రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 29, 2016

రచన- పాటలు- దర్శకత్వం : ముదస్సర్ అజీజ్

తారాగణం : అభయ్ డియోల్, డయానా పెంటీ, మోమల్ షేక్, అలీ ఫైజల్, జిమ్మీ షేర్ గిల్, పీయూష్ మిశ్రా, జావేద్ షేక్, కన్వల్జిత్ సింగ్ తదితరులు సంగీతం : సోహైల్ సేన్, ఛాయాగ్రహణం : సౌరభ్ గోస్వామి బ్యానర్స్ : ఇరోస్  ఇంటర్నేషనల్, ఎ కలర్ ఎల్లో ప్రొడక్షన్ నిర్మాతలు : కృషికా లుల్లా, ఆనంద్ ఎల్ రాయ్
 
విడుదల :  18 ఆగస్టు, 2016
***
        కామెడీ తీయడం ఆషామాషీ వ్యవహారం కాదనీ,  అందుకే ఇప్పుడు ప్యూర్ కామెడీల జోలికి ఎవరూ పోవడం లేదనీ, ఈ సెగ్మెంట్ లో శూన్యాన్ని భర్తీ  చేసి లాభపడే ఆలోచన చేయడం లేదనీ, చేస్తే కామెడీకి పూర్వవైభవం కల్పించే అదృష్టం చేసుకుంటూ, దండిగా రాబడులు కూడా  పొందవచ్చనీ తెలియజేసుకుంటూ హిందీలో ఓ సినిమా వచ్చింది- ‘హేపీ భాగ్ జాయేగీ’ అని.  ఇది అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం...

కథ 
     అమృత్ సర్ లో ఇండో- పాక్ వ్యవసాయ సదస్సు జరుగుతూంటుంది. పాకిస్తాన్ నుంచి మాజీ గవర్నర్ జావేద్ అహ్మద్ (జావేద్ షేక్), అతడి కొడుకు బిలాల్ అహ్మద్ (అభయ్ డియోల్) వచ్చి పాల్గొంటారు. కొడుకు తన లాగే రాజకీయాల్లోకి వస్తే పాకిస్తాన్ చరిత్రే మారిపోతుందని నమ్ముతూంటాడు జావేద్  (It will change the history of Pakistan).  కొడుకు బిలాల్ కి రాజకీయాలంటే ఇష్టముండదు. క్రికెటర్ కావాలని వుంటుంది. తండ్రిమాట కాదనలేక ఈసురోమని ఏడుస్తూ  రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటాడు.  అమృత్ సర్ లో సదస్సు ముగించుకుని లాహోర్ వెళ్ళిపోతాడు తండ్రితో. ఉదయాన్నే లేచి అమృత్ సర్ నుంచి తెచ్చుకున్న పెద్ద పళ్ళ బుట్టని తెరిస్తే,  అందులోంచి కెవ్వు మంటూ హేపీ (డయానా పెంటీ) బయటికి గెంతుతుంది. బిలాల్ తో బాటు పనిమనిషీ, పియ్యే అదిరిపడతారు. ఎవరు ఏమిటని ఆరాతీస్తే, తను అమృత్ సర్ వాసి. అక్కడి కార్పొరేటర్ బగ్గా ( జిమ్మీ షేర్ గిల్) తో తన కిష్టం లేని పెళ్లి చేస్తున్నాడు తండ్రి (కన్వల్జిత్ సింగ్). తను గిటారిస్ట్ గుడ్డూ (అలీ ఫైజల్) ని కాలేజీలో చదువుకుంటు
న్నప్పట్నించీ ప్రేమిస్తోంది. గుడ్డూతో పారిపోవాలని పెళ్లి పందిట్లో పైనుంచి దూకితే లారీలో పడింది. గుడ్డూ మిస్సయ్యాడు. లారీలో పళ్ళ బుట్టలో దాక్కున్న తనకి రాత్రిపూట లారీ ఎటు వెళ్లిందో తెలీదు. ఇదీ సంగతి. 

