రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, May 18, 2020

943 " స్క్రీన్ ప్లే సంగతులు


        (చదివే పని పెరగడంతో రాత పనికి వారంపాటు బ్రేక్ పడింది. నేటి నుంచి షరా మామూలే...)
       
టీవల హిందీలో టౌన్ కామెడీలనే కొత్త ట్రెండ్ రోమాంటిక్ కామెడీలు వస్తున్నట్టు, ఇదో కొత్త జానర్ అవుతున్నట్టూ గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. దీని జానర్ మర్యాదల గురించి కొందరు అడుగుతున్నారు. ఈ టౌన్ రోమాంటిక్ కామెడీలు రెండు రకాలు. లివ్ ఇన్ రిలేషన్ షిప్, గే లవ్, లెస్బియన్ లవ్ వంటి జీవన శైలుల్ని నగర సంస్కృతిలో చూపిస్తున్నవి కాస్తా, సాంప్రదాయంగా నిదానంగా వుండే టౌన్ సెటప్ లో చూపిస్తూ కొత్త ట్రెండ్ కి బాట వేయడం ఒక రకం కాగా; ఈ కాన్సెప్ట్స్ కాకుండా, సాధారణ రోమాంటిక్ కామెడీలనే ఇదే టౌన్ సెటప్ లో చూపించడం రెండో రకం. మన్మర్జియా, లుకా ఛుప్పీ, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా వంటివి మొదటి రకంలోకి వస్తే, బరేలీకీ బర్ఫీ, డ్రీంగర్ల్ వంటివి రెండో కోవకి చెందుతాయి. ఈ రెండు రకాల రోమాంటిక్ కామెడీల్ని సిటీ లైఫ్ లో చూపించడం మొనాటనీ అయిపోవడం వల్ల కావొచ్చు, వీటిని టౌన్లకి తీసికెళ్ళి నేపథ్య వైవిధ్యంతో కొత్తదనాన్ని సాధిస్తున్నారు. ఆ టౌన్ ఏదైతే వుంటుందో దానిదైన నేటివిటీని, మనుషుల్నీఅచ్చంగా చిత్రించి ఒక దగ్గరితనం ప్రేక్షకులు ఫీలయ్యేలా, ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు.

       
‘లుకా ఛుప్పీ’ (దాగుడు మూతలు) లివ్ ఇన్ రిలేషన్ షిప్ కథ. నగర నేపథ్యంలో చూపిస్తూ వచ్చిన ఈ ఆధునిక పోకడని ఇలా టౌన్లో చూపించడం వల్ల ఒనగూడే బాక్సాఫీసు లాభమేమిటంటే, ఇలాటి నగర పోకడలు టౌనులో అలజడి సృష్టించ వచ్చనే ఒక అంచనా. అక్కడి ప్రజలు (పాత్రలు) ఛీ థూ అని దీన్నో ఇష్యూగా చేసి హంగామా చేయ వచ్చన్న ఆలోచన. ఈ అల్లరి అలజడి లేదా కామిక్ కాన్ఫ్లిక్ట్ కొత్త వినోదాత్మక విలువగా మారి బాక్సాఫీసుకి తాజాదనాన్ని తీసుకు వస్తుందన్న వ్యూహం. టౌను జీవులు నగరాల కంటే కాలంతో ఒకడుగు వెనకుంటారనే అందరూ ఆమోదించే సినిమా సూత్రీకరణే ఈ జానర్ కి నేపథ్య బలాన్ని సమకూరుస్తోంది. 

        ‘లుకా ఛుప్పీ’ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కూడా. మరాఠీలో రెండు సినిమాల దర్శకుడు. రచయిత రోహన్ శంకర్ ఈ కథ రాసుకొస్తే వెంటనే తిరస్కరించాడు. కారణం అది మథుర పట్టణ నేపథ్యంలో వుండడం. ఆ పట్టణమూ అక్కడి వాతావరణం తనకి తెలియవు. తెలియని వాటితో రిస్కు తీసుకోలేడు. అలాగని కథని ఫలానా వూరు అని కాకుండా ఫార్ములా సినిమాగా తీసేయడానికి మనసొప్పలేదు. తర్వాత్తర్వాత ఈ సబ్జెక్టుని చేపట్టేందుకు సిద్ధపడి, రచయితతో కలిసి ఏడాదిన్నర పాటూ మథురకి వెళ్ళివస్తూ అక్కడి నేటివిటీని అర్ధంజేసుకోవడానికి ప్రయత్నించాడు. మథుర పట్టణం పలికే ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేశాడు. తదనుగుణంగా కథా రచనలో పాల్గొన్నాడు.

