రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, ఏప్రిల్ 2018, గురువారం

716 : సందేహాలు -సమాధానాలు




Q :    కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేని ముక్కోణ ప్రేమ కథలకెలా అన్వయించాలి? ఏమైనా మూవీస్ ఉదాహరణకి చెప్తారా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుందని తెలుసు. కానీ ఇప్పుడు నేనొక ఎసైన్ మెంట్ చేస్తున్నా, అందుకే అడిగాను. పోతే, హిందీలో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే పోలి వుంటాయంటారా?
జయసింహా, రచయిత 

 A :   ఇరిటేడ్ అవడానికేముందని. అసలెందుకు ఇరిటేట్ అవాలని. అది విక్టిమ్ మెంటాలిటీ. ముక్కోణ ప్రేమ కథలకి  కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేని కల్పించాలంటే ఇంటర్ ప్లేని ముక్కోణంలో వుండే మూడు పాత్రల్లో రెండిటికే పరిమితం చేయాలి. ఏ కథల్లోనైనా ఇంటర్ ప్లే ఎప్పుడూ రెండు పాత్రల మధ్యే వుంటుంది గనుక. ఐతే ముక్కోణ ప్రేమకథలు ఒక పాత్ర వర్సెస్ రెండు పాత్రలుగా వుంటాయి. కథంటేనే ఒక పాత్రకి వ్యతిరేకంగా ఇంకో పాత్ర పనిచేయడం. ఇలా ఇతర జానర్ల కథల్లో ఇంటర్ ప్లే హీరోకీ విలన్ కీ లేదా,  హీరోకీ హీరోయిన్ కీ, తండ్రికీ కొడుక్కీ,  అన్నకీ తమ్ముడికీ ...ఇలా రెండు పాత్రల  మధ్యే వుంటుంది. 

          కానీ ముక్కోణ ప్రేమల్లో కథ హీరోదైతే, ఎదుటి పాత్రలుగా రెండు  హీరోయిన్ పాత్రలుంటాయి. కథ హీరోయిన్ దైతే,  ఎదుటి పాత్రలుగా  రెండు హీరో పాత్రలుంటాయి. అదే ఇతర జానర్స్ లో హీరోకి ఇద్దరు విలన్లు విడివిడిగా వుండరు. వుంటే ఒకే లక్ష్యంతో కుమ్మక్కై వుంటారు. ఎందుకంటే హీరోకి రెండు లక్ష్యాలు కుదరదు కాబట్టి. ఇద్దరు విలన్లు వేర్వేరు లక్ష్యాలతో వుంటే, ఒక విలన్ సద్దాం హుస్సేన్ లా ఎందుకో ‘బంకర్’ లాంటి  దాంట్లో దాక్కుని పడుకుని, హీరో చేతిలో ఉత్తి పుణ్యాన చచ్చిపోతాడు  ‘రంగస్థలం’ లో లాగా. హీరోకి కూడా ఇతడితో లక్ష్యం లేదు కాబట్టి, కథలో వేస్టుగా వేలాడుతున్న అన్ వాంటెడ్ ఫెలోని సరదాకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాంటిది చేపట్టి, ప్రక్షాళన చేసే స్తాడు సైకో కిల్లర్ లాగా – భంగ స్థలం చేస్తూ. దీనికి సరేలే సంబడమని వూరుకోవాలి మనం. 

      అసలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేలో ఎదురురెదురు రెండే పాత్రలుంటాయి. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్ర. కారణం, మనుషులనే వాళ్ళకి కాన్షస్ మైండ్ ఒకటి, సబ్ కాన్షస్ మైండ్ ఒకటి మాత్రమే ఆలోచించి దేవుడు అమర్చాడు.  లేకపోతే  ఈ ప్రపంచాన్ని మనుషులెప్పుడో ఖతం చేసి పారేసే వాళ్ళు. అలాటిది ముక్కోణంలోకి తెచ్చి  ఒక పాత్ర వర్సెస్  రెండు పాత్రలు పెడితే ఇంటర్ ప్లే ఎలా సాధ్యమవుతుంది? కాన్షస్ మైండ్ వర్సెస్ సబ్ కాన్షస్ మైండ్ + అదనపు సబ్ కాన్షస్ మైండ్ అసహజమూ, ప్రకృతి విరుద్ధమూ కదా?

