రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, అక్టోబర్ 2023, శుక్రవారం

1370 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : లోకేష్ కనరాజ్
తారాగణం : విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాతలు : లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల : అక్టోబర్ 19, 2019
***

        ళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనకరాజ్ ల  కాంబినేషన్ లో మాస్టర్ తర్వాత లియో రెండో సినిమా. భారీ ప్రచారార్భాటంతో విడుదలై, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు వసూలు చేసిందన్న నిర్మాతల ట్వీట్లతో ఇది వైరల్ అవుతోంది. కమల హాసన్- సూర్య- విజయ్ సేతుపతి లతో పానిండియా బ్లాక్ బస్టర్ విక్రమ్ తీసిన కనకరాజ్ లియో కి తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగుతుందా, కొనసాగడానికి సరిపడా విషయముందా తెలుసుకుందాం...

కథ

    పార్తీపన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నిర్వహిస్తూ కుటుంబంతో వుంటాడు. కుటుంబంలో భార్య సత్య (త్రిష), 18 ఏళ్ళ కొడుకు (మాథ్యూ థామస్), ఎనిమిదేళ్ళ కూతురు (ఇయాల్) వుంటారు. కుటుంబంతో ప్రశాంతంగా  గడుపుతున్న పార్తీపన్ జీవితంలోకి ఓ ముఠా ప్రవేశిస్తుంది. కాఫీ షాపులో డబ్బు దోచుకోవడానికి వచ్చిన ముఠా (దర్శకుడు మిస్కిన్, శాండీ) బారినుంచి కూతుర్ని కాపాడుకుంటూ వాళ్ళని చంపేస్తాడు పార్తీపన్. దీంతో అరెస్ట్ అవుతాడు. అవి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్యలుగా కోర్టు నిర్ధారించి నిర్దోషిగా విడుదల చేసేస్తుంది. దీంతో పార్తీపన్ చుట్టుపక్కల హీరోగా ప్రచారమవుతాడు. ఆ ఫోటో ఎక్కడో వున్న ఆంథోనీ దాస్ (సంజయ్ దత్), అతడి కొడుకు హెరాల్డ్ దాస్ (అర్జున్) అనే క్రిమినల్స్ చూస్తారు. పార్తీపన్ పేరుతో హిమాచల్ లో వుంటున్నది తన చిన్న కొడుకు లియో దాసేనని ఆంథోనీ గుర్తించి ఎటాక్ చేస్తాడు. తను లియో దాస్ కాదని, నువ్వెవరో తెలియదనీ వాదిస్తాడు పార్తీపన్. అయినా వినిపించు
కోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు ఆంథోనీ దాస్.
       
ఇంతకీ పార్తీపన్ ఎవరు
? ఆంథోనీ చిన్న కొడుకేనా? పార్తీపన్- లియో ఒకరు కాదా? కాకపోతే ఇంకెవరు? కొడుకుని చంపాలని ఆంథోనీ ఎందుకు పగబట్టాడు? కొడుకు అతడికేం అపకారం చేశాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పై కథా సంగ్రహం చదివితే ఆసక్తికరంగా వుంది. నువ్వు కొడుకువని విలన్ క్లెయిమ్ చేయడం, కాదని కొడుకు తిప్పికొట్టడం, కొడుకుని చంపాలని విలన్ ప్రయత్నించడం, తండ్రికి కొడుకు ఏం అపకారం చేశాడని ప్రశ్న తలెత్తడం, అసలు కొడుకు కొడుకేనా అన్న సందేహం కలగడం... ఇదంతా ఇంట్రెస్టింగ్ మాఫియా ఫ్యామిలీ డ్రామాగా కుతూహలం రేకెత్తిస్తుంది. తీరా ఈ సస్పెన్స్ మీద వున్న ముసుగు తీస్తే కంగాళీగా వుంటుంది.

టైటిల్స్ లో ఈ సినిమాకి ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ అనే హాలీవుడ్ మూవీ ప్రేరణ అని వేశారు. హాలీవుడ్ మూవీలో తండ్రీ కొడుకుల సంబంధం లేదు, క్రిమినల్- క్రిమినల్ సంబంధమే వుంది. ఈ మూవీ 2000లలో వచ్చిన గొప్ప సినిమాగా నమోదైంది. ఇందులో హీరో ట్రేడ్ మార్క్ స్కిల్స్ తో వుంటాడు. కుటుంబం మీద దాడి జరిగినప్పుడు ఆ స్కిల్స్ బయటపడి తానే ఆశర్యపోతాడు. అతను తుపాకీతో కాల్చి చంపడం ఒక ప్రత్యేక శైలితో చేస్తాడు. అలా కుటుంబాన్ని రక్షించుకోవడానికి చంపేసి నేర ప్రపంచంలో ఇరుక్కుపోతాడు. ఈ దయనీయ స్థితి సినిమా అంతటా వెంటాడే భావోద్వేగంగా వుంటుంది.  
       
ఇలాటిదే కథతో 1990 లో ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన
రౌడీయిజం నశించాలి వచ్చింది. నిజానికిది  మలయాళంలో మోహన్ లాల్ నటించిన కిరీడమ్కి రీమేక్. దీనికి మోహన్ లాల్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఇందులో ఓ బడా రౌడీ బారినుంచి కానిస్టేబులైన తండ్రిని కాపాడుకుంటూ  చంపేస్తాడు హీరో. దీంతో వూళ్ళో హీరో అయిపోతాడు. కానీ రోజురోజుకీ బయటపడలేని విధంగా రౌ డీయిజంలోనే  ఇరుక్కుపోతాడు. మరిన్ని మరిన్ని నేరాలు చేయాల్సి వస్తుంది...ఇందులో, పై హాలీవుడ్ మూవీలో ఒక నీతి వుంది. లియో లో ఇదే మిస్సయి, విలన్ కుటుంబ గొడవలకి పరిమితమై పోయింది. ఇదైనా సరిగ్గా లేదు.
       
