రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, నవంబర్ 2021, బుధవారం

1079 : సాంకేతికం


         మంచి రోజులొచ్చాయి ప్రారంభ దృశ్యాల్లో బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాల పాట అయిపోయాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాక, విమానం లాండ్ అవుతున్న షాట్ పడుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వరరావుని చూపిస్తుంది కెమెరా. అక్కడికి అజయ్ ఘోష్ వస్తాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరుగుతుంది... అంటే బెంగళూరులో జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఆల్రెడీ ప్రేమలో వున్నారనీ, వాళ్ళిద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారనీ, వాళ్ళు వచ్చిన విమానం హైదరాబాద్ లో లాండ్ అయిందనీ, హైదారాబాద్ లో అజయ్ ఘోష్ మిత్రుడు కోటేశ్వరరావు విచారంగా కూర్చుని వున్నాడనీ, అజయ్ ఘోష్ అతడి దగ్గరకొచ్చి విచారంగా వున్న కారణం అడిగితే, ఇద్దరి మధ్య వాళ్ళ కూతుళ్ళ  మీదికి చర్చ మళ్ళిందనీ ఈ ఐదు సీన్లలో డల్ గా చెప్పారు. సినిమా ప్రారంభంలోనే డల్ గా చెప్పిన ఈ ఐదు సీన్లు ఎలా వున్నాయి? స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తిరాసిన డైలాగ్ వెర్షన్ లా లేవూ? 

        స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే అది డైలాగు వెర్షన్ అవుతుందా? ఇదీ ఇప్పుడు వేసుకోవాల్సిన మిలియన్ బడ్జెట్ల ప్రశ్న. రచయితకి పరిధులుంటాయి. ఆ పరిధిలు దాటి విజువల్ గా డైలాగు వెర్షన్ రాయలేడు. దర్శకులు ఒప్పుకోరు. విజువల్స్ చూసుకోవడం దర్శకుల పరిధి. కాబట్టి రచయిత స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచే ఎత్తి డైలాగు వెర్షన్ రాయగలడు. కానీ  కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మొదలైన వాటికి మేకర్ తనే అయినప్పుడు రైటర్ లా రాయలేడు. అతను రైటర్ లా రైటింగ్ చేయలేడు, మేకర్ లా మేకింగ్ చేస్తాడు. స్టోరీ మేకింగ్. అతను పదాలతో సీన్స్ ఆలోచించడు, షాట్స్ తో సీన్స్ ని చూస్తాడు. ఆ ప్రకారం రాస్తాడు. రైటర్ దగ్గర పెన్నే వుంటుంది, మేకర్ దగ్గర కెమెరా వుంటుంది. కెమెరాతో వెండి తెర మీద రాస్తాడు. స్టోరీ రైటింగ్ రైటర్ చేసుకుంటాడు, మేకర్ గా దర్శకుడు స్టోరీ మేకింగ్ చేస్తాడు. అంటే రైటర్ లా సీన్లతో డైలాగులు రాసుకుంటూ వర్బల్ గా కథ చెప్పకుండా, కెమెరా షాట్స్ తో ఇమేజెస్ సృష్టించి కదిలే బొమ్మల కథ చూపిస్తాడు. అతను చెప్పడు. చెప్పడం పుస్తక భాష. అతను చూపిస్తాడు. చూపించడం సినిమా భాష, దృశ్య మాధ్యమం భాష. దృశ్య మాధ్యమం భాష తెలిస్తే సీన్లు తగ్గి, సినిమా నిడివీ తగ్గి, దాంతో బడ్జెట్టూ తగ్గి, నిర్మాత సంతోషిస్తాడు.

        2.
           రాజ రాజ చోర లో చూద్దాం. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. ఈ రెండు సీన్లలో అర్ధమయ్యే విషయమేమిటి? జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని  ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తున్నాడనీ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ డల్ గా అర్ధమవుతోంది.

