రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, డిసెంబర్ 2019, శనివారం

899 :రివ్యూ పాయింట్



        తెలుగు సినిమాలు ఇంకా అవే బిగినింగ్ ఆర్భాటాలుగానే నిర్మాణ మవుతున్నాయి. ఆర్భాటంగా బిగినింగ్ తప్ప ఆ తర్వాత ఏమీ వుండని అదే పాత పరిస్థితి / తప్పు ఇంకా  కొనసాగుతోంది. స్క్రీన్ ప్లే పరిభాషలో తెలుగు సినిమాలంటే కేవలం బిగినింగే అన్నట్టు తయారయ్యింది. బిగినింగ్ తర్వాత వుండాల్సిన మిడిల్ మాయమైపోయింది. ఆ బిగినింగ్ కూడా ఇంటర్వెల్ దాకా సాగదీసి వుంటుంది- ఆ తర్వాత మిడిల్ తో నడవాల్సిన సెకండాఫ్ డొల్లేనని ఇక సగటు ప్రేక్షకులకి కూడా అర్ధమైపోతోంది. ఇదిప్పుడు రాంగోపాల్ వర్మ, వెంకటేష్ ల సినిమాలకి కూడా ఎగబ్రాకింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, వెంకీ మామా ఈవారం తాజాగా ఈ లిస్టులో చేరికలు. ఈ లిస్టు గత పదిహేనేళ్ళుగా వుంది. పదిహేనేళ్ళ క్రితమే ‘ఇంటర్వెల్ అనే చౌరాస్తా నుంచి ఎటు వైపు?’ అని ‘ఆంధ్రభూమి’ లో రాశాం. ఇలా రాసేవాళ్ళకీ, సినిమాలు తీసే వాళ్ళకీ ఒక గ్యాప్ ఎందుకనో వుంటుంది. తీసే వాళ్ళకి పత్రికల విశ్లేషణలు పట్టవు. పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. సినిమాలు ఫ్లాపయ్యాక కూడా అవే తప్పులతో మరిన్ని ఫ్లాపులు అలాగే తీస్తూ పోతారు. లిస్టు పెంచేస్తూంటారు. దీంతో నిర్మాతలు బలి. అటు చెన్నైలో తమిళ నిర్మాతలకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. స్క్రీన్ ప్లే నాలెడ్జి తమకి కూడా అవసరమన్న అవగాహనకొస్తున్నారు. దర్శకుడెవరైనా, రైటరెవరైనా లెక్కలోకి తీసుకోకుండా, స్వయంగా నిర్మాతలు స్టోరీ డిపార్ట్ మెంట్స్ పెట్టుకుని వాళ్ళ స్క్రిప్టుల్ని కఠిన పరీక్షలకి గురిచేస్తున్నారు (దీనిపై వ్యాసం ఈ వారం చూద్దాం). 

       
లా ఎంత కాలం? పది కోట్లు పెట్టినా సెకండాఫ్ లేని సగం సినిమాయే చేతికొస్తున్నాక ఇక సెకండాఫ్ తీయడం దేనికి? ఇలాగే గంటన్నర ఇంటర్వెల్ దాకానే పెట్టేసుకుని, ఆ గంటన్నర పాటు టెంప్లెట్ ప్రేమలు, కామెడీలు, ఓ మూడు టెంప్లెట్ పాటలూ, ఫైట్లూ పెట్టుకుని, ఇంటర్వెల్ రాగానే కథ ప్రారంభించడానికి ఓ టెంప్లెట్ విలన్ని ఎంటర్ చేసి - ప్రేక్షకులారా ఇంతవరకే మాకు చాతనయింది, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కథ మీరే వూహించుకోండి, వెళ్ళిపోండి - అని శుభం వేసేస్తే సరిపోతుందిగా?  

