయం, గుణగణాలు చూపించకుండా ఈ ప్లాట్ పాయింట్ వన్ మలుపులో అతడ్ని లాయర్ గా ఎలా ప్రవేశపెడతారు? బిగినింగ్ విభాగమంటే ముందు పాత్రల పరిచయం కాదా?
అలా మునిస్వామి కేవలం వచ్చి చెప్పుకున్నంత మాత్రాన, కరుప్పు స్వామి నడుం బిగించి లాయర్ గా వచ్చేయడం విజువల్ యాక్షన్ సెన్స్ మిస్సైన- లేజీగా రాసిన పనికిరాని వెర్బల్ సీనే. టైటిల్స్ కి ముందు సూర్యని కరుప్పు స్వామిగా వివిధ యాక్షన్ మాంటేజీలతో చూపించారు. ముందే ఇలా చూపించడంతో సూర్య పాత్రతో వుండాల్సిన సస్పెన్స్ అంతా పోయింది. సింపుల్ గా బిగినింగ్ కథనం చూపిస్తూ,కోర్టులో ఒక అన్యాయపు సీను వేసి, దీనికి కౌంటర్ గా సూర్య కరుప్పు స్వామిలా మెరుస్తున్న కత్తి తిప్పుతూ దున్నపోతు మీద వచ్చేయడాన్ని చూపిస్తే, కోర్టులో జరిగిన అన్యాయానికి ప్రతిగా సూర్య రాకతో చప్పట్లు పడేవి. ఇదీ పాత్రతో కలుపుకుని కథనంతో పాల్పడాల్సిన డైనమిక్స్. 40 నిమిషాలు పాత్రే కనిపించకపోతే థ్రిల్ చేసే డైనమిక్స్ ఏముంటాయి- ఇతర పాత్రలతో చప్పగా సాగే అవే సీన్లు తప్ప.
అలా దున్నపోతు మీద వచ్చేసి, ఇప్పుడు ప్రేక్షకులకి మొట్టమొదటి సారిగా కాంపౌండు లోనే వున్న గుడిని రివీల్ చేస్తూ, గుడిలోకి దూరిపోయి అదృశ్య మైపోతే ఇదొక మిస్టేరియస్ ఘట్టంగా నిలిచిపోతుంది. సినిమాలో చూపించినట్టు సూర్య ఎంట్రీ కోసం, అదీ పేలవమైన ఎంట్రీ కోసం 40 నిమిషాల వరకూ ఎదురు చూడకుండా బిగినింగ్ కథనంతో కలిపి ముందే ఎంట్రీ ఇచ్చేస్తే, తర్వాత ప్లాట్ పాయింట్ వన్ కి సినిమాటిక్ గా న్యాయం చేసే ప్రొసీడింగ్స్ అన్నీ ఏర్పడే అవకాశముంటుంది.
ఈ నేపథ్యంలో ప్లాట్ పాయింట్ వన్ సీన్ వేస్తే ఇది విజువల్ యాక్షన్ తో వుంటే- అంటే ఆ తండ్రీ కూతుళ్ళ మీద లాయర్ బేబీ కృష్ణ తన గ్యాంగ్ తో గుడి ముందు దాడి చేసి కొడుతూంటే- ఆ తండ్రీ కూతుళ్ళ ఆక్రందనలకి కరుప్పు స్వామి (సూర్య) ఈ సారి కత్తి పట్టుకుని తెల్ల గుర్రం మీద గుడిలోంచి వచ్చేసి గ్యాంగ్ ని చావ గొడుతూంటే -తమిళ నాడు నుంచీ టెక్సాస్ దాకా ఒకటే ఈలలు వినేవాళ్ళం.
అదే గుర్రం మీద అలాగే కోర్టులోకి దూసుకెళ్ళి అలజడి సృష్టిస్తే, ప్లాట్ పాయింట్ వన్ విజువల్ యాక్షన్ తో మరింత స్ట్రాంగ్ గా వుండేది. అలా వచ్చేసి మేజిస్ట్రేట్ బల్ల మీద కత్తి గుచ్చి ఓ చూపు చూస్తే, ఇక డైలాగుల అవసరమే వుండదు సూర్య పాత్ర గోల్ ఏర్పాటుకి.
ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ నటించిన ‘ట్రూ లైస్’ లో చేజింగ్ సీన్లో ష్వార్జ్ నెగ్గర్ రోడ్ల మీద గుర్రం మీదే వెంటాడుతాడు. వెంటాడుతూ హోటల్లోకి దూసుకొచ్చేసి తీవ్ర అలజడి సృష్టిస్తాడు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఐకనిక్ యాక్షన్ సీను ఇది. కానీ సూర్యతో పాత్రరీత్యా అవకాశమున్న ఇలాటి యాక్షన్ సీనే లేకుండా, కేవలం మునిస్వామి డైలాగులతో పూర్ గా ఏర్పాటు చేశారు ప్లాట్ పాయింట్ వన్ ని. స్క్రీన్ ప్లేలో స్టార్ ని వాడుకునే విధానం ఇదేనా? స్క్రీన్ ప్లే అంటేనే స్టార్ ప్లే!
