రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 19, 2019

861 : రివ్యూ


        రుసగా దేశ భద్రతకి  సంబంధించిన అంశాలతో సినిమాలు నటిస్తూ వస్తున్న యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం, మరో అలాటి టాపిక్ తో ‘బాట్లా హౌస్’ నటించాడు. ఫోర్స్ - 2, పరమాణు, సత్యమేవ జయతే, రోమియో అక్బర్ వాల్టర్ ల తర్వాత, ‘బాట్లా హౌస్’ తో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే  ప్రయత్నం చేశాడు. ‘బాట్లా హౌస్’ దేశవ్యాప్తంగా సంచలనమైన నిజంగా జరిగిన కథ  కావడంతో దీనికెక్కువ ఆదరణ కన్పిస్తోంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకునే కథతో 2013 లో  ‘డీ –డే’ అనే హిట్ రియలిస్టిక్ యాక్షన్ తీసిన ‘కల్ హో నహో’ ఫేమ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ, కొంత గ్యాప్ తర్వాత  ‘బాట్లా హౌస్’ అనే మరో రియలిస్టిక్ యాక్షన్ తో వచ్చాడు. ‘పింక్’ అనే థ్రిల్లర్ తో  పేరు తెచ్చుకున్న రచయిత రీతేష్ షా, క్షుణ్ణంగా రీసెర్చి చేసి రాసిన ఈ ఎన్కౌంటర్ కథతో మరోసారి ‘పింక్’ లాంటి కోర్టు రూమ్ డ్రామాకి తెర తీశాడు. ఈ నేపథ్యంలో  ఢిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సంఘటన ఎలా తెరానువాదమైందో చూద్దాం...
కథ
         
టీవీ న్యూస్ యాంకరైన భార్య నందిత (మృణాల్ ఠాకూర్) ఆరోపణలతో విసిగిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎసిపి సంజయ్ కుమార్ (జాన్ అబ్రహాం), ఆమె ఇక పుట్టింటికి వెళ్లిపోతానంటే - పోతే పో అని  ఏర్ పోర్టులో దిగబెట్టడానికి తీసుకుని బయల్దేరతాడు. కానీ తను అర్జెంటుగా బాట్లా హౌస్ ఆపరేషన్ కెళ్ళాలి. ఆమె మనసు మార్చుకుని మధ్యలో దిగిపోతుంది. తను బాట్లా హౌస్ కి చేరుకునే సరికి అక్కడ కాల్పులు జరుగుతూంటాయి. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇన్స్ పెక్టర్ వర్మ (రవి కిషన్) తీవ్రంగా గాయపడతాడు. ఎసిపి సంజయ్ వెంటనే రంగంలోకి దిగి ఇద్దరు టెర్రరిస్టుల్ని హతమారుస్తాడు, మరో ఇద్దరు తప్పించుకుంటారు, ఒకడు దొరుకుతాడు.

        వీళ్ళు టెర్రరిస్టులు కాదనీ, యూనివర్సిటీ విద్యార్ధులనీ, జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అనీ ప్రజలు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ పార్టీలూ ఆందోళన చేస్తారు. సంజయ్ ని తీవ్రంగా తూలనాడుతారు. మరోవైపు ఇన్స్ పెక్టర్ వర్మ ఆస్పత్రిలో చనిపోతాడు. ఎంక్వైరీ చేయమంటే ఎందుకు ‘ఎంగేజ్’ అయ్యారని పోలీస్ కమిషనర్ మనీష్ చౌదరి (జైవీర్) నిలదీస్తాడు. ఇన్స్ పెక్టర్ వర్మ తన ఆదేశాల్ని ఉల్లంఘించాడని అంటాడు సంజయ్. దీంతో డిపార్ట్ మెంట్లో అంతర్గత కుమ్ములాటలు ఈ బూటకపు ఎన్కౌంటర్ కి కారణమని గొడవ చేస్తుంది మీడియా కూడా. మనమీద యీ దుష్ప్రచారం ఆగాలంటే తప్పించుకున్న టెర్రరిస్టుల్ని పట్టుకోవాలంటాడు సంజయ్. మళ్ళీ ఈ ప్రయత్నం కూడా చేస్తే ప్రజలు తంతారని వారిస్తాడు కమీషనర్ చౌదరి.  సంజయ్ మానసిక క్షోభకి లోనవుతాడు. బూటకపు ఎన్కౌంటరని ప్రజల దూషణలు ఒకవైపు, సహకరించని కమీషనర్ ఇంకోవైపు, భార్యతో సమస్యలు మరోవైపు, వీటన్నిటికీ మించి చనిపోయిన టెర్రరిస్టులు తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులు మరింకోవైపు...ఇన్నిటి మధ్య సంజయ్ విచలితుడవుతాడు. ఇప్పుడేం చేశాడు? వాళ్ళు బాంబులు పేల్చిన టెర్రరిస్టులేనని, జరిగింది నిజమైన ఎన్కౌంటరేనని, తను తప్పు చేయలేదని ఎలా నిరూపించాడు? ఇదీ కథ. 

