రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2023, గురువారం

1308 : స్క్రీన్ ప్లే సంగతులు


        ప్పుడున్న గ్లోబల్ ట్రెండ్స్ లో ప్రేక్షకులు -ముఖ్యంగా యువప్రేక్షకులు సినిమాల నుంచి ఏం ఆశిస్తున్నారని చూస్తే, గత కాలపు మూస సినిమాలు ఇంకెంత మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన అమిగోస్ కి స్క్రీన్ ప్లే సెట్టింగ్ వర్క్ చేస్తున్నప్పుడు కోవిడ్ లాక్ డౌన్లతో ఆ వర్క్ ఆగిపోయి, తర్వాత ఏం జరిగిందో మనకి సమాచారం లేని నేపథ్యంలో, తీరా సినిమా చూస్తే ఆందోళనకరంగా వుంది- స్క్రీన్ ప్లే అంటే ఒక దురవగాహనతో తక్షణ పరాజయానికి సరిపడా బీజాలతో సినిమా ముస్తాబయింది. కాన్సెప్ట్ చూస్తే డపెల్ గేంగర్ అనే పబ్లిసిటీతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన యూనిక్ పాయింటు. రచన చూస్తే ఆ యూనిక్ నెస్ ని నీరుగార్చే పాత మూస టెంప్లెట్ త్రిపాత్రాభినయ వ్యవహారం. ప్రేక్షకులెలా అంగీకరిస్తారు? ఎంతసేపూ స్టార్ కి ఇంత మార్కెట్ వుందని సినిమాలు తీయడం కాకుండా, కాస్త ఆ సబ్జెక్టు మార్కెట్ యాస్పెక్ట్ గురించి కూడా ఆలోచించాలిగా? ముందు మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయమైతే దాన్ని బట్టి వుండే క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకో వచ్చు.  

        మూస ఫార్ములా చిత్రణలతో ప్రేక్షకులు విసిగి వేసారి పోయారు. ప్రేక్షకులు టికెట్లకి చెల్లిస్తున్న నోట్లు చాలాసార్లు కొత్తగా మారిపోయాయి, కానీ సినిమాలు చూస్తే అవే పాత మిడతంభొట్లు. కనీసం తీస్తున్న సినిమా జానర్ మర్యాదలకి కట్టుబడినా మూస సినిమాలు రావు. పాత సినిమాల్లో ఐదణాల ఆనందరావు ఆంధ్ర పత్రిక పేపరు చదువుతూ, ఏమోయ్ కాఫీ రెడీయా?’ అన్న ఓపెనింగ్ డైలాగుతో సినిమాకి క్లాప్ కొట్టి శ్రీకారం చుడితే, ఆరణాల అన్నపూర్ణమ్మ పరపరలాడే పట్టుచీరలో కులుకుతూ కాఫీకప్పుతో వచ్చేలాంటి, నీరస కాఫీ గింజల సీనుని కొంచెం మార్చి, ప్రారంభ సీనుగా వేస్తే, యూనిక్ అమిగోస్ కి యూత్ ఫుల్ యాక్షన్ జానర్ మర్యాదై పోతుందా?
        
అసలు సింగిల్ జానర్ సినిమాలు ఇప్పటి మార్కెట్ కే రిస్కేమో అన్పిస్తున్నప్పుడు, తీసే సింగిల్ జానర్ సినిమాలైనా వాటివైన నిర్దుష్ట జానర్ మర్యాదలు పాటిస్తే కొత్తదనం ఫీలవడానికి ఆస్కార ముంటుంది. కానీ హాలీవుడ్ లో  సింగిల్ జానర్ సినిమాల బోరు నుంచి ప్రేక్షకులకి విముక్తి కల్గిస్తూ, మల్టీ జానర్ లేదా క్రాస్ జానర్ సినిమాలు తీస్తున్నారు. ఇన్సెప్షన్, నైవ్స్ ఔట్, కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ లాంటివి.
        