          ఇందుకే ఒక పెళ్ళికాని హీరో x ఇద్దరు పెళ్లి కాని  హీరోయిన్లు, లేదా ఒక పెళ్ళికాని హీరోయిన్ x ఇద్దరు పెళ్లి కాని హీరోల ముక్కోణాలు పెద్దగా కనెక్ట్ కావు. 

          ఎప్పుడు కనెక్ట్ అవుతాయంటే,  మూడింట్లో రెండు పాత్రలకి పెళ్ళయిపోయి వుంటే. ఈ రకం ముక్కోణాల్లో సంజయ్ లీలా భన్సాలీ బలమైన ఇంటర్ ప్లేలని సృష్టిస్తాడు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) లోనైనా, ‘బాజీరావ్ మస్తానీ’ (2015) లోనైనా. ‘కాసా బ్లాంకా’ (1942) లాంటి హాలీవుడ్ లో కూడా ఇంతే. ‘ఆప్ కీ కసమ్’ (1975), ‘ఏక్ హసీనా దో దీవానే’(1972) లాంటి బాలీవుడ్స్ లో కూడా ఇంతే. ‘మేఘ సందేశం’ (1982), ‘జీవిత చక్రం’ (1971) లాంటి టాలీవుడ్స్ లో కూడా ఇంతే. ‘దేవదాసు’ (1953) లో పార్వతి (సబ్ కాన్షస్) అంటే భయపడి పారిపోతాడు దేవదాసు (కాన్షస్). చంద్రముఖితో కాన్షస్ వరల్డ్ లోనే వుండి పోతాడు. విడిగా కాన్షస్ మైండ్ కి జీవితం లేదు. సబ్ కాన్షస్ (అంతరాత్మ)తో కలిసుంటేనే జీవితం, లేకపోతే  పతనం. దేవదాసు పతనం ఇలాంటిదే. ఇందులో నీతి ఇదే.

          ఒకసారి కింది జేమ్స్ బానెట్  పటం చూస్తే,  గొప్ప కథల మెంటల్ మేకప్ ఇదీ : ఎడమ కాన్షస్, కుడి సబ్ కాన్షస్, పైన స్పిరిచ్యువల్, కింద ఫిజికల్ – ఈ నాల్గిటి కలబోతే మనిషి. స్పిరిచ్యువల్ శిఖరంతో ‘దేవదాసు’ గొప్పకథల స్థాయికి చేరింది. స్పిరిచ్యువాలిటీ ఏం చెప్తుందంటే, నువ్వు అంతరాత్మ (సబ్ కాన్షస్) తో కలిసివుంటే, సద్గతి పొందుతావని, ఆథ్యాత్మిక ఫలాల్ని అందుకుంటావని. దేవదాసు అంతరాత్మతో కలిసి లేడు. అందుకే ఫిజికల్ (తామసిక) స్థాయిలో వుండిపోయి పతనమయ్యాడు. 


        సరే, గొప్ప కథలిప్పుడు అవసరం లేదు. గొప్ప సినిమాలు తీయాలంటే ఆస్తికులై వుండాల్సిందే, నాస్తికుల వల్ల కాదు. స్టీవెన్ స్పీల్ బెర్గ్ ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ తో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్నిఅంత గొప్పగా తీర్చగాలిగాడంటే, నాస్తికుడై కాదు. 

          ఈ కాలంలో గొప్ప కథలు కాక, సింపుల్ కథలే అర్ధవంతంగా చెప్పాలంటున్నాం కాబట్టి, దీని గురించే మాట్లాడుకుందాం. 

