రివ్యూ..
షుగర్ కోటింగ్ మిస్సయిన సీరియస్ నెస్ !
దర్శకత్వం : వై. సునీల్ కుమార్ రెడ్డి
తారాగణం : మనోజ్ నందం, ప్రియాంకా పల్లవి, సత్యానంద్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్ ,
నిర్మాత : వై. రవీంద్ర
విడుదల: 18 జులై 2014 సెన్సార్ : ‘A’
*
దర్శకుడు వై. సునీల్ కుమార్ రెడ్డి రోమాంటిక్ కథలకి యూత్ ఎదుర్కొంటున్న సమస్యల్ని జోడిస్తూ యూత్ స్పృహ వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకి ముందు ‘సొంతూరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలతో సామాజిక స్పృహ వున్న దర్శకుడుగా అవార్డులు సాధించుకున్నారు. యూత్ వైపు దృష్టి సారించాక ‘ఒక రోమాంటిక్ క్రైం కథ’, ‘వెయిటింగ్ ఫర్ యూ’, ‘నేనేం చిన్న పిల్లనా’ తర్వాత ఇప్పుడు ‘ఒకక్రిమినల్ ప్రేమకథ’ తీశారు. వీటిలో ‘నేనేం చిన్న పిల్లనా’ కాలం చెల్లిన ఫ్యామిలీ డ్రామాగా వర్కౌట్ కాలేదు, ‘వెయిటింగ్ ఫర్ యూ’ ఫ్యాక్షన్ , టెర్రరిజం, మతకలహాల కలగూరగంపలా దెబ్బతింది . ఇప్పుడు ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ తో మరో యూత్ సమస్యని ఎత్తుకున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, యూత్ కి సెక్సు సమస్యలు తప్ప ఇంకేవీ ఉండనట్టు భావించడం దగ్గరే. వీటికంటే కెరీరిజం మీద, డబ్బు సంపాదనల మీద ఆసక్తికరమైన కొత్త కథలు చెప్పవచ్చన్న ఆలోచన చేయకపోవడం దగ్గరే!
దర్శకుడు వై. సునీల్ కుమార్ రెడ్డి రోమాంటిక్ కథలకి యూత్ ఎదుర్కొంటున్న సమస్యల్ని జోడిస్తూ యూత్ స్పృహ వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకి ముందు ‘సొంతూరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలతో సామాజిక స్పృహ వున్న దర్శకుడుగా అవార్డులు సాధించుకున్నారు. యూత్ వైపు దృష్టి సారించాక ‘ఒక రోమాంటిక్ క్రైం కథ’, ‘వెయిటింగ్ ఫర్ యూ’, ‘నేనేం చిన్న పిల్లనా’ తర్వాత ఇప్పుడు ‘ఒకక్రిమినల్ ప్రేమకథ’ తీశారు. వీటిలో ‘నేనేం చిన్న పిల్లనా’ కాలం చెల్లిన ఫ్యామిలీ డ్రామాగా వర్కౌట్ కాలేదు, ‘వెయిటింగ్ ఫర్ యూ’ ఫ్యాక్షన్ , టెర్రరిజం, మతకలహాల కలగూరగంపలా దెబ్బతింది . ఇప్పుడు ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’ తో మరో యూత్ సమస్యని ఎత్తుకున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, యూత్ కి సెక్సు సమస్యలు తప్ప ఇంకేవీ ఉండనట్టు భావించడం దగ్గరే. వీటికంటే కెరీరిజం మీద, డబ్బు సంపాదనల మీద ఆసక్తికరమైన కొత్త కథలు చెప్పవచ్చన్న ఆలోచన చేయకపోవడం దగ్గరే!
