రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జులై 2020, సోమవారం

961 : రివ్యూ!దర్శకత్వం: ముఖేష్ ఛబ్రా
తారాగణం: సుశాంత్ సింగ్ రాజ్పుత్, సంజనా సంఘీ, సాహిల్ వేద, శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులు

రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిం సేన్ గుప్తా
సంగీతం: ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం: సత్యజిత్ పాండే
బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

***
       
త్మహత్య చేసుకుని సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి విడుదల ‘దిల్ బేచారా’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తోంది. ఇది కూడా అతడి మరణాన్ని చూపించేదే. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలై వుంటే దాని ప్రభావంతో మనసు మార్చుకుని ఇవ్వాళ అందరి మధ్య సజీవంగా వుండే వాడేమో. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు ‘మీటూ’ వివాదంలో ఇరుక్కోవడంతో నిర్మాణం ఆలస్యమై అనుకున్న నవంబర్ 2019 కల్లా విడుదల కాకపోవడం ఒక బ్యాడ్ లక్. 

       
అంతరిక్షం సుశాంత్ అభిమాన సబ్జెక్టు. నలభై లక్షలు పెట్టి కొన్న టెలిస్కోప్ తో నక్షత్ర లోకాలని వీక్షిస్తూ వుండేవాడు. 2016 లో ఆత్మ హత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల కూడా అంతరిక్ష అభిమానియే. ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ లాగా సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాయాలనుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. నక్షత్ర లోకాలకి పయనించాలని వుందని కూడా రాసుకున్నాడు. సుశాంత్ నీ, రోహిత్ నీ నక్షత్ర లోకాలే సూదంటు రాయిలా ఆకర్షించి తీసికెళ్ళి పోయాయేమో. ఇక ‘దిల్ బేచారా’ కి ఆధారమైన పాపులర్ నవల పేరులో కూడా ‘స్టార్స్’ వుండడం (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’) ఇంకో ఐరనీ.

        ‘దిల్ బేచారా’ లో అంతరిక్షం గురించిన ప్రస్తావన కూడా వుంది. ఆత్మహత్యకి వ్యతిరేకంగా సంభాషణ కూడా వుంది. మరణాన్ని అదుపు చేసే మంత్రం కూడా వుంది. అతడికి సరదాగా సిగరెట్ నోట్లో పెట్టుకునే అలవాటు వుంటుంది. దాన్ని ముట్టించి స్మోక్ చెయ్యడు. సిగరెట్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే మరణం. ‘మారణాయుధాన్ని మన పెదాల మధ్య వుంచుకున్నా, మనల్ని చంపే శక్తిని మాత్రం దానికివ్వకూడదు’ అంటాడు. ‘జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు మనం నిర్ణయించలేం, ఎలా జీవించాలో నిర్ణయించుకో గలం’, ‘మరణించాక దాంతో బాటే జీవించాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది’, ‘పాట పూర్తిగా ఎందుకు లేదు? ఎందుకంటే జీవితమే పూర్తిగా వుండదు కాబట్టి’, ‘కాలుతున్న సిగరెట్ లో చంపే శక్తి వుంటుంది, దాన్నుంచి నేనా శక్తిని లాక్కున్నా’, ‘నా అంతిమ సంస్కారాల్లో నేనూ పాల్గొనాలనుకుంటున్నా’, ‘నేను గొప్ప గొప్ప కలలు గంటాను, వాటిని తీర్చుకోవాలన్న కోరిక మాత్రం కలగదు’, ‘స్ట్రాంగ్ గా వుండాలని నేననుకోవడంలేదు, నార్మల్ గా వుండాలనుకుంటున్నా’, ‘సూసైడ్ ఇల్లీగల్, కనుక బతకాలి తప్పదు’... ఇలా జీవితం గురించి ఇన్ని సత్యాలు తెలుసుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. 

