రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, జూన్ 2020, సోమవారం

951 : రివ్యూ

      పొన్మంగళ్ వందాళ్ (బంగారు బొమ్మ వచ్చేసింది) ఎవిడెన్సు లేని ఎమోషనల్ కోర్టు డ్రామాతో రక్తి కట్టించాలని చేసిన ఒక విఫలయత్నం. కోర్టులో సింగిల్ లొకేషన్ వెర్బల్ కథనంతో యాక్షన్ లేని 120 నిమిషాల సస్పెన్స్ కథ నడపబోయి విఫలమయ్యారు. సినిమా నేపథ్యం లేని కొత్త దర్శకుడు జేజే ఫ్రెడరిక్ చాలా రీసెర్చి చేశానన్నాడు గానీ, ఆ రీసెర్చి లాయర్లు ఎలా పనిచేస్తారు, కోర్టులెలా పనిచేస్తాయి వంటి న్యాయ ప్రక్రియ తెలుసుకోవడం గురించి మాత్రమే వుంది తప్ప -అసలు కోర్టు రూమ్ డ్రామా, లేదా లీగల్ థ్రిల్లర్స్ ఎలా రాస్తారు, ఎలా తీస్తారు అన్న వాటికి సంబంధించి స్క్రీన్ ప్లే రీసెర్చి చేసుకున్నట్టు లేదు. కోర్టుల్లో కేసు విచారణలు ఎలా జరుగుతాయో అక్కడ హాజరై పరిశీలించానన్నాడు గానీ, అసలు సినిమాల్లో ఆ కోర్టు రూం డ్రామాలు ఎలా రక్తి కట్టిస్తారో సినిమాలు చూసి తెలుసుకున్నట్టు లేదు. దీంతో తను వాస్తవ కోర్టుల్లో ఎలా చూసిన దృశ్యాలు అలా సినిమాగా తీసేస్తే పరమ బోరు వ్యవహారంగా తేలింది. ఇంటర్వెల్ సీను సైతం కిక్ లేకుండా పేలవంగా తయారైంది. ఈ బలహీన కథాకథనాలకి తగ్గట్టు సంగీత దర్శకుడు కూడా కేవలం రెండు మూడు పరికరాలతో పరమ నీరసంగా సంగీతం చేశాడు. 

       
సీనియర్ హీరోయిన్ జ్యోతిక పాత సినిమా పాట పల్లవిని టైటిల్ గా పెట్టుకుని బంగారు బొమ్మలా విచ్చేసింది, మంచిదే. పొన్మంగళ్ ఇంగెవాగా కూడా రావొచ్చు. ఎన్నోడ దేవతగానూ రావొచ్చు. కానీ వచ్చి కాస్త కటాక్షించే పనేదో చేయకుండా కఠినంగా శిక్షించే పని పెట్టుకుంటేనే ప్రేక్షకులకి జీవన్మరణ సమస్య. అసలీ సబ్జెక్టుని ఎలా నమ్మి నిర్మించిందనేది పెద్ద సస్పెన్స్. లాయర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తల్లిగా తన రెండు పాత్రలు, బాలికలపై అత్యాచారాలనే భావోద్వేగం, లేడీస్ ని ఆకర్షించే ముచ్చటైన టైటిల్, ఇవన్నీ ఉత్సాహపర్చి ముందుకు నడిపించినట్టుంది. కానీ లాయర్ పాత్ర, తల్లి పాత్ర, బాలికలపై  అత్యాచారాలూ అనే పాయింటూ ఏవీ బలంగా దర్శకుడు చిత్రించ లేదని స్క్రిప్టు చూసి తెలుసుకున్నట్టు లేదు. లాక్ డౌన్ వల్ల మార్చిలో విడుదలవాల్సిన సినిమా ఆగిపోయి ఇప్పుడు అమెజాన్ లో విడుదలై నష్టపోకుండా బయటపడ గల్గింది గానీ, లేకపోతే థియేటర్స్ లో విడుదలై వుంటే ఒక్క రోజైనా ఆడుతుందానేది అనుమానమే. టీవీ సీరియల్స్  కూడా ఇలా తీయడానికి సాహసించరేమో. 