ప్రస్తుత సినిమాలో ఇళ్ళల్లో దగ్గరి బంధువులతో ఆడవాళ్ళు
ఎదుర్కొంటున్న లైంగిక హింస గురించి
చెప్పాలనుకున్నారు. దీనిపట్ల యువతీ
యువకులు ఎలా రియాక్టయ్యారన్నది చూపించాలనుకున్నారు. అయితే ఆ కామ ప్రకోపిత బంధువు అసలలా
ప్రవర్తించడానికి గల మానసిక కారణాల మూలాల్లోకి దర్శకుడు వెళ్లకపోవడం వల్ల, సమస్యకి
చూపించిన పరిష్కారం రొటీన్ ఫార్ములా చట్రంలో ఉండిపోయింది.
ఇదొక క్రిమినల్ ప్రేమ కథ అన్నారు. కానీ కథలో అతడ్ని
క్రిమినల్ గా చూపించలేదు, కథంతా అయ్యాకే అతను క్రిమినల్ గా మిగిలాడు. అదెలాగో
చూద్దాం...
బాబోయ్ మేనమామ!
శీను (మనోజ్) ఓ గ్రామంలో ఫోటో స్టూడియోలో పనిచేసే కుర్రాడు.
బిందు (ప్రియాంక పల్లవి) పెద్దమనిషైన శుభకార్యానికి వీడియో తీయడానికి వెళ్లి ఆమె
ఆకర్షణలో పడతాడు. ఇదామె గమనిస్తుంది. ఇక్కడనుంచీ ఆమె వెంట పడతాడు. ప్రేమ
ఖరారవుతుంది. అప్పుడు తాగుబోతు అయిన బిందు
తండ్రికి పక్షవాతం రావడంతో, విధిలేక ఉదర పోషణకు బిందు తల్లి వైజాగ్ లో ఉన్న తన
అన్న ( సత్యానంద్) పంచన చేరుతుంది- భర్తా కూతురూ సహా.
ఈ ఎడబాటు తాళలేక శీనుకూడా వైజాగ్ వెళ్ళిపోయి, బిందు చదివే
కాలేజీలోనే క్యాంటీన్ బాయ్ గా చేరతాడు. ఐతే విచిత్రంగా బిందు ఇతన్ని చూడదు,
మాట్లాడదు. ఆమె కోపానికి కారణమేంటో అర్ధంగాదు. అతడి కళ్ళ ముందే సిటీలో వేరే
కుర్రగ్యాంగ్ తో తిరుగుతూంటుంది.
ఈమె క్లాస్ మేట్స్ గా ఇద్దరమ్మాయి లుంటారు. వీళ్ళు తమ శరీరాల్ని
తాకే మగవాళ్ళ అంతు చూస్తూంటారు. ఒక రోజు ఉండబట్టలేక శీను మొండికేసిన బిందూని
పట్టుకోవడంతో దేహశుద్ధి జరిగి క్యాంటీన్ నుంచి డిస్మిస్ అవుతాడు. ఈ అవమానంతో
ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు బిందు వచ్చి పలకరిస్తుంది. ఇద్దరూ మళ్ళీ
ఒకటవుతారు. కానీ బిందూ అంతవరకూ తనకి దూరంగా వున్నా కారణం మాత్రం శీనుకి చెప్పాడు.
పైగా అతడికి చెప్పి కొన్ని సాహసాలు చేయిస్తూంటుంది. అమ్మాయిల్ని లైంగికంగా
వేధిస్తున్న లెక్చరర్ కి బుద్ధి చెప్పడం, బయట ఓ కారు అద్దం పగలగొట్టడం వంటివి...
ఈ కొత్త హీరోయిన్ ది ఫోటోజెనిక్ ఫేసు కాదు. దీంతో సినిమాకి
‘సి’ గ్రేడ్ లుక్ వచ్చేసింది. ఈమెతో తీసిన లైంగిక వేధింపుల దృశ్యాల ధాటి చూస్తే,
ఇలాటి గ్లామర్ తక్కువ హీరోయిన్లే ఇందుకు ధైర్యం చేస్తారేమో అఅన్పించేలా వుంది. కాబట్టి
ఇంతకంటే అందమైన హీరోయిన్ ని తెచ్చుకునే అవకాశం లేదు దర్శకుడికి.
