రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 14, 2022

1131 : రివ్యూ!


 

దర్శకత్వం: విమల్‌ కృష్ణ
తారాగణం : : సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, ఫిష్ వెంకట్ తదితరులు
రచన: విమల్‌ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం : సాయిప్రకాష్
బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ
విడుదల :  12 ఫిబ్రవరి 2022 
***

          సిద్ధు జొన్నలగడ్డ  2009 నుంచీ సినిమాల్లో నటిస్తున్నా, 2016 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ తో వెలుగులో కొచ్చాడు. 2020 లో కృష్ణ అండ్ హిజ్ లీలా తో మరోసారి ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఇప్పుడు డీజే టిల్లు తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. 2018 లో మహెబూబా లో హీరోయిన్ గా పరిచయమైన నేహాశెట్టి, తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటించి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పక్కన డీజే టిల్లు లో కన్పిస్తోంది. దీంతో విమల్ కృష్ణ కొత్త దర్శకుడుగా పరిచయమయ్యాడు. పెద్ద బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణం చేపట్టింది. సితార వారి ఈ ప్రతిష్టాత్మక సినిమా ఎలావుందో ఇక చూద్దాం...

కథ
బాలగంగాధర తిలక్ అలియాస్ టిల్లు (జొన్నల‌గ‌డ్డ‌) హైదరాబాద్ లో డీజే (డిస్క్ జాకీ) గా వుంటాడు. తల్లిదండ్రులతో వుంటాడు. డీజే గెటప్ లో అతిగానే కాస్ట్యూమ్స్ వేసుకుని తిరుగుతాడు. హైదరాబాదీ తెలుగు మాట్లాడతాడు. కేర్లెస్ గా బిహీవ్ చేస్తాడు. టార్గెట్ ఆడియెన్స్ కి అతను మిక్స్ చేసే సాంగ్స్ కలెక్షన్స్ కి పెళ్ళిళ్ళలో బాగా గిరాకీ వుంటుంది. అతడికో కల వుంటుంది. ఎలాగైనా షార్ట్ కట్స్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలని.

        ఇలావుండగా  రాధిక (నేహాశెట్టి) అనే ఓ సింగర్ ని చూసి వెంటపడతాడు. ఆమెకో బాయ్ ఫ్రెండ్ వుంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతూంటాడు. ఇది చూసి ఆమె టిల్లు తో తిరగడం మొదలెడుతుంది టిట్ ఫర్ టాట్ గా. ఒకరోజు బాయ్ ఫ్రెండ్ ఆమెతో గొడవ పడి,  ప్రమాదవశాత్తూ ఆమె చేతిలో చచ్చి పోతాడు. ఈ హత్యలో టిల్లు కూడా ఇరుక్కునే పరిస్థితి వుండడంతో ఆమెకి సాయపడి శవాన్ని మాయం చేస్తాడు. ఇది కనిపెట్టి ఓ బ్లాక్ మెయిలర్ (నర్రా శ్రీనివాస్), పోలీసులూ (బ్రహ్మాజీ, ఫిష్ వెంకట్) టిల్లూ రాధికల వెంటపడతారు. ఇక వీళ్ళని తప్పించుకోవడానికి టిల్లు ఏం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

హాలీవుడ్ లో చిక్ ఫ్లిక్ లేదా చిక్ లిట్ అనే కొత్త జానర్ సినిమాలొస్తూంటాయి. జెన్ జెడ్ (జెడ్ జనరేషన్) లైటర్ వీన్ ఫన్ రోమాన్సులు, రోమాంటిక్ థిల్లర్స్ వీటిలో వుంటాయి. ఇవి వాలంటైన్స్ డే కి విడుదలవుతూంటాయి. ఇవి ఆదునిక జెన్ జెడ్ హీరోయిన్ పాత్రలతో అమ్మాయిల్ని ఎక్కువ ఆకర్షించే జానర్ మర్యాదలతో వుంటాయి. యూత్ సినిమాల పేరుతో మనం తీస్తున్న సినిమాలకి యువ ఫ్రేక్షకుల్లో యువకులే తప్ప యువతులుండరు. పేరుకే యూత్ సినిమాలు, చూసేదీ మగ యువజాతే.

