రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 4, 2019

817 : టిప్స్


       52. ‘నువ్వు తోపురా’ లో హీరో సుధాకర్ పాత్రకి కల్పించిన నైతిక ప్రాతిపదిక ఏమిటి? అతను ఆవారా, బీటెక్ పూర్తి చెయ్యడు, ఏ పనీ చెయ్యడు, నడుం వంచి పని చేయమంటే సూరి ఎవ్వరికీ వంగడు అని పంచ్ డైలాగు. ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్), ఇంట్లో చెల్లెలు - ఓ కప్పు టీ కూడా సొంత డబ్బులతో కొనుక్కోలేని వాడివని అవమానించినా దులుపుకు పోతాడు (తర్వాతెప్పుడో ఫీలవుతాడు). వేళా పాళా లేకుండా ఫ్రెండ్స్ తో మద్యం తాగుతాడు. తాగి వచ్చి ప్రభుత్వోద్యోగిని అయిన చదువుకున్న తల్లితో, చదువుకుంటున్న చెల్లెలితో మిస్ బిహేవ్ చేస్తాడు. అన్నం ప్లేటు తీసి ఎత్తి పడేస్తాడు. ఎందుకిలా చేస్తున్నాడంటే చెప్పిన కారణం చిన్నప్పట్నుంచీ తల్లి తనని పట్టించుకోలేదట. ఆమె ఆఫీసు నుంచి వచ్చి, పాపాయిగా వున్న చెల్లెల్నే  చూసుకుంటూ, వంట పనీ అదీ  చేసుకుంటూ తనని పట్టించుకోలేదట. 

           ఇదీ ఇంతవరకూ ఇంట్లో కథకి నైతిక ప్రాతిపదిక. ఇంత వయసొచ్చాకైనా తల్లిని  అర్ధం జేసుకోకపోవడంలోని సైకలాజికల్ గ్యాప్ తో వుంది. పైగా తల్లి మీద ఆధారపడి బతుకుతూ. ఇది కథలో తల్లితో కాన్ఫ్లిక్ట్ కి (సంఘర్షణకి) సరిపోయిందా అన్నది వేసుకోవాల్సిన ప్రశ్న. సరిపోలేదనే సన్నివేశాలని చూస్తూంటే తెలుస్తుంది. మొన్న ‘సూర్యకాంతం’ లో లాగే పైపైన రాసేసి ఏదో చల్తాహై అన్నట్టు ఇదీ తీసేశారు.  ‘తోపు’ అన్నాక మానసిక ఎదుగుదలకి అడ్డు పడే కారణాలుండకూడదు. తోపు తోపే – వాడి మైండు షార్పే, అదే సమయంలో తుప్పే. ఈ కథ లోనే ఒకచోట సబబైన ఒక  కారణముంది మైండ్ తుప్పు పట్టడానికి. దీన్ని గుర్తించలేదు. 

           చిన్నప్పుడు తల్లి గురించి ఒకడు చెడుగా మాట్లాడతాడు. పొద్దుపోయినా తల్లి ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేదంటే ఇంకే నాన్నతో గడుపుతోందో నని. ఈ మాట అనగానే – దీంతో ఇక తల్లి తనని నిర్లక్ష్యం చేస్తున్న కారణం వాడి పసి మనసుకిలా తెలిసొచ్చి, దాంతో తల్లి మీద ఇప్పుడు అనుమానంతో  కూడిన ద్వేషం బలపడుతుందన్న అంచనా వెంటనే మనకి అందుతుంది. కానీ దీన్ని నీరుగారుస్తూ అక్కడికక్కడే మ్యాటర్ సెటిల్ చేసేశారు. వాడు వెంటనే తల్లిని అంత  మాట అన్నవాడిని కొబ్బరి కాయ పెట్టి కొట్టేస్తాడు. ఇంకేముంది- తనని నిర్లక్ష్యం చేస్తున్న తల్లి పట్ల ఈ పాజిటివ్ యాక్షన్ మొత్తం కాన్ఫ్లిక్ట్ నే గల్లంతు చేసేసింది. 