హీరో మనోజ్ ఓవరాక్షన్ లేకుండా బాగా చేశాడు. పాత్ర
ఎలావుండాలో అలా అండర్ ప్లే చేశాడు. ప్రేమలో బాధని ఓర్చుకోవడంలోనూ పరిణతి
కనబర్చాడు. కథల విషయంలో అతడింకా రాటుదేలితే, తనకంటూ ఫాలోయింగ్ వున్న ప్రేక్షకులకి
ఇంకా మంచి వినోదాన్ని అందించగలడు.
పోతే, మేనమామగా నీలి చిత్రాల బాపతు నిమ్న పాత్ర పోషించిన యాక్టింగ్
స్కూల్ అధినేత సత్యానంద్ గట్టి షాకిస్తారు ఈ సినిమాలో. ఇదికూడా ఒక సినిమాపాత్రేనా,
సినిమా పాత్రే అనుకుంటే, పోర్న్ స్టార్ సన్నీ లియోన్నే సినిమా ప్రేక్షకులు
ఆదరించారు గనుక ఇదెంతా అనుకున్నా, విజువల్ గా దీని పరిమితులు ఎంతవరకుండాలనేది కూడా
గాలి కొదిలేస్తే ఎలా? నిజజీవితంలోని అన్ని
చేష్టలూ కళారూపాల సన్నివేశాలవుతాయా? వాస్తవికత అంటే ఇదేనా? అంతా అయోమయం!
సాంకేతికంగా డీ టీ ఎస్ మిక్సింగ్ సృజనాత్మకంగా లేదు.
సన్నివేశాల వెలుపల ఎక్కడో దూరంగా
వినిపించే గొంతుకలు కూడా ఫుల్ వాల్యూంలో వుండడం ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఎంత లో
బడ్జెట్ సినిమాకైనా క్వాలిటీ విజువల్స్ సాధించే డీఐ ఇప్పుడు అందుబాటులో వున్న
కాలంలో ఈ సినిమా దాన్నందుకోనట్టే కన్పిస్తోంది. ఉన్నపాటల్లో మాత్రం మొదటి రెండూ
సాహిత్యంతో సహా బావున్నాయి. కెమెరా వర్క్ డిస్టర్బింగ్ సీన్లలో కూడా స్టాటిక్
షాట్లతో చలనం లేకుండా వుంది. సినిమా త్వరత్వరగా చుట్టేసినట్టుంది.
స్క్రీన్ ప్లే సంగతులు!
ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి. ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి, ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ, వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా ‘కథ’ అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి తీయాల్సింది కాదు!
ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి. ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి, ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ, వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా ‘కథ’ అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి తీయాల్సింది కాదు!
నిజజీవితంలో అనేక చేదు లుంటాయి. అవన్నీ సినిమాకి తీపి
అయిపోవు. వాటిలో చెప్పుకుని చప్పున కట్
చేసేసే చేదు ఉదంతాలుంటాయి. వాటిని
చెప్పుకునీ, ఊహించుకునీ ఆనందించలేం. ఖండించగలం.
అలాటి చేదుల్లో ఒకటి వావీవరసల్లేని లైంగిక
వేధింపులు. ఇందులో వుండేది బూతు కాదు, పెర్వర్షన్. వయసు మీదపడిన మేనమామ టీనేజి మేనకోడల్ని
అనుభవించడం, మామ కోడల్ని చెరచడం, తండ్రి కూతుర్ని
రేప్ చేయడం అప్పుడప్పుడు మనచుట్టూ జరిగే పెర్వర్టెడ్ కేసులే. అంత మాత్రాన దీంట్లో
సెక్సప్పీల్ ని చూసి, ఇలా కూడా కొత్తగా
యూత్ ప్రేక్షకుల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవచ్చన్న ఆలోచన కలగడమే బూమరాంగ్ అయ్యే పరిస్థితి! బూతు
వేరు, పెర్వర్షన్ వేరు. యువ ప్రేక్షకులు బూతు బానిసలనే దుర భిప్రాయం నుంచి, వాళ్ళు
ప్రమోటై సెక్సువల్ పెర్వర్షన్ కూడా ఎంజాయ్
చేసే సైకోలనే నిర్ణయానికి రావడం చాలా విచారకరం.
