రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 2, 2019

723 : విస్మృత సినిమాలు - 'పాలపిట్ట' ఆర్టికల్


       
         1969 మహాత్మా గాంధీ శత జయంతి సంవత్సరం.

          ఉపన్యాసాల టపాసులు విరివిగా పేల్చుకున్న దేశం.
          ఆ టపటపలు ఢమఢమలు సద్దుమణిగిన తర్వాత ఎప్పటిలా తిరిగి రొటీన్ రాజకీయ వేషాలు - రేపిన గాంధీజీ  ఆశయాల ఆశలుచేసిన గాంధీజీ  మరో ప్రపంచపు బాసలూ హుళక్కి అయి1969 నుంచీ నేటికి దిగ్విజయంగా 48 ఏళ్ళు. గాంధీ మహాత్ముడు చనిపోయింది 1948 లో కాదు, 69 లో! 

          రాజకీయం మారకుండా రాజ్యం మారదు. రామరాజ్యం రాదు. దీన్ని సినిమా దృశ్యమానం చేసినప్పుడుఒక మరోప్రపంచం’  వెలుస్తుంది. గాంధీజీ కలలుగన్న మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. గాంధీయిజాన్ని రాజకీయం సొమ్ము చేసుకుందే గానీసినిమాలు కాదు. ఒక దశలో వెండితెర మీద గాంధీ పాత్ర అలా కన్పించి ఓ సందేశమిస్తే ఘోల్లున నవ్వడం నేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే ప్రేక్షకులు, పూర్తి స్థాయి గాంధీ జీవితాన్ని ఆటెన్ బరో చిత్రిస్తే  కళ్ళకద్దుకుని చూసి తరించారు. వాళ్లకి  పూర్తి స్థాయి గాంధీజీ నిండు జీవితమే రీలు పడాలిఓ సందేశంతో సరిపెడితే కాదు. ఇందుకే అక్కినేనిఆదుర్తిలు చేతులు కాల్చుకున్నారేమో మరోప్రపంచం’ అనే కాలానికి ముందున్న కళాఖండం తీసి. 
            
            రాజకీయమేకాదు1970 ల నాటికి గాంధీయిజం పట్ల కూడా ప్రేక్షకులకి ఆసక్తి సన్నగిల్లిందనడానికి ఈ సినిమా పరాజయ గాథే  ఒక నిదర్శనం. 
             
         జాతిపిత నూరవ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వాప్నిక సందేశంతో 1970 లో మరో ప్రపంచం’ అనే ఆఫ్ బీట్ సినిమాని అక్కినేనిసావిత్రిజమునగుమ్మడి లాంటి పాపులర్ తారలతో నిర్మించి, ‘అసంతృప్తితోఅశాంతితోఅదేమిటో అర్ధం కాని ఆవేదనతోఅనుక్షణం మధనపడే విద్యార్ధులందరికీ’  ఏంతో ఆప్యాయంగా అందిస్తేఆ విద్యార్థులే  లక్ష్య పెట్టలేదు. లక్ష్యిత ప్రేక్షకులకే లెక్కలేనప్పుడు అసలు ప్రీ పొడక్షనే వృధా అన్పిస్తుంది. సినిమా అనామకంగా మిగిలిపోయింది కాలగర్భంలో కలిసిపోతూ.

        ఇది ఆనాటి స్టూడెంట్స్ బ్యాడ్ లక్కే. స్టూడెంట్స్ అన్నాక ఫ్యూచరిస్టిక్ సినిమాలు కూడా చూసి మేధస్సు పెంచుకోవాలి. ఇప్పుడు 48  సంవత్సరాల తర్వాత ఈ సినిమా చూస్తూంటే, ఇది కాలజ్ఞానం కూడా చెబుతూనాస్టర్ డామిజాన్ని ప్రదర్శించడాన్ని తెలిసినిటారుగా నిక్క బొడుచుకుంటాయ్ మన వెంట్రుకలు! 
          దటీజ్ ఆదుర్తి సుబ్బారావ్!
            సాహిత్యానికి కొడవటిగంటి కుటుంబ రావెలాగోసినిమాలకి ఆదుర్తి సుబ్బారావలాగ. తెలుగుదనందానికి అభ్యుదయం,వీటిని అరటి పండు  వొలిచి చేతిలో పెట్టినంత లొట్ట లేసుకునేంత స్పష్టతసరళత్వం... ఇద్దరూ కూడబలుక్కుని పంపకాలు జరుపుకున్నట్టు కన్పిస్తారు  ఒకరి సినిమాలూ, ఇంకొకరి సాహిత్యమూ చూస్తే.