          పై పెళ్ళయిన సెటప్ లో ఏం జరుగుతుందంటే - పూర్వం ప్రేమించి, పెళ్ళయిపోయిన పాత్రని మర్చిపోలేక సొంతం చేసుకోవాలని సంఘర్షిస్తూంటుంది ప్రధానపాత్ర. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో పెళ్ళయిన ప్రేయసి ఐశ్వర్యా రాయ్ కోసం తపిస్తూంటాడు ప్రధాన పాత్ర సల్మాన్ ఖాన్. ఇక్కడ సల్మాన్ పాత్ర కాన్షస్  అయితే, ఐశ్వర్య పాత్ర సబ్ కాన్షస్. ప్రధాన పాత్ర సాధించాలనుకున్న దేదైనా సబ్ కాన్షసే అవుతుంది. ఐశ్వర్య భర్త పాత్ర అజయ్ దేవగణ్ కాన్షస్ - సబ్ కాన్షస్ ల మధ్య గార్డియన్. మనుషుల సబ్ కాన్షస్ లో వుండే తొమ్మిది రకాల ఎమోషన్స్ లో ఒకటైన గార్డియన్ ఎమోషన్. ఇలా మూడో పాత్ర విడిగా మరో సబ్ కాన్షస్ గా  కాకుండా,  సబ్ కాన్షస్ లోనే  భాగమైన గార్డియన్  ఎమోషన్ కి ప్రతీకగా సర్దుకుంటుంది. కనుక మొదటి  రెండు పాత్రలతో కాన్షస్ – సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే చెక్కుచెదరదు. ఆ గార్డియన్ ఎమోషన్ తో కూడా హీరో తలపడాల్సిందే ఆమెని (సబ్ కాన్షస్ ని) పొందాలంటే. ఈ గార్డియన్ ఎమోషన్ నిర్ణయం పైనే ఆ ప్రేమికుల భవిత్యం ఆధారపడుతుంది. సాధారణంగా ఈ గార్డియన్ పాత్ర సంఘర్షిస్తున్న తన భార్యని , ఆమె ప్రేమికుడిని కలిపేసి విముక్తి కల్గిస్తుంది. 

      పెళ్లి హీరోకే  అయ్యిందనుకుందాం. ఆ హీరోకి పూర్వ ప్రేయసో, తాజా ప్రేయసో తగిలి తెగులు పుడుతుంది. ఈ ఇద్దర్లో ప్రేయసి ఏ  తరగతికి చెందినా,  హీరోకి సబ్ కాన్షస్ వరల్డ్ అవుతారు. కథల్లో ప్రధాన పాత్ర సాధించాలనుకున్న దేదైనా సరే, అది సబ్ కాన్షస్ వరల్డ్ కి ప్రతీకే అవుతుంది. తను కాన్షస్ ఇగో. అప్పుడు తనతో వున్న భార్య సబ్ కాన్షస్ లో గార్డియన్ ఎమోషన్ అవుతుంది. ఇలా హీరోకైనా, హీరోయిన్ కైనా పెళ్ళయి పోతే – ఆ లైఫ్ పార్టనర్ పని గార్డియన్ ఎమోషన్ గా కాపలా కాసి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే. ఒక్కోసారి పీవీ నరసింహా రావులా ఏ నిర్ణయమూ  తీసుకోకపోవడం కూడా నిర్ణయమే అని ఇక్కడంటే కుదరదు. ఆ కథ తెగదు. గంటలకి గంటలు సినిమా గడిచిపోతున్నా తెరపడక చించేసి పోతారు ప్రేక్షకులు. పీవీ నరసింహారావు బతికిపోయారు గానీ, సినిమాలు బతక లేవు.  

          భర్తకి ఆ ప్రేయసి పూర్వ  ప్రేయసి అయితే,  భార్యే త్యాగం చేస్తుంది. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కే పెద్ద పీట వేయాలి కాబట్టి. లేకపోతే ఆ పూర్వ ప్రేయసి బాధితురాలై, ప్రేక్షకులు ఒప్పుకోరు. ప్రేక్షకులు ముక్తకంఠంతో ఒప్పుకోకపోతే పోయార్లే  అని మనకెందుకనుకుంటే కుదరదు. ముక్తకంఠం అంటే వాళ్ళందరి కలెక్టివ్ కాన్షసే. ఎన్నో సబ్ కాన్షస్ (అంతరాత్మ) ల సమ్మేళనం ఆ సామూహిక కాన్షస్. దీన్ని  గౌరవించాల్సిందే. 