          ఇక్కడ మనం రాసి పెట్టుకోవాల్సిన  స్క్రీన్ ప్లే నీతి  ఏమిటంటే – కాన్ఫ్లిక్ట్ ని బిల్డప్ చేస్తున్నప్పుడు మధ్యలో దాన్ని సెటిల్ చేసేసే పాజిటివ్ టర్నింగు లిచ్చుకోకూడదని! 

          చిన్నప్పుడు విన్న మాటలతో వాడు (రాముడే విన్న మాటలతో సీతని దూరం పెట్టాడు) తల్లిని ద్వేషించి వుంటే, తల్లి ఇంకో నాన్నతో గడిపి రావడమే  తనని నిర్లక్ష్యం చేయడానికి మూలమని విషబీజం నాటుకుని వుంటే,  పెద్దయ్యాక కూడా దీనికి ఎక్స్ పైరీ వుండదు. ఏమో అప్పుడలా తిరిగిండొచ్చు అమ్మ - అని ఇప్పటికీ అనుకోవడానికి వీలుంది. ఒక అనుమానం ‘ముత్యాల ముగ్గు’ ని అంత హిట్ చేసింది. ఈ అనుమాన బీజం కాన్ఫ్లిక్ట్ కి ఆధారమైనప్పుడు, ఆ  నైతిక ప్రాతిపదిక చాలా బలంగా వుంటుంది. మనసులో పెట్టుకున్న అనుమానం ఎప్పుడు బరస్ట్ అయి బయట పెడతాడు - అప్పుడా మదర్ ఏమని జవాబిస్తుంది - అన్న బలమైన ఎమోషనల్ డ్రామా కోసం మనం ఉత్కంఠతో ఎదురు చూడొచ్చు. కథంటే ఇదికదా. వంద రూపాయలిచ్చుకున్న ప్రేక్షకుడు విషయం లేకుండా ఏం చూస్తూ కూర్చుంటాడు (జీఎస్టీ తో కలిపి 112 తీసుకుంటున్నారు, నూట పదహార్లు చేస్తే సరిపోతుంది కళా సేవలకి). 

          స్క్రీన్ ప్లే నీతి -2  :  ప్రేక్షక భక్తుడు  దక్షిణగా  సమర్పించుకున్న నూట పదహార్లు విలువ చేసే కళా  సేవలు కూడా అందించలేనప్పుడు కాళ్ళూ చేతులు ముడుచుక్కూర్చోవాల్సిందే!

          ఇక అమెరికా వెళ్లిపోయేటప్పుడు మదర్ తో ఇంకేదో గొడవ పెట్టుకుని చెప్పకుండానే వెళ్ళిపోతాడు. ఇంకేదో గొడవ కాదు, ఈ అనుమాన బీజమే బద్ధలవ్వాలి. తల్లి మీద అభాండం వేసేసి వెళ్లిపోవాలి. ఆమె కుప్పకూలిపోవాలి. ఇది మనల్ని సినిమా సాంతం ఆందోళన పరుస్తూ వెంటాడాలి - ఇప్పుడెలా పరిష్కారమవుతుందాని. ప్లాంట్ పాయింట్ వన్ అంటే ఇలా వుండాలి కదా? ఇంకేదో లేకి గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కథకి సంబంధమున్న ప్లాట్ పాయింట్ లా వుందా? ఇందుకే ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదని, ఇంకేదో వుంటుందనీ ఇంటర్వెల్ దాకా భరిస్తూ చూడాల్సి వచ్చింది.

