రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 27, 2019

809 : రివ్యూ


     

దర్శకత్వం : రూసో బ్రదర్స్

తారాగణం : రెగ్యులర్ ఎవెంజర్స్ సూపర్ హీరోలు, హీఒయిన్లు
నిర్మాణం : మార్వెల్ స్టూడియోస్
విడుదల ; ఏప్రెల్ 26, 2019

***    
వెంజర్స్మూడో సీక్వెల్ఎండ్ గేమ్అట్టహాసంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. తెలుగు ప్రేక్షకులకి చిరపరిచితులైన ఎవెంజర్స్ సూపర్ హీరోలు, హీరోయిన్లు, సూపర్ విలన్ మరోసారి అలరించేందుకు విచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ మరో గ్రాఫిక్స్ సీక్వెల్ ఎలా వుందో పరిశీద్దాం...
కథ
          ఈ విశ్వాన్ని అరచేతిలో వుంచుకోవాలని ఆరు కాలాతీత మణులు సంపాదించుకుంటాడు శక్తిశాలియైన లోకకంటకుడు థెనోస్. అతన్ని ఎదుర్కోబోయిన సూపర్ హీరోహీరోయిన్లు ఓడిపోతారు, కొందరు అదృశ్యమైపోతారు. ఇది గత సీక్వెల్ ‘ఇన్ఫినిటీ వార్’ లో జరిగిన కథ. ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు చూసుకుంటే థెనోస్ భూమ్మీద సగం జనాభాని నాశనం చేసి వుంటాడు. ఇప్పుడు మిగిలున్న సూపర్ హీరో హీరోయిన్లు పరిస్థితిని సరిదిద్ది యథాపూర్వ స్థితిని స్థాపించడానికి, టైంమెషీన్ లో కాలంలో ఐదేళ్ళు వెనక్కి ప్రయాణించి ఓడిపోయిన చోటే గెలవాలనుకుంటారు. గెలిచి కాలాతీత మణులు సహా అదృశ్యమైన తమ వాళ్ళని వెనక్కి తెచ్చు కోవాలనుకుంటారు. ఈ క్రమంలో మరోసారి థెనోస్ తో తలపడతారు. ఈ పోరాటంలో గెలిచారా లేదా అనేదే మిగతా కథ.

ఎలావుంది కథ 
     2012 లో ‘ఎవెంజర్స్’ తో ప్రారంభమైన  మార్వెల్ సూపర్ హీరో హీరోయిన్ల అడ్వెంచర్స్ సిరీస్  ‘ఎవెంజర్స్ – ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ గా, ‘ఎవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ గా రెండు సీక్వెల్స్ వచ్చాక, మూడోది  ‘ఎవెంజర్స్ - ఎండ్ గేమ్’ ఇప్పుడు  మన ముందుకొచ్చింది. మార్వెల్ కామిక్ బుక్స్ ద్వారా పాపులరైన వివిధ సూపర్ హీరో హీరోయిన్ల పాత్రలే ఈ సినిమాల్లో ఒక చోట కూడిన పాత్రలు. ప్రస్తుత సీక్వెల్ గత సీక్వెల్ పరాజయ ముగింపుకి విజయయాత్రగా  వుంటుంది. విశ్వాన్ని నాశనం చేయ బూనుకున్న థెనోస్ పరమైన ఆరు కాలాతీత మణుల్ని స్వాధీనం చేసుకుని అతణ్ణి అంతమొందించడమే ప్రస్తుత కథ. ఈ అత్యంత శక్తివంతమైన కాలాతీత మణులు ఒక్కోటీ ఒక్కో అంశతో వుంటాయి: మస్తిష్కం, ఆత్మ, సత్యం, శక్తీ, స్థల కాలాలు. మణుల గురించిన ఈ కథ వాస్తవానికి ప్రేక్షకులకి ఒక స్పిరిచ్యువల్ జర్నీ. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ దివ్య శక్తులున్న ఆర్క్ కోసం జర్మన్ నాజీలతో చేసే  స్పిరిచ్యువల్ పోరాటం. ఈ స్పిరిచ్యువల్ పోరాటాన్ని పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గానే తీసి బాక్సాఫీసులో, చరిత్రలో ఆబాలగోపాలాన్ని మెప్పించిన క్లాసిక్ గా నిలబెట్టేశారు. ప్రస్తుత ఎవెంజర్స్ సీక్వెల్ స్పిరిచ్యువల్ జర్నీ లేక, తగిన యాక్షనూ లేక, సూపర్ హీరో హీరోయిన్ల ఏడ్పుల కథగా మిగిలింది. 

ఎవరెలా చేశారు 
     కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్, ఐరన్ మాన్, యాంట్ మాన్, హల్క్, థోర్, నెబూలా, నటాషా, వార్ మెషీన్, రాకెట్...ఇలా మార్వెల్ కామిక్ బుక్స్ పాపులర్ పాత్రలన్నీ వున్నాయి. ఈ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయా హాలీవుడ్ స్టార్స్ అందరూ వున్నారు. వీళ్ళు ఒకొక్కరూ తెరమీద ప్రత్యక్షమవగానే ప్రేక్షకులు గుర్తుపట్టి ఈలలేస్తారు. ఆ తర్వాత చప్పబడి పోతారు. ఈ స్టార్స్ అప్పుడపుడూ కామిక్ డైలాగులు కొడుతూంటారు. ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయిపోయి పకపకా నవ్వుతారు. అయితే ఎంతసేపటికీ ఈ సూపర్ హీరో హీరోయిన్లు  యాక్షన్ లోకి వెళ్ళకుండా, సొంత బాధలు వెళ్ళబోసుకుంటూ వుండడంతో, కామిక్ డైలాగులకి ప్రేక్షకులిక రెస్పాండ్ అవడం మానేస్తారు. 

