రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, అక్టోబర్ 2022, ఆదివారం

1237 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : కెవి అనుదీప్
తారాగణం : శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క, కార్ల్ హార్ట్, సత్యరాజ్, ప్రేమ్జీ అమరేన్, ఆనందరాజ్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాతలు : డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు
విడుదల : అక్టోబర్ 21, 2022
***
        జాతిరత్నాలు అనే హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ స్టార్ శివ కార్తికేయన్ తో తెలుగు -తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు. ఇందులో మరియా ర్యాబోషప్క అనే ఉక్రెయిన్ నటి హీరోయిన్. గత నెలలోనే అనుదీప్ కథ అందించిన కామెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో దారుణంగా ఫ్లాపయింది. మైండ్ లెస్ కామెడీతో జాతిరత్నాలు హిట్టయ్యిందనీ ఇక మైండ్ లెస్ కామెడీలే తీయాలని నిర్ణయించుకున్నట్టుంది. కానీ దీపావళి సందర్భంగా ఇదే రోజు మరో నాలుగు  సినిమాలు- జిన్నా, ఓరి దేవుడా, సర్దార్, బ్లాక్ ఆడమ్ కూడా విడుదలయ్యాయి. పోటీ గట్టిగానే వుంది.

        మిళంలో శివ కార్తికేయన్ వరుస హిట్లు ఇస్తున్న స్టార్. ఇప్పుడతను తమిళంలో కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తో పోటీలో వెనుకబడ్డాడు. కార్తీ కూడా వరుస హిట్లు ఇస్తున్న తమిళ స్టారే. తాజాగా పొన్నియిన్ సెల్వన్ లో నటించాడు. తమిళంలో సర్దార్ కి మార్నింగ్ షో కే హిట్ టాక్ వచ్చేసింది. ప్రిన్స్ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. మరి సినిమా ఎలావుంది? ఇది తెలుసుకుందాం...

కథ
ఆనంద్ (శివ కార్తికేయన్) ఓ ఊళ్ళో స్కూలు టీచర్. సోషల్ సబ్జెక్టు చెప్తాడు. సోషల్ నాలెడ్జి ఏమీ వుండదు. స్కూలుకంటే సినిమాలకి ఎక్కువ వెళుతూ వుంటాడు. తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) అభ్యుదయవాది. కులాంతర వివాహాలు జరిపిస్తూంటాడు. ఎందుకైనా మంచిదని కొడుకు ఆనంద్ చేత హామీ పత్రం రాయించుకుంటాడు- ఎట్టి పరిస్థితిలో కులాంతర వివాహమే చేసుకోవాలని, కులంలో అమ్మాయిని ప్రేమించరాదనీ. ఇప్పుడు అదే స్కూల్లో జెస్సికా (మరియా) అనే బ్రిటీష్ జాతీయురాలు ఇంగ్లీషు టీచరుగా వచ్చి చేరుతుంది. ఈమె తండ్రి విలియమ్స్ (కార్ల్ హార్ట్) తాత ఆస్తిపాస్తులు ఇక్కడే వదిలి వెళ్ళడంతో తను ఇక్కడే సెటిలై పోయాడు. టౌన్లో ఇతడి స్థలం ఒకటి కబ్జా చేయాలన్న పన్నాగంతో ఓ కేడీ భూపతి (ప్రేమ్జీ అమరేన్) వుంటాడు.

స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ జెస్సికా  ఇంగ్లీషు అందచందాలు చూసి
, ఆనంద్ ఇక సినిమాల కెళ్ళడం మానేసి, బుద్ధిగా స్కూలుకొస్తూ వచ్చిన పని ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటాడు. అతడి ప్రేమని చూసి ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే కులాల్ని, మతాల్నీ అధిగమించి విశాల ప్రాతిపదికన ఆనంద్ ఓ విదేశీయురాలిని ప్రేమించడం గర్వంగా ఫీలైన తండ్రి విశ్వనాధం, ఆమె బ్రిటిషర్ అని తెలిసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో ఓ బ్రిటిష్ తాత తన తాతని చంపాడు కాబట్టి.