సామాజిక సమస్య చెబుతున్నామని గణాం కాలేసి, చూపించిందంతా
పెర్వర్షన్నే. లేకపోతే, పదేపదే కూతురు వయసున్న మేనకోడలితో బలవంతంగా మాస్టర్బేషన్
దగ్గర్నుంచీ ఓరల్ సెక్సు వరకూ పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు.
ఇటీవలే ‘హైవే ‘
తీసిన ఇంతియాజ్ అలీకి బూతుకీ, పెర్వర్షన్ కీ మధ్య సన్నని గీత తెలుసేమో.. అందుకే
జాగ్రత్త పడి, తను తీస్తున్న కమర్షియల్
ఎంటర్ టెయినర్ లో లైంగిక వేధింపుల గురించి సూచన ప్రాయంగా మాత్రమే తెలియజేసి వదిలేశాడు. వీటిని దృశ్య పరంగా చూపిస్తే వెగటు
పుట్టి వైడ్ యాక్సెప్ టెన్స్ ఉండదని,
కేవలం ఇంటర్వెల్ దగ్గర- తన బాల్యం దగ్గర్నుంచీ ఒక అంకుల్ పాల్పడుతున్న లైంగిక
వేధింపుల గురించి హీరోయిన్ చేత వాచికంగా
హీరోకి చెప్పించాడు. క్లైమాక్స్ లో ఆ అంకుల్ ని అందరి ముందూ దులిపేసి, షాక్ కి
గురిచేసి వెళ్లి పోతుందామె, అంతే!
ఇలా నీటుగా చెబితే ప్రేక్షకులామె బాధని ఫీల్ అవడానికి సరిగ్గా సరిపోయింది.
సునీల్ కుమార్ రెడ్డి సినిమాలో హీరోయిన్
బాధకన్నా, ఆ బాధని సెక్సువల్ గా చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ కూడా చేయాలన్న కసి
ఎక్కువ వుంది. ఇంతియాజ్ అలీ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ కి లైంగిక వేధింపులనే విషాదముంది,
అది కేవలం ఇంటర్వెల్లోనూ, ముగింపులోనూ రెండు చోట్ల తప్ప, ఎక్కడా బయట పెట్టకుండా బందిపోటు (రణదీప్ హూడా) తో ఆమెకి
రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చి ఎంటర్ టెయిన్ చేస్తూ పోయాడు. గొప్పింటి
బిడ్డ తనని కిడ్నాప్ చేసిన డెకాయిటీనే
ప్రేమించడమనే స్టాక్ హోమ్ సిండ్రోం
అనే మానసిక స్థితిని తెలియజేస్తూ వుంటుందే
తప్ప, ఆమె చెప్పే వరకూ అసలు కారణం మనం పసిగట్టలేం. మంచి కథల్లో హిడెన్ ట్రూత్
ఉంటుందని అంటాడు జేమ్స్ బానెట్. ఐతే దాన్ని నిర్వహించడంలోనే అంతా వుంది. ఇంతియాజ్
అలీ దాన్ని మరుగు పరచి, ఆరు రాష్ట్రాల
పొడవునా సాగే రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇస్తే, సునీల్ కుమార్ రెడ్డి దాన్ని
బట్టబయలు చేసి ఎలాంటి షుగర్ కోటింగూ లేకుండా పచ్చి పచ్చిగా అదే ప్రధాన కథ అనుకుని
చెలరేగిపోయారు!
