రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జులై 2016, సోమవారం

ఆర్టికల్ :

     ప్రతీ సంస్కృతీ హీరోల్ని కలిగి వుంటుంది.  దాదాపు కథలన్నీ హీరో చుట్టే తిరుగుతాయి. మైథాలజిస్టు జోసెఫ్ క్యాంప్ బెల్ హీరో పాత్ర రూపకల్పనలో చోటు చేసుకునే వివిధ దశల క్రమాన్ని గుర్తించారు. హీరో అంటే తన రోజు వారీ సాధారణ ప్రపంచపు సరిహద్దులు దాటుకుని,  సవాళ్ళతో కూడిన అసాధారణ ప్రపంచంలోకి ప్రవేశించి, తనవాళ్ళ శ్రేయస్సు కోసం పోరాడి, అంతిమంగా వారికా విజయ ఫలాల్ని అందించేవాడు- ‘కబాలి’ లో రజనీకాంత్ లాగా. ‘కబాలి’ లో రజనీ కాంత్ మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాటం చేయడాన్ని చూపించారు. 
          ఒక సాధారణ వ్యక్తి  హీరోగా అవతరించాలంటే  అతను అనుభవించాల్సిన దశలు 11 వుంటాయని క్యాంప్ బెల్ అంటారు. ముందుగా ఆ కాబోయే హీరో తన చుట్టూ వున్న పరిస్థితులతో అసౌకర్యాన్ని ఫీలవుతాడు. అప్పుడు అతడికి ఆ పరిస్థితుల్ని మార్చక తప్పదన్నట్టుగా ఒక అనుభవం ఎదురవుతుంది- ఆ అనుభవంతో అతడికి ముందు కెళ్ళాలంటే ప్రమాదకర పరిస్థితులుంటాయి. అప్పుడు అతడికి పెద్ద దిక్కుగా వున్న పాత్ర ముందుకు వెళ్లేందుకే అతడ్ని ప్రోత్సహిస్తుంది. దాంతో సమీకరణలు చోటు చేసుకుంటాయి- అనుచరులు ఒక వైపు- ప్రత్యర్ధులు ఒక వైపు గుమికూడతారు. ఇక మిగిలిన కథ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గురించి, దాన్ని సాధించడం గురించి, ఆ విజయ ఫలాలతో తిరిగి రావడం గురించీ వుంటుంది. క్యాంప్ బెల్ పురాణ పాత్రలకి సంబంధించే హీరో పాత్ర నిర్మాణం గురించి చెప్పినా, ఇది నేటి సినిమా స్క్రిప్టులకి కూడా వర్తిస్తుంది. శక్తియుక్తుల్ని ప్రదర్శించే హీరో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. కబాలీ ఇదే చేస్తాడు. 

      క్యాంప్ బెల్ ఇలా అంటారు : పురాణాల, పారంపర్యంగా వస్తున్న ఆచారాల ప్రధాన కర్తవ్యం మానవశక్తి పురోగమించడానికి అవసరమైన ప్రతీకాత్మలని అందించడమే ...అయితే వాస్తవానికి, మానవ బలహీనతలు పెచ్చు మీరుతున్న కొద్దీ ప్రతీకాత్మలు అందించే ఆధ్యాత్మిక  విలువలు  కూడా గుర్తింపుని కోల్పోతూంటాయి...

          అంటే హీరో అనేవాడు ఆధ్యాత్మిక ప్రదాత అన్నమాట. అతను మన ఆలోచనల్ని ప్రభావితం చేసి మనం ఉన్నతంగా ఎదిగేందుకు మనల్ని తన వెంట తీసుకుపోతాడన్న మాట- ఎలా వున్న వాళ్ళని అలా వదిలెయ్యకుండా. కబాలి ఇది సాధించాడా?

       హీరో అనేవాడు తను వేసే ప్రతీ అడుగూ ఉన్నతాశయపు పవిత్రతని కాపాడేందుకే వేస్తాడు. కథలో భాగంగా వుండే  ఎలాటి హింసకైనా అతీతంగా అతడి మంచితనం ప్రకాశిస్తుంది. చెబుతున్న  కథ ప్రభావశీలంగా వుండేందుకు కొన్ని అతిశయోక్తులకి పాల్పడక తప్పదు. కాబట్టి మంచితనమా - హింస ఈ రెండిటినీ పోటాపోటీగా  కొంచెం అతి చేసి చిత్రించడం అవసరమే.

      జైన మతస్థులు ఈ పరిస్థితిని మేనేజ్ చేసేందుకు ఒక ఆసక్తికర విధానాన్ని కనుగొన్నారు. ప్రతీ కథలో మూడు ప్రధాన పాత్రలుంటాయి. నాలుగు కూడా వుండొచ్చు. నాల్గోపాత్ర కథలో వున్నా లేకపోయినా, దాన్ని చక్రవర్తి అన్నారు. మిగతా మూడు పాత్రలు బలదేవుడు  లేదా హీరో పాత్ర, వసుదేవ లేదా సెకండ్ హీరో పాత్ర, ప్రతి వసుదేవ  లేదా యాంటీ హీరో అంటే విలన్ పాత్ర. ప్రతి వసుదేవ అన్న పేరే సగం ప్రపంచానికి అతను అధిపతి అన్న అర్ధాన్నిస్తోంది. ఎలాగైతే వసుదేవులు ప్రపంచాన్ని ఏలతారో, అలా యాంటీ వసుదేవులు ప్రపంచం మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. అయితే ఇది విలనిజంతో కూడుకుని వుంటుంది.  

          బలదేవుడు ఎవర్నీ చంపడు. అతను  జైనుల అహింసా సిద్ధాంతపు పరిరక్షకుడుగా వుంటాడు. వసుదేవుడు చంపి పాతాళానికి పోతాడు. ప్రతి వసుదేవ కూడా వాడి దుర్మార్గాల రీత్యా నరకానికే పోతాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పాత్రయిన బలదేవుడు మాత్రం జైనుల  ధర్మం ప్రకారం పరిత్యాగం చేసి మోక్షం పొందుతాడు. 

      నిజమే, హీరో కూడా హింసకి పాల్పడాల్సి వస్తుంది. అయితే అది విలన్ పాత్ర పాల్పడే స్థాయిలో భయానక బీభత్సభరితంగా వుంటే, నిర్దాక్షిణ్యంగా చంపడమే హీరోయిజ మనుకుంటే, అతను  రక్తపాతానికి అతీతుడైన ధర్మ పరాయణుడైన హీరో ఎలా అవుతాడు? కబాలిలో చూపించినట్టుగా మనుషుల్ని చంపడమంటే దోమల్ని చంపడంతో సమానమా? అసలు చంపడాలు లేని బ్రాండ్ హీరోయిజాన్ని మనం ప్రమోట్ చేయలేమా?


-సుధామహి రఘునాథన్
(టైమ్స్ ఆఫ్ ఇండియా)