        అమృత్ సర్ నుంచి ఆ లారీతో బాటు తన  కాన్వాయ్ సరిహద్దు దాటుకుని మా లాహోర్ వచ్చిందంటాడు బిలాల్. ఇది లాహోర్,  నువ్వు పాకిస్తాన్ లో వున్నావ్- మా కొంపలు ముంచావ్-  అని లబోదిబో మంటాడు. ఇది బయటపడితే రాజకీయంగా అల్లరవుతుందనీ, హేపీని పోలీసులకి అప్పగిస్తే ఆమెకి కూడా ఇబ్బందులు తప్పవనీ భావించి,  తండ్రికి తెలీకుండా ఇంట్లోనే దాస్తాడు. ఇంట్లో కన్పించీ కన్పించకుండా మిస్సవుతున్న ఆకారాన్ని చూసి తండ్రి కంగారు పడుతూంటే, ‘అది అమ్మ ఆత్మ’  అని నమ్మిస్తూంటాడు బిలాల్. ఒకవైపు తనకి పొలిటీషియన్ జియా రెహమానీ (మనోజ్ బక్షీ) కూతురు మోడరన్ గర్ల్ జోయా (మోమల్ షేక్) తో సంబంధం కుదిరి వుంది. కానీ ఇప్పుడు చూస్తే  హేపీని లైక్ చేస్తూంటాడు. 

        అటు అమృత్ సర్ లో హేపీని పోగొట్టుకున్న పెళ్లి కొడుకు బగ్గా,  హేపీ లవర్ గుడ్డూని బంధిస్తాడు. హేపీ తండ్రి  హేపీ కన్పిస్తే కాల్చెయ్యాలని తుపాకీ పట్టుకుని తయారుగా వుంటాడు. పరిస్థితి ఉద్రిక్తంగా వుంటుంది. ఈ నేపధ్యంలో అటు లాహోర్లో బిలాల్ వైపు నుంచి ఏ సంఘటన జరిగి,  వీళ్ళంతా  లాహోర్లో వెళ్లి పడి అలజడి సృష్టిస్తారనేది మిగతా కామెడీ కథ. 

ఎలా వుంది కథ     ఫ్రెష్ కామెడీ అనొచ్చు. కామెడీ అనగానే, పెళ్లి  కూతురు పారిపోయిందనగానే, రౌడీ గ్యాంగులు టాటా సుమో లేసుకుని తుపాకులూ కత్తులతో బీభత్స భయానక దృశ్యాల్ని సృష్టించే (ఇవ్వాల్టి ‘చుట్టాలబ్బాయ్’ వరకూ)  తెలుగు కామెడీల్లా లేదు. తెలుగు కామెడీల  క్వాలిటీ నేలకు దిగిన పరిస్థితుల్లో కాస్త ఉపశమనం కోరుకునే వాళ్ళు  ‘హేపీ భాగ్ జాయేగీ’ హాస్యాన్ని ఆశ్రయించాల్సిందే. జీవితాల్లో పట్టుకున్న సృజనాత్మక హాస్యం దీని ప్రత్యేకత. నిత్యజీవితంలో అనుభవమయ్యే వివిధ పరిస్థితుల సునిశిత పరిశీలనలోంచి బోల్డు హాస్యాన్ని సృష్టించిన కథ. పెళ్లి కూతురు పారిపోవడమనేది పాత కథే, కథనం కొత్తది. దీనికి పాకిస్తాన్ నేపధ్యం సరికొత్తది. ఎవరి మనోభావాల్నీ  దెబ్బతీసే ఎలాటి రాజకీయ కామెంట్లు గానీ, జోకులు గానీ  లేని క్లీన్ ఎంటర్ టైనర్. హీరోయిన్ చూపించే ఇండియన్ నోటు మీద గాంధీ బొమ్మ చూసి, పాక్ పోలీసు సెల్యూట్ కొట్టేలాంటి చిన్న చిన్న ఫన్నీ సీన్స్ కి కూడా,  పాక్ సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టి అనుమతి ఇవ్వలేదు గానీ- మీడియాలో ఎక్కడా ఏ అంశం మీదా వివాదం రేగకుండా జాగ్రత్త తీసుకున్న కథ ఇది.  ‘నువ్వేమైనా అడుగు, కాశ్మీర్ తప్ప’ అని  పాక్ పోలీసు అధికారి పలికే  డైలాగుగానీ, జిన్నా చిత్రపటం చూసి – ‘ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తావు?’ అని హీరో అనే డైలాగు గానీ నవ్వు తెప్పించేవే. ‘నేను ఇండియా వెళ్లి ఇండియా ఉప్పు తినను’  అని పాక్ పోలీసు అధికారి అంటే, ‘మనం దిగిమతి చేసుకుంటున్నది ఇండియా ఉప్పే’ అని హీరో గుర్తు చేయడం ఎలాటి సెన్సార్ కీ, కాంట్ర వర్సీలకీ దొరకని సెటైరే.  ఇక ప్రతీ మాటకీ హీరో తండ్రి - It will change the history of Pakistanఅనడం అతి పెద్ద  వ్యంగ్య బాణమే అనుకోవాలిగానీ, ఒంటి కాలిమీద లేవడానికి ఎవరికీ అవకాశమే ఇవ్వదు. అమృత్ సర్ లో చెడిపోయే మొదటి పెళ్లి సీను దగ్గర్నుంచీ, లాహోర్ లో సామూహిక వివాహాల సీను వరకూ నాన్ స్టాప్ క్రేజీ కామెడీ ఇది. 
ఎవరెలా చేశారు
       బిగ్ మసాలా సినిమాలకి దూరంగా సహజంగా వుండే చిన్న చిన్న సినిమాలతో వెరైటీ పాత్రల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్న అభయ్ డియోల్ కిది మరో విభిన్న పాత్ర. పాకిస్తానీయుడి పాత్రలో, అదీ మాజీ గవర్నర్ కొడుకు పాత్రలో,  హుందాగా కన్పిస్తూ ఉత్తమ హాస్యాన్ని పలికించాడు. మన తెలుగు సినిమాల్లోలాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకైనా సరే ఆవారా తాగుబోతు, నీచ నికృష్ట, కోన్ కిస్కా గాడిలా వుండాలన్న దిక్కు మాలిన తెలుగు రూలు నుంచి ఇదెంతో రిలీఫ్!