ఒకసారి పైన ఇచ్చుకున్న వివరణని మళ్ళీ ప్రస్తావించుకుంటే -
ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు
నాలుగు రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్
తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి. ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి.
ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ, వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ
సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న
స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ
సినిమా ‘కథ’ అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి తీయాల్సింది కాదు!
ఇలా ఫ్లాష్ బ్యాక్స్ ని ‘కథ’ అని ఎందుకు అనుకోవడం లేదు మనం?
ఏ సినిమాలో ఫ్లాష్ బ్యాకు అయినా కథా లక్షణాలతో వుండదు కాబట్టి!
దీన్ని వివరించుకుందాం- ఉదాహరణకి హీరో చేసే యాసిడ్ దాడితో ఈ
సినిమా మొదలౌతుంది. అరెస్టయి లాకప్ లోపడ్డాక అతడికి జరిగిందంతా గుర్తొస్తూంటుంది.
ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో- విలేజిలో తను ఫోటో స్టూడియోలో పనిచేసుకుంటూ, సమర్తాడిన రోజున
హీరోయిన్ని చూసి ప్రేమిస్తూ, ఆమె వైజాగ్ వెళ్లిపోవడంతో తనూ అక్కడి కెళ్ళి, అదే
కాలేజీ క్యాంటీన్ లో చేరి పనిచేస్తూ, ఆమెకోసం ప్రయత్నిస్తూ వుండి నప్పుడు, ఒకానొక
ఘట్టంలో ఆమె తన మేనమామని చంపమంటుంది..ఎందుకు చంపాలన్న దానికి తనూ ఓ ఫ్లాష్ బ్యాక్
ఎత్తుకుంటుంది. అంటే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట!
ఈ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో, మేనమామతో తను పడుతున్న లైంగిక
వేధింపులు ఏకరువు పెడుతుంది. ఇదయ్యాక మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది.
హీరోయిన్ చెప్పిన సమస్యకి పరిష్కారంగా మేనమామని చంపడానికి ఒప్పుకుని
ప్లానేస్తాడతను. దీంతో ఈ ఫ్లాష్ బ్యాకు కూడా
ముగిసి, హీరో యాసిడ్ దాడికి వెళ్ళే దృశ్యంతో మొదటి కొస్తాం. అంటే వర్తమాన
కాలంలోకి వస్తాం. ఈ వర్తమాన కాలంలో కోర్టుకి తీసుకెళ్తున్న హీరో తిరిగి దాడి చేసి
మేనమామని చంపడంతో సినిమా ముగింపుకొస్తుంది.
ఫ్లాష్ బ్యాక్స్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో వర్తమానం
లోకొచ్చి, యాసిడ్ దాడి కేసులో పోలీసుల
విచారణా, లాకప్ లో వున్న హీరో ఇంటరాగేషన్ వగైరా జరుగుతూంటాయి.
ఇప్పుడు పాయింటేమిటంటే – హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఇన్నర్ ఫ్లాష్
బ్యాక్, మధ్యమధ్యలో వచ్చిపోయే వర్తమానకాలంలో
జరిగే సంఘటనలూ - ఈ మూడింట్లో ఏది సినిమా
కథ?
ఫ్లాష్ బ్యాక్స్ ఎప్పుడూ కథలు కాబోవు!
వర్తమాన కాలం (రియల్ టైం) లో మొదలెట్టిన కథ లేకుండా, పూర్వ మెప్పుడో జరిగిన విశేషాల తాలూకు ఫ్లాష్ బ్యాక్ (సింహావలోకనం-
డ్రీమ్ టైమ్ ) మనజాలదు. ఫ్లాష్ బ్యాక్
దానికదే స్వతంత్ర కథాంగం కాదు. వర్తమాన సంఘటనలతో మొదలెట్టి చెప్తేనే ఫ్లాష్ బ్యాక్
కి అర్ధం. అదే వర్తమాన కథ ఫ్లాష్ బ్యాక్ లేకున్నా సర్వస్వతంత్రంగా సాగే సంపూర్ణ
ప్రక్రియ.