తెలుగులోనూ దీని అవసరం గుర్తిస్తే మంచిదే. సినిమా అంటే ఒక లవ్ ట్రాక్, ఒక హీరో ట్రాక్, ఒక విలన్ ట్రాక్, ఒక ఎండ్ అనే నాల్గు పంక్చరు టైర్ల టెంప్లెట్లకి బదులుగా - నాల్గు వేర్వేరు జానర్లతో కొత్త రూపు రేఖలు తొడగడం మంచిదే. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ వినరో భాగ్యము విష్ణు కథ తో ఇదే ప్రయోగం చేశాడు. అయితే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, ఈ యూనిక్ మల్టీ జానర్స్ ప్రయోగంలో మళ్ళీ అదే అలవాటైన కాఫీ గింజల సీన్లు తిష్ఠ వేసి తినేశాయి.  To make a great film you need three things - the script, the script and the script.- అని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు. దీన్ని ఇలా చెప్పు కోవచ్చు- To make a great Telugu film you need three things - cut the coffee ginjalu, cut the coffee ginjalu, and cut the coffee ginjalu first-  అని.  

1. ఏది మల్టీ జానర్?

గోల్డ్ రష్ తీసినప్పుడు చార్లీ చాప్లిన్ ఇదే అంటాడు- అనుకున్న స్టోరీ ఐడియాని ఆద్యంతం దాని అనుభూతితో నిలబెట్టడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడే చాలా మంది దారి తప్పి పోతారు. ఒక కొత్త స్టోరీ ఐడియాని ధూంధాం చేస్తూ ప్రేక్షకుల మధ్యకి తీసికెళ్తాం. కానీ దానిని ఫ్లాట్ గా తయారు చేసి దాని ఖర్మానికి వదిలేస్తాం. చివరికి చూస్తే చింతపండు బెల్లం తప్ప ఏమీ వుండదు- అనేసి.
        
పై తెలుగు సినిమాని దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ - అనే ఏడు జానర్లతో మల్టీ జానర్ సినిమాగా తీశారు. మళ్ళీ ఇందులో రెండు కథలు : హీరోతో ఒక కథ, హీరోయిన్ తో ఇంకో కథ. దీని గురించి చివర్లో చెప్పుకుందాం. ప్రస్తుతం జానర్స్ కి పరిమితమవుదాం. ఇలా పైన చెప్పుకున్న ఏడు జానర్లతో ఏ జానర్ సినిమాగా అనుభూతి చెందుతూ సినిమా చూడాలి మనం? ఏదీ అనుభూతించ లేని విధంగా వుంది. మరి జానర్లని ఎలా నిర్వహిస్తే మల్టీ జానర్ సినిమాని మానమర్యాదలతో  అనుభూతించగలం? 
        
ఇది ఆసక్తికప్రశ్న. సినిమాలున్నవి అనుభూతించడానికే, రసాస్వాదనకే. దీన్ని గుర్తించడం లేదీ రోజుల్లో. కానీ తీసే సినిమాకి ఒకటి కంటే ఎక్కువసార్లు చూసే రిపీట్ ఆడియెన్స్ స్టేటస్ రావాలంటే ఇదే ముఖ్యం : అనుభూతి. కథని రూపొందించే ప్రక్రియలో వచ్చే మొదటి ప్రశ్నల్లో ఇవి కొన్ని- కథ కూడా ప్రాణియే కాబట్టి- కథ ఏ జానర్? ప్రతీ జానర్ దానిదైన పాత్రచిత్రణల్ని, గతిని, స్వరాన్ని, శైలినీ డీఫాల్టుగా కలిగి వుంటుందని ముందు అర్ధం జేసుకోవాలి.
        