        రెండూ సెకండాఫ్ సిండ్రోములే. అమ్మరాజ్యం ఫస్టాఫ్ లో ఎన్నికల్లో వెలుగు దేశం బాబు ఓడిపోయి, ఆర్సీపీ జగన్నాథ రెడ్డి అధికారంలోకి వస్తాడు. బాబు ఓర్వలేకపోతాడు. ఎలాగైనా జగన్నాథ రెడ్డికి అప్రతిష్ట తేచ్చి గద్దెదింపాలని బాబు, అతడి కుమారుడు చినబాబూ అనుకుంటారు. ఇంతలో తన పార్టీలో ముఖ్యుడైన దయనేని రమ హత్య జరిగిపోతుంది. దీంతో సీఎం జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది. దయనేని రమని ఎవరు చంపారు ఏమిటనేది సెకండాఫ్ కథ.

        షరా మామూలుగా ఇంటర్వెల్లోనే కథ ప్రారంభం కావాలి కాబట్టి, ఆ హత్యవరకూ ఫస్టాఫ్ స్పేస్ ఫిల్లర్ క్యారక్టర్స్ ఏవేవో వచ్చేస్తాయి. ప్రణయ్ కళ్యాణ్, పిపి జాన్ ల కామెడీలు, చినబాబు మీద సెటైర్లు నిండిపోతాయి. హత్య తర్వాత సెకండాఫ్ లో ఇవే అర్ధంలేని సెటైర్లు, కామెడీలు. అసలు కథ హత్య జరిగిన నేపథ్యంలో జగన్నాథ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకి వెళ్ళడం, ఎన్నికల్లో గెలవడం, ఇంతే. సెకండాఫ్ లో ఏదేదో కామెడీలతో కథ జోలికే పోలేదు. 

        విడుదలకి ముందు ఈ కథలో పాయింటు విన్నప్పుడు వైరల్ అయ్యే మార్కెట్ యాస్పెక్ట్ తో వుందన్పించింది. తీరా చూస్తే వీగిపోయింది. జగన్నాథ రెడ్డిని దించడానికి దయనేని రమని చంపే ప్లానుతో రమకి కంగారు పుట్టించడం పాయింటు అని తెలిసినప్పుడు - ఇదేదో బాగానే వుందనిపించింది. మనుగడలో వుండే పాయింటు. రమని చంపేస్తే అక్కడితో ఈ పాయింటు అంతమైపోతుంది, ఇక కథేమీ వుండదు, ఎవరు చంపారన్న పనికిరాని సస్పెన్సు తప్ప. కానీ సినిమాలో ఇదే జరిగింది. రమని చంపేశారు, కథనీ చంపేశారు, సెకండాఫ్ నీ  చంపేశారు, మొత్తం సినిమానే చంపేశారు.


        ఈ కథ ప్రకారం బాబు, చినబాబులు విలన్లు అనుకుంటే, జగన్నాథరెడ్డి హీరో. ఈ హీరోని రమని చంపడం ద్వారా ఇరికించాలని విలన్ల ప్లాను లేదా కథకి పాయింటు. అప్పుడు ఆత్మ రక్షణలో పడ్డ హీరో రమని చంపకుండా చూడడం, ఆ తాలూకు స్ట్రగుల్ చేయడం మనుగడలో వుండే పాయింటు. చంపాలని విలన్లు, ఆపాలని హీరో. ఇప్పుడేం జరుగుతుందన్నది మిగతా పొలిటికల్ థ్రిల్లర్.
There is no terror in the bang, only in the anticipation of it ―Alfred Hitchcock కొటేషన్ కి మించిన దిక్సూచి లేనే లేదు. ఇంటర్వెల్ అనే చౌరాస్తాలో కన్పించే గైడ్ పోస్ట్. కానీ ఇంటర్వెల్లోనే రమని హరీ మన్పిస్తే సినిమా హరిలో రంగ హరీ, వర్మగారి పని సరి!

        ఈ మధ్య విఫలమవుతున్న రాజకీయ సినిమాలు చూస్తూంటే ఒక్కటే గుర్తుకొస్తూంటుంది - కోడి రామకృష్ణ ‘భారత్ బంద్’.దీన్ని గైడ్ లా పెట్టుకుని ఎన్ని రాజకీయ సినిమా లైనా విజయవంతంగా తీయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.