ఎలాగంటే, ఓ కథని తీసుకుంటే, దాంట్లో ఓ సమస్య- దాంతో ఓ సంఘర్షణా – దానికో పరిష్కారమూ
అనే మూడంకాల పరిపూర్ణ ఫోటో ఫ్రేముగా
కన్పిస్తుంది. ఇది కథా లక్షణం.
అదే ఫ్లాష్ బ్యాక్స్ లో చూస్తే, ఈ లక్షణం వుండదు.
సమస్య-సంఘర్షణ-పరిష్కారం అనే మూడంకాల నిర్మాణం వుండదు. వీటిలో సమస్య, సంఘర్షణ అనే
రెండంకాలే వుంటాయి, మూడోదైన పరిష్కారం వుండదు. వుంటే అసలు ‘వర్తమాన కథే’ వుండదు.
ఎందుకంటే, ఫ్లాష్ బ్యాక్ లోనే సమస్య పరిష్కారమై పోయింది కాబట్టి!
ఈ సినిమా హీరోకి కథలో ముందుగా ఎందుకో ప్రేమించని హీరోయిన్ తో సమస్య
ఏర్పడింది, తర్వాత ఆమె చెప్పిన ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ తో సంఘర్షణ మొదలయ్యింది. ఈ
సంఘర్షణకి పరిష్కారమార్గం వర్త మాన కథలో హీరోయిన్ మేనమామని చంపమనడం దగ్గర వుంది.
ఫ్లాష్ బ్యాక్ లో లేదు.
అలాగే హీరోయిన్
ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో మేనమామాతో ఆమెకి లైంగిక వేధింపుల సమస్యే వుంది. దాంతో
సంఘర్షణ మాత్రమే వుంది. అంతేకానీ, అదే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ సమస్య పరిష్కారమై
పోలేదు!
కనుక ఏ కథ ఫ్లాష్ బ్యాక్ లోనైనా సమస్య, సంఘర్షణ ఈ రెండూ
మాత్రమే కన్పించి, ఒక అసంపూర్ణ ఫోటో
ఫ్రేములానే వుంటుంది. ఏ సినిమా ఉదాహరణ తీసుకున్నా ఫ్లాష్ బ్యాకులు ఇలాగే వుంటాయి.
చిరంజీవి ‘ఖైదీ’ లో చిరంజీవిని పరారీలో వున్న ఖైదీ గా ఎష్టాబ్లిష్ చేసి, గతంలో
అసలేం జరిగిందనే దానికి ఒకే ఏకబిగి మోనో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి, రావుగోపాలరావుతో సమస్య, సంఘర్షణా చెప్పుకొచ్చారు. గతంలో అసలేం జరిగిందో ఫ్లాష్
బ్యాకు ద్వారా మనకి తెలియబర్చాక, తిరిగి వర్తమానంలో కొచ్చి, ఇప్పుడేం జరగాలన్న
దానికి పరిష్కారంగా క్లైమాక్స్ ప్రారంభించారు. ఇలా ఫ్లాష్ బ్యాక్ లో వుండేది కథే
కాదని స్పష్టం చేయడంజరిగింది. కనుక ఫ్లాష్ బ్యాక్స్ లో కూడా చెబుతున్నది కథే
అనుకుని సాగిపోతే అంతా అభాసు అవుతుంది.
వర్తమాన కథలో ‘ఎందుకు?’ అన్న ప్రశ్నలోంచే కదా ఫ్లాష్ బ్యాక్
పుడుతుంది? వర్తమానంలో హీరో యాసిడ్ దాడి చేశాడు. ఎందుకు? అన్న ప్రశ్నలోంచే అతడి
ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ హీరోయిన్ మేనమామని చంపాలన్నప్పుడు కూడా ఎందుకు?