        ఈ కథకి పూర్వరంగం
       ఇలా ఏర్పాటవుతుంది - మథుర పట్టణాన్ని సందర్శించిన సినిమా స్టార్ నజీం ఖాన్ (అభినవ్ శుక్లా) తను లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో వున్నట్టు గొప్పగా ప్రకటించడంతో పెద్ద దుమారం లేస్తుంది. ప్రజలు అతడి పోస్టర్ల మీద పేడ కొడతారు. సినిమాలు నిషేధిస్తారు. పెళ్లి పవిత్రత గురించి ఓవరాక్షన్ చేస్తూ ఆందోళనకి దిగుతారు. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న యాంటీ నేషనల్ అని అతడి మీద ముద్ర వేస్తారు. ఇదంతా చూసి సంస్కృతీ రక్షా మంచ్ అనే లోకల్ పార్టీ రంగంలోకి దూకుతుంది. దీన్ని రాజకీయం చేసి ప్రేమికుల్ని ఉరికించి ఉరికించి కొడుతుంది. పార్టీకి చెందిన పేట రౌడీ కార్యకర్తలు హిందూ ధర్మ సంరక్షకులుగా మారిపోయి ఎడాపెడా వాయిస్తూంటారు. ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమని, లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ (ఎల్ ఆర్) కి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమనీ ధీరోదాత్త ప్రకటన చేస్తాడు పార్టీ అధ్యక్షుడు విష్ణు త్రివేదీ (వినయ్ పాఠక్). ఇతను ప్రతీసారీ ఎన్నికల్లో ఓడిపోతూంటాడు. ఇప్పుడు గెలవడానికి మంచి మసాలా దొరికింది.  


        ఈ పూర్వ రంగంలో కథ
        ఇలా ప్రారంభమవుతుంది- లోకల్ కేబుల్ టీవీ స్టార్ రిపోర్టర్ వినోద్ ‘గుడ్డూ’ కుమార్ శుక్లా (కార్తీక్ ఆర్యన్), అతడి కెమెరామాన్ అబ్బాస్ ( అపరాశక్తి ఖురానా) పనిచేస్తున్న ఆఫీసుకి కూతురు రేష్మీ (కృతీ సానన్) ని వెంటబెట్టుకుని  విష్ణు త్రివేదీ వస్తాడు. ఈమె జర్నలిజం చేసి ఇంటర్న్ షిప్ కోసం ఎదురు చూస్తోంది. కేబుల్ టీవీ చీఫ్ ఆమెని చేర్చుకుంటాడు. ఆమె గుడ్డూ, అబ్బాస్ లతో కలిసి టీంగా వుంటుంది. వీళ్ళు  టౌన్లో ఎల్ ఆర్ మీద అభిప్రాయ సేకరణ చేస్తూంటారు. ఎల్ ఆర్ చాలా మంచిదని, కాబోయే మొగుడు తాగుబోతో కాదో అప్పుడే తెలుస్తుందనీ, తాగుబోతు మొగుడితో అనుభవం గడించిన ఒక ముసలావిడ కెమెరా ముందు సంచలన కామెంట్ చేస్తుంది.

        ఇలా కలిసి పనిచేస్తూ ప్రేమలో పడతారు గుడ్డూ రేష్మీలు.  గుడ్డూ కుటుంబంలో తల్లిదండ్రులు, పెళ్ళయిన అన్న, వాళ్ళ కొడుకు, పెళ్ళికాని అన్న, ఇంకో బాబూలాల్ (పంకజ్ త్రిపాఠీ) అనే తుంటరి బంధువూ వుంటారు. వీళ్ళకో బట్టల షాపు వుంటుంది. ఈ బాబూలాల్ ఆడవాళ్ళ వెంటపడే రోమాంటిక్ అలవాటుతో వుంటాడు. ఇటు రేష్మీని ప్రేమిస్తున్న గుడ్డూ పెళ్ళికి పెళ్ళికాని అన్న అడ్డుగా వుంటాడు. మరోపక్క రేష్మీ అప్పుడే ప్రేమకి సిద్ధంగా వుండదు. మరికొంత కాలం అతణ్ణి తెలుసుకోవాలనుకుంటుంది. ఇందుకు ఎల్ ఆర్ ప్రపోజ్ చేస్తుంది. గుడ్డూ షాక్ తింటాడు. తప్పదంటుంది. ఉన్న వూళ్ళో అందరికీ తెలిసేలా ఎల్ ఆర్ కి భయపడతాడు. అబ్బాస్ ఒక ఐడియా చెప్తాడు. దూరంగా గ్వాలియర్ లో ఎసైన్ మెంట్ పెట్టుకుని ముగ్గురూ వెళ్తే, అక్కడ వాళ్ళిద్దరూ 20 రోజులు ఎల్ ఆర్ చేసుకో వచ్చంటాడు.

        అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు.


            అలా గ్వాలియర్ లో ఎల్ ఆర్ పెడ్తారు. వీళ్ళ మీద అదే భవనంలో వుండే మిసెస్ శ్రీవాస్తవ్ అనే ఆవిడ కన్నేసి వుంటుంది. వీళ్ళకి పెళ్లి కాలేదని పసిగట్టి అందర్నీ పిలుచుకు వచ్చి పట్టిస్తుంది. ఇలాటిదేదో జరుగుతుందని ముందే వూహించిన అబ్బాస్ ఐడియాతో, తమ నకిలీ పెళ్లి ఫోటో ఒకటి గోడకి పెట్టేస్తారు గుడ్డూ రేష్మీలు. ఈ పెళ్లి ఫోటో చూసి నమ్మేసి అందరూ మిసెస్ శ్రీవాస్తవ్ ని తిట్టేసి వెళ్ళిపోతారు. 

        ఇక ఈ ఎల్ ఆర్ లో గుడ్డూ పెళ్ళికి తగిన వాడేనని సర్టిఫై చేస్తుంది రేష్మీ. ఇంతలో గ్వాలియర్ కొచ్చి, ఒక పెళ్ళయినావిడతో రోమాంటిక్ ఎపిసోడ్ వెలగబెడుతున్న బాబూలాల్ కంట పడిపోతారు గుడ్డూ రేష్మీలు. ఇక అతను కడుపులో దాచుకోలేక గుడ్డూ కుటుంబం మొత్తాన్నీ తీసుకొచ్చి చూపించేస్తాడు సీను. ఆ పెళ్లి ఫోటో చూసి గుడ్డూ కుటుంబం వీళ్ళకి పెళ్ళయిందనే నమ్ముతారు. కాకపోతే లేచిపోయి దొంగ పెళ్లి చేసుకుని పరువు తీసినందుకు తిడతారు. వెళ్లి రేష్మీ తండ్రికి విన్నవించుకుంటారు. అతను షాక్ తింటాడు. కూతురే ఇలా చేస్తే రేపు ఎన్నికల్లో ఏం పోరాడతానని తల పట్టుకుంటాడు. ఖర్మ అనుకుని పెళ్లి రిసెప్షన్ కి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్ళికాని గుడ్డూ రేష్మీలు పెద్దల ముందు ఇంకోసారి పెళ్లి చేసుకుని రిసెప్షన్ పెట్టుకుంటామంటారు. వీల్లేదంటాడు. 

         ఇలా పెళ్లి కాలేదని నమ్మించలేని తాము పెళ్ళయిన జంటలాగా కాపురం పెట్టా ల్సివస్తుంది గుడ్డూ వాళ్ళింట్లో. ఇది మనసొప్పక రహస్యంగా నైనా పెళ్లి చేసుకుందామని పట్టుబడుతుంది రేష్మీ. ఇలా వీళ్ళ  రహస్య పెళ్లి ప్రయత్నాలు కూడా ఎలా విఫలమవుతూ  హాస్య ప్రహసనాలు సృష్టించాయన్నది మిగతా సెకండాఫ్ కథ.

జానర్ మర్యాదలు
      ముందుగా చెప్పుకోవాల్సిందేమిటంటే బ్యాక్ డ్రాప్. నగర బ్యాక్ డ్రాప్ లో కథని టౌన్ బ్యాక్  డ్రాప్ లో చూపించడం. ఆ టౌను వాతావరణాన్నీ, అక్కడి ప్రజల తీరు తెన్నుల్నీ, భాషనీ కథలో భాగం చేసి, ఆ టౌను కథా ప్రపంచాన్ని సృష్టించడం. ఈ కథ ఈ టౌనుకి వర్తించే  కథా ప్రపంచం. ఇదే కథని ఇంకో టౌనులో తీస్తే ఆ టౌనుకి వర్తించే కథా ప్రపంచంగా మార్పు చేర్పులు చేసుకోక తప్పదు. ఒక కథ పట్టుకుని ఏ టౌను కైనా ఇదే నా కథ, ఇదే నా కథనం, ఇవే నా పాత్రలు, ఇవే నా దృశ్యాలు, ఇవే నా డైలాగులూ  - ఎంతో కష్టపడి నా నా ముద్దొచ్చే స్క్రిప్టు నేను రాసుకున్నాను, మార్చమంటే మార్చనుగాక మార్చను - అని గుండుగుత్త బేరం పెట్టుకుంటే ఈ జానర్ జోలికి రానవసరం లేదు. 


