రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 23, 2016

రివ్యూ!


దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
తారాగణం: సందీప్ కుమార్, నైనా గంగూలీ, వంశీ చాగంటి, శ్రీతేజ్‌, కౌటిల్య, వంశీ నెక్కంటి తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : రాం గోపాల్ వర్మ,
రచన: చైతన్య ప్రసాద్‌, రాధాకృష్ణ, సంగీతం: రవిశంకర్‌, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాస్తవ్‌, దిలీప్‌ వర్మ, సూర్య చౌదరి
బ్యానర్‌: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
విడుదల : డిసెంబర్ 23, 2016
***
1970- 80లలో విజయవాడలో కొనసాగిన రౌడీ రాజకీయాలకి  రాం గోపాల్ వర్మ తనదైన  వెర్షన్ తో తెర రూపం ఇచ్చారు. వంగవీటి- దేవినేని కుటుంబాల మధ్య గొడవలు, పరస్పర హత్యలూ చూపించారు. ఒకప్పుడు రౌడీయిజం ఎలా రాజ్యమేలేదో వంగవీటి మోహనరంగా హత్య జరిగిన ఎడాది లోగానే, హైదరాబాద్ నేపధ్యంలో  ‘శివ’  ద్వారా తెలియజేశారు. ‘శివ’ నుంచీ ‘వంగవీటి’ వరకూ వచ్చిన వర్మ-  చరిత్రని కాల్పనీకం చేయడంలో- మధ్యలో తీసిన  ‘రక్తచరిత్ర’ తో కొంత వరకు నిరూపించుకున్నారు. ఆ నిరూపణతో విజయవంతంగా ‘కిల్లింగ్ వీరప్పన్’ కూడా  తీశారు. పరిటాల రవి, వీరప్పన్ లు ఈ కాలం ప్రేక్షకులకి తెలిసిన వాళ్ళే. వీళ్ళకీ 1970- 80 లనాటి దేనినేనీ- వంగవీటి లకీ మధ్య మూడు దశాబ్దాల అంతరం వుంది. ఈ అంతరాన్ని అధిగమిస్తూ ఆనాటి వ్యక్తులకి నేటి ప్రేక్షకులు కనెక్ట్ అవడానికి వర్మ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ‘వంగవీటి’ అనే టైటిల్ కి ఎంత వరకు న్యాయం చేశారు? మొత్తంగా ఈ చరిత్ర ద్వారా ఏం చెప్పాలనుకున్నారు?.....ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ కింద వెతుక్కుందాం.
కథ





      (చరిత్ర తెలియని వాళ్ళ కోసం కథని పూర్తి పేర్లతో, తేదీలతో  విడమర్చి చెప్పాల్సి వస్తోంది)...1972 లో విజయవాడని గడగడ లాడించిన కమ్యూనిస్టు రౌడీ నాయకుడు చలసాని వెంకటరత్నం హత్య జరిగింది. హత్య చేసిన వాడు వంగవీటి రాధా కృష్ణ మూర్తి అలియాస్ రాధ. ఎందుకు హత్య చేశాడంటే,  కేవలం బస్టాండ్ రాధాగా బస్టాండ్   వరకే రౌడీయిజం చేసుకుంటున్న తనని వెంకటరత్నం గ్యాంగులో చేర్చుకున్నాడు. రాధాకి ఆశ పెరిగింది. వెంకటరత్నం ని అడ్డుపెట్టుకుని బెజవాడ వ్యాప్తంగా ఎదగాలని కలలు గన్నాడు. ఇది వెంకటరత్నంకి తెలిసి ఘోరంగా అవమానించాడు. దీంతో కక్ష పెంచుకుని తన గ్యాంగుతో కలిసి వెంకట రత్నాన్ని కత్తులతో పొడిచి చంపేశాడు రాధ. వెంకట రత్నం అనుచరుల్ని కూడా ఊచకోత కోసి వెంకటరత్నం స్థానాన్ని కైవసం చేసుకుని బెజవాడకి కింగ్ అయ్యాడు. రిక్షా యూనియన్లూ, టాక్సీ యూనియన్లూ వెంకటరత్నం నుంచి రాధా  ఖాతాలోకి బదిలీ అయిపోయాయి. ముఠా ప్రధాన ఆదాయ మార్గం రౌడీ మామూళ్ళు వసూలు చేసుకోవడమే. 

         రాధా  తమ్ముడు మోహన రంగారావు అలియాస్ రంగా. ఇతను సినిమాల్లో లాగే అన్నో తండ్రో మాఫియా అయితే దూరంగా తన మానాన తాను అమాయకంగా బతికే యువకుడు లాంటి వాడు (‘గాడ్ ఫాదర్’ చిన్న కొడుకు కూడా ఇంతే కదా?). బాగా పరపతి పెంచుకున్న రాధా  దగ్గరికి ముగ్గురు స్టూడెంట్స్ – దేనినేని గాంధీ, నెహ్రూ, మురళీ  సోదరులు వచ్చి తమ కాలేజీలో గొడవలకి సంబంధించి సాయం అర్ధించారు. ఈ ముగ్గుర్నీ తనతో కలుపుకుని యూనైటెడ్ ఇండిపెండెంట్స్ అనే స్టూడెంట్ పార్టీని పెట్టించాడు రాధా.  ఇలా తమ నాయకుణ్ణి చంపి, బెజవాడని ఏలుకుంటూ ఏకుమేకైన రాధాని అడ్డు తొలగించు కోవాలనుకుంది కమ్యూనిస్టు పార్టీ. 1974 లో ఒక మామూళ్ళ సెటిల్మెంట్ కోసం ఓ షాపు కెళ్ళిన రాధాని పథకం ప్రకారం పట్టపగలు కత్తులతో పొడిచి చంపేశారు. వెంకట రత్నాన్ని రాధా ఎలా చంపాడో అలాగే తనూ చనిపోయాడు. 