***
         సరే, దీన్నలా వుంచుదాం. ఇక అమెరికా వెళ్ళాక  అక్కడ ఏ నైతిక ప్రాతిపదికన కొనసాగాడు? అమెరికా వెళ్లకముందు, హీరోయిన్ తో విడిపోయాడు. ఆమె ఎమ్మెస్ కి యూఎస్ కెళ్ళడం నచ్చలేదు. బీటెక్ పూర్తి చేసి తననీ రమ్మన్నా మొండికేశాడు. అలా విడిపోయాక, అమెరికా వెళ్తాడు. అమెరికా  వెళ్లేందుకు కథకుడు చేసిన కథనం చిన్నప్పుడే తాత దగ్గర డప్పు బాగా వాయించడం నేర్చుకోవడం. ఈ డప్పు కళ ఇప్పుడు అమెరికాలో ప్రోగ్రాం ఇచ్చేందుకు దారి తీస్తుంది. అక్కడికెళ్ళి మిస్ బిహేవ్ చేసి ఆ తెలుగు సంఘం వాళ్లకి దూరమైపోతాడు. చదువూ పూర్తి చేయలేదు, జస్ట్ అమెరికా వచ్చే ముందే తాత చనిపోతే శవయాత్రలో తాత కోసం డప్పు వాయించాడు, అంత సెంటిమెంటల్ డప్పు కళతో అమెరికా  వచ్చిన వాడు దాన్ని కూడా ఉపయోగించుకుని బాగుపడాలనుకోడు. మరేం తోపు?  మరెందుకు అమెరికాకి రావడం? క్యారక్టర్ కి విలువల ఆధారిత మోటివేషన్ ఏది? అమెరికా వెళ్ళడమంటే అమేథీ వెళ్ళడం కాదుకదా? 

          స్క్రీన్ ప్లే సేవల రీత్యా చెప్పాలంటే డప్పు వాయించడానికి అమెరికా వెళ్ళడమంటే ఒక కమర్షియల్ అప్పీలున్న సెటప్ అది. దీని పే ఆఫ్ అలాగే జరిగిపోవాలి. డప్పు వాయించేసి ఆదరగొట్టాలి. ఆ డప్పు చిరిగిపోవాలి తల్లి మీద కసితో! అతడి మైండ్ మీద తల్లియే స్వారీ చేస్తోంది. ఈ భారం ఇంకెప్పుడు దిగిపోతుందో తెలీదు. ఇది పాత్రకి ఎమోషనల్ సెటప్. ఫిజికల్ సెటప్ వచ్చేసి తిరిగి రాలేక అమెరికాలో ఇరుక్కోవడం. 

          కానీ ఇందంతా వుండదు. అమెరికాలో డప్పు ప్రదర్శనే వుండదు (పాపం తాత!). అతడి రొచ్చు ప్రవర్తన నచ్చక అమెరికా తెలుగు సంఘం వాళ్ళు వెళ్ళగొడతారు. మామూలుగా విమాన మెక్కించి తిరుగు టపాలో పంపించేస్తారు. పంపించక పోతే అది కాంట్రాక్టు ఉల్లంఘన. డిమాండ్ చేసి రిటర్న్ జర్నీ సాధించుకోవచ్చు. అలా చేయక, ఏం చెయ్యాలో తోచనట్టు, అమెరికాలో గొప్ప చిక్కులో పడిపోయినట్టు ఫీలవుతాడు. ఫీలయ్యి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుండి పోవడానికి నిర్ణయించుకుంటాడు. పెట్రోల్ బంకులో ఉద్యోగంలో చేరతాడు. ఇందులో కూడా లాజిక్ ఆలోచించకుండా పక్కన బెడదాం. అయితే ఇక్కడ్నించే కథ వీగిపోవడం మొదలెడుతుంది.  ఇప్పటి వరకు ఫస్టాఫ్ అరగంట కథే. ఇక్కడ్నించీ ఇంకో రెండు గంటలు అమెరికాలో కథంతా వుంది. దీని నైతిక ప్రాతిపదికేమిటో చూద్దాం. 

          ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా పెట్రోలు బంకులో వుంటూ శాశ్వత పౌరసత్వం గురించి ఆలోచిస్తాడు. దీనికి గ్రీన్ కార్డు కోసం అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తెలుసుకుని, ఒకమ్మాయితో ఉత్తుత్తి పెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆమె ఏడు వేల డాలర్లు డిమాండ్ చేస్తుంది. అంత డబ్బెలా అని ఆలోచిస్తూంటే ముగ్గురు క్రిమినల్స్ పరిచయమవుతారు. వాళ్ళు త్వరలో పెద్ద డ్రగ్ డీలింగ్ చేయబోతున్నారు. ఆ డ్రగ్స్ కొట్టేసి అమ్ముకోవాలని ప్లానేస్తాడు. ఆ తర్వాత కథంతా దీనిగురించే. 