అటు జెస్సికా  తండ్రి విలియమ్స్ కూడా ఇండియన్ రక్తంతో సంబంధం వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి
, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ  

ఇది పూర్తి స్థాయి కామెడీ కథ. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నర్సింహా రావు మొదలైన దర్శకులు ఫక్తు కామెడీ సినిమాలే తీసే వాళ్ళు. ఈ కాలంలో రోమాంటిక్ కామెడీలు, హార్రర్ కామెడీలు, క్రైమ్ కామెడీలూ అంటూ ప్రేమని, హార్రర్ ని, క్రైమ్ నీ జోడించుకుని సబ్ జానర్ కామెడీలు తీస్తున్నారే తప్ప, ఆ రోజుల్లో ఆ దర్శకులు తీసేలాంటి ఫక్తు కామెడీలు తీయలేక పోతున్నారు. దీనికి కాస్త సృజనాత్మకత, ప్రతిభ కావాలి సామాజిక స్పృహతో బాటు. కనుక ఒక జంధ్యాల, ఈవీవీ, వంశీ, రేలంగి అన్పించుకునే దర్శకులు ముందు కాలంలో కూడా రావడం అసంభవమనుకుంటున్న సమయంలో అనుదీప్ అనే దర్శకుడు వచ్చాడు.

అయితే అనుదీప్ తో సమస్యేమిటంటే, అతను ప్రధాన పాత్ర ఆధారిత కామెడీ తీయడు. ప్రధాన పాత్రని అప్రధానం చేసి, ఇతర పాత్రలతో కలిపేసి గుండుగుత్త కామెడీ తీస్తాడు. ఏ కథైనా, ఎలాటి కథైనా ప్రధాన పాత్రకి గోల్ అంటూ వుంటుంది. ఆ గోల్ ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, దాంతో పోరాటం, పరిష్కారమనే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ సహిత స్క్రీన్ ప్లేతోనే వస్తుందని అతడికి తెలుసో లేదో. ఇలా ఈ సార్వజనీన స్క్రీన్ ప్లే స్ట్రక్చరనేది గోల్ తో యాక్టివ్ గా వుండే ప్రధాన పాత్రతోనే సాధ్యమనీ, గోల్ లేకుండా పాసివ్ గా వుండే ప్రధాన పాత్రతో విఫలమవుతుందనీ, బేసిక్స్ అతడికి తెలుసో లేదో తెలీదు.

స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ నేర్పర్చేదే గోల్ కోసం పోరాడే యాక్టివ్ ప్రధాన పాత్ర. అంతేగానీ, ప్రధాన పాత్ర కోసం స్ట్రక్చర్ ని ఎవరూ కనిపెట్టలేదు. యుగాలుగా రాస్తున్న కథల్లో గోల్ తో వుండే ప్రధాన పాత్రే స్ట్రక్చర్ నేర్పరుస్తూ వస్తోందని గమనించి స్క్రీన్ ప్లే శాస్త్రాలు రాశారు నిపుణులు. శాస్త్రం ముందు కాదు, పదార్ధమే ముందు. పదార్థాన్ని విశ్లేషిస్తేనే శాస్త్రం ఏ రంగంలోనైనా.

అనుదీప్ తీస్తున్నవి సిల్లీ కామెడీలే. దీనికాధారం సామాజిక అంశాలే
, నేటివిటీయే. సోషల్ కామెంట్ చేసే సదాశయమే. వ్యక్తుల హిపోక్రసీని బయట పెట్టాలన్న తపనే. అయితే ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చని అరిస్టాటిల్ మహాశయుడు చెప్పాడు. అనుదీప్ చేస్తున్నదిదే. మంచిదే. అయితే ఈ అబ్సర్డ్ కామెడీని అతను కథతో చేయడం లేదు. సెటైర్లతో విడివిడి స్కిట్స్ తీసి, వాటిని కలిపి అదే కథ అనుకోమంటున్నాడు.