       ఇక గ్యాంగ్ డైలమాలో పడింది. ఇప్పుడు ఎవరు నడపాలి? మళ్ళీ సినిమాల్లో లాగే అమాయకంగా దూరంగా బతుకుతున్న రంగా మీద దృష్టి పడింది. బలవంతం చేసి అతణ్ణి అన్న స్థానంలో కూర్చో బెట్టారు (గాడ్ ఫాదర్ తర్వాత గాడ్ ఫాదర్ చిన్న కొడుకు పరిస్థితీ ఇంతే కదా?- ఇలాటి ఇంకే సినిమాల్లోనూ ఇంతే కదా?). ఐడియాలివ్వడంలో గొప్ప వాళ్ళయిన దేవినేని సోదరులు, రాధాతో బాగానే నెట్టు కొచ్చారు. కానీ ఇప్పుడు రంగాతో అలా లేదు. నగరంలో ప్రైవేట్ సిటీ బస్సుల రద్దుకోసం జరిపిన ఆందోళనకి  తామే సారధ్యం వహించి జేజేలు కొట్టించుకోవడంతో రంగా కన్నెర్ర జేశాడు. దీంతో విడిపోయి కాలేజీలో వేరే పార్టీ పెట్టుకున్నారు దేవినేని సోదరులు- యూనైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని.  ఇటు రంగాకి లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. గుణదలలో జరిగిన ఒక హత్యకి సంబంధించి ప్రతీకారంగా రంగా, 1979లో దేవినేని గాంధీని కాలేజీ క్యాంపస్ లో చంపించేశాడు. దీంతో పగతో రగిలిపోయాడు గాంధీ చిన్న తమ్ముడు మురళీ. రంగా అనుచరుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని చంపేశాడు. 1983 లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో నెహ్రూ, మురళిలు ఆ పార్టీలో చేరిపోయారు. నెహ్రూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, రంగా ఓడిపోయాడు. అన్న ఎమ్మెల్యే అవడంతో మురళి ఇంకా చెలరేగిపోయాడు. తన పెద్దన్న చావుకు ప్రతీకారంగా ఎలాగైనా రంగాని చంపాలని ప్రతిన బూనాడు. రంగా భార్యకి ఫోన్ కూడా చేసి బెదిరించాడు. దీంతో నెల్లూరు  వెళ్లి వస్తున్న మురళిని చిలుకలూరి పేట దగ్గర 1988 మార్చిలో దారి కాచి చంపించేశాడు రంగా (ఈ హత్య జరిగినప్పుడు ఈ వ్యాసకర్త విజయవాడలోనే వున్నాడు). సౌమ్యుడైన నెహ్రూ ఆశక్తుడై పోయాడు. ఇక విజయవాడలో రౌడీ రాజకీయాలకి శాశ్వతంగా చుక్క పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. బడుగుల సమస్యలపై రంగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అదే 1988 లో, డిసెంబర్ 26 తెల్లవారుజామున అయ్యప్ప భక్తుల్లా ముఠా వచ్చిపడి దీక్షాశిబిరంలోనే రంగానీ, అనుచరుల్నీబాంబులేసి,  నరికి చంపేశారు...ఇదీ సినిమా కథ. 