          భర్తకి ఆ ప్రేయసి తాజా సెటప్ అయితే మాత్రం, ఆ సబ్ కాన్షస్ కి ప్రతీక అయిన తాజా ప్రేయసి కోసం సంఘర్షించి సంఘర్షించి, ఆ భర్త నగ్న సత్యాలు తెలుసుకుని (సబ్ కాన్షస్ లో వుండేవి నగ్న సత్యాలే) పరివర్తన చెంది భార్య వైపుకి వచ్చేస్తాడు. తొలిప్రేమ భార్యే అన్నది కూడా ప్రేక్షకుల కలెక్టివ్ కాన్షస్ కి అర్ధమవుతుంది. మనుషులు సంఘజీవులు కాకుండా రాజకీయ జీవులైనప్పుడు,  కలెక్టివ్ కాన్షస్ ఫీలవరు –సెలెక్టివ్ కాన్షస్ ని కలిగి వుంటారు. 

          ఇప్పుడు పెళ్ళికాని ముక్కోణాలు చూద్దాం. ఇవి  ఒక హీరో ఇద్దరు హీరోయిన్లలో ఎవర్ని ఎంపిక చేసుకోవాలన్న ప్రశ్నతో, లేదా ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల్లో ఎవర్ని కోరుకోవాలన్న ప్రశ్నతో సంఘర్షిస్తూ వుంటారు. ఇక్కడ ఎదుటి ఇద్దరు హీరోయిన్లు, లేదా ఇద్దరు హీరోలు సబ్ కాన్షస్ వరల్డ్స్. కానీ మనలో వుండేది ఒకటే అంతరంగం, మన మనసు దాంతోనే సంఘర్షిస్తూ వుంటుంది. రెండో అంతరంగం మనకుండే అవకాశమే లేదు. దీని వల్ల ఆ హీరో లేదా ఆ హీరోయిన్,  ఆ రెండు అంతరంగాలతో చేసే సంఘర్షణ మనకి సిల్లీగా అన్పిస్తుంది. ఎదుటి ఇద్దర్లో ఒకరు మెయిన్ హీరోయిన్, ఇంకొకరు సెకండ్ హీరోయిన్ అయి వుంటారు. మెయిన్ హీరోయిన్నే చేసుకోమని మనసు చప్పున చెప్పేస్తుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ తో సంఘర్షణేమిటి? ఒకామె సాంప్రదాయం కలదిగా వుంటే, రెండో ఆమె నాగరికత వెర్రితలలు వేసి వుంటుంది. రెండో ఆమెనే  చేసుకోవాలని మనసు చెప్తుందా?  హీరో ఈ టైపే అయితే అలాగే చేసుకుంటాడు. కానీ హీరో మారాలని కదా కలెక్టివ్ కాన్షస్? మనం మారినా మారక పోయినా హీరో మారాలనే అరుస్తాం. మనదాకా వస్తే చూసుకుంటాం, కానీ ముందు హీరో మారాలనే అరుస్తాం. 

          పెళ్ళికాని  ముక్కోణంలో ఇలా పాత్రకి రెండు సబ్ కాన్షస్ వరల్డ్స్ ఎదురుకావడం, లేదా సబ్ కాన్షస్ రెండుగా చీలిపోవడంతో కథలు కృత్రిమత్వాన్నే ప్రోది చేసుకుంటున్నాయి. 

         ముక్కోణంలో ఈ సమస్యనే  18 వ శతాబ్డంలో  ప్రఖ్యాత రచయిత్రి జేన్ అస్టెన్ పరిష్కరించింది ( సోర్స్ : స్టోరీ కన్సల్టెంట్ కైట్లిన్ హెచ్ ). ఇందులో ఏకకాలంలో హీరోయిన్ ఇద్దరితో ప్రేమలో పడదు. ఒకరి మీదే  ఫీలింగ్స్ బాగా పెంచుకుంటుంది. అతడి అసలు వ్యక్తిత్వం బయటపడ్డాక ఫీలింగ్స్ ని ఆపేస్తుంది. రెండో అతనికి హృదయాన్ని  విప్పుతుంది. (ప్రైడ్ అండ్ ప్రిజుడిస్).

          హీరోయిన్ తనని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న అతని  వయస్సెక్కువనీ, రోమాంటిక్ గా లేడనీ ఉపేక్షిస్తుంది. డాషింగ్ గా వుండే ఇంకో అతనితో ప్రేమలో పడుతుంది. అతడామెని అంత  సీరియస్ గా తీసుకోకుండా వదిలెయ్యడంతో గాయపడుతుంది. మెల్లమెల్లగా మొదటి అతని వైపు మొగ్గుతుంది (సెన్స్ అండ్ సెన్సి బిలిటీ).