       ఈ కథ ఎల్ ఆర్ కాన్సెప్ట్ తో తీశారు. ఒక్కో టౌనులో దీని పట్ల ఒక్కో రియాక్షన్ ప్రజల నుంచి వుండొచ్చు. కనుక ఒక టౌనుని దృష్టిలో పెట్టుకుని ఇలాటి కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు, ఆ టౌను ప్రజల రియాక్షనేమిటో వెళ్లి అడిగి తెలుసుకోవాలి. ఆ రియాక్షన్స్ ని కథలో భాగం చేయాలి. 

        మాది వరంగల్, లేదా విజయవాడ- మాకు తెలిసిన వరంగల్ లేదా విజయవాడలో మేం బాగా తీసుకోగలమనుకుంటే తీసేది కథతో వుండక,  పనిగట్టుకుని అక్కడి చారిత్రక, పర్యాటక, తీర్థ స్థలాల ప్రదర్శన చేసే ప్రమాదముంది. తెలియని టౌన్లో తీస్తే దర్శకుడు కథతో వుంటాడు.  ఈ జానర్లో హిందీలో తీస్తున్న ఇలాటి టౌన్లు దర్శకులకి పరాయి ప్రాంతాలే. ‘లుకా ఛుప్పీ’ తీసిన మథురలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కటీ చూపించలేదు.   
    
రెండోది, తారాగణం కూర్పు
        ఈ జానర్లో తీస్తున్న హిందీ సినిమాల్లో పెద్ద స్టార్స్ వుండరు. పెద్ద విలన్లు, పెద్ద కమెడియన్లు, పెద్ద సహాయ నటులూ వుండరు. బాలీవుడ్ బిగ్ బడ్జెట్స్ తో పోలిస్తే ఇవి చాలా స్మాల్ బడ్జెట్ కామెడీలు. ఇలాటి వాటిలో నటిస్తూ గుర్తింపూ, ప్రేక్షకుల అభిమానమూ పొందుతున్న స్మాల్ నటీ నటులే ఈ జానర్ ని పెంచి పోషించుకుంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావ్, కార్తీక్ ఆర్యన్, అపరా శక్తి ఖురానా, అభినవ్ శుక్లా వంటి హీరోలు, కృతీ సానన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ వంటి హీరోయిన్లు, పంకజ్ త్రిపాఠీ, పియూష్ మిశ్రా వంటి కమెడియన్లు, వినయ్ పాఠక్, సీమా పహ్వా వంటి సహాయ నటులూ ఈ స్మాల్ మూవీస్ స్టార్లుగా తమదైన వినోదాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఈ సినిమాలు బాగా పాపులర్ అవడానికి వీటికి పరిమితమై పాపులర్ అవుతున్న ఈ నటులే కారణం. వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఈ స్మాల్ మూవీస్ కి క్యూలు కడుతున్నారు ప్రేక్షకులు. 


        తెలుగులో ఈ పరిస్థితి, ఈ మార్కెట్ యాస్పెక్ట్ ఆలోచన, పరిశీలన, పరిజ్ఞానం  లేవు. ఇదంతా వదిలేసి ఇక సినిమాలకి భవిష్యత్తే లేదనీ, ఓటీటీయే టీకా మందు అనీ అటువైపు క్యూలు కట్టడం. స్మాల్ మూవీస్ తో పాపులరై స్మాల్ మూవీస్ కి ప్రేక్షకుల్ని ఆకర్షించే స్మాల్ హీరోహీరోయిన్లు గానీ, కమెడియన్లు గానీ, సహాయ నటులుగానీ తెలుగుకి లేకుండా చేశారు మొత్తానికి. అలా పెంచి పోషించుకోలేదు.  సినిమాకొక కొత్త హీరో, సినిమాకొక కొత్త హీరోయిన్ కావాలి. ఆ తర్వాత వాళ్ళేమైపోతారో తెలీదు. సినిమాకొక కొత్త బ్యాచి ఎవరూ ప్రేక్షకులకి తెలియడం లేదు. ఆ సినిమాలూ దృష్టిలో పడ్డం లేదు.        