ఎలావుంది కథ
     చరిత్ర తెలియని, ఆ చరిత్రలోని వ్యక్తుల గురించీ  తెలియని ప్రేక్షకులకైతే ఇది మరో మామూలు దాడి- ప్రతి దాడుల రొటీన్ మాఫియా కథలా వుంటుంది. నేటి ప్రేక్షకులు ఈ సినిమాలో పలికే ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతారని చెప్పారు వర్మ. అయితే మంచిదే. కానీ ఆ ఎమోషన్స్ కి ఇవి రియల్ లైఫ్ క్యారక్టర్లు అనే స్పృహ కూడా వుంటేనే బాగా కనెక్ట్ అవగల్గుతారు.  సీదా సాదా హత్యకు ప్రతిహత్యగా, ఓ థ్రిల్లర్ లా అనిపించే ఈ కథలో, బెజవాడ రౌడీల చరిత్ర, ఆ సంఘటనల క్రమం, ఆ వ్యక్తులూ తెలిసి వున్న ప్రేక్షకులతో  పేచీలేదు. ఎలాగూ  ఆ సంఘటనలతో, వ్యక్తులతో  కనెక్ట్ అవుతారు. ఇదలా ఉంచితే, హత్యలకి దారితీసిన పరిస్థితులపై గానీ, మోటివ్స్ పై గానీ  సరైన దృష్టి పెట్టలేదు. అలాగే, పాత్రల మధ్య వాడు మావాణ్ణి చంపాడు, కాబట్టి నేను వాణ్ణి చంపాలన్నట్టుగా –వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత గొడవల్లాగే  చిత్రణ వుంది తప్ప- అప్పట్లో వాళ్ళ చుట్టూ వున్న వాళ్ళ సాంఘీక, రాజకీయ జీవితాలూ పరిస్థితులూ చూపించింది లేదు. ఇందుకు కూడా ఇదొక సాధారణ థ్రిల్లర్ రూపం ధరించి నట్టయింది.  ఈ కథ ఎవరిది? వంగవీటి రంగాదా, లేకపోతే దేవినేని సోదరులదా? దేవినేని సోదరుల  కథ అన్నట్టే తయారయ్యింది. టైటిల్ మాత్రం ‘వంగవీటి’....టైటిల్ ప్రకారం వంగవీటి మోహన రంగారావుని హైలైట్ చేయడానికి ఎందుకో మొహమాట పడ్డారు వర్మ, చివరికి రంగా హత్యని కూడా చప్పగా తేల్చేశారు. రంగా అన్న రాధా హత్యకి కూడా బిల్డప్ ఇవ్వలేదు గానీ, దేవినేని సోదరు లిద్దరి హత్యల్ని మాత్రం టైం తీసుకుని, బిల్డప్పులతో, అంత డిటైల్డ్ గా బాగా చూపించారు. రంగా అనుచరుణ్ణి చంపడానికి మురళీ వెంట తరిమే సీను కూడా చాలా యాక్షన్ తో కూడుకున్నది. ఇలా ప్రేక్షకుల్లోకి ఏ సంకేతాలు పంపదల్చుకున్నారో తెలీదు కానీ,  సానుభూతిని ఎవరిపై ఎక్కుపెట్టారో తెలిసిపోతోంది.

          కానీ రంగా ఒక మహా శక్తిగా ఎదిగాడు. ఎలా ఎదిగాడన్నది చూపించలేదు. బెజవాడ దాటుకుని రాష్ట్రమంతా ప్రసిద్ధుడయ్యాడు రాజకీయాల్లోకి వచ్చాక. ఇది కూడా చూపించలేదు. పేదలకి, బడుగులకి ఒక దేవుడిలా అవతరించాడు. దీని ప్రసక్తి కూడా లేదు. అందుకే ఆయన హత్య తర్వాత బెజవాడ ఒక్కటే కాదు- శ్రీకాకుళం నుంచీ ఆదిలాబాద్ దాకా అట్టుడికి పోయింది. లూటీలూ దహనాలూ జరిగాయి. కమ్మ కులస్థుల్ని టార్గెట్ చేసి వాళ్ళ హోటళ్ళూ, థియేటర్లూ, షాపులూ తగులబెట్టారు. మామూలు జనాలు సైతం ఎగబడి షాపుల్లోంచి టీవీలూ మిక్సీలూ ఎత్తుకెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బస్సులు నాశనమయ్యాయి. వారంపాటు స్తంభించిపోయింది రాష్ట్రం. హైదరాబాద్ లో ఆ వర్గం వారి థియేటర్లని తగులబెట్టారు. కాచీగూడ లోని ఎన్టీరామారావు తారకరామా థియేటర్ కూడా ఆహుతయ్యింది. 40 రోజులపాటు కర్ఫ్యూ నీడన మగ్గింది విజయవాడ. ఇంతటి విధ్వంసం రాష్ట్రంలో మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య అప్పుడే జరిగింది. రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్న కుమారి 1989 లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశంలోకే వెళ్ళారు.

        వర్మ కథలో క్లయిమాక్స్ లో రంగా హత్యా దృశ్యం తుస్సు మన్పించడమే గాక- ఒక వాయిసోవర్ తో కథ ముగించేశారు. రంగా హత్యతో విజయవాడ మాత్రమే విధ్వంసానికి గురయ్యిందన్నారు. హత్య ఎవరు జరిపించారో ఇప్పటికీ ఎవరికీ తెలీదన్నారు. తెలిసి, చూస్తూ వున్నా, ఆ కనక దుర్గమ్మ నోరు విప్పడం లేదని ఒక జోకేసి ముగించారు. రంగా భార్య రత్నకుమారి పాత్రని హత్యలకి ప్రోత్సహించే మనిషిగా చిత్రించారు. ఇదెంతవరకూ నిజం. ఆ పాత్రని అర్ధాంతరంగా ముగించారు. చరిత్రని చూపిస్తున్నప్పుడు ఏదీ దాచకూడదేమో?  రంగా కాపు అయితే, రత్నకుమారి కమ్మ. వాళ్ళది కులాంతర వివాహం. కానీ విచిత్రంగా ఈ రెండు కులాల మధ్యే అగ్ని రాజుకుంది. పోతే, మాట మాత్రంగానైనా ఆ తర్వాత ప్రారంభమైన రత్నకుమారి  రాజకీయ జీవితం గురించి చెప్పలేదు. దేవినేని కుటుంబంలో మిగిలిన నెహ్రూ గురించిన ముక్తాయింపు కూడా లేదు.