సగం పాడిన పాట
     జీవన్మరణాలు, సంఘర్షణ, అస్తిత్వ సంక్షోభం వంటి అంశాలని తాకుతుంది ‘దిల్ బేచారా’. ప్రాణాంతక వ్యాధితో యువజంట, వాళ్ళ యంగ్ రోమాన్స్, ఎడబాటు ఈ కథ. జంషెడ్ పూర్ నేపధ్యంలో వుంటుంది. అక్కడ కిజీ బసు (సంజనా సంఘీ) థైరాయిడ్ క్యాన్సర్ బాధితురాలు. భుజాన ఆక్సిజన్ సిలండర్ తో వుంటుంది. తల్లిదండ్రులు (శాశ్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ) అండగా వుంటారు. మరణం కోసం ఎదురు చూస్తూ గడపడం తప్ప రోజంతా చేసే పనుండదు. అయితే బాధని మరిపించుకోవడానికి ఎక్కువ బయట తిరుగుతూ వుంటుంది. ఒక సింగర్ ని అభిమానిస్తూ వుంటుంది. అతను పాడిన పాట సగమే వుండడం ఆమెకి సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూంటుంది. ఆ పాట అతను పూర్తిగా ఎందుకు పాడలేదు? ఆపేసిన దగ్గర్నుంచి పాట ఎలా వుంటుంది? అతనేమయ్యాడు? ఇవి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుంటుంది. 

        ఊళ్లోనే ఒక షార్ట్ మూవీస్ మేకర్, ఇమ్మాన్యుయేల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్) వుంటాడు. ఇతను రజనీకాంత్ అభిమాని. రజనీకాంత్ ని అనుకరిస్తూ షార్ట్ మూవీ తీస్తూంటాడు. ఇంకో క్యాన్సర్ బాదితుడైన మిత్రుడు జేపీ (సాహిల్ వేద్) సహకరిస్తూ వుంటాడు. ఒక రోజు కిజీని చూసి ప్రేమలో పడిపోతాడు మానీ. వెంటపడుతున్న అతణ్ణి కిజీ వారిస్తూంటుంది. కానీ క్రమంగా తనూ ప్రేమలో పడిపోతుంది. అతను బోన్ క్యాన్సర్ బాధితుడు. 

        ఇద్దరూ పరస్పరం అర్ధం జేసుకుని ప్రేమని కొనసాగిస్తూంటారు. ఆమె తల్లిదండ్రుల ఆమోదం కూడా పొందుతారు. ఆమె అసంపూర్ణంగా వున్న పాట గురించే కాదు, ఆ సింగర్ ని కూడా కలుసుకోవా లనుకుంటోందని కూడా తెలుసుకుని, ఆమె కోరిక తీర్చడానికి పూనుకుంటాడు మానీ. ఆ సింగర్ అభిమన్యు వీర్ (సైఫలీ ఖాన్). అతను పారిస్ లో వున్నట్టు తెలుస్తుంది. అతడ్ని కలుసుకోవడానికి పారిస్ చేరుకుంటారు కిజీ, ఆమె తల్లి, మానీ. 

        అక్కడేం జరిగింది? ఆ తర్వాత ఇద్దరి ప్రేమా ఏమైంది? ఇద్దరి వ్యాధులు ఏమయ్యాయి? మరణాన్ని ఆహ్వానించారా? అతను షార్ట్ మూవీ పూర్తి చేయగలిగాడా? ఆమెకి పాట పూర్తిగా తెలిసిందా? ఆ పాటని ఎవరు పూర్తి చేశారు?...ఇదీ మిగతా కథ. 

ఎలా వుంది కథ
     ముందుగా చెప్పుకున్నట్టు ఇది బెస్ట్ సెల్లర్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవలాధారం. ఇదే టైటిల్ తో హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. హాలీవుడ్ సినిమా పూర్తిగా నవలని అనుసరించి వుంది. ‘దిల్ బేచారా’ లో మార్పులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ గోల్ విషయంలో చేసిన మార్పు కనెక్ట్ కాలేదు. ఆమె సగం పాట గురించి సింగర్ ని కలుసుకోవాలన్న గోల్ తో వుంటుంది. ఇదేమీ ఆమె జీవితంలాంటి పాట కాదు కనెక్ట్ కావడానికి. నవల్లో కథ ప్రకారం అందులోని హీరోయిన్ ఒక నవల చదువుతుంది. అది తన లాంటి క్యాన్సర్ తో వున్న హీరోయిన్ కథే. ఆ నవల చివరి వాక్యాలు సగమే వుండి ముగింపు తెలియదు. దీంతో ముగింపు తెలుసుకోవడానికి అజ్ఞాతంలో వున్న రచయిత అన్వేషణలో వుంటుంది. ఇలా మరణం ముంగిట వున్న హీరోయిన్ జీవితానికి కనెక్ట్ అయ్యే పాయింటుగా ఇది వుంటుంది.