  మూగమనసులుమంచిమనసులుతేనెమనసులుసుమంగళిఇద్దరు మిత్రులుడాక్టర్ చక్రవవర్తీ ...లాంటి ఎన్నెన్నో చక్కరకేళులతో ఆదుర్తి సుమధుర సంగీతాల చిత్రావళి. అంతేకాదు, జానర్ సెట్టర్ కూడా తను. మూగమనసులు లాంటి పునర్జన్మల సినిమాలు ఎప్పుడు ఎవరు తీసినా బాక్సాఫీసుకి మాలిమి కావడం ఆయనేసిన  బాటే. 1968-75 మధ్య ఏడేళ్ళ కాలంలో మిలన్,జీత్,  ఇన్సాఫ్రఖ్ వాలామస్తానా లాంటి పది వరకూ హిందీలో బిగ్ స్టార్స్ తో సూపర్ హిట్స్ కూడా ఇచ్చిన షాన్ దార్ దర్శకుడాయన. జీవితంలో ఎక్కడా ఆయన పరేషాన్ గా కన్పించింది లేదు.

          అసలు  ‘మరోప్రపంచం’ కి  ముందు 1967 లోనే  సుడిగుండాలు’ తో మొదటిసారి దిగ్విజయంగా చేతులు కాల్చుకోవడం అయింది. అయితే 1965 లో తేనెమనసులు’ తో కృష్ణ సహా అందరూ కొత్త వాళ్ళతో చేసిన మొట్ట మొదటి ప్రయోగం సూపర్ హిట్టయింది. ఐతే 1970 లో సూపర్ తారలతో మరోప్రపంచం’  పరాజయం తర్వాత ఆదుర్తి ప్రయోగాల ఆర్తి పరిసమాప్తి అయింది. ఇందులో గాంధీజీ ప్రవచిత మరోప్రపంచం రాలేదు సరికదాడబ్బెట్టి కొందామన్నా బియ్యపు గింజ జాడ లేకపోయేసరికి,  విసిగిన ముసలవ్వ పాత్రలో జమున అంటుంది చివరికి – ‘ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా?’ అని. గ్రేట్ సెటైర్. ఇప్పుడు  అదే ప్రళయం గురించిన 2012 యుగాంతం’ అనే హాలీవుడ్ డబ్బింగ్ సినిమానే తెగ ఆడించారు  తమకిక భవిష్యత్తు లేదని డిసైడ్ అయిపోయిన ప్రజలు!

       ఇంకా ఇందులో నూరవ గాంధీజీ పుట్టిన రోజుకి అట్టహాసంగా సభలు జరుపుకుంటూఇలా రెచ్చ గొడతారు నాయకులు  “ మేం గాంధీ పేరు తగిలించుకుని ఆయన రుణం తీర్చుకుంటున్నాం. నా పేరు ఉగ్ర నరసింహ గాంధీమరి మీరోమీరెలా తీర్చుకుంటారు గాంధీ గారి రుణంఈ హైదరాబాద్ – సికిందరాబాద్ జంట నగరాల్ని ఒక్కటి చేసి గాంధీ బాద్ గా మార్చాలని ఉద్యమించండి! పోరాడి మీ ప్రాణాలను త్యాగం చేయండి ప్రజలారా!” ...ఇలా దేశవ్యాప్తంగా నాయకుల ప్రసంగాల తర్వాత ఒక షాట్ వేస్తాడు దర్శకుడు. అది ఆకాశంలో కావుకావుమనే కాకుల గోల. రాయకీయాలంటే 48 ఏళ్ల నాడే చీదర పుట్టిందన్న మాట. ఇవ్వాళ కొత్తగా తిట్టుకోవాల్సిందేమీ లేదు. 