        రంగా హత్య ఎవరు జరిపించారో తెలియదన్నారు గానీ, ఒక చోట ఎన్టీఆర్ కాలు, మరో చోట ఎన్టీఆర్ చెయ్యీ ఎందుకలా చూపించారో మరి. వాస్తవంలో రంగా హత్య కేసుని నెహ్రూ ఎదుర్కొన్నాడు. 40 మందికి పైగా అనుచరుల్ని అరెస్ట్ చేశారు. రత్నకుమారి కోరిక మీద కేసుని రంగారెడ్డి కోర్టుకి బదిలీ చేశారు. 2002 లో తీర్పు వచ్చింది. అప్పటికి 13 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన వాళ్ళు ప్రాసిక్యూషన్ వైఫల్యంవల్ల విడుదలై పోయారు. ఇలా కేసు మీద తీర్పు కూడా వచ్చింది. 



       వర్మ వంగవీటి- దేవినేనిల ఇమేజిలతో ఎటూ తేల్చుకోలేక, చరిత్రతో ఎందుకొచ్చిం
దన్నట్టు ఓ యాక్షన్ థ్రిల్లర్ లా తీసేశారు. ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలీదుగానీ- ఒక సూక్ష్మం మాత్రం బోధపడుతుంది- గ్యాంగ్ స్టర్ అనేవాడు చెప్పుడు మాటలు వింటే ప్రాణాల మీదికే వస్తుందనేది. ఈ కథలో ఇది వెంకటరత్నం హత్యలో, రంగా- దేవినేని సోదరులు విడిపోవడంలో కన్పిస్తుంది. అప్పట్లో రాధా గనుక వెంకట రత్నంని చంపకుండా వేరు కుంపటి పెట్టుకుని వుంటే ఈ రౌడీ రాజకీయం ఇన్ని వరస హత్యలతో ఇన్ని మలుపులు తిరిగేది కాదు. రాధా వేసిన బాటనే మిగిలిన వాళ్ళూ అనుసరిస్తూపోయారు. 


        ఇదలా ఉంచితే, ఈ మొత్తం చరిత్రలో షేక్స్ పియర్ ‘మాక్బెత్’ నీతి కన్పిస్తుంది.
అనుచరుడనే వాడు లీడర్ కి అనుచరుడుగానే వుండాలి. లీడర్ స్థానాన్ని ఆక్రమించడం కోసం లీడర్ ని చంపితే ఏమౌతుందో చరిత్రలో చాలా మాక్బెత్తులు చాలా సార్లు చెప్పాయి. ఒక లీడర్ అనుచరుడు ఎదుటి లీడర్ని కూడా తన లీడర్ ఆదేశాలతో తప్ప చంపకూడదు. అనుచరుడు లీడర్ గా ఎదగాలనుకుంటే వేరు కుంపటి పెట్టుకోవాలి. అప్పుడు లీడర్ అనుచరులకీ తన అనుచరులకీ మధ్య గ్యాంగ్ వార్స్  జరుగుతూండవచ్చు. అప్పటికీ లీడర్ ని చంపకూడదు. కథని ప్రారంభించడానికి లీడర్ని చంపకూడదు, ఒకవేళ కథని ముగించడానికి చంప వచ్చు- వర్మ తీసిన ‘కంపెనీ’ లో సినిమా ముగుస్తూండగా, అజయ్ దేవగణ్  మాఫియా లీడర్ పాత్రని, విజయ్ రాజ్ అనుచరుడి పాత్ర అనూహ్యంగా షూట్ చేసి చంపే ఫినిషింగ్ టచ్ లా...


        ఆధిపత్యం కోసం రాధా వేరు కుంపటి పెట్టుకోకుండా తన లీడర్ వెంకట రత్నాన్నే  చంపాడు. అందుకు త్వరలోనే అనుభవించాడు. రాధా మీద వెంకటరత్నానికి గాసిప్స్ మోసిన వెంకటరత్నం అనుచరులు మాక్బెత్ లో మంత్రగత్తెల పాత్రలే. అలాగే దేవినేని సోదరులమీద గాసిప్స్ మోసిన రంగా అనుచరులు కూడా మాక్బెత్ మంత్రగత్తెల్లాంటి వాళ్ళే. వెంకటరత్నం, రంగాలు ఈ ‘మంత్రగత్తెల’ మాటలకి పడిపోవడం వల్లే అనర్ధాలు జరిగాయి. కానీ వెంకటరత్నంతో రాధా చేసినట్టుగా గాక, తమ లీడర్ రంగా నుంచి విడిపోయి దేవినేని సోదరులు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఇక గ్యాంగ్ వార్స్ అనే సహజ పరిణామాలు సంభవించాయి. ఇవి ముదిరి రంగా గాంధీని చంపించాడు. అప్పుడు మురళి రంగా జోలికెళ్ళ కుండా, సరిగ్గానే రంగా అనుచరుల్ని చంపాడు. ఇప్పుడు మిగిలిన రెండో అన్న నెహ్రూని లీడర్ గా తీసుకుని  మురళి అనుచరుడుగా ఉండాల్సిన వాడు. అలా ఉండలేదు. తమ ప్రత్యర్ధి రంగాని స్వతంత్రించి తనే చంపాలనుకున్నాడు. సేమ్ రాధా గతి పట్టింది. అప్పుడు లీడర్లు లీడర్లు  పోరాడుకుని ఒక లీడర్ రంగా హతమయ్యాడు...
        వర్మ తీసిన  ఈ ‘చరిత్ర’ లోంచి ఈ ‘మాక్బెత్’ నీతిని మాత్రమే గ్రహించగలం.