       ఒకప్పుడు స్మాల్ మూవీస్ హీరోయిన్ గా గజలా వుంటూ ఆకర్షించేది. ఒక స్మాల్ మూవీ లో ఆకర్షించిన హీరోయిన్ ని మరో దర్శకుడు తీసుకోవడం లేదు. తనూ ముక్కూ మొహం తెలీని ఓ కొత్త హీరోయిన్నే తెచ్చుకుని ప్రేక్షకుల మీద రుద్ద బోతాడు. ప్రేక్షకులకి చీమ కుట్టి నట్టుండదు. వాళ్ళు మొహం తిప్పుకుని ఎటో చూస్తారు. ఆ కొత్త హీరోయిను ఎటో వెళ్ళిపోతుంది. ఏ కొత్త హీరోయినుకీ రెండో సినిమా నొసట రాసి పెట్టి వుండదు. చాలా బ్యాడ్ మార్కెటింగ్ సాంప్రదాయంతో వున్నారు తెలుగు స్మాల్ మేకర్లు. హిందీలో ఇలా లేదు. ఒక స్మాల్ మూవీలో ఆకర్షించిన కృతీ సాసన్, నుస్రత్ బరూచా, భూమీ పట్నేకర్ లని ఇతర స్మాల్ దర్శకులు తమ స్మాల్ మూవీస్ కి తీసుకుంటూ, అలాగే పైన చెప్పుకున్న లాంటి హీరోలనీ, కమెడియన్లనీ, క్యారక్టర్ ఆర్టిస్టులనీ తీసుకుంటూ, స్మాల్ మూవీస్ మార్కెట్ కంటూ ఒక స్మాల్ స్టార్ డమ్ ని సృష్టించుకున్నారు. ఇక ఈ సినిమాలకి గిరాకీయే గిరాకీ. వంద కోట్లకి పైనే వసూళ్లు. 

        ‘లుకా ఛుప్పీ’ లో కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో కన్పించే ఆర్టిస్టు లెవరూ లేరు. వుంటే జానర్ మర్యాద దెబ్బతింటుంది. తెలుగులో ఈ జానర్ ని ప్రయత్నించాలనుకుంటే ఈ క్యాస్టింగ్ నిగ్రహం పాటించాల్సిందే. ఒకటొకటిగా స్మాల్ మూవీ స్టార్ క్యాస్ట్ తో స్టార్ డమ్ ని సృష్టించాల్సిందే. రెగ్యులర్ సినిమాల తారాగణాన్ని పక్కన బెట్టాల్సిందే. వాళ్ళేం నష్టపోరు. 

       క్రియేటివ్ యాస్పెక్ట్ లో -
        కాన్సెప్ట్ బోల్డ్ అయినా ఇది రోమాంటిక్ కామెడీ. అందువల్ల హీరో హీరోయిన్లు విడిపోకుండా తమ బంధం కోసం కామిక్ పోరాటానికి తెరలేపారు. రోమాంటిక్ కామెడీ జానర్ మర్యాదల ప్రకారం అవి ఫస్టాఫ్ కామెడీగా, ఇంటర్వెల్లో ఇద్దర్నీ విడదీసి సెకండాఫ్ బాధాకర డ్రామాగా వుండవు. రోమాంటిక్ ప్రేమల్లో ప్రేమికులు ఏవో క్రేజీ పనులకి దిగుతారు, ఇరుక్కుంటారు, బయటపడేందుకు నానా కామిక్ ప్రయత్నాలూ చేస్తారు. ఈ జానర్ మర్యాదే ‘లుకా ఛుప్పీ’ లో వుంది. ఫస్టాఫ్ లో ఆమె ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేసే దగ్గర ప్లాట్ పాయింట్ వన్ వచ్చింది. సెకండాఫ్ లో సామూహిక వివాహాల ఘట్టంతో ప్లాట్ టూ ఏర్పడింది. ఆద్యంతం హాస్య ధోరణి బతికింది. అక్కడక్కడా పాత్రలు సీరియస్ అవుతాయి గానీ అది ధర్మాగ్రహమే. దీంతో కథ సీరియస్ అయిపోలేదు. 