      ఈ రెండు సందర్భాల్లోనూ  హీరోయిన్ ఒక సమయంలో ఒకే  సబ్ కాన్షస్ తో ఇంటర్ ప్లేలో  వుంటోంది. అందుకని ఈ నవలలు చిరస్థాయిగా నిలిచి పోయాయి. 

          నిర్ణయం తీసుకోవడంలో ఆమె తాత్సారం చెయ్యదు. ఒకడు పరిచయమయ్యాక నిర్ణయం తీసుకునే దృష్టితోనే ఆమె క్రియాశీలకంగా వుంటుంది. వూరికే అతడితో ఎంజాయ్ చేస్తూ గడపదు. తీరా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేక ఏడ్పులూ గట్రా ప్రదర్శించదు. ఏకకాలంలో ఇద్దరూ తనని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నా,  ఆమె ఒక్కరి పైనే దృష్టి  పెట్టి వర్కౌట్ చేస్తుంది. కాబట్టి  జేన్ కథల్లో ఈ పెళ్ళికాని ముక్కోణాల్లో ఇలా కాన్షస్ – సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే ప్రకృతి సిద్ధంగా కుదిరి అలరిస్తుంది. 

          ఇదీ విషయం. ఇకపోతే హిందీలో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే పోలి వుంటాయా అనడం గురించి. స్ట్రక్చర్ ఎనిమిదవ భాగంలో ఆల్రెడీ హిరానీ సినిమాని  ఉదహరించాం, కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే దృష్ట్యా.

Q :   Hi Sir,  hello, I am very much thankful  to you for teaching movie structural basics in your site. Please tell me about ‘Kung Fury’,  directed  by  David Sandberg,  who has produced thr. crowd funding, inspiring the world cinema.
―Hare  e  Sh, Asst
. Dir. 

A :   థాంక్స్. టీచింగ్ చేయడం లేదు. టీచింగ్ మన వృత్తి కాదు. మీరు చెప్పిన మూవీ గురించి రాయలేం. అది ముప్ఫై నిమిషాల షార్ట్ మూవీ, పైగా వరల్డ్ మూవీ జానర్. అందులోనూ క్రౌడ్ ఫండింగ్. ఈ సెక్షన్ ని ఈ బ్లాగులో డీల్ చేయడం లేదు. మీరు కమర్షియల్ సినిమా సెక్షన్ కి చెందితే ఇలాటి మూవీస్ కి దూరంగా వుంటే మంచిదని మా అభిప్రాయం. ఒకవైపు స్ట్రక్చర్ తెలుసుకుంటూ, ఇంకోవైపు స్ట్రక్చర్ వుండని షార్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ అంటే రెంటికీ కుదరని పని. ఏదో ఒక సెక్షన్ నిర్ణయించుకుని అందులో కృషి చేయగలరు. టాలీవుడ్ షార్ట్ మూవీస్ అడ్డా కాదు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ గిడ్డంగి కాదు. బ్లాగులో తాజాగా రాసిన వ్యాసమే షార్ట్ మూవీస్ బదులు  అదే ఖర్చుతో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీ తీసుకోమని. సినిమాని చందాలడుక్కుని తీసే స్థాయికి దిగజార్చ వద్దని. ఇది చదివి కూడా మీరు షార్ట్ మూవీని విశ్లేషించమంటున్నారు....

 Q :  స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం అద్భుతం. అయితే మీరు తెలుగు సినిమాకు ఇది చాలు అనకుండా. ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ బుక్ లో హీరో జర్నీ గురించి (అన్ని మజిలీలు) కొంచెం వివరంచగలరు.   బుక్ చదివి, అర్థం చేసుకునేంత ఇంగ్లీషు రాని నాలాంటి వాళ్ళ కోసం.
అజ్ఞాత అసోషియేట్