      2008 సెప్టెంబర్ 13 న ఢిల్లీలో ఐదుచోట్ల బాంబు పేలుళ్లు సంభవించి ముప్పై మంది చనిపోయారు,133 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఈ దాడుల వెనుక వుందని  పసిగట్టిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దళం ఆ టెర్రరిస్టుల్ని ఆరా తీసి, 19వ తేదీన బాట్లా హౌస్ ఫ్లాట్ మీద దాడి చేశారు. ఆ సందర్భంగా పరస్పరం జరుపుకున్న కాల్పుల్లో ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇన్స్ పెక్టర్  మోహన్ చంద్ శర్మతో బాటు, ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు, ఇద్దరు పారిపోయారు, ఒకడు దొరికాడు. దీనిమీద నిరసనలు పెల్లుబికాయి. విద్యార్ధుల్ని బూటకపు ఎన్కౌంటర్ లో చంపారంటూ న్యాయవిచారణ జరిపించాలన్నారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నివేదిక కోరింది. జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపి పోలీసులకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో మళ్ళీ ఆందోళనలు చెలరేగాయి. అది నిజమైన ఎన్కౌంటర్ అయితే ఒక మృతుడి తల మీద నాల్గు బుల్లెట్లు ఎలా తగులుతాయని, కూర్చోబెట్టి కాల్చారని, ఇంకో మృతుడి వీపు చర్మం చిత్ర హింసలకి గురి కాకపోతే ఎలా చిట్లుతుందని, ఆ ఫ్లాట్ కి ఒకే తలుపు వుండగా, కింద ఒకే ద్వారం వుండగా ఇద్దరు ఎలా పారిపోతారనీ, అక్కడ నిజంగా టెర్రరిస్టులే దాగి వున్నారని తెలిస్తే, ఇన్స్ పెక్టర్ శర్మ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకుండా ఎలా వెళ్ళాడని...కాబట్టి ఇది పోలీసుల అంతర్గత కుమ్ములాటల వల్ల జరిగిందనీ...ఇలా ఆరోపణలు  కురిపించాయి హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు. 2013 లో సెషన్స్ కోర్టు తీర్పు వెలువడింది. దొరికిన ఒక టెర్రరిస్టుకి శిక్ష విధించింది. దీని మీద అప్పీలు కెళ్ళారు. 


          కేసు అప్పీల్ లో వుండగా ఈ సినిమా తీసిన దర్శకుడు నిఖిల్ అద్వానీ, రచయిత రీతేష్ షాలు తమ సుదీర్ఘమైన డిస్ క్లెయిమర్ తో,  సినిమా కోసం తాము చేసిన కల్పనని, సృజనాత్మక స్వేచ్ఛని  సీరియస్ గా తీసుకోరాదన్నారు. సంఘటనకి తమదైన వెర్షన్ తో చేసిన చిత్రణలతో  ఏ అభ్యంతరమూ వుండదు. నిద్ర పుచ్చే చివరి కోర్టు దృశ్యాల తోనే సినిమాటిక్ గా అభ్యంతరముంటుంది. కోర్టులో వాదోపవాదాల మధ్య ‘మేము ఏ వాదం వైపూ లేము’ అని ఇంకో  డిస్ క్లెయిమర్ వేయడమూ అభ్యంతరమే. ఎటువైపూ లేకపోవడం వల్లే  కోర్టు దృశ్యాలు స్లీపింగ్ పిల్స్ లా వున్నాయి. అంతవరకూ హీరో చుట్టూ మాంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వున్న కథని, కోర్టుకు చేర్చడమే పొరపాటుగా వుంది. 