కథ ఎక్కడుంది
? ఆనంద్ జెస్సికాతో ప్రేమలో పడ్డం దగ్గరుంది. ఆ తర్వాత ఇంటర్వెల్లో వీళ్ళ తండ్రులు అడ్డుకోవడం దగ్గరుంది. ఇంకా తర్వాత తండ్రులు రాజీపడే క్లయిమాక్స్ లో వుంది. ఈ మూడే కథతో సంబంధమున్న ఘట్టాలు. మిగిలిన వన్నీ వీటితో సంబంధం లేని, వీటి మధ్య పేర్చిన, విడివిడి సెటైరికల్ స్కిట్స్. కేవలం కథకి సంబంధించి ఆ మూడు ప్లాట్ పాయింట్స్ ని పెట్టుకుని, వాటి మధ్య ఫిల్లర్స్ గా స్కిట్స్ వేస్తూ సినిమా నడిపేశాడు.

ఇందుకే హీరో పాత్ర ఆనంద్ కి పని (గోల్) లేకుండా పోయింది. ఇంకా ఓ స్థలాన్ని కబ్జా చేయాలనుకునే పక్క పాత్ర భూపతి కెక్కువ గోల్ వుంది. అతను ఇంగ్లీషు వాడి స్థలాన్నెలా కొట్టేయాలన్న గోల్ తో  చివరి దాకా మంచి ఊపు మీద యాక్టివ్ గా వుంటాడు- పైన చెప్పుకున్న
ప్రధాన పాత్ర -సమస్య -పోరాటం -పరిష్కారం స్ట్రక్చర్ తో యాక్టివ్ క్యారక్టర్ గా! అతను స్థలాన్నైతే కొట్టేయ లేకపోయాడు గానీ, హీరో ఆనంద్ చేతిలో వుండాల్సిన త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని మాత్రం కొట్టేసి పాసివ్ గా కూర్చోబెట్టేశాడు.

చెప్పేదేమిటంటే
, ఆల్రెడీ తెలుగు హీరోలకి అలంకరిస్తున్న పాసివ్ పాత్రల్ని తీసికెళ్ళి తమిళ హీరోల్ని కూడా పుష్పమాలాంకృతుల్ని చేయడమెందుకని. తెలుగు దర్శకుడు వెళ్ళి వెళ్ళి  తమిళాన్ని కూడా తెలుగు కిష్కింధ చెయ్యాలా? 2020 లో తమిళంలో మడోన్ అశ్విన్ అనే కొత్త దర్శకుడు తీసిన మండేలా అనే రాజకీయ సెటైర్ లో హీరోగా యోగిబాబు బార్బర్ పాత్ర ఎంత యాక్టివ్ గా వుంటుంది. కథని అతనే సృష్టిస్తాడు, అతనే నడిపిస్తాడు, అతనే ముగిస్తాడు.

హీరోగా ఆనంద్ కూడా చేయాల్సిందేమిటంటే
, ప్రేమకి అడ్డుపడుతున్న తండ్రుల వ్యక్తిగత వైరాల్ని వాళ్ళకే వ్యతిరేకంగా వాడుకుని టీచర్ గా బుద్ధిచెప్పడం. లేకపోతే టీచర్ పాత్ర దేనికి? మొదట కామెడీ కోసం టీచర్ని నాలెడ్జి లేని వాడుగా చూపించినా, ప్రేమతో సమస్యలో పడ్డాక ఎదగాలిగా (క్యారక్టర్ గ్రోత్)? ఎదిగి టీచర్ అన్పించుకుంటూ, వూరి  సమస్యగా మారిన తన సమస్యని కామెడీగానే, సృజనాత్మకంగా పరిష్కరించుకునే గోల్ తో కొనసాగాలిగా (క్యారక్టర్ ఆర్క్)? కథకి ఉష్ణోగ్రత పెంచాలిగా (టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్)? ఇవేమీ లేకుండా హీరో అయిపోతాడా?

పైన కథా సంగ్రహం రాసినప్పుడు... ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి
, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అని పేర్కొన్నాం. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అన్నామే గానీ, ఇప్పుడేం చేశాడు ఆనంద్?... అని రాయలేదు. ఎందుకంటే ఈ కథలో ఆనంద్ ఏమీ చేయని -గోల్ లేని పాసివ్ పాత్ర కాబట్టి.