        ఇవి కూడా ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్ సీన్లే. ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే సీన్లు డల్ గానే వుంటాయి. చాలా సినిమాల్లో, చాలా చాలా సినిమాల్లో, వెండితెర మీద ట్రీట్మెంటే చూపిస్తున్నారు కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మేకర్లు. వెండి తెర మీద చూపించాల్సిన డైలాగ్ వెర్షన్ చూపించడం లేదు. పుస్తక భాష చెప్తున్నారు. రైటర్ చేసే స్టోరీ రైటింగ్ అనేది జస్ట్ క్రియేటివిటీ, మేకర్ చేసే స్టోరీ మేకింగ్ క్రాఫ్ట్. క్రాఫ్ట్ తెలిసిన మేకర్లు ఎంతమంది వున్నారు? ఎంత బడ్జెట్ ని సేవ్ చేస్తున్నారు? దృశ్య మాధ్యమ భాష చూపిస్తూ తమలోని ఆర్ట్ ని ఎంతవరకు ప్రదర్శిస్తున్నారు?

        పై రెండు సినిమాల్లో మచ్చుకి ప్రారంభ సీన్లే చెప్పుకున్నాం. సినిమా సాంతం  చూస్తే ఇలాటివింకెన్నో వుంటాయి. చెప్పొద్దు, చూపించు - అని సాహిత్యానికి సంబంధించే రష్యన్ రచయిత చెఖోవ్ చురక వేశాడు. ఇక సినిమాలకిది ఇంకెంత వర్తించాలి. చంద్రుడు ప్రకాశిస్తున్నాడని నాకు చెప్పకు, పగిలిన అద్దం మీద చంద్ర కాంతి తళుక్కుమనడాన్ని నాకు చూపించూ - అన్నాడు చెఖోవ్. అంటే ఉత్త మాట కాదు, వర్ణన కావాలని పుస్తక భాషక్కూడా. ఈ వర్ణనాత్మక దృశ్యాన్నే మేకర్ కెమెరాతో చూపిస్తాడు. ట్రీట్మెంట్లో వెన్నెల కాస్తోందని రాసేయ్యొచ్చు. అది పట్టుకుని రైటర్ డైలాగ్ వెర్షన్లో 'వెన్నెల కాస్తోంది' అనే రాయొచ్చు. అప్పుడు మేకర్ ఆరుబయట పండు వెన్నెలని ట్రీట్మెంట్ లాగా డల్ గా చూపిస్తాడా, లేకపోతే పగిలిన కిటికీ అద్దం మీదో, టేబుల్ మీద గాజు గ్లాసు మీదో, చంద్ర కిరణాలు పడి తళుక్కున పరావర్తనం చెందే యాక్షన్ ని బ్యూటీఫుల్ గా డైలాగ్ వెర్షన్ చూపిస్తాడా? అదన్న మాట, యాక్షన్ ఈజ్ విజువల్ రైటింగ్, స్టోరీ మేకింగ్. సినిమా స్టిల్ ఫోటోగ్రఫీ కాదు, చలనం లేకపోవడానికీ, చైతన్యంతో లేకపోవడానికీ. సినిమా చలనాన్నీ చైతన్యాన్నీ చూపించే సినిమాటోగ్రఫీ. అందుకే చలన చిత్రమన్నారు, నిశ్చల చిత్రమనలేదు.

        3.
        మరి ఎలా చేసి వుండాలి పై రెండు సినిమాల విషయంలో? మంచి రోజులొచ్చాయి నే తీసుకుందాం. 1. బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్నారు  సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు. 2. ఓ పాట అయిపోయింది. 3. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నారు. 4. విమానం లాండ్ అవుతున్న షాట్ పడింది. 5. అప్పుడు హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వర రావున్నాడు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరిగింది...ఇలా వున్నాయి స్టోరీ రైటింగ్ చేసిన ఐదు సీన్లు.