        అంత కష్టపడి చివరికి తప్పించుకున్న టెర్రరిస్టుని పట్టుకున్న హీరో,  కోర్టుకి తీసికెళ్ళడ మేమిటి? ఎంత మంది మృతికి, వికలాంగులవడానికి  కారకుడయ్యాడో, ఇన్స్ పెక్టర్ కుటుంబం సహా, ఆ బాధిత కుటుంబాలందరి ముందూ హాజరుపర్చి, వాళ్ళు వేసే కఠిన ప్రశ్నలకి జవాబు చెప్పుకునేలా చేసి-  టెర్రరిజం సినిమా కథల టెంప్లెట్ ని మార్చవచ్చు కదా? అసలైన కోర్టు ఇది కదా? హీరో మతగ్రంథం చదివి వినిపిస్తే టెర్రరిస్టులు మారతారా? ఇలాటి కథల్లో ఎప్పుడూ స్టేక్ హోల్డర్లయిన వందలాది బాధిత కుటుంబాల ఉనికే లేకుండా చేయడమేమిటి?

         
దీన్నొక ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పరిమితం చేశారు. కథా ప్రయోజనాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. కోర్టు వాదోపవాదాల్లో మొత్తం ఆ రోజు అసలేం జరిగిందీ సైంటిఫిక్ ఆధారాలతో, రెండు వైపుల నుంచీ చెప్పుకువచ్చే డ్రామా స్థాయికి కుదించారు. ఇలాటి సామాజిక నేరాల్లో జరిగిందానికి  లాజిక్కులు జోడించుకు వచ్చే, మన తార్కిక బుద్ధిని పరీక్షించే, కథ అవసరం లేదు. ఈ కథకి విశాల ప్రాతిపదికన మనలోని మానవీయ, సామాజిక కోణాలని తట్టిలేపే ఎమోషనల్ డ్రామా అవసరం. ఇది సరయిన కథా ప్రయోజనమవుతుంది. దొరికిన వాణ్ణి  సామూహిక బాధితుల కోర్టులో నిలబెట్టి, వాడు జవాబు చెప్పుకోలేని ప్రశ్నలు సంధింపజేయడం అవసరం. టెర్రరిస్టులకి ఈ కొత్త అనుభవం రుచి చూపిస్తే మత్తు వదుల్తుంది. మతగ్రంథాలు, చట్టాలు వాళ్ళ అంతరాత్మల్ని తాకలేవు. టెర్రరిస్టులు మౌలికంగా సమాజంతో తెగతెంపులు జేసుకున్నారు. వాళ్ళని అక్కడికే తెచ్చి భావజాలాన్ని చంపాల్సి వుంటుంది.

          ఈ సినిమాలో ఒకటి మాత్రం యాదృచ్ఛికంగా, తులనాత్మకంగా కళ్ళకి కడుతుంది- ఎన్కౌంటర్ ని అనుమానించి ఉద్యమించిన వాళ్ళెవరినీ అప్పటి ప్రభుత్వం జాతివ్యతిరేకులు, దేశద్రోహులు అనకపోవడం, నిర్బంధించక పోవడం. మీడియా గొంతు నొక్కకపోవడం. 

ఎవరెలా చేశారు 
     జాన్ అబ్రహాం ఈ మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ ని అజేయంగా పోషించాడు. క్యారక్టర్ని చూస్తున్నప్పుడు తనలోకి ప్రేక్షకుల దృష్టి చొచ్చుకెళ్ళేలా  చేశాడు. క్యారక్టర్ బాధ ప్రేక్షకుల బాధ అయ్యేలా చూశాడు. సినిమాల్లో అలవాటుగా చూపించే అతి కూడా చేశాడు. జాతీయ పతాకాన్ని చూడగానే దేశభక్తి పొంగుకు రావడం. జాతీయ పతాకం, దేశభక్తి తర్వాతి సంగతి. అది యుద్ధ చిత్రాల్లో సైనికులు చూసుకునే సంగతి. అంతదాకా పోనవసరం లేదు. ఇలాటి పోలీసు కథల్లో ముందు న్యాయదేవత చేతిలో త్రాసుతో వుంటుంది. ఈ కథ ఈమెతో సంబంధం. తన ఇమ్మీడియెట్ దైవం న్యాయదేవత కావాలి. 