        ఇది పదిహేనేళ్ళ క్రితం ఒక సీరియల్ కిల్లర్ కేసుని తిరగదోడే కథ. స్కూలు వయసు బాలికల్ని చంపే జ్యోతి అనే సీరియల్ కిల్లర్, ఎన్కౌంటర్ లో చనిపోయి కేసు క్లోజ్ అవుతుంది. పదిహేనేళ్ళ తర్వాత లాయర్ వెన్బా (జ్యోతిక పోషించిన ఈ పాత్ర వెన్బా అంటే కవిత అని అర్ధం) ఆ కేసు రీ ఓపెన్ చేయించి వాదిస్తుంది. దీంతో ఆమె పట్ల వ్యతిరేకత వస్తుంది. తమ పిల్లల్ని చంపిన సీరియల్ కిల్లర్ని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నందుకు తల్లులు దాడి కూడా చేస్తారు. ఆ నాటి కేసులో సాక్షుల్ని కోర్టులో విచారిస్తూ వాళ్ళ తప్పుడు సాక్ష్యాల్ని బయట పెడుతూంటుంది వెన్బా. వరదరాజన్ (త్యాగరాజన్) అనే పలుకుబడిగల వ్యక్తి కొడుకు రోహిత్ (అఖిల్ సంతోష్) నీ, అతడి స్నేహితుడినీ జ్యోతి చంపిందని ఆరోపణ. ఊటీలో రోహిత్, అతడి స్నేహితుడూ ఒక బాలికని కిడ్నాప్ చేస్తున్న జ్యోతి బారి నుంచి కాపాడబోతే, వాళ్ళని కాల్చి చంపిందని ఆ నాటి కేసులో రుజువైన విషయం. ఇది నిజం కాదని ఇప్పుడు వెన్బా వాదన. పోలీసులు సాక్ష్యాలు సృష్టించి జ్యోతి మీద తప్పుడు కేసు బనాయించి ఎన్కౌంటర్ చేశారని, పోలీసులు పేర్కొన్నట్టు జ్యోతి నార్త్ ఇండియన్ కాదనీ ఆమె వాదం.

        ఈ వాదాన్ని ఎలా నిరూపించింది? అసలెందుకు ఈ కేసు చేపట్టింది? జ్యోతితో తనకి సంబంధ మేమిటి? జ్యోతి కాకపోతే బాలికల సీరియల్ కిల్లర్ ఎవరై వుంటారు? అసలు తనెవరు?... ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు. 

        2005 లో 19 మంది బాలికల్ని-
     చంపి పాతిపెట్టిన రేపిస్టు కిల్లర్ సురీందర్ కోహ్లీ సంచలనం సృష్టించిన నోయిడా నిథారీ కేసు గుర్తు కొస్తుంది ఈ సినిమా చూస్తూంటే. ఈ మధ్య తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’ కూడా గుర్తుకొస్తుంది. అయితే కథకో ప్రణాళిక అంటూ లేకపోవడంతో దర్శకుడు ఫీలైన సస్పెన్సు లన్నీ తేలిపోతూంటాయి.  ఏ విషయం దాచాలి, అదెప్పుడు చూపించాలి, ఏ విషయాన్నీ తురుపు ముక్కగా వాడుకోవాలి, అదెలా ముగింపు బ్యాంగ్ గా ఇవ్వాలీ అన్న డైనమిక్స్ పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడంతో, విషయముండీ సినిమాకి చాలని విషయంగా నీరుగారిపోయింది. 


        సస్పెన్స్, థ్రిల్, టెంపో అనేవేవీ దృష్టిలో పెట్టుకోకుండా కథ నిర్వహించడంతో ముందే కథేమిటో, జ్యోతిక పాత్రెవరో, ఆమెకి సీరియల్ కిల్లర్ జ్యోతి ఏమవుతుందో తెలిసిపోతూ - అసలు చూస్తున్నది సినిమాయేనా అన్పించేలా తయారైంది. ఈ కథ సీరియల్ కిల్లర్ అంటున్న జ్యోతి గురించా, లేక హత్యకి గురైన మైనర్ ఆడపిల్లల గురించా- దేనికి ఎక్కువ ఎమోషనల్ ఇంపాక్ట్ - షాక్ వేల్యూ వుంటుందో తెలుసుకోక పోవడం వల్ల కథనం గజిబిజి అయింది. 