            ఇక అప్పుడు పేటలో కుటుంబాల్ని చూపిస్తాడు. అప్పటికే అరడజనేసి మంది పిల్లల మంద వున్నాఇంకా దారిద్ర్య ఆహ్వాన కేంద్రాలుగా పడగ్గదుల్ని చేసుకుని కులికే మూర్ఖ శిఖామణుల్ని చూపిస్తాడు. మరోపక్క పేదరికంలో వొళ్ళమ్ముకున్న  పాపానికి పుట్టుకొచ్చే అక్రమ సంతతి శ్రేణుల్నీ చూపిస్తాడు. ఈ పిల్ల జాతి మొత్తాన్నీ ఓ రాత్రి దొంగలెత్తుకుపోతారు. 

            ఈ కేసుల దర్యాప్తుకి ఐజీ (గుమ్మడి వెంకటేశ్వరరావు ) రంగంలోకి దిగుతాడు. ఇంకా లోతైన దర్యాప్తుకి ఢిల్లీ నుంచి సీఐడీ  రవీంద్రనాథ్ (అక్కినేని నాగేశ్వరరావు)  దిగుతాడు. రకరకాల మారువేషాలతో ఇతను చేస్తున్న దర్యాప్తు వివరాల్ని రహస్యంగా ఫోటోలు తీసి ఓ పత్రిక్కి పంపుతూంటుంది  ఐజీ కూతురు సంధ్య (సలీమా). వాటిని  ప్రచురిస్తూ ఐజీకీసీఐడీ కీ షాకిస్తూంటాడు ఎడిటర్ - కం - పబ్లిషర్ (విజయ్ చందర్). 

       వెళ్లి వెళ్లి దర్యాప్తు ఓ రహస్య స్థావరానికి చేరుతుంది. అక్కడుంటారు వందలమంది మాయమైపోయిన పిల్లలు. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారుసకల సౌకర్యాలతో మరో ప్రపంచాన్ని  అనుభవిస్తున్నారు. చిరిగిన విస్తరి మెతుకులతోఅతుకుల బొంత బతుకులతోపేదల కోసం ధనికులు కట్టిన మహా మంచి ప్రపంచం (శ్రీశ్రీ పాట) కి సుదూరంగా, ఏంతో మెరుగైన జీవన ప్రమాణాలతో,పాపాలు శాపాలు లేని సుఖవంతమైన రామరాజ్యాన్ని నిర్మించుకుంటున్నారక్కడ. దీని వెనుక సంధ్యఎడిటర్పెద్ద గాంధీ (మాడా) తోబాటు, మరో ముగ్గురున్నారు. వీళ్ళ దూరదృష్టికి ప్రభావితుడై తన పిల్లల్ని కూడా వీళ్ళ పరం జేస్తాడు రవీంద్ర నాథ్. కానీ ఈ మారు ప్రపంచాన్ని మామూలు  ప్రపంచపు రాజ్యాంగంచట్టాలూ ఒప్పుకోవు. అందుకని రవీంద్రనాథ్  సహా అందరూ చట్టం ముందు దోషులుగా నిలబడతారు.