        అలాగే హీరో హీరోయిన్ల పాత్రలు రెండూ యాక్టివ్ గానే వున్నాయి. రోమాంటిక్ కామెడీ అన్నాక ఉర్రూత లూగించాలి. అది హీరో ఒక్కడి వల్లే కాకూడదు, హీరోయిన్ ని నామమాత్రం చేయకూడదు. ఇక్కడ హీరో కాకుండా హీరోయిన్ కృతీ సానన్ ఎల్ ఆర్ ని ప్రపోజ్ చేయడం అతిపెద్ద యూత్ అప్పీలున్న క్రేజీ బీట్ అయింది. ఈ ప్లాట్ పాయింట్ వన్ న్యాయంగానే అరగంట సమయానికొస్తుంది. ఇక్కడ్నించే కాన్ఫ్లిక్ట్ మొదలయ్యింది. ఎల్ ఆర్ (సహజీవనం చేద్దాం) అనే పాయింటు తో ఈ కాన్ఫ్లిక్ట్ లో కావాల్సినంత యూత్ అప్పీల్ కూడా వచ్చేసింది. అలాగే పెళ్ళికాకుండా పెళ్ళైన వాళ్ళలా బతకలేక రహస్య పెళ్లి ప్రయత్నాలకి తెరలేపే ఇంటర్వెల్ మలుపులోనూ, ఆ తర్వాత సెకండాఫ్ సాంతం, యూత్ అప్పీల్ పరవళ్ళు తొక్కింది. ఐరనీ కామెడీని సృష్టిస్తుందని అంటాడు అరిస్టాటిల్. అరటి తొక్క మీద కాలేసి జారిపడ్డ వాడికి ఏడుపు, మనకి నవ్వు. అలాగే పెళ్లి లేకుండా కాపురం చేసి చూద్దామనుకుంటే, విరుద్ధంగా పెళ్ళయిన జంటలా కాపురం చేయాల్సి వస్తున్న డైనమిక్సే ఈ కథకి, కాన్ఫ్లిక్ట్ కి ఓ ఐరనీ సృష్టించాయి. 

        ఇంకో ప్రధాన డైనమిక్ ఏమిటంటే, ఎల్ ఆర్ మీద యుద్ధం ప్రకటించిన హీరోయిన్ తండ్రియే కూతురి ఎల్ ఆర్ తో కుక్కిన పేనయిపోవడం. అయితే అతడి నియోజక వర్గంలో యువ ఓటర్లు ఎక్కువ వున్నారనీ, అతను ఓడిపోతూ వుండాడానికి అతడి యూత్ వ్యతిరేక భావాలే కారణమనీ - హీరో అతడి కళ్ళు తెరిపించే ముగింపు బాగానే వుంది గానీ, మొత్తంగా చూస్తే ఈ కథ బలహీనమైనది. 

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ఎల్ ఆర్ ప్రపోజల్ తో ముక్కోణం ఏర్పడింది. కానీ ఆమె ప్రపోజల్ కి హీరో కంగారు పడతాడే గానీ, అసలు స్టార్ నజీం ఖాన్ ఎల్ ఆర్ స్టేట్ మెంట్ తో వూరుని గడగడ లాడించిన నాయకుడే ఆమె తండ్రి అనీ, ఆమె తోనే ఎల్ ఆర్ అంటే ఇక చావే గతి అనీ రిస్కు ఫ్యాక్టర్ ని ఎస్టాబ్లిష్  చేయకుండా పైపైన కథ చేసేశారు. ప్లాట్ పాయింట్ వన్ లో హీరోయిన్ ప్రపోజల్ తో హీరోయిన్ -హీరో- హీరోయిన్ తండ్రీ అన్న ముక్కోణం ఏర్పడింది. ఈ ముక్కోణంలో వుండాలి కథ. ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఎలిమెంట్స్ ని కలపకపోవడం వల్ల ఈ ఇబ్బంది. 

        అలాగే ఇరవై రోజుల ఎల్ ఆర్ లో కూడా డైనమిక్స్ లేవు. సహజీవనంలో అతను నచ్చితే, ఓకే అనుకుంటే అది కథెలా అవుతుంది? అతను నచ్చక తిరగబెడితే కథవుతుంది. నచ్చక దుకాణం కట్టేద్దామనుకునే లోపే గుట్టు బయటపడే పరిస్థితి వచ్చి, నచ్చని వాడు మొగుడుగా తగులుకున్న ఇరకాటంలో ఆమె పడితే -  బలహీన కథకి బలం చేకూరేది. కామిక్ కాన్ఫ్లిక్ట్ కి ఇంకో యాంగిల్ తోడయ్యేది.
 
సికిందర్