రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, అక్టోబర్ 2023, గురువారం

1368 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం : బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, శరత్ కుమార్, రఘుబాబు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్
బ్యానర్ : షైన్ క్రియెషన్స్, నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : అక్టోబర్ 19, 2023
***

        ఖండ, వీర సింహారెడ్డి జంట విజయాల తర్వాత బాలకృష్ణ నుంచి భగవంత్ కేసరి దసరా కానుకగా అందింది. ఈసారి బాలకృష్ణ కామెడీ ట్రాకులతో కమర్షియల్ యాక్షన్ మసాలాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఓ భిన్నమైన ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మెప్పించిందా? ప్రయత్నం మంచిదే అయినా విషయం బావుందా? విషయం బావున్నా చెప్పడం బావుందా? ఇవి తెలుసుకుందాం...

కథ

    ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (బాలకృష్ణ)  అనుకోని ప్రమాదంలో ఓ ఎస్సై (శరత్ కుమార్) చనిపోవడంతో, అతడి కూతురు విజ్జీ (శ్రీలీల) ని పెంచుకుంటాడు. ఆమె తండ్రి కోరిక ప్రకారం ఆమెని ఆర్మీ లో చేర్పించే సంకల్పంతో వుంటాడు. ఇద్దరి మధ్య తండ్రీ కూతుళ్ళ అనుబంధమేర్పడుతుంది. అయితే తండ్రి మరణంతో ఒక ఫోబియాకి లోనైన విజ్జీ ఆర్మీలోచేరేందుకు ఒప్పుకోదు. ఇంతలో ఒక టాప్ బిజినెస్ మాన్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రామ్ పాల్) డిప్యూటీ సీఎం (శుభలేఖ సుధాకర్) ని చంపి డిప్యూటీ సీఎం పియ్యే (బ్రహ్మాజీ) దృష్టిలో పడేసరికి అతడ్ని చంపేందుకు వేట మొదలెడతాడు. ఈ వేటలో అతడికి అతడికి విజ్జీమీద అనుమానం కలిగి ఆమెని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు భగవంత్ కేసరి విజ్జీని కాపాడుకుని, పాత శత్రువు సాంఘ్వీని అంతమొందించేందుకు ఎలా పోరాటం మొదలెట్టాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    జైలర్ రజనీకాంత్ బాటలో బాలకృష్ణ ఇమేజి చట్రం లోంచి బయటికొచ్చి వయస్సుకి తగ్గ పాత్ర నటించిన కథ ఇది. జైలర్ లోలాగే కామెడీలు, డ్యూయెట్లూ, వీర హీరోయిజాలు, పంచ్ డైలాగులు, మాస్ బిల్డప్పులు, ఎలివేషన్లూ లేకుండా, సీదా సాదా కంటెంట్ రిచ్ సెంటిమెంటల్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వూర మాస్ సినిమాల చట్రం లోంచి బయటికొచ్చి కాన్సెప్ట్ ప్రధానప్రయత్నం చేశాడు. కాన్సెప్ట్ వచ్చేసి స్త్రీ స్వశక్తీ కరణకి సంబంధించింది. ఆడపిల్లలు సింహంలా వుండాలని బాహాటంగానే సందేశమివ్వడం. అయితే ఈ కాన్సెప్ట్ ఒక పక్క, ఇంకో పక్క విలన్ తో పగ - రెండూ కలిసి ఒక వొరలో ఇమడలేక పోయాయి. దీంతో స్త్రీ స్వశక్తీ కరణ అంశం గల్లంతై పోయింది.
        
ఈ స్త్రీ స్వశక్తీ కరణని కూడా హీరోయిన్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంగా వుంది. చిన్నప్పట్నుంచీ ఆమె ఏం కావాలని కోరుకుంటోందో తెలుసుకోకుండా ఆర్మీలో చేరు, ఆర్మీలో చేరూ అని ఒకటే టార్చర్ పెట్టడం బ్యాడ్ పేరెంటింగ్ అన్పించేలా వుంది. తండ్రి మరణంతో ఆమె మానసికంగా ఒక ఫోబియాతో బాధపడుతోంటే దీనికి ట్రీట్ మెంట్ ఇప్పించకుండా, శారీరకంగా బలంగా ఎదగమని కఠిన శిక్షణకి గురి చేయడం ఇంకో బ్యాడ్ టేస్ట్.
        