అన్న ప్రశ్నలోంచే కదా ఆమె తాలూకు ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది?
ఫ్లాష్ బ్యాక్ అనేది వర్తమాన కథలో తలెత్తిన సమస్య కి సంబంధించి
-ఎందుకు, ఏమిటి, ఎలా- అన్న సందేహాలకి అవసరమైన
సమాచారాన్ని అందించి సంతృప్తి పర్చే వనరు మాత్రమే- డేటా బ్యాంక్ మాత్రమే!
మరి కథ కాని ఇలాటి ఉత్త సమాచారాన్నే ఊకదంపుడుగా అన్నేసి
తడవలు ఫ్లాష్ బ్యాక్ మీద ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ పోవడం ఏం స్క్రిప్టింగ్ న్యాయం?
ఎంత స్క్రీన్ టైం వేస్టు? పైగా ప్రేక్షకులు జీర్ణించుకోలేని దృశ్యాల పరంపర తో ఎంత సమ్మెట పోటు?
హీరో యాసిడ్ దాడి చేసి లాకప్ లో పడ్డం, ఆతర్వాత
అప్పుడప్పుడూ ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ లూ, చిట్టా చివర్లో కోర్టుకి తీసి
కెళ్తున్న హీరో మళ్ళీ మేనమామ మీద దాడి జరిపి చంపేయడం-ఇంతే ఈ సినిమా కథ!
ఈ అత్తెసరు కథ కూడా ఫ్లాష్ బ్యాకుల వల్ల ముక్కలయ్యింది,
త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని కోల్పోయింది, సింహభాగం స్క్రీన్ టైముని ని ఫ్లాష్
బ్యాకులు మింగేయ్యడం వల్ల ఈ కథలో ఉండాల్సిన టైం ఎండ్ టెన్షన్ గ్రాఫ్ వీలు పడకుండా
పోయింది! అప్పుడప్పుడు వచ్చిపోయే ఈ కథని ఫాలోకావడం కష్టమై పోయింది.
మరేం చెయ్యాలి?
నాన్ లీనియర్ కాకుండా లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా ఈ కథ
చెప్పాలి, ఫ్లాష్ బ్యాకులు చెప్పడం కాదు.
హీరో నిద్ర లేచాడు, అరటి తొక్క మీద కాలేశాడు, సర్రున జారి
కింద పడ్డాడు- ఇది లీనియర్ కథనం. కర్త- కర్మ- క్రియ అనే మైండ్ రిసీవ్ చేసుకునే సక్రమ
పద్ధతిలో- వర్తమాన కాలంలో.
హీరో సర్రున జారి కింద పడ్డాడు, అరటి తొక్క మీద కాలేశాడు,
హీరో నిద్ర లేచాడు-ఇది నాన్ లీనియర్ కథనం- అక్రమ పద్ధతిలో.
ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి
-హీరో ఎందుకు జారి కింద పడ్డాడు? అరటి తొక్క మీద కాలేశాడు కాబట్టి అని- వెనక్కెళ్ళి
ఫ్లాష్ బ్యాకుతో అరటి తొక్క మీద కాలేసినట్టు
చూపించాలి. కాలెలా వేశాడూ-అనే మరో సందేహానికి- నిద్ర లేచి మంచం దిగుతున్నట్టు మరో
ఫ్లాష్ బ్యాక్ వేయాలి. ఓహో అలాగా అని అప్పుడర్ధం అవుతుంది అడిగేవాడికి.