          ఇంకో అతి ఏమిటంటే, ఎన్కౌంటర్ సమయంలో దొరికిన అనుమానితుణ్ణి ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు గ్రీన్ షర్టు వేసుకుని, మతగ్రంథంతో రెడీ అన్నట్టు తను వుండడం. అనుమానితుడు “అయోధ్య చేస్తే, గుజరాత్ చేస్తే మేం వూరుకోవాలా?” అంటాడు. అప్పుడు గ్రీన్ షర్టు వేసుకున్న అబ్రహాం, గ్రీన్ సంచీలోంచి మతగ్రంధం తీసి, కళ్ళకద్దుకుని, ముద్దాడి బాగా ఓవర్ డ్రామా చేస్తాడు. అరబ్బీ చదివి అర్ధం చెప్తాడు. తను పోషిస్తున్న ఎసిపి సంజయ్ పాత్రకి అరబ్బీ ఎలా వచ్చింది? సంస్కృతం కూడా వచ్చా? నేపాళ భాష కూడా? టెర్రరిస్టులతో ఎప్పుడూ ఇవే టెంప్లెట్ ఇంటరాగేషన్ సీన్లు. గ్రీన్ షర్టు వేసుకున్న తను అసలైనది మరిచాడు – మత గ్రంథం తెరచినప్పుడు తల మీద టోపీయో, చేతి రుమాలో వేసుకోవడం! అసలు ఏ మత గ్రంథాలనీ ఇంటరాగేషన్ చేసే, హింసించే దుర్గంధభూయిష్ట గదుల్లోకే తీసికెళ్ళరు. 

          ఈ కథకి ప్లాట్ డివైస్ గా ఇంటరాగేషన్లో వుండాల్సింది వాడు తిప్పికొట్టే అభౌతిక మతగ్రంథ సూక్తులు కాదు. వాడి బాంబు దాడుల్లో మరణించిన, వికలాంగులైన వాళ్ళ భౌతిక మైన, లౌకికమైన, హృదయవిదారక విజువల్స్. ఇవి చూపించి కదా వాడి జవాబు కోరాలి? 

          తను చంపిన ఇద్దరు టెర్రరిస్టులు భూతాలై తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులతో అబ్రహాం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పేషంట్ కూడా అవుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తను చూసే విజువల్స్ లో ఆ భూతాల వెనుక ముస్లిం సమూహాలే వుంటాయి హాహాకారాలు చేస్తూ. పదే పదే ఇది రిపీటవుతుంది. తనని దూషిస్తూ ఆందోళన చేస్తున్న సమూహాల్లో అన్ని వర్గాల వాళ్ళూ వున్నారు. ఒక వర్గమే మత ఫీలింగుతో తన మీదికి వస్తున్నట్టు సెలెక్టివ్ గా మార్క్ చేసుకుని చిత్తభ్రాంతులకి లోనవడమెందుకు? దర్శకుడూ రచయితా నిష్పక్షపాత ధోరణి నుంచి అక్కడక్కడా పక్కకెళ్ళి పోతూంటారు.

        భార్యతో ఆ గొడవేమిటో అర్ధమేగాదు. సినిమా మొదటి దృశ్యమే భార్య సణుగుడుతో ప్రారంభమవుతుంది. ఈ మొదటి షాట్ ని బ్లర్ చేసి చూపించడం, గొడవేమిటో దర్శకుడికి స్పష్టత లేదనేమో. ఈ గొడవైనప్పుడల్లా బ్లర్ చేసి చూపిస్తే సరిపోయేది. ఇక ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిరూపించే అంశానికి సంబంధించి-  తప్పించుకున్నటెర్రరిస్టు వేటలో  పాత్రచిత్రణకి, నటనకి, సంఘర్షణకి అబ్రహాం ఏ - వన్ యాక్టర్. కమీషనర్ నుంచీ హోంమంత్రి (చిదంబరం?) వరకూ ఎవరి ఆమోదంలేని ఆపరేషన్ కి తెగించడం, దెబ్బతినడం, తెగించడం చీవాట్లు తినడం...ఇలా సానుభూతి ఎక్కువ పొందుతాడు. చివరికి కోర్టు దృశ్యాలు మళ్ళీ మైనస్. 