            కాలం కంటే ముందు తీసిసామాజికాంశాల మీద ముందస్తు కామెంట్స్ చేసిన ఈ ప్రయోగం నాటి ప్రేక్షకుల ఆలోచనా స్థాయికి మించిపోయింది  కావొచ్చు. పైగా గాంధీయిజం తెలియాలంటే,  ఆ యిజం పుట్టిన కాలమాన పరిస్థితుల అనుభవం లేకా కావొచ్చు. సినిమాల్లో ప్రేక్షకుల ఆసక్తికి ముందుగా తెర మీద పాత్రలు పడే స్ట్రగుల్  కన్పించాలి. తమ కళ్ళముందు ప్రత్యక్షంగా వున్న సమస్యలతో స్ట్రగుల్ చూపించిఆ పైన  పరిష్కార మార్గంగా ఏ ఊహా జగత్తుని  సృష్టించి చూపించినా దాన్ని ఆశ్వాదించగల మూడ్ లోకి నిఖార్సుగా వెళ్ళిపోగలరు ప్రేక్షకులు. మరో ప్రపంచం’ లో ఈ  మొదటిదే  మిస్సయికేవలం బాలల కాల్పనిక జగత్తే తెరకెక్కడంతో ప్రేక్షకులకి రుచించి వుండదు. కథన పరంగా ఆఫ్ బీట్ పిక్చర్లు అరుదుగా స్ట్రక్చర్ లో వుంటాయి. పైగా తక్కువ మందిని ఆకర్షిస్తాయి.  

        ఇందులో అపహరణకి గురయిన పిల్లలు బెగ్గింగ్ గ్యాంగ్ పాలబడి స్లమ్  డాగ్ మిలియనీర్’  పద్ధతిలో కళ్ళ పీకివేత  ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు కొన్ని హాస్టల్స్ లో, మెస్సుల్లో కన్పిస్తున్న  స్టూడెంట్స్ కుల వివక్షావస్థని కూడా ఈ సినిమాలో చూస్తాం. ముందు జరిగేది పేపర్లో వచ్చేసే అంతిమ పోరాటం’  తరహా సీనిక్ ఆర్డర్ ని కూడా అప్పుడే చూస్తాం. పిల్లల్ని పరాయి దేశాలకి తరలించి అక్కడ్నించి  మన మీదికే  విరోధులుగా ప్రయోగిస్తారేమో - అన్న ఒక పాత్ర అనే మాటతో... నేటి జిహాదిస్టులు కళ్ళకి కడతారు. ఓ మాట అందిందే తడవుఅది పట్టుకుని ఫ్లాష్ బ్యాకుల్లో  కెళ్ళిపోయి తనివిదీరా సావిత్రి వేసే జంధ్యాల బ్రాండ్ సుత్తి’ ని కూడా అప్పట్లోనే ఇందులో చూడొచ్చు. పారిపోతున్న దొంగనుకుని పెద్ద గాంధీ’ లాంటి ప్రయోజకుణ్ణి జనం పట్టుకుని చితకబాది,చంపేసే అమానుష దృశ్యాలెన్నో ఇప్పుడు మనం లించింగ్ సంఘటనలుగా చూస్తున్నాం. అలాగే  ఉపన్యాసాలలో తప్ప ఆంతరంగిక సంభాషణల్లో దేశంప్రజలూ  అన్న మాటలు ఒక్కసారైనా అనే నాయకుడు ఒక్కడైనా వున్నాడేమో గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి”  అన్న అక్కినేని డైలాగు ఇప్పటి రాజకీయాల్లో చూస్తున్నదే. ఇలా వీలైనన్ని అంశాల మీద భవిష్య వాణి ఆనాడే ప్రకటించేసిందీ ఆదుర్తి అపూర్వ సృష్టి. 


       సావిత్రిజమునలవి కీలక పాత్రలేం కావు. సినిమా టికెట్లు తెగెందుకే వాళ్ళిద్దరూ వున్నారన్పిస్తుంది. అక్కినేనిగుమ్మడిలే రథ సారధులు. మోదుకూరి జాన్సన్ మాటలు రాసిన ఈ వాస్తవిక కథా చిత్రంలో శ్ర్రీశ్రీ రాసిన ఒక పాట మాత్రమే వుంది - ఇదిగో ఇదిగో ప్రపంచం’ అనే పాటకి కేవీ మహదేవన్ స్వరకల్పన. అత్యధిక శాతం దృశ్యాలకి నేపధ్య సంగీతమే వుండదు. తెలుపు – నలుపులో నిర్మించిన ఈ నంది అవార్డు పొందిన చలనచిత్రానికి  కేఎస్ రామకృష్ణారావు ఛాయాగ్రహణం.