          పూర్తిగా కథాకథనాలు, పాత్ర చిత్రణలతోనే వచ్చింది సమస్య. సూటిగా మూడుముక్కల్లో లైనుగా చెప్పుకుంటే ఈ కథ - ఐదేళ్ళ క్రితం థెనోస్ తో పొందిన పరాభవానికి బదులు తీర్చుకోవడమే. హాలీవుడ్ హైకాన్సెప్ట్ సినిమాల స్టోరీ లైన్లు సింపుల్ గా వుంటూ, వాటి మీద యాక్షన్లు భారీ రేంజిలో వుంటాయి. ‘ఎండ్ గేమ్’ లో ఇది రివర్స్ అయింది. స్టోరీ లైను పాత్రల పుట్టుపూర్వోత్తరాలతో పెనుభారంగా మారిపోయి, యాక్షన్ కనుమరుగై పోయింది. పాత్రల గత పురాణాలతో, ఉపోద్ఘాతాలాతో ఎంతకీ అసలు కథలోకి వెళ్ళని తతంగమైపోయింది. 

          ఫస్టాఫ్ గంటన్నర పాటు మూడు పాత్రలు మిగిలిన పాత్రల్ని పోరాటానికి ఒప్పించడం తోనే  సరిపోయింది. ఈ ఒప్పించే క్రమంలో ఆయా పాత్రలు మొండి కేయడం, బాధలు చెప్పుకోవడం, కుటుంబ సెంటిమెంట్లు వెళ్ళబోసుకోవడం ఫ్లాష్ బ్యాకులు వేసుకోవడం...   ఇలా సబ్ ప్లాట్స్ తో, పూర్వ కథలతో కాలం గడుపుతూ ఎంతకీ పోరాటానికి సమాయత్తం కారు. అయ్యాక పోరాటానికి తయారీలతో సెకండాఫ్ లో మరో 70 నిమిషాల వరకూ గడిపేస్తారు. ఇక థెనోస్ తో ముఖాముఖీ అయి పోరాటం మొదలెట్టేసరికి రెండు గంటల 20  నిముషాలు సమయం చూపిస్తుంది గడియారం. ఇంత సేపూ కథ మొదలవదు, యాక్షన్ కూడా మొదలవదన్న మాట. ఇప్పుడు ఇదే క్లయిమాక్స్ యాక్షన్ కూడా. ఈ యాక్షన్ 20 నిమిషాల్లోనే ముగిసిపోతుంది. మధ్యమధ్యలో యాక్షన్ ని ఆపి ఇంకా పాత్రల డ్రామాలుంటాయి. ఇక థెనోస్ అంతమయ్యాక శుభం పడదు. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి ఇంకో మరో 20 నిమిషాల సేపూ సూపర్ హీరో హీరోయిన్ల పాత్రాలకి ముగింపు తతంగం! ఇంతమంది స్టార్స్ వున్న మొత్తం మూడు గంటల సినిమాలో యాక్షన్ వుండేది ఆ 20 నిమిషాల సేపే! ఇలా నస ఎక్కువ, పస తక్కువగా తయారయ్యింది. 

       ప్రారంభంనుంచే ప్రేక్షకుల కామెంట్స్ – ‘మన సినిమాల్లో లైటింగ్ బావుంటుంది, ఈ సినిమా యేంటి చీకటిగా వుంది’ అని. నిజమే, 90 శాతం దృశ్యాలు చీకట్లోనే వుంటాయి. 20 నిమిషాల క్లయిమాక్స్  భారీ యాక్షన్ కూడా చీకట్లోనే. ఏ సూపర్ హీరో / హీరోయిన్ ఎవర్ని కొడుతున్నారో అర్ధమే గాదు! ఫస్టాఫ్ పూర్తిగా బోరు, సెకండాఫ్ ఇంకా బోరు, పైగా చీకట్లో కుమ్ములాట. ఈ సినిమాని సగానికి కత్తెర వేసి విడుదల చేయవచ్చు. పూర్వం ఫిలిం రీళ్ళున్న కాలంలో థియేటర్లలో ఆపరేటర్లే ప్రేక్షకులకి బోరు కొట్టే భాగాల్ని కత్తిరించి, నిడివి తగ్గించేసే వాళ్ళు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. 

          ఇప్పటికి ఎన్నోసార్లు తెలిసిన పాపులర్ పాత్రలనే చకచకా ఒకచోట చేర్చి యాక్షన్ ప్రారంభించకుండా,  వాటి అక్కరలేని పూర్వా పరాలతో,  పాత్ర చిత్రణలతో, భావోద్వేగాలతో  తెగ బోరు కొట్టించారు. హాలీవుడ్ సినిమా కాబట్టనేమో ఎలా వున్నా అహా ఓహో అంటూ హైప్ సృష్టించారు. 1960 – 70 ల కాలంలో వచ్చిన హాలీవుడ్ కళాఖండాలలాగా దీన్ని తీశారు. దివ్య శక్తులున్న ఆరు మణులనే సింపుల్ స్పిరిచ్యువల్ యాక్షన్ థ్రిల్లర్ గా తీయడంలో విఫలమయ్యారు. ‘అలీటా’ తో  చేసినట్టు దీన్ని కూడా ఇప్పుడు కాలం చెల్లిన జోసెఫ్ క్యాంప్ బెల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చేయడమే పెద్ద సమస్య!  

సికిందర్
https://telugurajyam.com/