అయితే గోల్ తో ఏం చేయాలన్నా ఇక్కడ అసలు సమస్య వుంది. తండ్రుల సమస్యే సమస్య. ఎప్పుడో స్వాతంత్ర్య పోరాటంలో ఇంగ్లీషు తాత తన తాతని చంపాడని ఆనంద్ తండ్రి, ఇండియన్ రక్తంతో సంబంధం వద్దని జెస్సికా తండ్రీ సృష్టించిన సమస్యలో లాజిక్ ఎంత? ఎమోషన్స్ ఎంత? ఇవి కన్విన్సింగ్ గా వుండే పాయింట్సేనా? ఏ మాత్రం అర్ధం లేని, ఎమోషన్లు పుట్టించని, సిల్లీ పాయింట్స్. పైన అరిస్టాటిల్ ని ఉటంకిస్తూ చెప్పుకున్నట్టు - ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చు. ఇది దర్శకుడు అనుదీప్ తీసిన స్కిట్స్ కే వర్తిస్తోంది తప్ప కథ పుట్టడానికి కారణమైన ఎమోషన్స్ లేని ప్లాట్ పాయింటుకి కాదు.

తండ్రులు సృష్టించిన సమస్యే ఎమోషన్స్ లేకుండా ఇల్లాజికల్ గా
, సిల్లీగా, ఆషామాషీగా వుంటే ఇది సినిమాని నిలబెట్టే ప్లాట్ పాయింట్ అవదు- ఫాల్స్ పాయింటుతో ఫ్లాప్ ప్లాట్ పాయింటవుతుంది. ఆనంద్ దీంతో ఎంత గోల్ పుట్టించుకున్నా అందులో ఎమోషన్ లేక, ఎంత కథ నడిపినా నిలబడేది కాదు. మొట్టమొదట కథకి ఐడియా తట్టినప్పుడు తట్ట నెత్తినెట్టుకుని పరిగెత్తకుండా, అసలా ఐడియా అనేది స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ నిచ్చే పరిధిలో వుందా లేదా తెలుసుకోక పోతే ఇంతే జరుగుతుంది.

అనుదీప్ స్కిట్స్ కి ఆధారంగా చేసుకున్నవి కులాలు
, ఇండో -బ్రిటిష్ వైరం, దేశభక్తి -మానవత్వం మొదలైనవి. వీటిని వ్యంగ్యం చేసి, హాస్యం పట్టించి, ఎంత కడిగెయ్యాలో అంతా కడిగేసుకుంటూ పోయాడు.

కులాలు నర్సు చేతిలో వున్నాయి, ఇటు పిల్లని అటు మారిస్తే కులాలే మారిపోతాయి’... ‘దేశాల్ని ఆక్రమించి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ నిచ్చింది మీరు’... ఇంగ్లీషోడికి ఇంకా ఇండియాలో చోటుందా’... వంటి డైలాగులెన్నో  పేలుతూంటాయి. కృత్రిమ -కాపీ పేస్ట్- వాట్సాప్ జోకుల రోమాంటిక్, హార్రర్, క్రైమ్ ప్లాస్టిక్ కామెడీలతో మొహం మొత్తిన వాళ్ళకిది కాస్త ఉల్లాసమే.

ప్రతీ స్కిట్ ఏదో రకంగా హాస్య సంభాషణా బలంతో పేలేదే. నాలుగు స్కిట్స్ హైలైట్ గా వుంటాయి- కూరగాయల షాపు దగ్గర సొరకాయ కామెడీ
, ఇంట్లో మొబైల్ కాలర్ ట్యూన్ కామెడీ, పోలీస్ స్టేషన్లో యాంటీ ఇండియన్స్- జనరల్ నాలెడ్జి కామెడీ, చివర్లో దేశభక్తి వర్సెస్ మానవత్వం కామెడీ క్లయిమాక్స్.

మంచి కామెడీ తీయాలంటే ఐక్యూ ఎక్కువుండాలి
, ఇంటలిజెంట్ రైటింగ్ వుండాలి. ఇవి ఆద్యంతం స్కిట్స్ లో కన్పిస్తాయి.