హీరో పాత్రచిత్రణ మీద ఆధారపడ్డ ఈ కథ ఎంత అపరిపక్వంగా వుందంటే- ప్రారంభంలో విజయ్ వూరిమీద పడి దాడి చేస్తున్న హైనాని వీరోచితంగా ఎదుర్కొంటాడు. ఈ పోరాటంతో అతను పవర్ఫుల్ వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. తర్వాత కుటుంబంతో
, కాఫీ షాపుతో సాధారణ జీవితం గడుపుతున్న సామాన్యుడిలా వుంటాడు. కాఫీ షాపు మీద దుండగులు దాడి చేసినప్పుడు, వాళ్ళతో పొరాడి చంపేసి తన బలానికి తనే ఆశ్చర్యపోతాడు- మనం కాదు- ఎందుకంటే అతను ఎంత పవర్ఫుల్లో ముందే హైనాతో పోరాటంలోనే తెలుసుకున్నాం.
       
దీంతో కాఫీషాపు సంఘటనతో సామాన్యుడిగా సర్ప్రైజ్ చేసి నేరప్రపంచంలో ఇరుక్కోవాల్సిన పాత్ర పూర్తిగా రివర్స్ అయింది. పాత్ర పట్ల ఏ మాత్రం సానుభూతి కూడా పుట్టదు. ఓపెనింగ్ గ్రాండ్ గా వుండాలని హైనాతో పోరాటం పెట్టకుండా
, కాఫీషాపుతోనే అతడి జీవితం చూపించి వుంటే పాత్ర చిత్రణ- దాంతో కథా దెబ్బ తినేవి కావు. హాలీవుడ్ మూవీతో ప్రేరణ పొందడమంటే వాళ్ళు పెట్టని సీన్లు పెట్టడం కాదు.
       
లోపాలు పక్కన పెడితే ఫస్టాఫ్ మాత్రం క్లీన్ గా వుంటుంది. నీ తండ్రినంటూ సంజయ్ దత్ రావడం వరకూ
, అసలు తనెవరో మనకు తెలియకుండా విజయ్ సస్పెన్సు పోషించడం వరకూ, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో డ్రామా హాట్ హాట్ గా వుంటుంది. చిన్న ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వాలేదు. సెకండాఫ్ కొచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ తో కంగాళీగా మారిపోతుంది. ఏ మాత్రం ఒప్పించని బారుగా సాగే కుటుంబ డ్రామా, అది కూడా బలహీనంగా బయటపడుతుంది. ఇంత బ్యాడ్ రైటింగ్, మేకింగ్ టాప్ డైరెక్టర్ ఎలా చేశాడో తెలీదు. సెకండాఫ్ కథ, దాని క్లయిమాక్స్ మొత్తం సహన పరీక్షగా మారిపోతాయి. లేని కథకి యాక్షన్ సీన్లు మాత్రం భారీగా, అతి వయొలెంట్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

    కమర్షియల్ సినిమాల్లో ప్రేక్షకులు ఆశించే ఎలాటి డ్యూయెట్లు, కామెడీలు, రోమాన్సు లేకుండా సహజంగా అన్పించే రియలిస్టిక్ పాత్ర నటించాడు విజయ్. ఎక్కడా నవ్వుతూ కూడా కంపించడు. పాత్రకి తగ్గ సీరియస్ నెస్, దానికి తగ్గ యాక్షన్ సీన్స్ ఈ రెండే సినిమాలో కనిపిస్తాయి. ఈ యాక్టింగ్ కి తగ్గ పాత్రచిత్రణ, భావోద్వేగాలు కూడా వుంటే బావుండేది.
       
త్రిష కుటుంబానికి ఎదురైన ఆపదలకి సంఘర్షణ పడే పాత్రలో ముద్ర వేస్తుంది. విలన్లిలిద్దరూ- సంజయ్ దత్
, అర్జున్ పరమ బోరు పాత్రలుగా మిగిలిపోతారు సెకండాఫ్ లో. వీళ్ళ కుటుంబ కథ అదో మార్లెండ్ బ్రాండో గాడ్ ఫాదర్ ఫ్యామిలీ కథలా ఫీలవడం!
       
ట్రెండ్ లో వున్న అనిరుధ్ రవిచందర్ సంగీతంలో
నా రెడీ సాంగ్ వింటేనే బావుండొచ్చుగానీ, తెర మీద తేలిపోయింది. మిగిలిన పాటలు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ గా వస్తాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ మొదలైనవి ఫ్రెష్ గా అన్పిస్తాయి. అన్బీరవ్ సమకూర్చిన యాక్షన్ సీన్స్ లో ఎన్ని అవయువాలు తెగిపడ్డాయో, అన్నీ లీటర్ల రక్తం ప్రవహించిన్దో లెక్కే లేదు.
       
మొత్తం మీద లోకేష్  కనక రాజ్ గత మూడు సినిమాల మ్యాజిక్ మిస్సవడమే కాదు
, ఫస్టాఫ్ చూసి సెకండాఫ్ స్కిప్ చేసినా ఫర్వాలేదనిపించేలా వుంది.

—సికిందర్