        ఈ కథలో కర్త, కర్మ రెండున్నాయి. సీరియల్ కిల్లర్ అంటున్న జ్యోతి కర్త అయితే, ఆమె చేతిలో మరణించారంటున్న బాలికలు కర్మ స్థానంలో వున్నారు. ఇప్పుడు సస్పెన్సు తో సినిమా నిలబడాలంటే కర్తతో కథ నడుపుతూ కర్మని చివరి వరకూ దాచిపెట్టాలి. అంటే జ్యోతి ఎవర్ని చంపిందీ చెప్పకుండా ఆమె సీరియల్ కిల్లర్ కాదని నిరూపించే అంశంతో మాత్రమే కథ నడపాలి. ఎప్పుడైతే చివరికి జ్యోతి దోషి కాదని నిరూపణ అయి అసలు కిల్లర్ దొరికిపోతాడో, అప్పుడు అతడిక్ కనెక్ట్ చేస్తూ అతను చంపిన బాలికల మృతదేహాల వెలికితీత చూపించాలి. బాలికల అత్యాచార హత్యలు అన్న విషయం ఇప్పుడు లైవ్ గా, తాజాగా రివీలైనప్పుడు ఎక్కువ షాకింగ్ గా వుంటుంది. కదిలించే దృశ్యంగా వుంటుంది, బలమైన ఎమోషన్ తో వుంటుంది. ముగింపుకో అర్ధముంటుంది. నాటకీయత వుంటుంది. ఈ ముగింపుకి ఫీలవుతూ థియేటర్ నుంచి, లేదా అమెజాన్ నుంచి నిష్క్రమిస్తారు ప్రేక్షకులు. 

        ఈ కథకి ముగింపు జ్యోతి దోషి కాదని తేలడం కాదు. జ్యోతి దోషి కాదనే తేలుతుందని మనకి ముందే తెలుసు. అసలు జ్యోతి చంపిందంటున్నది ఎవర్నీ అన్నది ఈ కథకి ముగింపవుతుంది. చివరికి బాలికల మృత దేహాలనే తురుపు ముక్కని ఓపెన్ చేసి ప్రయోగించడమే కథలో తెలియని, వూహించని స్టన్నింగ్ ముగింపవుతుంది. అచ్చు గుద్దినట్టు వాళ్ళ మృతదేహాల క్లోజింగ్ ఇమేజితో. 

        కానీ దర్శకుడు ఎలా చేశాడంటే, సినిమా ఓపెనింగ్ లో పదిహేనేళ్ళ క్రితం జ్యోతి చేసిందంటున్న బాలికల హత్యాకాండా, మృతదేహాలూ సహా ఆమె ఎన్కౌంటర్ మొత్తం విప్పి చూపించేసి చేతులు దులుపుకున్నాడు. దీంతో మొదటి ఐదు నిమిషాల్లోనే సినిమా అయిపోయింది. అమెజాన్ అనవరంగా మిగిలిన 115 నిమిషాల సినిమా కొనుక్కుని మన నెత్తిన రుద్దింది. ఇలా కాకుండా, బాలికల హత్యాకాండా, వాళ్ళ మృతదేహాలూ చూపించకుండా, ఆమె ఒక సీరియల్ కిల్లర్ అనే చెప్పి - ఆమె ఎన్కౌంటర్ ఎలా జరిగిందో అది మాత్రమే చూపించి ముగిస్తే-  ఆమె ఎవర్ని చంపి వుంటుందన్న సస్పెన్స్ ఈ కథని కాపాడేది. మిగతా 115 నిమిషాల సినిమాకో అర్ధంపర్ధం వుండేది. 