        వీటిని స్టోరీ మేకింగ్ చేస్తే... బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కథనమంటే ఆడియెన్స్ కి ప్రశ్నలా సీను వేసి, దానికి జవాబు సీను తర్వాత చూపించడమేని చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడే ఆడియెన్స్ ఏం జరుగుతోందాని బుర్రకి పని చెప్పి, సీను తర్వాత సీను యాక్టివ్ గా చూడ్డంలో లీనమైపోతారు. ప్రశ్నలు జవాబులుగా సీన్లుంటేనే కథనానికి డైనమిక్స్ వుంటాయి. ఎప్పటికప్పుడు కథనం చలనంలో వుంటూ చైతన్యవంతంగా, థ్రిల్లింగ్ గా వుంటుంది.             

            ఇలా కాక - బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ప్రేమలో వున్నారు. పాట పూర్తయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళి పోవాలనుకున్నారు. విమానం లాండ్ అయింది. హైదరాబాద్ లో విచారంగా కూర్చుని వున్నాడు కోటేశ్వరరావు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. కూతుళ్ళ గురించి మాట్లాడుకున్నారు - అంటూ పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు వరస పెట్టి, కథ తెలిసిపోయేలా అన్నీ ముందే చెప్పేస్తూంటే, ఇక చూడడానికి ఆసక్తి ఏముంటుంది. ఏవో వచ్చిపోతున్న సీన్లని ఆడియెన్స్ లేజీగా, పాసివ్ గా చూడ్డం తప్ప.

        అందుకని, బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడు కోవాల్సిన అవసరం లేదు. విమానం లాండింగ్ షాట్  కూడా అవసరం లేదు. కోటేశ్వర రావు విచారంగా కూర్చున్న సీనూ అవసరం లేదు. ఈ మూడు సీన్లూ అవసరం లేదు.

        పాట అవగానే హైదరాబాద్ లో వున్న మెహ్రీన్ పీర్జాదా తండ్రి అజయ్ ఘోష్ ని చూపించి, అతడి మీద విమానం సౌండ్ వేస్తే సస్పెన్స్ క్రియేటై పోతుంది, ఆ విమానం సౌండేంటని. దీని తర్వాత కోటేశ్వర రావుతో అజయ్ ఘోష్ సీను వేసి,  దీని తర్వాత సినిమాలో చూపించినట్టు ఏర్ పోర్టు నుంచి క్యాబ్ లో వస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలని చూపిస్తున్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వచ్చేసినట్టు చెప్పిస్తే సరిపోతుంది. తలెత్తిన ప్రశ్నలూ జబాబులూ అన్నీ వచ్చేస్తాయి. డైలాగ్ వెర్షన్ డైనమిక్ గా, విజువల్ గా వుంటుంది. మేకర్ ఆర్టు బయటపడుతుంది.

        ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని బెంగుళూరు కాఫీ షాప్ లో మాట్లాడుకునే సీను, విమానం లాండింగ్ షాట్, కోటేశ్వరరావు మీదే ఓపెన్ చేసిన సీనూ- ఈ మూడిటి ఖర్చూ తప్పి, బడ్జెట్ తగ్గిపోతుంది. అవసరానికి మించి వున్న సినిమా నిడివి కూడా తగ్గి అర్ధవంతంగా, చైతన్య వంతంగా వుంటాయి సీన్లు.

        అర్ధవంతంగా ఎలా వుంటాయి? విడి విడిగా చూపించిన విమానం షాటుకీ, తర్వాత కోటేశ్వర రావు సీనుకీ ఏమైనా సంబంధముందా? దీన్నే లేజీ రైటింగ్ అంటారు. ఈ రెండూ లేపేసి, అజయ్ ఘోష్ మీద విమానం సౌండు పోస్టు చేస్తే అర్ధముంటుంది. ఆడియెన్స్ కి దాచి పెడుతూ, విమానంలో వస్తున్నది అతడి కూతురే కాబట్టి. సౌండ్ చాలా స్క్రీన్ ప్లే సమస్యల్ని పరిష్కరిస్తుంది, బడ్జెట్ నీ ని తగ్గిస్తుంది. స్టోరీ మేకింగ్ కి సౌండ్ కూడా ఒక టూలే. ఈ టూల్ తో కూడా కలిపి  షాట్సునీ, సీన్సునీ ఆలోచించడం చాలా అవసరం.
(మిగతా రేపు)

—సికిందర్