ఎవరెలా చేశారు 
       ప్రతివొక్కరూ బాగా నటించారు. ఇందులో రెండో మాటకి తావులేదు. కాకపోతే వాళ్ళ పాత్రల్నే వర్మ పైపైన తడిమి వదిలెయ్యడంతో సజీవ పాత్రలుగా మాత్రం కన్పించరు.  ఉన్నంత వరకూ పాత్రల్ని అద్భుతంగా నటించారు. అందరూ కొత్త ముఖాలే, ఒక్క లాయర్ పాత్రధారి తప్ప. దీంతో ఫ్రెష్ ఫీలింగ్ కన్పిస్తుంది. కొత్తవాళ్ళయినా నటింప జేసుకోవడంలో వర్మ ఎప్పుడూ విఫలమవలేదు.  సోదరులు రాధా, రంగా రెండు పాత్రల్నీ సమర్ధవంతంగా పోషించాడు సందీప్ కుమార్. ముఖ్యంగా సౌమ్యంగా కన్పించే రంగా పాత్రలో ప్రధానంగా దృష్టిని ఆకర్షిస్తాడు.  ఇక అచ్చం నెహ్రూ లాగే వున్న శ్రీతేజ్ ఇంకొక హైలైట్. చలసాని వెంకటరత్నం (విజయవాడ రాజకీయాల్లో ఇంకో వెంకటరత్నం వుండేవారు- కాంగ్రెస్ మంత్రీ, గొప్ప నాయకుడూ అయిన కాకాని వెంకటరత్నం) పాత్రలో వంశీ నెక్కంటి విచిత్ర  మ్యానరిజమ్స్ ని ప్రదర్శించాడు షార్ట్ టెంపర్ వ్యక్తిత్వంతో. గాంధీగా కౌటిల్య, మురళీగా వంశీ చాగంటి, రత్నకుమారిగా నైనా గంగూలీ కూడా కొత్త వాళ్లన్పించనంత ఈజ్ తో నటించుకు పోయారు. 

        ఈ సినిమా బలహీనత అంతా కూడా కొట్టొచ్చి నట్టు కన్పించే పాత్రల మధ్య కుల సమీకరణలని నిర్వచించక పోవడం దగ్గరే వుంది. నగరంమీద ప్రారంభమైన ఆధిపత్య పోరు కాస్తా కులాధిపత్య పోరుగా పరిణమించి, అంతిమంగా దాని ఫలితాలు అమాయక ప్రజలెలా చవిచూశారో  చెప్పక దాట వెయ్యడంలోనే వుంది.... రత్నకుమారి పాత్ర కేంద్ర బిందువుగా- ఆలంబనగా దీన్ని పకడ్బందీగా చూపించుకు రావొచ్చు.  ఈ పని చేయలేదు. కానీ ఈమె తన స్వకులస్థులైన దేవినేని వర్గీయులనే చంపేందుకు భర్తని ప్రోత్సహించినట్టు చూపించారు.



       ఇది వర్మ చేసిన కల్పనే అయితే,  ఇది ‘మాక్బెత్’ సూత్రాల ప్రకారం కూడా చాలా తప్పు. అధికారంలో వున్న భర్తని భార్య హత్యలకి ప్రోత్సహిస్తోందంటే ఆమెకి సొంత ఎజెండా ఉండొచ్చు. ఆ హత్యా పరంపరలో భర్త రాలిపోతే, ప్రియుడితో కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని. ‘మాక్బెత్’ చేసే హెచ్చరిక ఇదే (ఇంకా కావాలంటే ‘మాక్బెత్’ ఆధారంగా విశాల్ భరద్వాజ్ తీసిన ‘మక్బూల్’ చూడొచ్చు). కానీ వర్మ చూపించిన ‘భార్య’ పాత్రకి ఇలాటి సొంత ఎజెండాలు కన్పించవు. ఆమె నిజాయితీతోనే వుంటుంది. కానీ ఎలాంటి నిజాయితీ? తను ప్రేమిస్తున్న రంగాతో ఇంట్లో పెళ్ళికి వొప్పుకోకపోతే, ఇల్లొదిలి వచ్చేసిన తనని దేనినేని సోదరులు, తల్లీ  తమ ఇంట్లో పెట్టుకుని రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించారు. అలాటి సహృదయుల పైన భర్తని  ఎలా ఎక్కుబెడుతుందామె? మధ్య వర్తిత్వం నెరపి ఉద్రిక్తతల్ని సడలింప జేయొచ్చుగా? అంత నెగెటివ్ రోల్ ప్లే చేసిన పాత్ర చివరికి ఏం సాధించింది? పే ఆఫ్ కాని  పాత్ర ప్రవర్తనని వూరికే సెటప్ చేయడమెందుకు?