        ‘దిల్ బేచారా’ డైలాగులు కాన్సెప్టుకి తగ్గట్టుగా బాగానే వున్నాయి. కానీ కథా కథనాలు కాన్సెప్ట్ కి తగ్గ ఫీల్ ని కల్గించవు. ఫీల్ కల్గించేది చనిపోయిన వ్యక్తిగా సుశాంతే గానీ పాత్ర  కాదు. పాత్ర కంటే, సూసైడ్ చేసుకున్న సుశాంతే కన్పిస్తూంటే, బోలెడు సానుభూతీ కన్నీళ్ళతో ప్రతిస్పందించి సినిమా బావుందంటున్నారు ప్రేక్షకులు. సుశాంత్ కి వీడ్కోలు చెబుతున్న సినిమాగా ఇంతకంటే కథని విశ్లేషించడం భావ్యం కాదు. 

ఇద్దరూ ఇద్దరే
    నటుడుగా ఇంత టాలెంట్ వున్న సుశాంత్, జీవించడంలో ఆ టాలెంట్ చూపక పోవడం అతి పెద్ద విషాదం. టాలెంట్ ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని తెలుసుకోలేక పోయాడు. స్మైల్ అతడి చిరకాల ఎస్సెట్. ఆ స్మైల్ కే సీన్లు షైన్ అవుతాయి. డైలాగ్ డెలివరీ అసామాన్యం. మరణాన్ని తేలికగా తీసుకునే పాత్రగా కొన్ని ఫన్నీ సీన్స్ క్రియేట్ చేశాడు. సైలెంట్ హ్యూమర్ ఇంకో ప్లస్. ఇన్ని పాజిటివ్స్ వున్న తను నెగెటివ్ నిర్ణయం తీసుకోవడమే పాజిటీవిటీకి గొడ్డలి పెట్టు. అతడి నిష్క్రమణ పాజిటీవిటీకే పెద్ద లోటు. 

        హీరోయిన్ సంజనా క్యాన్సర్ పాత్రకి సరీగ్గా సూటయ్యింది. ఆధునిక క్యాన్సర్ పాత్ర. కొద్ది కొద్ది మాటలు, వడివడి నడక, గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ సైకలాజికల్ గా అలౌకిక భావతరంగాల్ని తట్టిలేపుతాయి. బెస్ట్ నటి. సాంకేతికాలు థీమ్ ని ప్రదర్శిస్తాయి. కొన్ని చోట్ల వెలసిన జీవితాల్లాగే వెలసిన రంగులుంటాయి. తొమ్మిది వుండీ లేనట్టుండే పాటలతో రెహ్మాన్ సంగీతం ఒక స్మూత్ ట్రావెల్. 

        క్యాస్టింగ్ డైరెక్టర్ నుంచి సినిమా దర్శకుడుగా మారిన ముఖేష్ ఛబ్రా హాలీవుడ్ ఒరిజినల్ జానర్ ని కూడా మార్చి తీశాడు. నవల గానీ, హాలీవుడ్ సినిమా గానీ కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ కి చెందినవి. పదహారేళ్ళ హీరోయిన్, పదిహేడేళ్ళ హీరో ఇద్దరి క్యాన్సర్ కథ. వినూత్నంగా ఇంత లేత టీనేజీ హీరోహీరోయిన్ పాత్రలతో క్యాన్సర్ కథ కాబట్టే మార్కెట్ యాస్పెక్ట్ తో నవల, సినిమా అంత పాపులర్ అయ్యాయి.

సికిందర్!