          దీనికి నైతిక ప్రాతిపదికేమిటి? అతను మొదటి నుంచే క్రిమినల్ అయివుంటే, డ్రగ్స్ దందా కోసం అమెరికా వచ్చి వుంటే, ఆ క్రిమినల్ మనస్తత్వానికి నైతిక ప్రాతిపదిక సరిపోతుంది. అది వాడి  నీతి.  దానికెలాగూ చివర్లో అనుభవించే ముగింపూ వుంటుంది. 

          కానీ మన తోపు క్రిమినల్ కాదు. సరూర్ నగర్లోనూ డబ్బుకోసం అలాటి పన్లు చేయలేదు. అమెరికా వచ్చి క్రిమినల్ ఆలోచన లెలా చేస్తాడు? చట్టం కళ్ళు గప్పి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా వుంటూ గ్రీన్ కార్డుకి నిచ్చెన లెలా వేస్తాడు? అందుకు చట్టం కళ్లుగప్పి బోగస్ పెళ్లికి ఎలా సాహసిస్తాడు? దీనికి డబ్బుకోసం డ్రగ్ దందాలోకి ఎలా దిగిపోతాడు? ఇవన్నీ చేస్తూ నానా కష్టాలు పడుతున్నాడని చెప్పి ఎలా కన్విన్స్ చేస్తారు?

          అమెరికా వెళ్ళిన వాడి కష్టాలు ఇంత ప్లానింగ్ తో, వాడి నేరస్థ మనస్తత్వంతో చూపిస్తే అవి మనం ఫీలయ్యే కష్టాలవుతాయా? అమాయకుడు అమాయకంగా కష్టాలెదుర్కొంటే వుండే  నైతిక ప్రాతిపదిక క్రిమినల్ చర్యలకి పాల్పడితే వుంటుందా? దాంతో పాత్ర మీద సానుభూతి వస్తుందా? పోనీ ఆ క్రిమినల్ చర్యలతో ఎంటర్ టైన్ చేస్తుందా? దీని తాలూకు కామెడీలు వగైరా ఎంజాయ్ చేస్తామా? ఏం మెసేజ్ ఇస్తున్నాడు యూత్ కి? అమెరికా  వెళ్లి ఇలాటి పనులు చేసి సెటిలవమనా? మొన్నే అమెరికన్ అధికారులు యూనివర్సిటీ ప్రవేశాల పేరుతో వలపన్ని వందలాది తెలుగు విద్యార్ధుల్ని పట్టుకుని హెచ్చరిక పంపారు. ఎందరో  నిపుణులు అమెరికాకి ఎంత జాగ్రత్తగా వెళ్లి, ఎలా మెలగాలో టీవీల్లో మొత్తుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కొచ్చే యూత్ దీన్నెలా తీసుకోవాలి?  దీన్ని వినోదంగా చూసి మిగతా విషయాలు మర్చిపోవాలా? సరే కానీ,  పాత్రపరంగా సినిమాటిక్ గా చూసినా,  నైతిక ప్రాతిపదికనేది యూత్ ని ఒప్పించేదిగా వుందా?

***
          నైతిక ప్రాతిపదిక రోమాన్స్ తో కూడా లేదు. సరూర్ నగర్లో ప్రేమించి దూరం చేసుకున్న  హీరోయిన్ అమెరికాలో కన్పిస్తే ఒక్క క్షణం ఆగి ఆలోచించడు. ఆమె కంటే గ్రీన్ కార్డు, బోగస్ పెళ్లి ఇవే ముఖ్యమనిపిస్తాయి. ఆ బోగస్ అమ్మాయినే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. ఇలా  ‘మోరల్ ప్రెమైజ్’ సరిగా లేని సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని ‘'The Moral Premise: Harnessing Virtue and Vice for Box Office Successఅని ఒక పుస్తకమంతా రాశాడు  పీహెచ్డీ చేసిన స్టాన్లీ విలియమ్స్.

(మరికొన్ని మరోసారి)
సికిందర్  
.