         ఇక దేవినేని సోదరులే తమ కులస్థురాల్ని కాపు కులస్థుడైన రంగాకి నచ్చ జెప్పి పెళ్లి జరిపించినట్టు చూపించినప్పుడు,  ఇది డ్రమెటిక్ సందర్భం వాళ్ళ నిజజీవితాల్లో కూడా. కులాంతర వివాహంతో ముడిపడిన ఈ డ్రమెటిక్ సందర్భమే ఆ తర్వాత వాళ్ళ మధ్య అన్ని సంఘర్షణల్లోనూ వర్మ గుర్తు చేయాలి నిజానికి - చరిత్ర మీద కామెంట్ చేయబూనిన ఒక దర్శకుడైతే. ఏదీ దాచకుండా చరిత్రని ఎత్తి చూపించి ప్రశ్నించి నప్పుడే ఇలాటి సినిమాల్లో దర్శకత్వ నిబద్ధత కనబడేది. దేనికో వెరచి, ఎందుకో సందేహపడి తటస్థ వైఖరిని వదులుకుంటే అది రాజకీయనాయకుడి లక్షణమౌతుంది.  చరిత్ర బ్యాడ్ జర్నలిజమని ఇందుకే అని ఉంటాడు జోసెఫ్ క్యాంప్ బెల్. ఇది నిజం చేశారు వర్మ. అంత నిర్భయంగా ట్వీట్లు చేసే వర్మ,  సినిమాలో తన సహజ శైలి ఫీట్లు చేయక, నిమ్మకు నీరెత్తి నట్టుండిపోయారు- మొక్కుబడి యాక్షన్ థ్రిల్లర్ చూపించేస్తూ. 



      పోస్టర్ల మీద ‘కాపు కాసే శక్తి’ అని కులప్రస్తావన తెచ్చినంత స్వేచ్ఛగా కథలో తిరుగాడలేక పోయారు వర్మ. కాదనలేని ఈ కులాల కోణాన్ని కథకి ఆత్మగా చేసుకుని వుంటే, అదే ఎమోషనల్ థ్రెడ్ గా మారి అద్భుతం చేసివుండేది ఈ సినిమాకి. ఈ కథలో మొదట కులాలకతీతంగా వున్నపాత్రలు ఎలా దిగజారిపోయాయో ఒక బలమైన ముద్రతో చెప్పే వీలుండేది. చరిత్రని ఉన్నదున్నట్టో, అసమగ్రంగానో, అర్ధసత్యాలతోనో చూపించి చేతులు దులుపుకోకుండా, ఆ చరిత్ర సృష్టించిన మనుషులు మిస్సయ్యిందేమిటో,  అది ఎత్తి చూపిస్తూ సమాజానికో హెచ్చరిక పంప గలగాలి. తన యుక్త వయస్సు నుంచీ ఈ హింసారి రంసని గమనిస్తూ వచ్చానంటున్న వర్మ- ఒక్క మాటలో ఈ చరిత్ర మీద తన అభిప్రాయమేమిటో చెప్పి ఉండాల్సింది. రిపోర్టింగ్ చేయడం అభిప్రాయం చెప్పడం కాదు. 

        ఒక్కో హత్య జరిగినప్పుడల్లా వర్మ తన వాయిస్ తో  వ్యాఖ్యానాలు చేయడం కథని ముందుకు నడిపించే మంచి టూల్ గానే ఉపయోగపడింది గానీ, ఒక్కోసారి అదే కర్ణక ఠోరంగా పరిణమించిన  మాట కూడా నిజం. అలాగే ఎమోషన్లు పెంచడానికి సెకండాఫ్ లో వరుసగా బ్యాక్ గ్రౌండ్ లో తన స్టయిల్ లో పెట్టిన అరుపుల పాటలతో ఆయా విష పరిణామాలని చూపించడం కూడా పైపైన వేసిన పూతే.  ఎమోషన్ అనేది కథలో వుండే పాయింటు లోంచి కదా పుట్టాలి. ఆ పాయింటు పాత్రలు విస్మరిస్తున్న అంతకి ముందున్న సెక్యులరిజమే. పాయింటుతో కట్టి పడెయ్యకుండా సినిమాని నిలబెట్టడం కష్టం. ‘షిండ్లర్స్ లిస్ట్’ అనే స్పీల్ బెర్గ్ తీసిన నాజీల చరిత్రలో- విలాసవంతంగా జీవిస్తూండే వ్యాపారవేత్త, ఎందుకని లక్షాలాది మంది యూదుల్ని తన సొంత ఖర్చుతో నాజీల ఊచకోత నుంచి తప్పిస్తూ పొరుగు దేశాలకి తరలిస్తూ పోయాడు? కేవలం తనలో మేల్కొన్న మానవత్వం కారణంగానే! ఈ మానవత్వమనే పాయింటే  సినిమాకి ఆత్మ అయింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఏర్ లిఫ్ట్’ లో కూడా ఇంతే. ఎన్ని ఇజాలు పెట్టుకున్నా అవన్నీ మానవిజం కిందే వుంటాయి.