        అభయ్  పాత్రకో అంతర్మథనముంది- క్రికెటర్ అవాలన్న తన కోరిక చంపుకుని తండ్రి కోర్కె తీరుస్తూ ఇష్టంలేని రాజకీయాల్లోకి వచ్చాడని. పంజరంలో పక్షిలా ఫీలవుతున్నాడు. తనకి విరుద్ధంగా హీరోయిన్ హేపీ తన స్వాతంత్ర్యం కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా పారిపోగల తత్త్వంతో వుండడం. ఇలాటి ఈమెని తిరిగి తండ్రి దగ్గరికి పంపి ఆమె స్వేచ్చని, కోరికల్ని హరించకుండా,  ప్రియుడితో పెళ్లి జరగడానికి సహకరించాలన్న ధ్యేయం పెట్టుకుంటాడు-తనకి లేని స్వేచ్చ ఆమె కుండాలన్న ఆలోచనతో.  దీంతో పాత్ర అమాంతం ఎలివేటవుతుంది. కానీ ఈ ధ్యేయంతో చాలా చిక్కుల్లో పడతాడు. చాలా గేములు ఆడాల్సి వస్తుంది. సొంత తండ్రి, కాబోయే భార్య, కాబోయే మామ, హీరోయిన్ తండ్రి, పెళ్లి కొడుకు బగ్గా, లాహోర్ లో వాడి  అనుచరులూ – ఇంతమందిని ఎదుర్కొని గట్టెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది! సాధారణంగా హీరోకి వ్యతిరేకంగా విలన్ ఒక్కడే ఉంటాడు, కానీ ఇక్కడలా కాదు- హీరోకి అందరూ వ్యతిరేకులే- ఒక్కోసారి హీరోయిన్ కూడా. 
       ఏ రాజకీయాల్ని అసహ్యించుకుంటాడో ఆ రాజకీయాలే చెయ్యాల్సి వస్తుంది. హేపీ ప్రియుడు గుడ్డూ కోసం అమృతసర్ వచ్చినప్పుడు కోరిక ఆపుకోలేక గల్లీలో పిల్లలతో క్రికెట్ ఆడతాడు. రెండు  సిక్సర్ లు కొట్టి, తను పాకిస్తానీ అని ప్రకటిస్తాడు. ఈ సంగతి ముందు చెప్పి వుండాల్సింది - అని పిల్లలు అనగానే, పిల్లల చేతిలో కూడా క్రికెట్ రాజకీయాలమయమై పోయిందని వాపోతాడు! అభయ్  డియోల్ కిది కొత్త నేపధ్యంతో కొత్త తరహా పాత్ర. 
      హేపీ పాత్రలో హీరోయిన్ డయానా పెంటీది సినిమాలో అందరికంటే డాషింగ్ పాత్ర. ఆమె ఒక్క తన్ను తంతే ఎక్కడికి ఎగిరెళ్లిపోతారో తెలీదు. ఆమె ఎక్కువ ఆలోచించదు. ఎప్పుడేది అనుకుంటే అప్పుడది వెంటనే చేసేస్తుంది. మనదేశం, పర దేశం అన్న తేడా,  భయం కూడా లేవు. లాహోర్ లో ఆటో వాడికి ఇండియన్ నోటు ఇచ్చి అడ్జస్ట్ చేసుకొ మ్మంటుంది. వాడు వినకపోతే చితకబాది గలాభా సృష్టిస్తుంది. ‘పాకిస్తాన్ లోకి వచ్చి ఇలా పడ్డావ్, నీకు టెన్షన్ గా లేదా?’ అనడిగితే, ‘నాకెందుకూ టెన్షన్, పాకిస్తాన్ పడాలి  టెన్షన్!’ అనేసే రకం. 
      ఆమెని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన ఆమె తండ్రి, మాజీ గవర్నర్ ని చంపడానికి వచ్చిన టెర్రరిస్టుగా ముద్ర పడి, వూరంతా పోస్టర్లు వెలసి, పోలీసు వేటతో నానా తంటాలు పడతాడు. ఈ పాత్రలో కన్వల్జిత్ సింగ్ ది ఇంకో రకమైన హాస్యం. హేపీని వెతుక్కుంటూ లాహోర్ వచ్చిన పెళ్లి కొడుకు బగ్గా, జగ్గా అనేవాడి లోకల్ ముఠాతో హేపీని కిడ్నాప్ చేయడానికి ప్లానేస్తాడు. ఈ నెగెటివ్ పాత్రలో హీరో జిమ్మీ షేర్ గిల్ అచ్చం పంజాబీ వాడిలా కన్పిస్తాడు. తనేం మాట్లాడతాడో అర్ధం జేసుకోవడం చాలా కష్టం- ‘ఐయాం స్పీకింగ్ విత్ గుడ్డూ మీ దమన్ సింగ్ బగ్గా పంజాబీ టు ‘ఇంగీష్’ నాన్ స్టాప్  టాప్ స్పీడ్  హూ యూ బీ వాట్ యూ వాంట్’ -  అని ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనేస్తాడు. గమ్మత్తయిన క్లయిమాక్స్ తో తనే లాహోర్ వదిలి అమృత్ సర్ పారిపోయి రావాల్సి వస్తుంది. అమృత్ సర్ లో సభ ఏర్పాటు చేసి, పెళ్ళయిపోయిన హేపీ- గుడ్డూ లని పొగుడుతూ ఉపన్యసించే తీరు జిమ్మీ షేర్ గిల్ నుంచి అద్బుత కామెడీ.  

