రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జులై 2016, శనివారం

సాంకేతికం!

అళగర్ సామి 







        తెలుగులో నేటి మెగా బడ్జెట్ల  హై - ఎండ్ టెక్నాలజీ సినిమాల్లో ఏది గ్రాఫిక్స్, ఎంతవరకు కళాదర్శకుడి పరిధీ అన్నది తెలియనంతగా పాలూ నీళ్ళలా కలగలిసిపోయి,  ఈ రెండు విభాగాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఒకసారి మహేష్ బాబు నటించిన ‘అర్జున్’ లో మధుర మీనాక్షి దేవాలయ సముదాయం సెట్ నే చూడండి- అదంతా కళా దర్శకుడి అద్భుత ప్రతిసృష్టి లాగే అన్పిస్తుంది చూసే కళ్ళకి. కానీ అందులో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కళాదర్శకుడు వేసిన సెట్ అనీ, మిగతా పై అంతస్తులన్నీ గ్రాఫిక్స్ తో చేసిన కల్పనే అనీ తెలిస్తే భలే ఆశ్చర్య పోతారు! అదీ అళగర్ సామి ప్రతిభ. ‘దశావతారం’ లో కమలహాసన్ ని విగ్రహాకి కట్టి  జలసమాధి చేసే యాక్షన్ దృశ్యం కూడా అళగర్ సామి గ్రాఫిక్  సృష్టే. నిజానికక్కడ సముద్రమనేదే లేదు, అపరబ్రహ్మలా అళగర్ సామి సృష్టించిన గ్రాఫిక్స్ సముద్రమే తప్ప!

          ‘భిన్న ప్రాంతాలనుంచి విభిన్న సంస్కృతుల  నుంచీ యానిమేటర్లు ఈ రంగంలోకి వస్తున్నా కొద్దీ మనం అంతర్జాతీయ స్థాయిని మించిపోతాం!’ అని అంటారీయన గర్వంగా. అన్నట్టు హైదరాబాద్ ఐటీ కూడలి అన్నది పాత మాట.గ్రాఫిక్స్ కి కూడా జంక్షన్ అనేది తాజా మాట. అళగర్ సామి చెన్నై లోని స్టూడియో కేంద్రంగా పనిచేస్తున్నా, ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో వెన్ శాట్  టెక్ సర్వీసెస్ పేరుతో  సంస్థ ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ గా వుంటున్నారు.తెలుగులో అల్లు అర్జున్ నటించిన  ‘వరుడు’ కి గ్రాఫిక్స్ సమకూర్చారు. 2003 ఓ ‘ఒక్కడు’ నుంచీ గుణశేఖర్  సినిమాలకి సేవలందిస్తున్నారు.

నమ్మలేని నిజాలు
గ్రాఫిక్స్ కి ముందు   
      ‘వరుడు’ లో కీలక సన్నివేశాల వెనుక నమ్మలేని నిజాలున్నాయి. లైవ్ డెమో సాక్షిగా అది చూపించారు అళగర్ సామి. చూస్తే- మొదట బ్లూమ్యాట్ నేపధ్యంగా కళ్యాణ మండపం సెట్ తప్ప మరేమీ లేదు. దాని చుట్టూ అందమైన పూదోట గానీ, పైన సూర్యోదయపు సువిశాలాకాశం గానీ లేవు. కథ ప్రకారం ఉదయం ఏడున్నరకి పెళ్లి ముహూర్తం. ఆ సన్నివేశాల చిత్రీకరణకి కొన్ని రోజులైనా పట్టొచ్చు. అన్ని రోజులూ అదే ప్రాతఃకాలపు టెంపరేచర్ టోన్ నీ, మేఘాల ఆవరణాన్నీ, చుట్టూ పూల మొక్కల తాజా దనాన్నీ, యధాతధ స్థితిలో వుంచేందుకు ఏం చేయాలన్న సమస్యతో దర్శకుడు గుణశేఖర్ వస్తే, అళగర్ సామి ఇచ్చిన ప్లానే  ఈ లైవ్ డెమోలో ఇప్పుడు చూపిస్తున్న తర్వాతి షాట్లు. ఇప్పడు బ్లూమ్యాట్ కట్ అయిపోయింది. మండపం చుట్టూ ముగ్ధ మనోహర పూదోటా, పైన ఉదయకాలపు బంగారు వన్నెతో మెరిసిపోయే గగనతలమూ, అంతా అళగర్ సామి మాయాజాలం! మళ్ళీ ఇది చాలనట్టూ - పిల్ల వాయువులు వీస్తున్నట్టూ, దాంతో నాజూకైన పూల రేకలు అటూ ఇటూ కదులుతున్నట్టూ అదనపు ఎఫెక్ట్! సినిమాలో తర్వాత మొత్తం మండపం కూలిపోయే సీను కూడా గ్రాఫిక్సేనని చెప్పారు.