        ఇక వెంకీమామ కూడా ఇంటర్వెల్లో ప్లేటు ఫిరాయింపే. ఆ ప్లేటు కాశ్మీర్ లో సర్జికల్ స్ట్ర యిక్ అంటూ ఎగిరే పళ్ళంలా వెళ్లి ఎక్కడో పడింది. వూళ్ళో వెంకీ, కార్తీక్ మేనమామ. కార్తీక్ జాతక రీత్యా వెంకీకి ప్రాణగండం. ఇద్దరూ కలిసి వుండే కామెడీలు చేసుకుంటారు ఫస్టాఫ్ లో. వెన్నెలని వెంకీతో కలపాలని కార్తీక్ కామెడీ, హారికని కార్తీక్ తో కలపాలని వెంకీ కామెడీ. ఇంతలో కార్తీక్ కన్పించకుండా పోతాడు. ఎందుకు పోయాడు? తనవల్ల మేనమామ వెంకీకి ప్రాణ గండం వుంది గనుక. ఎక్కడికి పోయాడు? సైన్యంలో కలిసిపోయాడు. వెంకీ ఏం చేశాడు? వెతుక్కుంటూ పోయాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఏం చేశారు? సర్జికల్ స్ట్రయిక్ ని వీలైనంత అపహాస్యం చేసి సెకండాఫ్ ని అర్ధంలేని మిడిల్ గా చేశారు. 


        పాయింటేమిటి? కార్తీక్ కి తనవల్ల మేనమామకి జాతకరీత్యా ప్రాణగండం. ఇక్కడ మెయిన్ క్యారక్టర్ ఎవరు? కార్తీకే. ఒక పాత్రకి దానివల్ల ఇతరులకి ప్రాణగండముంటే ఆ కథ ఎవరిదవుతుంది? ఆ పాత్రదే అవుతుంది. ఎలా? ఇక్కడ తన వల్ల మేనమామకి ప్రాణ గండాన్ని నివారించే, వీలయితే తన ప్రాణాల్నే ఇచ్చే పాత్ర తనే గనుక. ఈ గోల్ తో, దీని తాలూకు సంఘర్షణతో, పరిష్కారాన్ని తనే కనుక్కోవాలి గనుక. కనుక్కున్నా కనుక్కోలేకపోయినా స్ట్రగుల్ తనదే, కథ తనదే. తన జాతకం వల్ల పుట్టిన తన కథ. కనుక్కుంటే డూయర్ పాత్ర, కనుక్కోలేకపోతే, మేనమామే కనుక్కుంటే బీయర్ పాత్ర. ఈ ఓటమి ఫర్వాలేదు, మేనమామ ముందు ఓటమి ఫర్వాలేదు. ఎదుటి పాత్రయిన మేనమామ విలన్ పాత్ర కాదు, తను పాసివ్ క్యారక్టర్ అవడానికి.   
       
       కానీ వెంకీ, కార్తీక్ పాత్రలు సినిమాలో రివర్స్ అయ్యాయి. వెంకీ ప్రధాన పాత్ర అయిపోయాడు, జాతక సమస్య వున్న కార్తీక్ ప్రాధాన్యంలేని సహాయ పాత్రయి పోయాడు! కథతో ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా వుంటుందా? ఈ కథకి చాలా మందే రచయితలున్నట్టు వినికిడి. 

         ఈ కథకి మోరల్ ప్రేమీజ్ ని నిర్ధారించుకుని దాని ప్రకారం కథ చేసుకోలేకపోయారు. మామా అల్లుళ్ళ మధ్య జాతక రీత్యా ఏర్పడ్డ సమస్యకి కొనసాగింపు కథ స్వాభావికంగా ‘త్యాగం’ అనే మోరల్ ప్రేమీజ్ (నైతిక ఆవరణ) లోకి దానికదే వచ్చేస్తుంది. సన్నిహితంగా వుండే వివిధ పాత్రల మధ్య త్యాగాల కథలతో సినిమాలెన్నో వచ్చాయిగా? వాటి లోంచే ఈ కథ తీసుకుని పాయింటుని విరిచి విన్యాసాలు చేస్తే కొత్త కథయి పోతుందా? త్యాగమనే విలువ యూనివర్సల్ నీతి. దీన్ని విరిస్తే, లేదా దీన్నుంచి పలాయనం చిత్తగిస్తే ఇంతే సంగతులు చిత్తగించవలెను.

సికిందర్