రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 22, 2020

946 : రైటర్స్ కార్నర్

థాబ్రహ్మ, స్క్రీన్ ప్లే గురువు రాబర్ట్ మెక్ కీ రెండు ప్రశ్నల కిచ్చిన సమధానాలు ఈవారం రైటర్స్ కార్నర్ లో...
కథ రాయాలనుకునే ముందు రచయిత వేసుకోవాల్సిన కఠిన ప్రశ్నలేమిటంటారు?
*రచయితకి ఊహాశక్తి కన్నా అంతర్దృష్టి కన్నా, నిర్దుష్టత కోసం ఎన్ని మార్లయినా తిరగ రాయగల పట్టుదల ముఖ్యం. టాలెంట్ లో పట్టుదల అనేది కూడా ముఖ్యమైన భాగం. ఈ పట్టుదల వుందా అన్నది ముఖ్య ప్రశ్న. ఈ పట్టుదల కలగాలంటే రాసే కథాంశం పట్ల ఉత్సాహం కలగాలి. ఒక కథాంశం తట్టగానే ఇది అంత ఉత్సాహాన్నిస్తోందా నాకూ అని ప్రశ్నించుకోవాలి. నా కాలాన్నీ శ్రమనూ కొన్ని మాసాలపాటు ధారపోసేంత అర్హత ఈ కథాంశానికుందా అన్న ప్రశ్న రావాలి. ఉదయం లేవగానే రాయాలన్న ఆకలితో రాయడానికి గడిపేంత బలమైన కథాంశమేనా ఇదీ అన్న ప్రశ్న ఎదురుకావాలి. కాదు అనే సమాధానాలొస్తే ఆ కథాంశాన్ని పక్కన పెట్టేయాలి. మరొక కథాంశం వెతుక్కోవాలి. టాలెంట్, టైము ఈ రెండే రచయిత పెట్టుబడి. వృత్తికి మేలు చేకూర్చని కథాంశాలతో ఎందుకు వీటిని వృధా చేసుకోవాలి.

సినిమా కథ నమ్మశక్యంగా వుండాలంటారా? సినిమా కథని నమ్మశక్యంగా చేసే అంశమేమిటంటారు?
*సినిమా కథ నమ్మశక్యంగా వుండాలి. ఆ కథాప్రపంచాన్ని ప్రేక్షకులు నమ్మాలి. ప్రేక్షకులు సినిమాటిక్ లిబర్టీని మన్నించే స్థాయి వరకూ కథ నమ్మశక్యంగా వుండాలి. సినిమాల్లో జరిగేవన్నీ నిజ జీవితంలో జరగవు. ప్రేక్షకులు నిజ జీవితాన్ని కాసేపు పక్కన బెట్టి వినోదించే మేరకూ సినిమాకళ సృజనాత్మక స్వేచ్ఛకి అనుమతి వుంటుంది.  ప్రేక్షకులు తమ వ్యక్తిగత ప్రపంచంలోంచి ఇవతలి కొచ్చి, కాసేపు కాల్పనిక ప్రపంచంలో విహరించడానికి అభ్యంతర పెట్టరు. ఇక కథని నమ్మశక్యంగా చేసే అంశమంటారా... కథకి సంతృప్తిపర్చే ఎఫెక్ట్స్ వుంటాయి : సస్పెన్స్ -సానుభూతి, కన్నీళ్లు- నవ్వులు, అర్ధాలు- భావోద్వేగాలు వంటివి ...ఇవన్నీ ‘అవును ఇంతే’ అన్పించేలా కథలో పాతుకుని వుంటాయి. ‘అవును ఇంతే’ అన్పించకపోతే ఆ కథ నమ్మకం కోల్పోతుంది. ప్రేక్షకులు ‘అవును ఇంతే’ అని ఫీలవకపోతే ఆ కథ విశ్వసనీయతని ప్రశ్నిస్తారు. కథలోంచి వెళ్ళిపోతారు. ఇలాటి ఒక సినిమాకి థియేటర్లో లోలోన మండి పడుతూ, బోరు భరిస్తూ కూర్చుంటే, ఇంకో సినిమాకి ఆ సినిమాని తిప్పికొట్టి, బయటికొచ్చి బ్యాడ్ టాక్ వ్యాప్తి చేస్తారు. దీంతో ఆ రచయిత లేదా దర్శకుడి కెరీర్ డ్యామేజీ అవుతుంది.   

        ఐతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. నమ్మశక్యమైనది అంటే వాస్తవికమైనది అని కాదు. అవాస్తవిక జానర్స్ వున్నాయి, ఫాంటసీ లాంటివి. సైన్స్ ఫిక్షన్, యానిమేషన్, మ్యూజికల్స్ వంటివి. ఇవి విశ్వంలో ఎక్కడా లేని కథాప్రపంచాలతో వుంటాయి. అయినా ది ప్రిన్సెస్ బ్రైడ్, ది మాట్రిక్స్, ఫైండింగ్ మెమో, సౌత్ పసిఫిక్ లాంటి అవాస్తవిక కథా ప్రపంచాలు హిట్టవుతాయి. ఇవెంత అవాస్తవికంగా వున్నా, అనుభూతులకివి లోతయిన ప్రాతిపదికతో వుంటాయి. కృత్రి మత్వంతో వుండే అవాంట్ గార్డ్, పోస్ట్ మోడర్నిజం సినిమాలూ ఇలా అవాస్తవికతని నమ్మశక్యం చేస్తాయి. ఇలాటి ప్రతీ కథా కథలో జరిగేవాటిని ఆ కథా లోకపు రూల్స్ నేర్పాటు చేసుకుని జరిపిస్తాయి -యాక్షన్ పరంగానూ, బిహేవియర్ పరంగానూ. ఈ కథా లోకపు రూల్స్ ని కాల్పనిక నియమాలానొచ్చు. కనుక రచయిత ఏ కథ రాసినా ఆ కథకుండే కాల్పనిక నియమాలతో ముందు నమ్మించాల్సి వుంటుంది. యాక్షన్ పరంగా, బిహేవియర్ పరంగా ఏర్పాటు చేసిన కాల్పనిక నియమాలకి భంగం కల్గించనంతవరకూ ‘అవును ఇంతే’ సర్టిఫికేట్ కి ఢోకా వుండదు. 

        కాబట్టి, నమ్మశక్యతకి ప్రధానం అంతర్గత ఏకీకృత నిలకడ తనం. వాస్తవికమైనా అవాస్తవికమైనా జానర్ ఏదైనా, ఆ కథా ప్రపంచం స్వయం ధృవీకరణతో వుండాలి. కథా ప్రపంచపు స్థల కాల సామాజిక వివరం ప్రేక్షకుల్ని నమ్మించే కాల్పనిక నియమాలతో వుంటే, ఆ కథలో జరిగే చర్యకి ప్రతిచర్య ప్రక్రియ ప్రేక్షకుల్ని తమవెంట తీసుకుపోతుంది.
***