నటనలు- సాంకేతికాలు
హీరోగా శివ కార్తికేయన్ కామెడీని చాలా ఈజ్ తో లాగించేశాడు. అతను చాలా సహజంగా సిట్యుయేషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్ తో కామెడీ సీన్లు ఎక్కువ. సత్యరాజ్ ఇందులో ప్రధాన కమెడియన్ అనుకోవచ్చు. ప్రారంభంలో సరిహద్దులు గీసుకుని కొట్టుకుంటున్న వూరి జనాల కులాల పిచ్చిని కత్తితో చికిత్స చేసి, అదే కత్తితో దేశభక్తి, మానవత్వం గ్రూపులకి చికిత్స చేస్తాడు. కత్తితో ఎవరి చేతి మీద గీరినా రక్తం ఎరుపే నని చూపించడం అతడి హాబీ. తెల్లవాడైన జెస్సికా తండ్రి కూడా చేతి మీద గాటు వేయించుకుని, తనది కూడా ఎరుపు రక్తమే కదా అనుకుంటాడు. ఇలాటి వెర్రిమాలోకాలు వుంటారనేది లాజిక్. దీనిమీద అబ్సర్డ్ కామెడీ. సత్యరాజ్ చెయ్యి నరికేసి చూపిస్తే అది బ్లాక్ కామెడీ.

అలాగే పోలీస్ స్టేషన్ కామెడీలో ఇన్స్ పెక్టర్ పాత్రలో ఆనందరాజ్ నటన. ఇక భూకబ్జాలు చేసే కేడీగా ప్రేమ్జీ అమరేన్ ది కూడా మంచి కామెడీ. ఇవన్నీ ఒకెత్తైతే, జెస్సికా తండ్రిగా నటించిన కార్ల్ హార్ట్ చెప్పుకోదగ్గ నటుడు. ఇక హీరోయిన్ గా నటించిన ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క తెలుగు పాత్రలో పూర్తిగా ఇమిడి పోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన బ్రిటిష్ అమ్మాయిగా ఆ సహజత్వం ప్రదర్శించింది. క్లయిమాక్స్ కి ముందు సత్యరాజ్ తో, ఆనాడు బ్రిటన్ చేసిన అన్యాయాలన్నిటికీ క్షమాపణలు చెప్పే భావోద్వేగపూరిత సన్నివేశం కదిలించేదే. స్కూల్ కామెడీ దృశ్యాలు కూడా బావున్నాయి. ఇద్దరు బాలనటులు ఫన్నీగా వున్నారు.

కామెడీలో స్లో పాటలు, ఫ్లోని దెబ్బతీసే మాంటెజెస్ సాంగ్స్ లేకుండా హుషారు నిచ్చే పాటలున్నాయి. రెండు గ్రూప్ సాంగ్స్ కి భారీ సెట్సే వేశారు. థమన్ సంగీతానికి తగ్గట్టు విజువల్స్ కూడా వున్నాయి.  మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కొన్ని ఔట్ డోర్స్ లో పాలిపోయినట్టు వుంది. ఎందుకలా డీఐ చేశారో తెలీదు.

పోతే ఇది ద్విభాషా చిత్రమన్నారు గానీ, ఇందులో తెలుగు నటీనటులెవ్వరూ లేరు. తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్ చేసినట్టుంది. అయితే తీసింది తెలుగు దర్శకుడు కావడంతో తెలుగే అన్పించే డైలాగులున్నాయి. కథ గురించి ఆలోచించకపోతే స్కిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. సినిమాలు ఫస్టాఫ్ బావుంటే, సెకండాఫ్ బావుండడం లేదు. లేదా ఫస్టాఫ్ బాగా లేక సెకండాఫ్ బావుండే సినిమా లొస్తున్నాయి. ప్రిన్స్ మాత్రం ఫస్టాఫ్- సెకండాఫ్  రెండూ స్కిట్స్ తో బోరు కొట్టవు. ఇదే స్కిట్స్ తో గాకుండా కథతోనే జరిగి వుంటే బావుండేది. దర్శకుడి దర్శకత్వంలో వేగం వుంది, పంచ్ వుంది- తీయడానికి కథ లాంటిది తయారు చేసుకుంటే బావుంటుంది. ఇంతకీ కథంటే ఏమిటి? 

—సికిందర్