          భార్య పాత్రలో నటి మృణాల్ ఠాకూర్ కి మంచి ఫేసు, ఎక్స్ ప్రెషన్స్ వున్నాయి. ఆమెకి వ్యక్తిగతంగా భర్తతో, న్యూస్ యాంకర్ గా వృత్తిగతంగా ఛానెల్ నిర్వాహకులతో పాత్రచిత్రణ సరీగా లేదు. భర్తతో గొడవేమిటో అర్ధమేగాదు. ఇక భర్త నకిలీ ఎన్కౌంటర్ చేశాడని విమర్శిస్తూ న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ నిర్వాహకులు, ఆమెని సెలవు మీద వెళ్ళ మంటారు. ఆమె ప్రతిఘటిస్తుం ది. తర్వాతేం చేస్తుందో కొనసాగింపు లేదు. భర్తతో వుంటుంది. 

         
భోజ్ పురీ స్టార్ రవికిషన్ ది సంక్షిప్త ఇన్స్ పెక్టర్ పాత్ర. ఎన్కౌంటర్ లో వెంటనే చనిపోతాడు. తర్వాత అబ్రహాం జ్ఞాపకాల్లో మాంటేజెస్ లో కన్పిస్తాడు. చివర కోర్టు దృశ్యాల్లో సస్పెన్స్ రివీలవుతున్నప్పుడు అసలెలా చనిపోయిందీ తిరిగి మాంటేజెస్ లో వస్తాడు. జడ్జిగా నటించిన ఉత్కర్ష్ రాయ్, కమీషనర్ గా నటించిన జైవీర్, డిఫెన్స్ లాయర్ గా నటించిన రాజేష్ శర్మ, తప్పించుకున్న టెర్రరిస్టుగా నటించిన సాహిదుర్ రెహ్మాన్ వాళ్ళ లుక్స్ తో, నిజ జీవితంలో ఆ పాత్రల్ని చూస్తున్నట్టే వుంటారు. అబ్రహాం ఇంటరాగేట్ చేసే అనుమానిత టెర్రరిస్టుగా అలోక్ పాండే ఇంకో ఎట్రాక్షన్.

          ఇక ఉత్తర ప్రదేశ్ లో దాక్కున్న టెర్రరిస్టు ప్రియురాలిగా, రష్యన్ డాన్సర్ గా నోరా ఫతేహీతో ఒక  ఐటెం పాట మాస్ కోసం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుంది, సందేహం లేదు. నటింపజేసుకోవడంలో, దృశ్య చిత్రీకరణల్లో నిఖిల్ అద్వానీ ఉత్తమ అభిరుచిని కనబర్చాడు. 

చివరికేమిటి 
      చివర్లో కోర్టు దృశ్యాలు తప్పిస్తే,  త్రీయాక్ట్స్ లో వున్న స్క్రీన్ ప్లే మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ తో సూటి కథగా సాగుతుంది. తొలి ముప్పావుగంటలో బిగినింగ్ ని ముగించి, న్యాయ విచారణ డిమాండ్ కి హీరో అప్రమత్తమై, గోల్ తీసుకోవడం చూపిస్తారు.ఇక్కడ ప్రారంభమయ్యే కథ తప్పించుకున్న టెర్రరిస్టు ని పట్టుకుని ఎన్కౌంటర్ ని నిరూపించే ఒకేఒక్క సూటి గీత మీద పరిగెట్టుతుంది. ఈ వేట రెండు ఎపిసోడ్లుగా వుంటుంది. మొదటి ఎపిసోడ్ ఉత్తరప్రదేశ్ లో విఫలమయ్యాక, రెండో ఎపిసోడ్ నేపాల్ సరిహద్దులో విజయవంతమవుతుంది. నేపాల్ సరిహద్దులో పట్టుకోవడాన్ని వేరే కేసులోంచి తీసుకుని వాడుకున్నట్టున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ముఖ్యుడు యాసీన్ భత్కల్ ని పట్టుకుంది నేపాల్ సరిహద్దులోనే. ఇలా భారీ కథకి హాలీవుడ్ టైపులో సింపుల్ లైను, ఇంతే. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్లు చాలా బర్నింగ్ గా, థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా వుంటాయి. చివరికి పట్టుకున్న టెర్రరిస్టుని కోర్టులో నిలబెట్టడం మాత్రం మానవీయకోణం లేని అదే పాత వ్యవహారంలా వుంది.


-సికిందర్
Watched at PVR, Moosarambagh
7 pm, 18.8.19