A :    జోసెఫ్ క్యాంప్ బెల్ ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ థియరీ క్లాసిక్ స్టోరీ స్ట్రక్చర్ కి పనికొచ్చేది. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల కోసం అరిస్టాటిల్ మోడల్ నుంచి ప్రారంభమై, జోసెఫ్ క్యాంప్ బెల్ మీదుగా,  సిడ్ ఫీల్డ్ కొచ్చి స్థిరపడినట్టు ఒక ప్రొఫెసర్ రాసిన వ్యాసాన్ని గతంలో ఈ  బ్లాగులో పోస్టు చేశాం. అది చదివే వుంటారు. ’90 లనుంచి హాలీవుడ్ సినిమాలు సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వస్తున్నాయి. క్యాంప్ బెల్ స్ట్రక్చర్ తో అమెరికన్ నవలలు వస్తున్నాయి, రోమాంటిక్ నవలలు సహా.  మారుతున్న కాలాల్లో మారుతున్న  ప్రేక్షకాభిరుచిని దృష్టిలో పెట్టుకుంటూ హాలీవుడ్ స్క్రీన్ ప్లే లని సరళీకృతం చేసుకుంటూ వస్తోంది. తెలుగులో ‘బాహుబలి’ యే తీసినా అందులో సిడ్ ఫీల్డ్ వుంటాడే తప్ప క్యాంప్ బెల్ వుండడు. ఎప్పుడో అరుదుగా ‘దంగల్’  లాంటి దానిలో వుంటాడు. ‘టైగర్ జిందా హై’లో కొంత వుంటాడు.

          హాలీవుడ్ కే అవసరం లేనిది మనకి అవసరం లేదు. వాళ్ళని మించిన కలల బేహారు లెవరుంటారు. హాలీవుడ్ కి అవసరం లేనిది మనదగ్గర ఏవి వచ్చి పడుతున్నాయంటే వరల్డ్ సినిమా నకళ్ళు . ఇది చాలనట్టు క్యాంప్ బెల్ కూడా ఎందుకు. ఉన్న టాలీవుడ్ ని ఇంకింత ఖాళీవుడ్ చేయడానికి కాకపోతే. ఆఫ్ కోర్స్, ఎవరూ ఎవరి మాటా వినరు. అది వేరే విషయం. ఎవరికివారే కింగులమనుకుంటారు. కింగ్ మేకర్లు అవసరం లేదు. అందుకే రాజకీయాలకన్నా అధ్వాన్నంగా వుంటోంది పరిస్థితి. రాజకీయాల మీద కొందరు సినిమాలు తీస్తే ఇందుకే నవ్వొచ్చేలా వుంటున్నాయి. 



       క్యాంప్ బెల్ చెప్పింది పురాణాల కథా నిర్మాణాన్ని. వాటిలో కథానాయకుడికి ప్రయాణంలో పన్నెండు మజిలీ లుంటాయని  చెప్పాడు. ఈ పురాణాల నిర్మాణాన్ని అనుసరించి స్టార్ వార్స్ సిరీస్, ఇండియానా జోన్స్ సిరీస్ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తర్వాత ఈ పన్నెండు మజిలీల్ని పదికి తగ్గించి మైకేల్ హాగ్ ఒక మోడల్ నిచ్చాడు. పది కూడా అవసరం లేదని,  సిడ్ ఫీల్డ్ ఆరుకి తగ్గించి పారడైం ఇచ్చాడు. హీరో మజిలీలకి మజిలీలు చేసుకుంటూ కూర్చుంటే కాలం మారిన ప్రేక్షకులు నిద్ర పోవడం ఖాయం. సిడ్ ఫీల్డ్ ప్లాట్ పాయింట్ -1, పించ్ -1, ఇంటర్వెల్, పించ్ -2, ప్లాట్ పాయింట్ -2 అనే  ఆరు స్టేజీలకి తగ్గించి  స్పీడు పెంచడంతో,  దీనివెంటే పడింది వ్యాపార స్పృహ దండిగా  వున్న హాలీవుడ్. 