           అనేక కమర్షియల్ సినిమాలు తీసిన ఆదుర్తిలో ఒక కోణాన్ని మాత్రమే చూశాం. సమాజం పట్ల బాధ్యత కూడా ఫీలైన దర్శకుడిగా ఇంకో కోణాన్ని ఈ కళాత్మకంలో కళ్ళారా చూడొచ్చు.

సికిందర్
(‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక, డిసెంబర్ 2018)
***

722 : నివాళి


 తెలుగు సినిమాతో కాదర్ ఖాన్ అనుబంధం
        కెనడాలో మృతి చెందిన హిందీ నటుడు, రచయిత కాదర్ ఖాన్ దక్షిణ భారత సినిమాకు ఎంతో సన్నిహితుడు. ముఖ్యంగా తెలుగువారు హిందీలో నిర్మించిన ఎన్నో చిత్రాల్లో నటించడమే కాకుండా రచన చేశాడు. దాసరి నారాయణ రావు, తాతినేని రామారావు, మురళీ మోహన్ రావు, రాఘవేంద్ర రావు, కె . బాపయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు పని చేశాడు.
         మేరీ ఆవాజ్ సునో, హిమ్మత్ వాలా, అనారీ, జ్యోతీ బనే జ్వాలా, జస్టిస్ చక్రవర్తి, తోఫా, మక్సడ్, గిరఫ్తార్, దిల్ వాలా, రఖ్ వాలా, సూర్యవంశ్ మొదలైన సినిమాలను పేర్కొనవచ్చు. కాదర్ ఖాన్ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను బాగా ఆకళింపు చేసుకునేవాడు. ఆయన రచయితగా విజయవంతమైన తెలుగు సినిమాలను హిందీలో పునర్నిర్మించేవారు.
        ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ రాయడంతో పాటు చక్కటి పాత్రల్లో కాదర్ ఖాన్ నటించేవాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా 15 లేదా 20 రోజులు తప్పకుండా ఉండేవాడు. ఆరోజుల్లో అన్నపూర్ణ, పద్మాలయా  స్టూడియోల్లో తప్పకుండా కనిపించేవాడు. కాదర్ ఖాన్ నటుడుగా ఎంత ప్రతిభావంతుడో, రచయిత గా కూడా పదునైన మాటలతో, హాస్యోక్తులతో ప్రేక్షకులకు  గిలిగింతలు పెట్టేవాడు .హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన అందరితో సరదాగా ఛలోక్తులతో మాట్లాడేవాడు. తెలుగు వంటకాలంటే అమితమైన ఆసక్తి. ఇక మధ్యాహ్న భోజనంలో కూడా వివిధ రకాలైన విజిటేరియన్, నాన్ విజిటేరియన్ వంటకాలు ఉండేవి. 

         ఎక్కడో ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో జన్మించిన కాదర్ ఖాన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సైన్సు, గణితం బోధించేవాడు. 1972 లో ‘జవానీ దివానీ’ సూపర్ హిట్ తో రచయితగా సినిమా రంగ ప్రవేశం చేశాడు. 1973 లో ‘దాగ్’ తో నటుడయ్యాడు. 
           కాదర్ ఖాన్ 300 సినిమాలకు పైగా నటించాడు.100 చిత్రాలకు పైగా మాటలు రాశాడు. ఆయన మోకాలు చికిత్స కోసం కుమారుడు సర్ఫరాజ్  ఖాన్ కెనడాలో ఉంటే వెళ్ళాడు. ఆ ఆపరేషన్ విజయవంతమైనా లేచి నడవలేకపోయాడు. కోలుకుంటాడని కుటుంబ సభ్యులు భావించినా ఊహించని విధంగా మంగళవారం గుండెపోటు వచ్చింది. కాదర్ ఖాన్ మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటు.

రాం ప్రసాద్