        ఇంకోటేమిటంటే, వెన్బా జ్యోతి కూతురనీ కూడా ఇంటర్వెల్లో చెప్పేసి ఇంకో సారి చేతులు దులుపుకున్నాడు. సస్పెన్సుని ఏమాత్రం కడుపులో దాచుకోలేక పోతున్నాడు దర్శకుడు. ఎంత త్వరగా చెప్పేస్తే అంత కడుపు తేలిక బడుతుందని తొందర పడుతున్నాడు. అతడి కడుపుతోనే వచ్చింది మొత్తం సమస్యంతా. వెన్బా జ్యోతి కూతురని ఇంటర్వెల్లో చెప్పేయడంతో, ఇక జ్యోతి మీద నుంచి, బాలికల హత్యల మీద నుంచీ, వెన్బా జాలి కథ మీదికి మళ్ళిపోయింది కథ. ఇక కోర్టులో ఆమె సెల్ఫ్ పిటీ తో కూడిన వాదనలు. అన్యాయం జ్యోతి కి కాకుండా, బాలికలకి కాకుండా, తనకే జరిగి పోయినట్టు! 

        ఈ కథని ఫిల్టర్ చేసి చూస్తే, ఈ కథ ఎన్కౌంటర్ కి గురైన జ్యోతిది కాదు, కేసు వాదిస్తున్న వెన్బాదీ కూడా కాదు, దర్శకుడి కడుపు కథ కూడా కాదు, ఘోర అకృత్యాలకి బలైన బాలికలది మాత్రమే ఈ కథ! జ్యోతీ, వెన్బా పాత్రలు కేవలం దయనీయమైన ఆ బాలికల మరణాలని బయటపెట్టేందుకు తోడ్పడే సాధనాలు మాత్రమే. ఇలాటి కేవల సాధన మాత్రమైన వెన్బా,  కథని తన మీదికి మళ్ళించుకుని సానుభూతి పొందాలనుకోవడం అక్రమం. 

        ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ముందు - 
       వెన్బా కి ఆమెని పెంచుకున్న పేతురాజ్ (భాగ్యరాజ్), జ్యోతి (ఈ జ్యోతి పాత్ర కూడా జ్యోతిక పోషించిందే) రాసిన డైరీ ఇచ్చి చదవమంటాడు. ఈ డైరీతో ఫ్లాష్ బ్యాకు వస్తూంటే వెన్బా జ్యోతి కూతురని మనకి తెలిసిపోతుంది. దీంతో ఇంటర్వెల్ కోర్టు సీన్లో తను జ్యోతి కూతురని చెబితే మనకి బ్యాంగ్ కాకుండా పోయింది. తెలిసిపోయిన విషయమే మళ్ళీ చెబితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అవుతుంది. పైగా దీని చిత్రీకరణ కూడా బ్యాంగ్ ఇవ్వాలన్న ఎఫెక్ట్స్ తో లేదు. దీనికి తగ్గట్టే సంగీత దర్శకుడు కూడా నాటకాల్లో కీ బోర్డు సంగీతంలా నీరసంగా వాయించి వెళ్ళిపోయాడు. జ్యోతీ, బాలికల కథ మధ్యలోకి వెన్బా దూరి చేసిన నిర్వాకం ఇదన్న మాట. 


        జ్యోతి ఎన్కౌంటర్ అయ్యేనాటికి వెన్బాకి ఎంతలేదన్నా పదేళ్లుంటాయి. ఇంకా ఆమె తల్లి కథ తెలుసుకోమని డైరీ ఇవ్వడమేమిటి? దర్శకుడి ఉద్దేశం ప్రేక్షకులకి ఆ కథ తెలియజేయాలని. ఇందుకు వెన్బాని మాధ్యమంగా వాడడం పాత్ర పరంగా తప్పుడు కథనం. మొత్తం కథనీ వెన్బా మీదికి మళ్ళించే - ఈ జ్యోతి ఫ్లాష్ బ్యాక్ తో వెన్బా ఆమె కూతురని బయటపెట్టడం ఇప్పుడనవసరం. జ్యోతి నిర్దోషి అని నిరూపించాక, తను జ్యోతి కూతుర్ననీ, అందుకే ఈ కేసు తిరగదోడాననీ  చెప్పి కోర్టులో వాదన ముగిస్తే, అప్పుడు అదొక కొత్త మలుపుగా నమోదవుతుంది కథనంలో. కథనం రీఫ్రెష్ అవుతుంది. 