మల్టీ జానర్ మూవీని రాసినప్పుడు, కథని చేపట్టే  విధానం ఎలా వుండాలో, ఆ విధానాన్ని ఆద్యంతం ఎలా నిర్వహించాలో ఎలా తెలుసుకోవాలి ? దీనికొక్కటే మార్గం : చెప్పాలనుకున్న కథ వివిధ జానర్స్ ల బొకేలో ఏ జానర్ కి అనుగుణంగా వుందో దాన్నందుకుని ప్రధాన జానర్ గా చేపట్టడమే. అంటే కథ యాక్షన్ కామెడీ అయితే, అది యాక్షన్ తో కూడిన కామెడీ కథనా, లేక కామెడీతో కూడిన యాక్షన్ కథనా ముందు నిర్ణయించాలి. యాక్షన్ తో కూడిన కామెడీ కథయితే, కామెడీని ప్రధాన కథగా చేసుకుని యాక్షన్ తో చెప్పాలి. కామెడీతో కూడిన యాక్షన్ కథయితే, యాక్షన్ ని ప్రధాన కథగా తీసుకుని కామెడీగా నడపాలి. అలాగే  కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అయితే, అది థ్రిల్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథనా, లేక సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన థ్రిల్లర్ కథనా ముందు నిర్ణయించాలి.  థ్రిల్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ కథయితే, సైన్స్ ఫిక్షన్ ప్రధాన కథగా థ్రిల్స్ తో నడపాలి.  సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన థ్రిల్లర్ కథయితే, థ్రిల్లర్ ని సైన్స్ ఫిక్షన్ తో నడపాలి.

2. ఇన్సెప్షన్ ఒక ఉదాహరణ

ఇన్సెప్షన్ చూద్దాం. ఇది యాక్షన్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ల మల్టీ జానర్ మూవీ. క్రిస్టఫర్ నోలన్ దీన్నెలా తీశాడు? పక్కా క్రైమ్ సినిమాగానే తీశాడు- కార్పొరేట్ క్రైమ్. అంటే యాక్షన్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ఈ మూడిట్లో ఓ కార్పొరేట్ కంపెనీని కుప్ప కూల్చే క్రైమ్ చుట్టూ సాగే కథగానే దీన్న నిర్ణయించాడు. అంతేగానీ కార్పొరేట్ కంపెనీని కుప్ప కూల్చే యాక్షన్ కథ గానో, సైన్స్ ఫిక్షన్ కథగానో నిర్ణయించ లేదు.
        
ఎవరైనా ఇన్సెప్షన్ ఏ జానర్ సినిమా అంటే చటుక్కున సైన్స్ ఫిక్షన్ అనేస్తారు. కానీ కాదు. సైన్స్ ఫిక్షన్ తో ఎలా కుప్ప కూలుస్తారు- నేరం (క్రైమ్) చేసి మాత్రమే కుప్ప కూల్చగలరు. ఈ మూలంశాన్ని- కోర్ పాయింటుని పట్టుకోవాలి. కాబట్టి తన కథకి క్రైమ్ ని ప్రధాన జానర్ గా తీసుకుని సైన్స్ ఫిక్షన్, యాక్షన్ లని సబ్ జానర్లుగా చేసుకుని, వీటితో కథనం చేశాడు. నోలన్ ఈ దృష్టితో ప్రేక్షకుల్ని టార్గెట్ చేయడంతో, మూవీ అంతటా ఎడతెగని ఒకే  పొందికైన అనుభూతిని ప్రేక్షకులు పొందగల్గారు.
        
కాబట్టి  దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ - అనే ఏడు జానర్లతో కూడిన వి. భా. వి. క ని మల్టీ జానర్ సినిమాగా తీసినప్పుడు వీటిలో ప్రధాన జానర్ ఏదో తెలుసుకోగల్గాలి. అసలు కథేమిటి? హత్యకేసులో ఇరుక్కున్న హీరోయిన్ని హీరో కాపాడ్డం కథ. అంటే రోమాంటిక్ థ్రిల్లర్ జానర్. అప్పుడు పూర్తి కథ రోమాంటిక్ థ్రిల్లర్ ఫీల్ తోనే తెగిపోకుండా సాగుతూ వుండాలి తప్ప మరోటి కాదు.
        
అప్పుడు అందులోకి దైవ భక్తి, దేశభక్తి, రాజకీయం, సామాజికం, మాఫియా, రోమాంటిక్ కామెడీ, మర్డర్ మిస్టరీ- ఇవన్నీ సబ్ జానర్లుగా ప్రధాన జానర్ కి (రోమాంటిక్ థ్రిల్లర్ కి) కథనంగా మారతాయి. అప్పుడు ఈ సబ్ జానర్ లన్నిట్లో కూడా రోమాంటిక్ థ్రిల్లర్ ఫీలే అంతర్లీనంగా వుంటుంది. అప్పుడు మొత్తం ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ కథకి సబ్ జానర్లతో ఏకత్వం వస్తుంది.