          తెలుగు ఫీల్డులో అసలు సిడ్ ఫీల్డే లేదు, అది వేరే విషయం. ఇంకా క్యాంప్ బెల్ ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఎందుకు? భక్తి సినిమాలు తీయాలంటే క్యాంప్ బెల్ ని ఖచ్చితంగా అనుసరించాల్సిందే. ఇప్పటి కమర్షియల్ సినిమాలకి అవసరం లేదు. ఇంకోటేమిటంటే, అతి సింపుల్ గా వుండే సిడ్ ఫీల్డ్  పారాడైం పట్టుబడకుండా క్యాంప్ బెల్ ని అర్ధం చేసుకోవడం కష్టం. కాబట్టి ముందు  సిడ్ ఫీల్డ్ మీద పట్టు సాధిస్తే, క్యాంప్ బెల్ తో హయ్యర్ ఎడ్యుకేషన్ కి పోవచ్చు. పోయి బ్రహ్మాండమైన కళాత్మక సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. ‘స్టోరీ’ అనే ఉద్గ్రంథం రాసిన రాబర్ట్ మెక్ కీ ఇదే చెప్తాడు - ముందు మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకున్న తర్వాత, కళాత్మక సినిమాలు ఆలోచించవచ్చని.


Q :  మీ పాత రివ్యూలు చదవాలంటే ఎలా?  ఉదాహరణకి ‘రేసు గుర్రం’  చదవాలి... అలాగే స్ట్రక్చర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాము కాబట్టి, సమయం దొరికినప్పుడు ‘శివ’ లాగా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఒదిగిన సినిమాల విశ్లేషణలు రాయండి. లేకపోతే  మీ బ్లాగు బోసిపోయినట్టుంటుంది.
అజ్ఞాత దర్శకుడు 

A :  బోసిపోయినా వదలరు. గణపతి కాంప్లెక్స్ దగ్గర వేలాడుతున్నట్టు బ్లాగుని పట్టుకుని వేలాడుతూ వుంటారు. బ్లాగుకుండే పరిమితుల దృష్ట్యా, కావాల్సిన వ్యాసాలు పొందాలంటే కొన్ని అసౌకర్యాలున్నాయి విజిటర్స్ కి. దీన్ని వెబ్ సైట్ గా మారిస్తే సెర్చింగ్ సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే బ్లాగులో పోగు పడిన వందల ఆర్టికల్స్ ని వర్గీకరణ చేసి,  వెబ్సైట్ కి బదిలీ చేయడమే పెద్ద పనై కూర్చుంది. ప్రస్తుతానికి ఇలా చేయవచ్చు –  ఏ సినిమా రివ్యూ కావాలో ఆ సినిమా విడుదల తేదీని బ్లాగు ఆర్కివ్ లో కెళ్ళి క్లిక్ చేస్తే  రివ్యూ దొరికిపోతుంది. విడుదల తేదీ ఆ సినిమాల వికీపీడియాలో వుంటుంది. ఒకవేళ రివ్యూ ఇవ్వడం ఒకటి రెండు రోజులు ఆలస్యం  జరిగివుంటే, ఆ ఒకటి రెండు తేదీలు కూడా కలిపి క్లిక్ చేసి చూడండి. ఇక మీరన్నట్టు సినిమాల విశ్లేషణలు తప్పక చేద్దాం. ఒక కొరియన్ లవ్ మూవీతో మొదలెడదాం.

***
         ఔను 95 వేలతో తీశా’ వ్యాసానికి సంబంధించి కడపనుంచి ‘Seven Roads’ అనే షార్ట్ మూవీ మేకర్ ఒక విషయాన్ని దృష్టికి తెచ్చారు. వ్యాసంలో పేర్కొన్న అస్సామీ కమర్షియల్ ‘లోకల్ కుంగ్ ఫూ 2’ ని క్రౌడ్ ఫండింగ్ తో నిర్మించారని.  ఇందులో వాస్తవం లేదు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ నిమిత్తమే  ఎనిమిది లక్షలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించారు. మిగతా వ్యయం 22 లక్షలు దర్శకుడితో బాటు ఇంకో ముగ్గురు నిర్మాతలు భరించారు. ఇదివరకు ‘లోకల్ కుంగ్ ఫూ’ అందించి పాపులరైన నేపధ్యంవుండడంతో  క్రౌడ్ ఫండింగ్ తేలికయ్యింది. 