గ్రాఫిక్స్ తర్వాత 

    క్లయిమాక్స్  సీన్లో 120 అడుగుల ఎత్తుగల పొగ గొట్టం మీద అల్లు అర్జున్ - విలన్ ఆర్యల మధ్య పోరాట దృశ్యాలు ఇంకా వేరే గ్రాఫిక్స్ కళ. ఇందుకు  రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారు. 20 అడుగుల ఎత్తులో నిర్మించిన బావి లాంటి సెట్ మీద అర్జున్ - ఆర్య లు కలబడతారు. దీన్ని కూడా బ్లూమ్యాట్ బ్యాక్ డ్రాప్ లోనే షూట్ చేశారు. ఇలా గ్రాఫిక్స్ కోసం సృష్టించే ఏదైనా సెట్ ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. ఇలాటి ఈ ‘బావి’ అనే రిఫరెన్స్ పాయింటుని  ఆధారంగా చేసుకుని  గ్రాఫిక్స్ తో 120 అడుగుల ఎత్తున్నట్టు పొగ గొట్టాన్ని సృష్టించి, దాని మీద 20 అడుగుల బావి సెట్ మీద చిత్రీకరించిన అర్జున్- ఆర్యల పోరాటాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఇంకా ఆ పోరాటం ధాటికి పొగ గొట్టం పెచ్చు లూడుతున్నట్టు అదనపు ఎఫెక్ట్ కల్పించారు. 


        ఈ క్లయిమాక్స్ దృశ్యం ‘ఎక్స్ మెన్ వోల్వోరిస్’ అనే హాలీవుడ్ మూవీ లోనిది కదా అంటే, ఒప్పుకున్నారు అళగర్ సామి. ‘ఈ సినిమాలో మనం చూస్తే హీరో - విలన్ లిద్దరికీ అతీంద్రయ శక్తులుంటాయి. అందువల్ల అంత ఎత్తులో వాళ్ళ పొగ గొట్టం ఫైట్ కి విశ్వసనీయత చేకూరింద
నుకోవచ్చు. అదే అల్లు అర్జున్ కి ఇక్కడ ఈ ఫైట్ లో అలాటి మానవాతీత శక్తులు లేవు. సైకో కాబట్టి ఆర్యకి వున్నాయన్న భ్రమ కల్గించారు. ఇందువల్లే ఈ క్లయిమాక్స్ ని ప్రేక్షకులు ఎంజాయ చేయలేక పోయారేమో?’ అంటే, ఇదీ ఒప్పుకున్నారు అళగర్ సామి.

        ‘దేశంలో బాలీవుడ్ తర్వాత ధైర్యమున్న పరిశ్రమ టాలీవుడ్డే’  అని కుండబద్దలు  కొట్టారు. తమిళంలో 10 సినిమాలు నిర్మిస్తే అందులో బిగ్ బడ్జెట్స్ రెండో మూడో వుంటాయనీ, అదే తెలుగులో అయిదారు వుంటున్నాయనీ అభిప్రాయపడ్డారు.  తెలుగులో గుణశేఖర్ సినిమాలతో బాటు ‘స్టాలిన్’, ‘శ్రీ రామదాసు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘అతిధి’, ‘సైనికుడు’, ‘దేశముదురు’, ‘వర్షం’, ‘అరుంధతి’, ‘కిక్’, ‘కొమరం పులి’  మొదలైన సినిమాలకి గ్రాఫిక్స్ సమకూర్చారు. 