3. మార్కెట్ యాస్పెక్ట్ వడపోత

అయితే ఈ సినిమా మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? ఏ ప్రేక్షకులకి దీన్ని ఉద్దేశించారు? కుటుంబాలు, వృద్ధులు, నడి వయస్కులు, యువతీ యువకులు, బాల బాలికలు, ఉయ్యాల్లో క్యారుమనే లేటెస్టు ప్రాణులూ -వంటి సకల వర్గాల సమ్మేళనం కోసం తీశారా? సినిమా చూస్తూంటే ఇలాగే వుంది. కానీ ఈ సినిమా చూసేందుకు వీళ్ళెవరూ రారు యూత్ తప్ప. చిన్న హీరోతో రోమాంటిక్ థ్రిల్లర్ యూత్ అప్పీల్ ఎక్కువుండే జానరే తప్ప మరోటి కాదు. కాబట్టి మిగతా అందరి కోసం తల పెట్టిన కాఫీగింజల సీన్లన్నిటినీ తీసేసి, బడ్జెట్ ని ఆదా చేస్తూ యూత్ కి ఊపునిచ్చే సీన్లతో సినిమా మార్కెట్ యాస్పెక్ట్ సామర్ధ్యాన్ని పెంచొచ్చు. అంటే యూత్ ఫుల్ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ మర్యాదలకి తగ్గ పాత్రచిత్రణల్ని, గతిని (పేస్ ని), స్వరాన్ని (టోన్ ని), శైలినీ (స్టయిల్ ని) క్రియేట్ చేసుకోవడం.
        
ఏ యూత్ సినిమాకైనా యువకులే కాకుండా యువతులు కూడా వచ్చేలా మార్కెట్ యాస్పెక్ట్ తో తీయాలన్న పరిజ్ఞానం కూడా వుంటే అదో పెద్ద భాగ్యం.
        
ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ కథ ఉస్సూరుమన్పిస్తూ యూత్ అప్పీల్ కి దూరంగా దైవభక్తితో ప్రారంభమై, మాఫియా జానర్ ని టచ్ చేసినప్పుడు, మాఫియా జానర్ నుంచి హీరో పరోపకార గుణంతో సామాజికంలోకి, ఆతర్వాత హీరోయిన్ తో రోమాంటిక్ కామెడీలోకి- ఇలా ఓ జానర్ ఇంకో జానర్ ని క్రాస్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ విడివిడి ఖండాలు అన్నట్టుగానే వచ్చిపోతూంటాయి. ఇలా విడివిడి ఖండాలుగా జానర్లని  పేర్చుకుంటూ పోవడంతో దేని ఫీలూ కలక్కుండా పోయింది. అన్నిటినీ కలిపి అంతర్వాహినిగా కామన్ ఫీల్ లేదు.
        
ఆద్యంతం ఒక కామన్ ఫీల్ ఒకే జానర్ తో వస్తుంది. అది ప్రధాన జానర్. ఆ ప్రధాన జానర్ ఏదో తెలుసుకుని దాంతో కథ చేసినప్పుడు, మిగిలిన జానర్లు పైన చెప్పినట్టు సబ్ జానర్లుగా ఆ కథలో సెటిలవుతాయి. దీంతో ప్రధాన జానర్ ఫీల్ ఏదైతే వుంటుందో, అదే అన్ని సబ్ జానర్లలో ప్రవహిస్తూ ఏకం చేస్తుంది. దీంతో అనేక కథలుగా కాక, ఒకే కథ చూస్తున్న ఫీల్ ఏర్పడుతుంది. ఇదీ మల్టీ జానర్ సినిమా చేసే పద్ధతి.
        