          ఇక్కడ తెలుగు క్రౌడ్ ఫండింగ్ అభిమానులు గమనించాల్సిందేమిటంటే, మిగతా దేశంలో క్రౌడ్ ఫండింగ్ తో లో- బడ్జెట్ కమర్షియల్ సినిమాలు తీసి వ్యాపారం చేసుకుంటూంటే, తెలుగులో వ్యాపార దృష్టి లేక, కళాత్మక దృష్టితో ప్రపంచానికి తమదేదో చాటాలని, కమర్షియలేతర ఇండిపెండెంట్ మూవీస్ తలకెత్తుకుంటున్నారు. ఇది చాలా సిల్లీ. ఎలాగంటే, ప్రపంచీకరణ వల్ల అన్నీతెలుస్తున్నాయి. ఆ తెలుస్తున్నవన్నీ మనం అందుకోవాల్సినవి కావు. ప్రపంచీకరణ వల్ల మనకన్నీ గొప్పగా తెలుస్తున్నాయి కదాని చెప్పి ఎక్కడెక్కడి వరల్డ్, ఇండిపెండెంట్, షార్ట్ మూవీస్ తెచ్చి ఇక్కడ దుకాణం పెడితే అమ్ముడుపోవు.   హాలీవుడ్ లో ఇలాటి పని చేస్తే  గేట్లు వేసేస్తారు. హాలీవుడ్ కైనా, టాలీవుడ్ కైనా కలెక్షన్లు వచ్చే కమర్షియల్సే కావాలి. వరల్డ్ మూవీస్ బాపతు సినిమాలు కాదు.

          హాలీవుడ్ లోనూ  క్రౌడ్ ఫండింగ్ తో సినిమాలు తీస్తున్నారు. అవి పక్కా హాలీవుడ్ మార్కు కమర్షియల్ సినిమాలే. హాలీవుడ్ లో జే చంద్రశేఖర్ అనే అతను 3 మిలియన్ డాలర్ల క్రౌడ్ ఫండింగ్ తో  ‘సూపర్ ట్రూపర్స్’  అనే పక్కా యాక్షన్ కామెడీ తీస్తే, 24 మిలియన్ డాలర్లు వసూలు చేసింది! ఇదీ క్రౌడ్ ఫండింగ్ సద్వినియోగమంటే. 


          తెలుగులో క్రౌడ్ ఫండింగ్ తో తీసినవే రెండు. ఇవి ఏమయ్యాయో తెలిసిందే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఏదో ప్రయోగాలు చేద్దామనుకుని,  క్రౌడ్ ఫండింగ్ తో ఏం తీసినా,  ఏ సొంత క్రియేటివ్ కోర్కెలు తీర్చుకున్నా,  మళ్ళీ వాటిని విడుదల చేయాల్సింది వ్యాపారులే. ఎన్నో  కమర్షియల్ సినిమాల విడుదలలకే దిక్కులేదు,  కమర్షియలేతర సమాంతర సినిమాల మొహం ఏ వ్యాపారి చూస్తాడు. వచ్చిన చిక్కేమిటంటే,  వస్తున్న కొత్త తరం బిజినెస్ సైడే చూడరు. కమర్షియల్ సినిమాల్ని విమర్శిస్తూ వాటికంటే మెరుగైన తమ టాలెంటేదో  చూపించాలనుకుంటారు. అమాంతం వెళ్లి వరల్డ్ సినిమాల మోజుతో ఇండీ మూవీస్ తీసి పడేస్తారు. వ్యాపార తెలివే చేతకాదు. వరల్డ్ మూవీస్ కి ఇక్కడింత ఫ్యాన్ క్లబ్ పెరిగి పోతూ వుంటే, వాటి జన్మ స్థానమైన యూరోపియన్ దేశాల్లో 80 శాతం మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలు ఏలుకుంటున్నాయి. ఇంకెక్కడి వరల్డ్ మూవీస్!  ఎప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ అభిరుచులే యూనివర్సల్. ఎక్కడైనా వర్కౌటవుతాయి. సమాంతర సినిమాలకి విడుదలే కష్టం. వరల్డ్ మూవీస్ అంటే మనం మర్చిపోయిన భాషలో ఆర్టు సినిమాలే. ఆర్ట్ సినిమాలకి తెలుగులో మార్కెట్ వుందా? సింపుల్ లాజిక్! మన కోరికలు నెరవేరాలంటే ప్రేక్షకుల ఆశలతో మన కోరికలు కలవాలి. బిజినెస్ సైడు చూడని సినిమా కోరికలు నేరవేరవు. నమ్మి క్రౌడ్ ఫండింగ్ చేసిన వందలాది చందాదారులకి మొహం కూడా చూపించలేం.



సికిందర్