మిడిల్ -1
కథా భంగం
ఇక సూర్య లాయర్ వేషంలో మామూలుగా కోర్టుకి హాజరవడంతో మిడిల్ 1 విభాగం
ప్రారంభమవుతుంది. మిడిల్ 1 కథనమంటే హీరో గోల్ కోసం ఎదుటి పాత్రతో సంఘర్షణ. సూర్య
గోల్ బంగారాన్ని విడిపించడం. అతడి ఎదుటి పాత్ర బీబీ కృష్ణ. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ఎంతగా అవినీతిమయమైందో ఇప్పుడు తెలుసుకుంటాడు. అదే కోర్టులో లాయర్ ప్రీతి (త్రిష) ని కలుస్తాడు. ఆమె మొత్తం కోర్టు
వ్యవహారాల్లో లాయర్ బేబీ కృష్ణ ఆధిపత్యాన్ని వివరిస్తుంది. అసలు కోర్టు కాంపౌండు
లోనే కరుప్పు స్వామి గుడి వుండడం ఎక్కడపడితే అక్కడ ఇలా లాజికల్ గా అడ్డు ఈ కథకి. కోర్టు కాంపౌండు లోనే
వుంటూ ఏం చేస్తున్నాడు కరుప్పు స్వామి ఇవన్నీ తెలుసుకోక? పూర్వ కాలంలో గ్రామ
సరిహద్దులో వుండేవట కరుప్పు స్వామి గుడులు పహారా కాస్తూ. ఈ కథలో కోర్టు కాంపౌండు
లోంచి తీసేసి చెన్నై ఊరవతల గుడిని చూపించినా లాజిక్ కి అడ్డు పడేది కాదు.
బేబీ కృష్ణ మొదటి విచారణ సమయంలో, వేర్వేరు న్యాయవాదుల
పేరిట అనేక పిటిషన్లు దాఖలు చేసి గందరగోళం సృష్టించి, విచారణని చెల్లనిదిగా
చేసి, కేసుని తారుమారు
చేస్తాడు. సూర్య సీక్రెట్ గా తన మహిమల్నుపయోగించి అవినీతిని ఎదుర్కొంటాడు. సూర్య
కరుప్పు స్వామి అవతారమని ప్రీతికీ, బేబీ కృష్ణకీ తెలిసిపోతుంది. దీంతో బేబీ కృష్ణ
మహిమలేవీ ఉపయోగించకుండా కేసు గెలవమని సూర్యకి
సవాలు విసురుతాడు. ఈ సవాలు తీసుకుని మహిమలు ఉపయోగించకుండా, అనేక అడ్డంకులెదు
ర్కొని సూర్య బంగారాన్ని తిరిగి పొందడంలో
విజయం సాధిస్తాడు. అయితే, అదే సమయంలో
మునిస్వామి కూతురు మీనూ ఆరోగ్యం చెడి చనిపోతుంది!
ఐపోయింది మిడిల్ -1 లోనే కథ!
ఒక వస్తువు ప్యాకేజీ కేజీ అని చెప్పి అందులో అరకేజీ వస్తువు పెట్టి అమ్మడం ఎంత నేరమో, ఇంటర్వెల్ లోపలే అయిపోయే కథని రెండున్నర గంటల కథగా చెప్పి ప్రేక్షకులకి అమ్మడం అంతే నేరం. విషాదమేమిటంటే ఈ నేరానికి పాల్పడ్డామని ఈ ఆరుగురు రచయితలకీ తెలీదు! ఇటీవలే తెలుగులో గుణశేఖర్ ‘యూఫోరియా’ కూడా ఇంటర్వెల్ లోపె అయిపుచ్చే కథతో నేరం చేశారు.
ఇంటర్వెల్ లోపు కథ అయిపోవడమంటే సినిమా సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడినట్టే. తర్వాత సెకండాఫ్ నడపడానికి వేరే కథ తెచ్చి అతికించడం. ఇలా ఫస్టాఫ్ కీ, సెకండాఫ్ కీ పరస్పర సంబంధమే లేని సినిమా తెరకెక్కుతుందన్న మాట! ఇప్పుడేం చేశారు?
అక్కడే ఆ దేవుడికి ఇంకో కేసు తగుల్తుంది.
కోర్టు కాంపౌండు లోనే ఒకామెకి అన్యాయం జరుగుతున్న దృశ్యం. ఈమెని గతంలో ఒక మంత్రి
లైంగిక వేధింపులకి గురి చేసిన కేసు. దీని మీద ఆమెతో దౌర్జన్యానికి పాల్పడుతూంటే,
సూర్య కల్పించుకుని వాళ్ళందర్నీ కొట్టి పడేసి ఆ కేసు చేపడతాడు. దీంతో ఇంటర్వెల్.