        సినిమాలో మాటలు పొట్టిగా సూటిగా బలంగా బావున్నాయి. టెక్నికల్ గా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ వున్నాయి. ఒకే సీన్లో రాధాని చంపే ముందు,  షాపు ముందు వుండే తడి నేల, వెంటనే పొడి నేలగా కన్పిస్తుంది. టీడీపీ పార్టీ అవిర్భవించినట్టు డైరెక్టుగా పసుపు జెండాలు చూపించకుండా కాస్త కాషాయంగా వుండే పతాకాలు చూపించారు.  అదే నెహ్రూ ఎన్నికల ప్రచారంలో అవికాస్తా ఒరిజినల్ తెలుగుదేశం పసుపు పచ్చ జెండల్లా బస్తీమే సవాల్ గా రెపరెప లాడుతున్నాయని చూసుకోలేదేమో కాస్ట్యూమ్స్ అతను- ఆర్ట్ డైరెక్టర్ కూడా.




        లొకేషన్స్ పరంగా ఆనాటి  విజయవాడని పకడ్బందీగా చూపించారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాలు వ్యూలోకి రాకుండా ఏరియల్  షాట్స్ మేనేజ్ చేశారు. అలాగే ఒక్కో హత్యా దృశ్యాల సెటప్ ని – యాక్షన్స్ నీ అద్భుతమైన సస్పెన్సుతో  క్రియేట్ చేస్తూ పోయారు. మురళిని చంపేటప్పుడు ఓపెనయ్యే లారీ బాడీలో, ముందు కత్తులూ కటార్లూ టపటప వచ్చి పడే సీను ఒక మార్వెలస్ క్రియేషన్. 


స్క్రీన్ ప్లే సంగతులు

      వర్మ ఫ్లాష్ బ్యాకుల జోలికి పోరు- అదే ఈ స్క్రీన్ ప్లేకి పెద్ద మైనస్. కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్స్ ని డిమాండ్ చేసే కథిది. అప్పుడే ఏకత్రాటి పైకి కథ రావడమే గాక, ఒకే పాత్ర ఆధారంగా కథని నడిపించడానికి వీలవుతుంది. సినిమా కథ ఎప్పుడూ ఒక్క పాత్రదే అయ్యుంటుంది. మిగిలిన పాత్రలు ఆ ఒక్క పాత్ర కథలో అంతర్భాగంగా  వుంటాయి.  కారణాలేవైతేనేం, పెట్టుకున్న టైటిల్ ప్రకారం వంగవీటి రంగా కథగా చూపించదల్చు కోలేదు వర్మ. అందులో అంతర్భాగంగా దేవినేనిల కథనీ  చెప్పదల్చుకోలేదు. కానీ వంగవీటి సోదరులు లేకపోతే దేవినేని సోదరులే లేరు. ఇంకా చెప్పాలంటే వెంకటరత్నం లేకపోతే  ఇంకెవరూ లేరు, ఈ చరిత్రే లేదు. ఇప్పుడు పనిగట్టుకుని వంగవీటి రంగా జీవిత చరిత్ర తీయడం, అందులో ఆయన్ని ప్రజాబాంధవ్యుడిగా చిత్రించడం వర్మ చేసేపని కూడా కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తి ఆరాధనకి దూరం. ఎవరి భజనా చెయ్యరు. ఇది మంచిదే. కానీ స్క్రీన్ ప్లే కి ఏది మంచిది? 

        చరిత్రలో ఎవరికీ ప్రాధాన్య మివ్వకుండా అందరి జీవితాలనీ కలిపి డాక్యుమెంటేషన్  చేస్తే అది సినిమా స్క్రీన్ ప్లే అవతుందా? కథలతో అపార అనుభవమున్న వర్మ కివన్నీ తెలీవని కాదు, తెలీదన్నట్టు ఇలా రాయడం కూడా మంచిదికాదు. కానీ ఫలితం సినిమాటిక్ అనుభవానికి భిన్నంగా వచ్చింది. సినిమా స్క్రీన్ ప్లేని వదిలేసి డాక్యుమెంటేషన్ చేస్తూ డాక్యూ డ్రామా చేశారు కాబట్టే అనేక సార్లు మధ్య మధ్యలో తన వాయిసోవర్ తో వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చింది. ఇదంతా  సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బ తీసింది. ఒకే పాత్ర- ఒక లక్ష్యం అన్నట్టుగా ఉంటేనే కదా స్క్రీన్ ప్లే అన్పించుకునేది. రాసుకున్నవన్నీ స్క్రీన్ ప్లేలు అయిపోవుగా. 