ఒక సినిమాలో కావాల్సిన చోటల్లా మసాలా దినుసులు వేసుకుంటూ పోవడం లాంటిది కాదు, మల్టీ జానర్ సినిమాల్లో జానర్ల వాడకం. స్క్రీన్‌ప్లేకి సంక్లిష్టతని, ఉత్సుకతనీ జోడించడమే జానర్లని కలపడంలో ఉద్దేశం. ఇది ఊహకందే కథాకథనాల్ని కొత్తగా, ఆకర్షణీయంగా మార్చేస్తుంది.

4. పాత్రలూ- సబ్ జానర్ల పంపకం

పై ఏడు జానర్లలో దైవ భక్తి, దేశభక్తి, సామాజికం, రాజకీయం, మాఫియా ఇవన్నీ సబ్ జానర్లుగా ప్రధాన కథయిన రోమాంటిక్ థ్రిల్లర్ కోసం పనిచేయాల్సి వుంటుంది. అంటే హీరోయిన్ హత్య చేయబోతోంది కాబట్టి దైవభక్తి, దేశభక్తులతో కూడిన సబ్ జానర్ సీన్లు పాత్రకి డైమెన్షన్ నిస్తూ హీరోయిన్ కుండాలి. హేరామ్ లో కమలహాసన్ వారణాసి వెళ్ళి గంగలో పాపప్రక్షాళన చేసుకోవడం మహాత్మా గాంధీని చంపడానికే. అలా హీరోయిన్ కి దైవ భక్తి చూపిస్తే అది స్టోరీ పాయింటుకుపయోగ పడాలి.
        
ఇక సామాజికం, రాజకీయం, మాఫియా ఇవి హీరోతో వుండాలి. హీరో హీరోయిన్ల మధ్య సబ్ జానర్ల పంపకం ఇలా జరిగాక- ప్రధాన కథకివి ఉపయోగ పడాలి. ప్రధాన కథ రెండుగా వుంది- హత్యకి ముందు రోమాంటిక్ కామెడీగా, హత్యకి తర్వాత రోమాంటిక్ థ్రిల్లర్ గా. అయితే ప్రధాన సమస్యేమిటంటే, హత్య అనే ఘటన ప్రొఫెషనల్ స్కిల్స్ తో లేదు. హత్య, దాని పరిష్కారం లాజికల్ గా వుండకపోతే సినిమా అభాసవుతుంది.

5. ప్లాట్ పాయింట్ల పల్టీ

ఇప్పుడు రెండు కథల ప్రయోగమెలా వుందో చూద్దాం. మాఫియా- ఎన్ఐఏ లకి సంబంధించి హీరోతో ఒక కథ, హత్యలో ఇరుక్కున్న హీరోయిన్ తో ఇంకో కథ. హీరోయిన్ కథతో - అంటే రోమాంటిక్ థ్రిల్లర్ తో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఎలాగూ వుంది. ఈ రెండు కథలకీ రెండు ముగింపులుంటాయి. రోమాంటిక్ థ్రిల్లర్ కథ ముగిసి పోయాక, మాఫియా- ఎన్ఐఏ కథ ముగింపు సన్నాహాలు మొదలవుతాయి. ఈ కథలో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడన్న ఫ్లాష్ బ్యాక్ కూడా వస్తుంది. ప్రధాన జానర్ కథ రోమాంటిక్ థ్రిల్లర్ అయిపోయిందని ఇక లేస్తూంటే మళ్ళీ ఇదేంట్రా అనుకుంటూ ఓపిక తెచ్చుకుని చూడాల్సి వస్తుంది. ఈ రెండో కథేదో ముందు ముగిసిపోతే వేరు. సబ్ ప్లాట్ వుంటే దాన్ని ముందే ముగిస్తారు. ప్రధాన కథ ముగిసిపోయాక సబ్ ప్లాట్ చూపించరు.  
        
అసలే సబ్ జానర్లతో సినిమా బరువెక్కి వుంటే రెండు కథల భారమొకటి. క్రియేటివిటీకి రూల్స్ వుండవని చేసుకుపోతే ఇలాగే వుంటుంది. శుభ్రంగా హీరోయిన్ తో రోమాంటిక్ థ్రిల్లర్ కథ వుండగా ఈ రెండో కథ అవసరమే లేదు. ఇలాకూడా అసలు కథతో వుండాల్సిన ఫీల్ ముక్కలైంది.
        