        మోడరన్ గర్ల్ జోయా పాత్రలో పాకిస్తానీ నటి
మోమల్ షేక్ సీరియస్ గా వుంటుంది పరిస్థితుల ప్రకారం. ఆమె తండ్రిగా వేసిన మనోజ్ బక్షీ - అభయ్ డియోల్, అతడి పనిమనుషులూ పెట్టే తికమకకి జవాబులు వెతుక్కునే పాత్రలో రాయల్ కామెడీని ప్రదర్శిస్తాడు. అభయ్ తండ్రిగా వేసిన జావేద్ షేక్ అయితే తన ఊతపదంతో (ఇట్ విల్  ఛేంజ్ ది హిస్టరీ  ఆఫ్ పాకిస్తాన్) ఇంకో గుర్తుండి పోయే పాత్ర పోషించాడు.

        ఇక టాప్ కామెడీ అయితే పీయూష్ మిశ్రాది. పాక్ పోలీసు అధికారి ఉస్మాన్ గా నవాబీ ఉర్దూ మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తాడు. పాతకాలం నవాబులు ఎలా మాట్లాడతారో అవే పదాలతో,  ఉచ్ఛారణతో, ముఖకవళికలతో పాత్రని ఎంజాయ్ చేస్తూ జీవించేస్తాడు. డబ్బా గాళ్లయిన గుడ్డూతో, బగ్గాతో  అతడి సీన్లు టాపు లేచిపోతాయి. అమాయక ప్రేమికుడు గుడ్డూ పాత్రలో అలీ ఫైజల్ కూడా ఫర్వాలేదు. 