ఈ సినిమాకి ఎంచుకున్న కథలో వావీవరసల్లేని లైంగిక వేధింపులనే
బాక్సాఫీసు వ్యతిరేక, డాక్యుమెంటరీ అనుకూల అంశం వుంది. సినిమాకి దీన్ని లీనియర్ కథనం
చేయడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి, ఈ అంశం లోని బాక్సాఫీసు వ్యతిరేక వెగటుతనాన్ని
తప్పించడం, రెండు- కథకి బలాన్ని చేకూర్చడం. స్టైల్ ఎప్పుడూ కంటెంట్ ని డామినేట్ చేయకూడదన్న
ప్రాథమిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కథకి
బాక్సాఫీసు అప్పీలు లేకపోయినా సమస్యగా చూస్తే ఇది బరువైనదే. వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ లో కూడా ఆ కుటుంబానికి
ఎదురైన సమస్య బరువైనదే. ఈ బరువైన సమస్యకి
ఫ్లాష్ బ్యాకుల చిత్రణ చేసి వుంటే ఎలావుండేదో ఒకసారి ఊహించుకుంటే ఎలా వుంటుంది? బరువైన ఫ్యాక్షన్ కథలు ఫ్లాష్ బ్యాక్స్ తో
తీస్తే హిట్టయ్యాయి కదా అనొచ్చు. పగా ప్రతీకారాల రొటీన్ యాక్షన్ కథలు వేరు, నైతిక
విలువల నిగ్గు తేల్చే సామాజిక సమస్యల కథాబలం వేరు. ఎంచుకున్న సమస్యలో ఎనర్జీ వున్నప్పుడు
ఆటోమేటిగ్గా సినిమాకి అదే ఒక స్టామినా అవుతుంది. కథ చెప్పడంలో ఫ్లాష్ బ్యాకులూ వగైరాలతో
వేరే టెక్నిక్కులు అవసరంలేదు. ఈ టెక్నిక్కులకి పాల్పడితే ఆ బరువైన సమస్య కాస్తా చెల్లాచెదురై
పోతుంది. ప్రస్తుత సినిమాలో జరిగిందిదే...అంతటి సీరియస్ సమస్యకి ఎలా స్క్రిప్టింగ్
చేయాలా అన్నది తేలక, లేదా ముందు చెప్పుకున్నట్టు- సమస్య బలం కోల్పోయినా సరే,
దీనికి సెక్స్ అప్పీల్ వుంది కాబట్టి అనుకుని ఆ దృశ్యాలకోసం కథని ఖూనీ చేయడం జరిగిపోయింది..
స్క్రీన్ రైటర్,
లాస్ ఏంజిలిస్ ఫిలిం స్కూల్ లో స్క్రీన్ రైటింగ్ అధ్యాపకురాలు లిండా కౌగిల్ లీనియర్-
నాన్ లీనియర్ తేడాల గురించి ఏమంటారో చూద్దాం - We generally see action unfold in time.
Audiences find it easier to focus on action that develops chronologically than
action that skips around time periods. Film is more immediate, and more easily
grasped if we see a clear progression of cause and effect relationships leading
to a climax, held together by a single protagonist.
ఇంతకంటే వివరణ వుండదు. కాబట్టి, ప్రస్తుత సినిమా కథని హీరో హీరోయిన్ల
ప్రేమకథ గానే షుగర్ కోటింగిస్తూ లీనియర్ గా చెబుతూ, హీరోయిన్ వ్యక్తిగత సమస్యని ఇంతియాజ్ అలీ ‘హైవే’ లోలాగా
డైలాగుల్లో చెప్పించేసి, ఆ సమస్యకి హీరో తీసుకునే
చర్యని ముగింపుగా పెట్టుకుంటే- అన్నేసి పచ్చి దృశ్యాలతో ప్రేక్షకుల్ని అఫెండ్ చేసే
అగత్యం తప్పేది. కథకి ఆ సమస్య అంతర్లీనంగా
ప్రవహిస్తూ (సబ్ టెక్స్ట్ గా ఉంటూ) కథాత్మని ఆవిష్కరించి బలాన్ని చేకూర్చేది. ఇలా చేయాలంటే
ఇంతియాజ్ అలీ పడ్డట్టే చాలా కష్టపడక తప్పదు. లేదంటే ఇలాంటి నికృష్ట సమస్యని ఎత్తుకోనే
కూడదు!
-సికిందర్