ఎన్ఐఏ వెతుకుతున్న డ్రగ్ మాఫియాకి హీరోయిన్ తో హీరో తన రోమాంటిక్  థ్రిల్లర్ కథ చెప్తూంటాడు. అంటే ప్రధాన జానర్ కథ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందన్న మాట. ఇదొక అదనపు మడత క్రియేటివిటీ. ఇన్ని క్రియేటీలతో మడతలు విప్పుకుంటూ సినిమా చూడాలన్న మాట. ఇదంతా మంకీ బిజినెస్.
        
ఫస్ట్ యాక్ట్ రోమాంటిక్ థ్రిల్లర్ కథని రోమాంటిక్ కామెడీగా  ఇంటర్వెల్ వరకూ సాగదీసి, అక్కడ ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ వల్ల జరిగే హత్య చూపించారు. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ఒకటే అంటాడు- There is no terror in the bang, only in the anticipation of it.- అని. అంటే ముందస్తు హెచ్చరిక లేకుండా బ్యాంగ్ ఇస్తే అందులో టెర్రర్ ఫీల్ ఏమీ వుండదని, ముందు నుంచే హెచ్చరికలు చేస్తూ బ్యాంగిస్తే ఆ సీను బలంగా  టెర్రరైజ్ చేస్తుందనీ.  
        
హీరోయిన్ కి ఫ్రాంక్ వీడియోలు చేయాలని వుంటుంది. మురళీ శర్మని రాజకీయ వర్గం చంపే ప్లాను విఫలమవడంతో అది ఫ్రాంక్ వీడియో తీసే ప్రయత్నమని చెప్పి తప్పించుకుంటారు. ఇది నమ్మిన హీరోయిన్ మురళీశర్మతో ఇలాటిదే ఫ్రాంక్ వీడియో చేసి హీరోని సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. హీరో రాగానే మురళీశర్మ మీద పిస్తోలుతో ఫైర్ చేస్తుంది. నిజంగానే ఫైర్ అయిన తూటాతో మురళీ శర్మ చనిపోవడంతో ఇంటర్వెల్.
        
ఈ బ్యాంగ్ లో టెర్రర్ ఫీల్ ఏముంది? ప్రశ్నలే వున్నాయి. ప్రశ్నలకి జవాబులు ఆలోచిస్తూ ఉలిక్కిపడే టెర్రర్ ఏమీ ఫీలవ్వం. నిజ పిస్తోలు ఎవరు పెట్టారు? ఎవరు ఈమెని ఇరికించారు? ఇప్పుడెలా బయటపడుతుంది? లాంటి రొటీన్ ప్రశ్నలు. అంటే జాలిగొల్పే బాధితురాలి ముద్ర పడింది. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు తలెత్తాయో, ఆమె పట్ల జాలి ఏర్పడిందో  అప్పుడా ఇంటర్వెల్ సీనుకంత ఇంపాక్ట్ వుండదు.
        
ఇలా ఎందుకు జరిగింది? ముందు నుంచీ హీరోయిన్ తో ఈమె సీరియస్ గా ఏదో చేయబోతోందన్న ముందస్తు హెచ్చరికగా (ఫోర్ షాడోయింగ్) తగిన సీన్లు వేయక పోవడం వల్లే. క్యారక్టర్ కి డెప్త్ నివ్వకపోవడం వల్లే. ఇంటర్వెల్లో టెర్రిఫిగ్గా ఆమె ఇంకో షేడ్ బయటపడాలేగానీ బేలతనం కాదు. మురళీ శర్మతో ఫ్రాంక్ వీడియో చేయాలనుకోవడం ఆమె పైకి కన్పిస్తున్న క్యారక్టర్. లోపల గుంభనంగా ఇంకేదో చేయబోతున్నట్టు ఇన్నర్ క్యారక్టర్ వుండాలి.
        