ఇలా తన ముందు దౌర్జన్యం జరుగుతూంటేనే సూర్య ఆ
గ్యాంగుని కొట్టి పడేసి మునిస్వామి కేసు చేపట్టాలని పైన ప్లాట్ పాయింట్ వన్
విషయంలో చెప్పుకున్నాం. రైటర్లు దీన్ని ఇంటర్వెల్లో అమలుపర్చారు. ఈ లైంగిక
వేధింపుల కేసు బిగినింగ్ విభాగంలోనే ఉప కథ
(సబ్ ప్లాట్0) గా నలుగుతూ వుంటుంది. దీన్ని మెయిన్ స్టోరీగా ఎత్తుకున్నారు. సబ్ ప్లాట్
మెయిన్ స్టోరీ అవుతుందా అంటే, మెయిన్ స్టోరీని చంపేశాక ఇంకేం చేస్తారు?
మెయిన్ స్టోరీని
బతికిస్తే...
కానీ కథ చచ్చిపోలేదు, బతికే వుంది. కూతుర్ని చంపించిన
బేబీ కృష్ణతో సూర్య కథ సెకండాఫ్ లో కంటిన్యూ అవడానికి బతికే వుంటుంది...
సెకండాఫ్ సిండ్రోం!
కానీ ఏం చేశారు? బేబీ కృష్ణ విలనీ పెంచకుండా,
సూర్య హీరోయిజాన్ని కిందికి దించుతూ, ఆరోగ్యం చెడిందంటూ కూతుర్ని చంపేసి, మెయిన్ స్టోరీనీ
దాంతో చంపేస్తూ- వేరే సబ్ ప్లాట్ ని తెచ్చి సెకండాఫ్ కి అతుకు వేశారు. ఇక కోర్టులో
ఈ సబ్ ప్లాట్ లైంగిక వేధింపుల కేసు కోర్టులో అర్ధం పర్ధం లేని కామెడీతో సాగుతుంది.
సూర్య మహిమల్ని ప్రయోగించి బేబీ కృష్ణని ఇబ్బంది పెడుతూంటాడు.
ఇప్పుడు కథలో మహా గొప్ప ట్విస్టు! సూర్యకున్న కరుప్పు
స్వామి మహిమలు నాంపల్లి దాటితే పనిచెయ్యవట. అందుకని కోర్టుని మాదాపూర్ కి మార్చాలని
లాయర్లతో కలిసి బేబీ కృష్ణ పోరాటం!
కరుప్పు స్వామి ప్రతిష్ట అడుగడుగునా దిగజారుస్తూ బేబీ కృష్ణగా దర్శకుడు ఇష్టమొచ్చినట్టు
తన సీన్లు పెంచుకుని- సెకండాఫ్ లో రెండు పాటలు తప్ప అరె ఆరు సీన్లకి సూర్యని కుదించేశాడు!
ఫస్టాఫ్ లో సూర్య 40 నిమిషాల వరకూ కనిపించక పోతే, సెకండాఫ్ లో ఆరే ఆరు సీన్లలో కనిపించడం!
ఇలా వున్నాయి స్క్రీన్ ప్లే సంగతులు.
సెకండాఫ్ చూడ్డానికేమీ లేదు. హిట్టయ్యింది. ఎందుకైందో మొదట్లోనే చెప్పుకున్నాం. కనీసం కాస్టింగ్ కూడా సరిగ్గా లేదు. తండ్రి పాత్రలో ఆర్టిస్టు చాలా మైనస్. ఈ పాత్రలో నిజానికి నాజర్, సత్యరాజ్ లాంటి బాగా తెలిసిన సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు వుంటే సీన్లు ఎలివేట్ అయ్యేవి. కూతురి పాత్రలో కూడా తెలిసిన నటి వుండాలి. ఇక విలన్ బేబీ కృష్ణగా దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. లాయర్ గా త్రిష పేరుకి వుంటుంది గానీ, కథకి ఉపయోగ పడదు.
ఇక కోర్టు సీన్లలో జడ్జిని మైలార్డ్ అని సంభోదించడం
ఇంకో విచిత్రం. మైలార్డులు, ప్రభువులు బ్రిటిష్ వాళ్ళతో పాటే పోయారు.
ప్రజాస్వామ్యంలో జడ్జిని యువరానర్ అనే సంభోదిస్తారు. ఇందులో మేజిస్ట్రేట్ కూడా ఎన్నిసార్లు
కోర్టు కోస్తాడో అన్ని సార్లూ చేతులు జోడించి నమస్కారం పెడతాడు. ఇది కూడా నాన్సెన్స్.
అలా న్యాయ మూర్తులెవరూ నమస్కారం పెట్టరు!
-సికిందర్
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)