        తన కెమెరా పనితనంతో లాహోర్ లొకేషన్స్ ని బాగా మనోరంజకం చేశాడు సౌరభ్ గోస్వామి. ఇందుకు పాకిస్తానీయులు అభినందించాలి. అయితే అమృత్ సర్ దృశ్యాలకి అక్కడి బాణీల్ని నేపధ్య సంగీతంగా కూర్చిన  సోహైల్ సేన్, లాహోర్ సన్నివేశాలకి అక్కడి సంస్కృతితో కూడిన బాణీలు కూర్చివుంటే బావుండేది- అక్కడి బాణీలు  హిందుస్తానీ సంగీతమేగా! 

        కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానై నిర్వహించిన ముదస్సర్ అజీజ్,  పెళ్ళికూతురు పారిపోవడమనే పాత కథనే  కొత్తరకం పాత్రలతో,  కొత్త రకం నేటివిటీతో, సన్నివేశాలతో వినోదభరితం చేశాడు బాగానే వుంది గానీ, అదే సమయంలో స్క్రీన్ ప్లే తో హీరో పాత్ర సమన్వయం కూడా చూసుకోవాల్సింది. ఫస్టాఫ్ లో హీరోయిన్ వల్ల  రాజకీయంగా అల్లరవుతుందని భయపడి గుడ్డూ తో ఆమెని కలిపేసేందుకు  ప్రయత్నించే హీరో, సెకండాఫ్ లో తన గోల్ కి కారణం ఇది కాదన్నట్టు- తనకి లేని స్వేచ్ఛ హీరోయిన్ కుండాలన్నట్టుగా వెల్లడించడం, అందుకే తను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం  స్టోరీ పాయింటుని  రెండుగా చీల్చినట్టు వుంది. హీరో పాత్రకి ఒక గోల్ పెట్టినప్పుడు దానికి ఒకే కారణం పెట్టివుంటే పాత్ర ఇంకా బలంగా కన్పించేది. ఈ పాత్ర గోల్ కి సెంటిమెంటు బలమున్న స్వేచ్ఛ కి సంబంధించిన కారణమే కరెక్ట్. 

చివరికేమిటి?
      కామెడీ రైటింగ్ కూడా ఇంటలిజెంట్ రైటింగ్ గా మారినప్పుడు అప్డేటెడ్ మూవీస్ ఇలా ప్రేక్షకుల మధ్యకి వస్తాయి.  సినిమాటిక్ డైలాగులతో, సీన్లతో,  క్రియేటివిటీ లేని మాసిపోయిన కార్బన్ కాపీ కామెడీలు తీయడం అలవాటుపడిన వాళ్ళు - ఇలా జీవితాల్లో ఉట్టి పడే సహజ హాస్యంతో  ఆరోగ్యకర సినిమాలు తీసే స్థాయికి ఎదగడం ఇప్పటి అర్జెంటు అవసరం. సమాజంలో చాలా హస్యముంది, పాత్రలున్నాయి- వీటితో ప్రేక్షకులు తమని ఐడెంటిఫై చేసుకున్నంతగా, మూసఫార్ములా కామెడీ- పేరడీలకి కనెక్టయ్యే  పరిస్థితి ఇక లేదని వారం వారం తెలుస్తూనే వుంది.

        రెండోదేమిటంటే, హార్రర్ కామెడీ, థ్రిల్లర్ కామెడీ, యాక్షన్ కామెడీ, క్రైం కామెడీ, అడల్ట్ కామెడీ...ఇంకేవేవో  కామేడీలంటూ ఇతర జానర్లని కలిపి కృత్రిమంగా విరగబడి తీసేస్తూ,  ప్యూర్ కామెడీనే మర్చిపోయారు. ప్యూర్ కామెడీలకి  ఇటు జంధ్యాల, ఈవీవీ లాంటి వాళ్ళు; అటు హృషికేష్ ముఖర్జీ, ప్రియదర్శన్ లాంటి వాళ్ళూ  ఇప్పుడు లేనే లేరు. ముదస్సర్ అజీజ్ ఈ కొరత తీర్చాడు. 

        మూడోదేమిటంటే, సింగీతం శ్రీనివాసరావు టైపు హింస లేని ఫక్తు హాస్యభరిత క్లయిమాక్సులు ఇప్పుడు  వర్కౌట్ కావేమో అన్న సందేహాల్ని  కూడా ‘హేపీ భాగ్ జాయేగీ’ శుభ్రంగా పటాపంచలు చేస్తోంది.

-సికిందర్