        కొత్త దర్శకుడు సీనియర్ దర్శకుల్నే- 
      నటవర్గంలో చేర్చి ప్రేక్షకాకర్షణ పెంచాలనుకున్నట్టుంది గానీ, కథాకథనాలే పేలవంగా తెలిపోతూంటే ఆకర్షణకి అవకాశంలేదు. ముందు కథ ఆకర్షించాలి, ఆ తర్వాతే మిగతా ఆకర్షణలు. పేతురాజ్ పాత్రలో భాగ్య రాజా, ప్రాసిక్యూటర్ పాత్రలో పార్తీపన్, వరదరాజన్ పాత్రలో త్యాగరాజన్, జడ్జి పాత్రలో ప్రతాప్ పోతన్, మైనర్ పాత్రలో పాండ్య రాజన్, డీఎస్పీ పాత్రలో సుబ్బు పంచు... ఇలా దర్శకులతో ‘మల్టీ స్టారర్’ తారాతోరణం కట్టాడు ఈపాటి సినిమాకి.  


     కోర్టుల వాదోపవాదాలతో మాటలతోనే కథ నడుస్తూంటుంది. ఈ సీన్లేవీ థ్రిల్లింగ్ గా వుండవు. కోర్టు రూమ్ డ్రామా అంటే, ఎవిడెన్సుతో రక్తి కట్టించకుండా, వెన్బా జాలి కథతో కూడిన ఎమోషనల్ డ్రామా అన్నట్టు తయారైంది. తగిన ఎవిడెన్స్ లేకుండా, కోర్టులో అందర్నీ కన్నీళ్లు పెట్టించే ఆమె జాలి కథ నమ్మేసి, జడ్జి తీర్పు చెప్పడం అమెచ్యూరిష్ గా వుంది. తను కూడా అప్పట్లో అత్యాచారానికి గురైన బాలికల్లో ఒక బాలికే. కానీ ఈ కథకి ఒక కథానాయకిగా తన విషాదాన్ని దాచుకుని, ఇతర బాలికల విషాదానికే విలువివ్వడం కథానాయిక లక్షణం. 


       ఎప్పుడైనా పాత కేసుల్ని తిరగదోడాలంటే, కోర్టు పునర్విచారణకి ఆదేశిస్తుంది. దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. అంటే కోర్టు బయటే ఈ ప్రక్రియ జరిగి, ఫలితాల్ని కోర్టుకి సమర్పిస్తారు. అంతేగానీ ఫ్రెష్ కేసులో జరిగినట్టు కోర్టులో పాత కేసుల విచారణ జరగదు. ఏదో సినిమా కోసం ఇలా కోర్టు విచారణ పెట్టుకున్నారు గానీ దీనికి లాజిక్ లేదు. ఈ విచారణలో ఎప్పుడో పదిహేనేళ్ళ నాటి సాక్షులు నిన్న మొన్న జరిగినట్టు, చూసినట్టు చెప్పేస్తూంటారు. ఫోటోలని గుర్తు పట్టేస్తూంటారు. కనీసం సాక్షుల జ్ఞాపక శక్తితో నైనా సస్పెన్స్, డ్రామా, గందరగోళం సృష్టించి దుమారం రేపలేదు దర్శకుడు. హ్యూమన్ సైకాలజీ, డ్రామా ఏవీ ముట్టుకోలేదు. పైగా జడ్జి విలన్ నుంచి లంచం తీసుకుని తీర్పుని తారుమారు చేస్తున్నట్టు చూపించడం పూర్తిగా అనవసరం, అది కథకి ఉపయోగపడ నప్పుడు. 

        రీసెర్చి న్యాయ ప్రక్రియ తెలుసుకోవడం గురించి మాత్రమే కాకుండా, కోర్టు రూం డ్రామా తీయడం గురించి కూడా చేసుకుని వుంటే - ఈ కథతో ఇంత అత్యాచారం జరిగేది కాదు.

సికిందర్