కథలో సైకాలజిస్టు పాత్ర (కాజల్ అగర్వాల్) వున్నప్పటికీ కూడా ట్రీట్ మెంట్ ఇప్పించే ఆలోచనే  రాదు. ఆర్మీలో చేరితేనే బలవంతురాలవుతుందను కోవడం ఏమిటో కూడా అర్ధంగాదు. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, వూరి చివర కరాటే శిక్షణ ఇప్పిస్తే పోయేదానికి. ఇప్పుడు సైన్యంలో చేరాలన్నా నాల్గేళ్ళ అగ్నివీర్ కొలువు తప్ప ఏం లేదు.
        
ఈ అసమగ్ర కాన్సెప్ట్ కి నెంబర్ వన్ గా ఎదగాలన్న విలన్ సొంత గొడవల కథ అడ్డుపడితే, ఇది కూడా కథ కుదరక విలన్ చాలా బలహీనంగా మారిపోయాడు. ఇలావుంటే, మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి – చైల్డ్ ఎబ్యూజ్ ని కూడా తెచ్చి కలిపేశారు. ఈ రెండూ పరస్పర సంబంధం లేనివి. దీనిమీదా స్కూలు పిల్లల ముందు లెక్చరివ్వడం. ఇలా అసలు కథ ఎక్కడికక్కడ లయ తప్పి అపశ్రుతులు పలకడం.కంటెంట్ రిచ్ సినిమా అంటే రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ తీసేసి, అందులో ఏవేవో కంటెంటులు కలపడం కాదేమో!

నటనలు - సాంకేతికాలు

    పెద్దరికం వహించే పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కన్పించే సినిమా ఇది. పైగా తెలంగాణ పాత్ర. ఆదిలాబాద్ కి చెందిన ఈ పాత్రలో తెలంగాణ డైలాగులు చెబుతూ ఎబ్బెట్టుగా ఏం లేడు బాలకృష్ణ. పైగా పవర్ఫుల్ గా వున్నాడు. ప్రతీ సీనులో (కాజల్ అగర్వాల్ తో తప్ప) ప్రభావశీలంగా వున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కూడా తన రొటీన్ పౌరుషాల నటనకి పోకుండా అదుపు చేసుకున్నాడు.
        
కానీ బలహీన విలన్ తో యాక్షన్ కథ అంతంతమాత్రమే. ఇక పెంపుడు కూతురితో బాండింగ్ కి పిలుపులే అడ్డుపడ్డాయి. చిన్నప్పట్నుంచీ పెంచుకుంటున్నప్పుడు అది తండ్రీ కూతుళ్ళ సంబంధమై పోవాలి. ఆమె చిచ్చా (చిన్నాన్న) అని పిలవడంతో బాండింగులు, ఎమోషన్లు ఉపరితలంలోనే వుండిపోయాయి. నాన్నా అని పిలిచి వుంటే ఆడియెన్స్  ఎక్కువ బాండింగ్, ఎమోషన్లు, ప్రేమలు ఫీలయ్యేవాళ్ళు. సినిమా చివర్లో ఎప్పుడో నాన్నా అనుకుంటుంది. ఈ ఆలస్యానికి అది పండని డ్రామా అయిపోయింది.
        
ఇక బాలకృష్ణ యాక్షన్ సీన్సు ఎందుకో ఈలలు వేయించేలా లేవు. హింస మాత్రం జైలర్ కి కొంచెం తక్కువ లెవెల్లో వుంది. తలకాయల నరికివేతలు లేవు. ఒకే పాట బా లకృష్ణ డాన్సుతో వుంది. గణేష్ ఉత్సవం పాట. ఈ పాట డాన్సులకి గొప్పగా చెప్పుకునే   శ్రీలీల స్కిల్స్ కనిపించకుండానే ముగిసిపోయింది.
        