        వివాదం ఎప్పుడు వుంటుంది? రెండు వర్గాలున్నప్పుడే. వివాదాస్పద కథల జోలికెళ్ళి నప్పుడు-రెండు వర్గాల్నీ బ్యాలెన్స్ చేయాల్సి వుంటుంది. ఆ బ్యాలెన్సింగ్ కోసం అందర్నీ కలిపేసి డాక్యుమెంటేషన్ చేస్తే సినిమా అవదు. ‘గాంధీ’ జీవిత చరిత్రతో  సినిమా ఎలా తీయాలన్నప్పుడే అటెన్ బరోకి అమల్లో వున్న స్క్రీన్ ప్లే సూత్రాల్ని తనకోసం కస్టమైజ్ చేసుకోవాలన్పించింది. లేకపోతే గాంధీ జీవితంలో జరిగిన ఎన్నో మహత్తర సంఘటనల్ని ఒక కథగా చెప్పడం కుదరదు. ఆయన జీవితంలోంచి నాల్గే ఘట్టాలు- దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా జీవితం, అవమానం, అందులోంచి లక్ష్యం; భారత్ కి తిరిగి వచ్చి ఆ లక్ష్య సాధనకోసం సహాయ నిరాకరణోద్యమం, మతకలహాలు, మరణం- ఇలా విభజించుకుని స్క్రీన్ ప్లే చేస్తే,  అది సమగ్ర రూపంలో గాంధీ జీవితంలా వచ్చింది. 


        ‘వంగవీటి’ ని ఇలా చేయాలనీ కాదు, రెండు వర్గాలున్నప్పుడు వంగవీటి ని హైలైట్  చేస్తే అది వివాదాస్పదం కావొచ్చు. పైగా వ్యక్తి ఆరాధన కూడా కావొచ్చు. అందుకే ఇలా జరక్కుండా టైటిల్ ఒకటిగా, సినిమా ఇంకొకటిగా తీశారు. ఇలాకాకుండా స్క్రీన్ ప్లే చట్రంలోకి వచ్చి, ఒకే పాత్ర- ఒకే లక్ష్యం అనుకుని,  ఈ సూత్రాన్ని అవసరానికి తగ్గట్టుగా సినిమాటిక్ అనుభవంతో, కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. 


        ఒకే పాత్ర (వంగవీటి)- ఒకే లక్ష్యం (దేవినేనిలు), ఒకే పాత్ర (దేవినేని నెహ్రూ)- ఒకే లక్ష్యం (రంగా). ఇలా ఇద్దరి వేర్వేరు వ్యవహారాల డైనమిక్స్ ని  సమాంతరంగా రన్ చేయడం. ఓపెనింగ్ మురళి మర్డర్ తో. దీంతో నెహ్రూ దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- తాము రంగా బ్యాచిలో చేరినప్పట్నించీ మురళి మర్డర్ వరకూ- రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని.  అటు రంగా దృక్కోణంలో ఫ్లాష్ బ్యాక్- వెంకటరత్నం దగ్గర్నుంచీ తన అన్న మర్డర్, దాంతో  తాను బాస్ అయిన విధం వరకూ- - రాజకీయాల్లోకి వచ్చాక తాను సాధించిన విజయాలూ కలుపుకుని. ఇప్పుడు ఇద్దరి సమగ్ర రూప మేర్పడింది, ఎవరేమిటో స్పష్టమైన ముఖ చిత్రం కళ్ళకి కట్టింది. ఇక క్లయిమాక్స్...రంగా మరణం, నెహ్రూ అరెస్ట్, అల్లర్లు, ఎండ్ టైటిల్స్ తో కేసు పరిణామాలు వగైరా. 


        వర్మ ఒక్కో హత్యని  ఒక్కో ప్లాట్ పాయింటుగా  పెట్టుకుంటూ పోయారు. బిగినింగ్ విభాగంలో రాధా  ఎదుగుదలలో భాగంగా వెంకటరత్నం మర్డర్ వేశారు.  తర్వాత రాధా మర్డర్ తో ప్లాట్ పాయింట్ వన్ ని  తెచ్చి, బిగినింగ్ ని ముగిస్తూ  రంగాని  ముగ్గులోకి దింపారు. ఇప్పుడు మిడిల్ ప్రారంభిస్తూ దేవినేనిలతో సంఘర్షణ పుట్టించి, ఇంటర్వెల్లో దేవినేని గాంధీ మర్డర్ వేశారు. మళ్ళీ ఈ మిడిల్ ని  కంటిన్యూ చేస్తూ సెకండాఫ్ లో,  ప్లాట్ పాయింట్ టూ గా,  మురళీ మర్డర్ వేశారు. దీనితర్వాత  రంగా మర్డర్ తో క్లయిమాక్స్.   


        ఇలా చేయడం వల్ల గుంపుగుత్తగా రెండు వర్గాల కథల్నీ కలగాపులగం చేసినట్టయ్యింది. దీంతో చూసేవాళ్ళకి ఆటోమేటిగ్గా ఎవరు హీరో, ఎవరు ఈ కథ నడిపిస్తున్నారూ అన్న సైకలాజికల్ కనెక్షన్ సంబంధ గడబిడ మొదలయింది. ఈ మొత్తాన్నీ పైన చెప్పుకున్న విధంగా, కస్టమైజ్ చేసుకుని వుంటే,  ఆ విడి విడి కథల్లో ఇద్దరూ హీరోలుగానే కన్పించే వాళ్ళు - ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్నది ప్రేక్షకులకే వదిలేస్తూ.

-సికిందర్
http://www.cinemabazaar.in