       ఇంతకీ గ్రాఫిక్స్ లో కెలా వచ్చారంటే, 1994 లో ‘జురాసిక్ పార్క్’ చూసి ఎక్సైట్ అయి యానిమేషన్ కోర్సులో చేరిపోయానన్నారు. అది పెంటా మీడియా సంస్థలో ప్రవేశం కల్పించిందనీ, అక్కడ వార్నర్ బ్రదర్స్, పండోరా ఫిలిమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలకి  లెక్కలేనన్ని యానిమేషన్ చిత్రాలు రూపొందించాననీ వివరించారు.  ‘పాండవాస్’ అనే ఇంకో  యానిమేషన్ కి అవార్డు వచ్చిందనీ, ఆ తర్వాత 1998 లో శంకర్ తీసిన ‘జీన్స్’ తో సినిమారంగ ప్రవేశం చేశాననీ చెప్పుకొచ్చారు ఫ్రెండ్లీ గా వుండే అళగర్ సామి.

         అక్కడ్నించీ ‘రోబో’ వరకూ శంకర్ తీసిన సినిమాలన్నిటికీ పని చేశానన్నారు. హిందీతో కలుపుకుని అన్ని భాషల్లో 250 సినిమాల వరకూ గ్రాఫిక్స్ చేశానన్నారు. వీటిలో 95 వరకూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా చేసిన సినిమాలున్నాయనీ , ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఎంబీఏ కూడా పూర్తి చేశాననీ,  తన  స్వస్థలం మధురై సమీపంలోని చిన్న గ్రామమనీ చెప్పారు. 

        సరే, మళ్ళీ మొదటి కొస్తే- ఇలా కళాదర్శకత్వం - గ్రాఫిక్స్ రెండూ కలగలిసి
పోయినప్పుడు, స్థూలదృష్టికి ఆ క్రెడిట్ కళాదర్శకుడికే పోతుంది, అలాగే యాక్షన్ దృశ్యాల క్రెడిట్ యాక్షన్ డైరెక్టర్లకి పోతుంది. మరి గ్రాఫిక్స్ నిపుణుల స్థాన మెక్కడ? వాళ్ళు అస్తిత్వ బాధితులుగా ఇలా మిగిలిపోవాల్సిందేనా?’ అని అడిగితే,  ఇది ఆయన ఎదురు చూడని ప్రశ్న అయింది...ఈ పాయింట్ తన కెప్పుడూ తట్టనే లేదట! 

        ఇక్కడే వున్నమార్కెటింగ్ చీఫ్ సుఖ్విందర్ సింగ్ అయితే కాసేపటి వరకూ తేరు కోలేకపోయారు. ఇక్కడే వున్న సీనియర్ మేనేజర్ కొండల రెడ్డి- ‘మేమెంత వర్క్ చేశామో, ఆర్ట్ డైరెక్టర్లు, యాక్షన్ డైరెక్టర్లూ ఎంత చేశారో లోలోపల మాకు తెలుస్తుంది’ అని ఏదో సర్ది చెప్పుకోబోయారు. 

        ఈలోగా సుఖ్విందర్ సింగ్ తేరుకుని- ‘మా ప్రొఫెషన్ లో ఈ ప్రశ్న మాకే తట్టలేదు, ఇంతవరకూ ఇలాటి ప్రశ్న ఇంకెవరూ ఎవరూ వేయలేదు’ అని  చెంపలు రుద్దుకున్నారు. అయితే తెలుగు మీడియాలో మొట్ట మొదటి సారిగా ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తమ  ఉనికి గురించి బయటి ప్రపంచానికి ఇలా తెలుస్తోంది గనుక ఇక నిశ్చింతగా  వుంటామన్నారు.


-సికిందర్
(సెప్టెంబర్ 2010, ఆంధ్రజ్యోతి- ‘సినిమా టెక్’ శీర్షిక’)