ఈసారి శ్రీలీలకి చెప్పుకోదగ్గ ప్రధాన పాత్ర దక్కింది. కూతురి పాత్రలో స్ట్రగుల్ చేస్తూ భిన్న పార్శ్వాల్ని ప్రదర్శించింది. అయితే సానుభూతి పొందే సన్నివేశాలు లేకపోవడం ఆమెకి మైనస్. ఆమె పాత్రతో వున్న కాన్సెప్ట్ ఇతర ప్రస్తావనలతో కంటిన్యూటీ దెబ్బతినడం కారణం.
        
బాలకృష్ణని ప్రేమిస్తూ వుండే కాజల్ అగర్వాల్ తో లవ్ ట్రాక్ నవ్వించే బదులు జాలి పుట్టించేలా వుంది. ఇంతకీ సైకాలజిస్టుగా ఆమె చేసిందేమిటో అర్ధం గాదు. ఆమె సైకాలజిస్టు పాత్రే తప్పేమో. ఆమె వైద్యం చేసే క్లినిక్ పెడితే సైకియాట్రిస్టు అవ్వాలి. ఇక విలన్ అర్జున్ రామ్ పాల్ చేసిందేమీ లేదు. పైగా అతడి సొంత కథతో వేరే ట్రాకు చాలా సినిమా నడుస్తుంది. ఎప్పుడైనా మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి వచ్చి అడ్డుతగులుతా డనుకుంటే అదే జరగదు.
        
ఈ సినిమాలో పాటలకి ప్రాధాన్యం లేదు. కాబట్టి తమన్ సంగీతం అలంకారప్రాయంగా వుండిపోయింది. సీనియర్ కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్  ఛాయాగ్రహణం ఒక ఆకర్షణగా చెప్పుకోవాలి. మిగతా ప్రొడక్షన్ విలువలు బాలకృష్ణ స్థాయికి తగ్గి ఎలా వుంటాయి. సినిమాలో డైలాగుల మీద మంచి కృషి చేసినట్టుంది- బంజారా హిల్సు, జూబిలీ హిల్సు, చిచ్చా కొడితే మెడికల్ బిల్సు

చివరికేమిటి

    చెప్పాల్సిన కథ ఒకటైతే దానికేదేదో కలిపి ఏమేమో చెప్పారు. ప్రారంభంలో ఇంకో గొడవ వుంటుంది. ముంబాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ (సంజయ్ స్వరూప్) ప్రభుత్వం నుంచి ప్రాణ భయంతో ఫ్యామిలీని తీసుకుని స్లమ్స్ లో దాక్కుందాడు. రక్షించడానికి ఒక స్నేహితుడు వచ్చి భగవంత్ కేసరి కథ చెప్పడం మొదలెడతాడు.
        
ఫస్టాఫ్ బాలకృష్ణ శ్రీలీలని పెంచడం, మరోవైపు కాజల్ అగర్వాల్ బాలకృష్ణ వెంటపడడం జరుగుతూ వచ్చి, మధ్యలో విలన్ కథ మొదలై, అతను డిప్యూటీ సీఎంని చంపి, శ్రీలీల వెంటబడడంతో- బాలకృష్ణ అడ్డుకునే సీనుతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇందులో విలన్ తో పాత పగ బయటపడ్డాక- ఫ్లాష్ బ్యాక్ ముగిసి- బాలకృష్ణ శ్రీలలకి ట్రైనింగ్ ఇప్పించే దృశ్యాల తర్వాత విలన్ తో క్లయిమాక్స్.
        
శ్రీలీలకి బలవంతపు ట్రైనింగ్. ఇలా కాకుండా, విలన్ తో ఆమె పడ్డ ప్రమాదానికి నువ్వే ఎదుర్కొమని బాలకృష్ణ మోటివేట్ చేసివుంటే, ఆమె కేర్పడే గోల్ ఆమె సొంత గోల్ అయ్యేది. మరొకరి గోల్ కోసం బతకకుండా. కథా కథనాల లోపాల వల్ల భగవంత్  కేసరి అందుకోవాల్సిన  స్థాయిని మాత్రం అందుకోలేక పోయింది.

—సికిందర్