పైన చెప్పుకున్నట్టు ఆమె దైవభక్తి గానీ, దేశభక్తి గానీ లోపలి ఉద్దేశానికి ఫోర్ షాడోయింగ్ గా అనుమానాస్పదంగా అన్పించాలి. ఇలా క్యారక్టర్ ని తెలిసిన ఔటర్ గోల్ తో బాటు -  తెలియని ఇన్నర్ గోల్ తో కూడా సిద్ధం చేసినప్పుడు, ఇంటర్వెల్లో మురళీశర్మని షూట్ చేయడంతో అప్పుడు హిచ్ కాక్ చెప్పే బ్యాంగ్ ఎఫెక్ట్ వుంటుంది. స్పష్టంగా ఫ్రాంక్ వీడియో వంకన ప్లానింగ్ గా చంపినట్టు వుండాలి. వామ్మో లోపలింకేదో కథుందిరో, యేసి పడేసింది- అని సూటిగా సర్ప్రైజ్ చేయాలే గానీ, ప్రేక్షకులు ఇంకేవో ప్రశ్నల దుకాణం పెట్టుకుని కూర్చోవడం కాదు. క్యారక్టర్ ప్రశ్నార్ధకమై ఆ కథేదో తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఏర్పడాలి. క్యారక్టర్ కి ఇంకో షేడ్ ఏదో వున్నట్టు బయటపడాలి. అమాయకురాలు ఇరుక్కుందని చూపించేసి అమాయకురాల్ని రక్షించడంలో ఏం కథ, ఏం డైనమిక్స్ వుంటాయి. హంతకురాలిగా చూపించి నిర్దోషిగా ఎలా బయట పడుతుందనడంలో కథా, కథనంలో డైనమిక్సూ వుంటాయి. క్యారక్టర్ కి డెప్త్ వుంటే, కథకి డెప్త్ వస్తుంది. లేకపోతే ఇంటర్వెల్ సహా అన్నీ ఫ్లాట్ గా వుంటాయి.
        
ఇది కాదు సమస్య. అసలు సమస్య హత్యతో వుంది. హత్య చుట్టూ అల్లిన కథ ఆషామాషీగా వుంది. హత్యకి గురైన మురళీ శర్మ ఇంకేదో దేశంలో బతికివుంటే హీరో పట్టుకుంటాడు. అప్పుడు తన చావుని వేరే శవంతో ఎలా ఫేక్ చేసిందీ చెప్పుకొస్తాడు. ఇది సిల్లీగా, హాస్యాస్పదంగా వుంటుంది. ఇది పూర్తిగా అన్ ప్రొఫెషనల్ రైటింగ్. ప్రధాన జానర్ రోమాంటిక్ థ్రిల్లరైనా థ్రిల్లింగ్ గా అన్పించకపోతే ఎలా? హత్యతో ప్లాట్ పాయింట్ వన్, పరిష్కారంతో ప్లాట్ పాయింట్ టూ రెండూ అర్ధరహితంగా వున్నాయి.
        
సిల్లీగానే మురళీ శర్మ చెప్తున్నది చూస్తే అతను హీరోలా అన్పించి, అతడి ముందు హీరో వెలవెలబోతాడు. అతడి కిలాడీతనం, ఆడుకున్న గేమ్ చూస్తే, అతడి స్థానంలో హీరో వుండాల్సిన కథ అన్పిస్తే, అది ఈ వ్యాసకర్త తప్పు కాదు.

ఇక ప్రతీదానికీ ఎన్ఐఏ ని చూపించడం ఫ్యాషనై పోయింది. ఎన్ఐఏ ని ఏర్పాటు చేసింది టెర్రరిజం కేసుల కోసం. డ్రగ్ మాఫియా కేసులకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని ప్రత్యేకంగా వుంది. 
ఇలా ఎన్నో లోపాలుంటేనే ఆ గజిబిజితో సినిమా ఎంతో బిజీగా వున్నట్టన్పిస్తూ ప్రేక్షకులకి యమ కిక్ ఇస్తుందేమో. జోహార్లు. నిజానికి  ఇలా విశ్లేషణ రాయకూడదు, సినిమాల్ని తీస్తున్న విధంగానే తీస్తూ పోవాలి.
—సికిందర్