        స్టయిలిష్ గా తీసిన డీజే టిల్లు (హీరోకి పెట్టిన బాలగంగాధర తిలక్ పేరులో, తిలక్ కి టిల్లు అని నిక్ నేమ్ పెట్టారు. హిందీలో టిల్లు అంటే పొట్టోడు అని అర్ధం) లో హీరోయిన్ క్యారక్టర్ కూడా ప్రధానమైనదే. సినిమా ఆట్మాస్ఫియర్ పరంగా చిక్ లిట్ కి సరిపోయే మేకింగ్ తో వుంది. ఇందులో హీరోకే క్యారక్టర్ తప్ప, హీరోయిన్ క్యారక్టర్ తో బాటు కథ లేకుండా పోయింది. ఫలితంగా ఇంటర్వెల్ కి చాలించుకున్న పొట్టి సినిమా అయింది. కేవలం హీరో క్యారక్టర్ ప్రదర్శించే మేల్ ఇగోయిజపు టక్కుటమారాలే, అది పుట్టించే నవ్వులే సినిమా అన్నట్టుగా తయారయ్యింది. ఈ టక్కుటమారాలూ నవ్వులతో కూడిన మేల్ ఇగోయిజం కూడా ఫస్టాఫ్ వరకే. ఇంత ఏకఛత్రాధిపత్య మేల్ ఇగోయిజమూ  సెకండాఫ్ ని కాపాడలేకపోయింది. సెకండాఫ్ కథ ఎటు పోయిందో, హీరో క్యారక్టర్ ఏం చేస్తోందో అర్ధం పర్ధం లేకుండా పోయింది. ప్రేక్షకులు అల్పసంతోషులు. ఇదే చాలన్నట్టు బ్రహ్మరధం పడుతున్నట్టు వార్తలు. ఆల్ ది బెస్ట్.

నటనలు- సాంకేతికాలు  

జొన్నలగడ్డ కోసం తీసిన సినిమా ఇది. కాబట్టి తన ఫంకీ క్యారక్టర్ వరకూ తీసుకుని- చూసుకుని- నటించాడు. స్వాంకీ గెటప్, హైదరాబాదీ తెలుగు, హౌలే గాడి ప్రవర్తన, లింగో, తెలివి తేటలు, డైలాగ్ కామెడీ... వీటిని సాధనాలుగా పెట్టుకుని ప్రేక్షకుల్ని తెగ నవ్వించాడు. అటు ఇస్మార్ట్ శంకర్ క్యారక్టర్ని తీసుకుని, ఇటు జాతి రత్నాలు కామెడీ చేసినట్టు. సినిమాలో ఏదెలా వున్నా కొత్తగా నవ్విస్తే చాలన్న ప్రేక్షకుల నాడీ పట్టుకుని దాంతో ఆడుకున్నాడు. అయితే జాతిరత్నాలు కామెడీకి నేటివిటీ వుంది.

        హీరోయిన్ నేహాశెట్టి క్యారక్టర్ జొన్నలగడ్డకి పోటీ రాకుండా చూసుకున్నారు. లేకపోతే చిక్ లిట్ కాకపోయినా కనీసం రోమాంటిక్ కామెడీ జానర్ కైనా న్యాయం చేస్తూ, నువ్వెంతంటే నువ్వెంతనే కౌంటరిచ్చే, పోటీనిచ్చే  సరైన క్యారక్టరైజేషన్ తో యాక్టివ్ పాత్రగా వుండేది. రోమాంటిక్ డ్రామా జానర్లో లాగా శాడ్ గా పాసివ్ గా వుండిపోయింది. ఇంతకంటే నేహా గురించి చెప్పుకోవడానికి లేదు.

        ఇక మిగిలిన క్యారక్టర్స్ లో ప్రిన్స్ తప్ప, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జడ్జిగా ప్రగతి కామెడీ పాత్రలేశారు. తమన్ నేపథ్య సంగీతం స్టయిలిష్ మూవీకి తగ్గట్టు లేదు, రొటీన్ కామెడీ సినిమాల్లో వినిపించే ఇన్ స్టృమెంట్సే వాడేశారు చిడతలు వాయిస్తున్నట్టు. మళ్ళీ పాటలకి వేరు. ఇక కెమెరా వర్క్, డీఐ అతి రంగులతో లౌడ్ గా వున్నాయి. కొత్త దర్శకుడి దర్శకత్వం లేని కథకి ఎలా వుంటుందో అలావుంది. జొన్నలగడ్డ స్వయంగా రాసుకున్న డైలాగులు హైలైట్ అని టాక్.

చివరికేమిటి
డీజేగా వున్న టిల్లు సింగర్ రాధికని చూసి ప్రేమలో పడ్డం, ఆమెతో హత్యలో ఇరుక్కోవడం, బ్లాక్ మెయిలర్ ని, పోలీసుల్నీ ఎదుర్కోవడం ఫస్టాఫ్. ఇంతవరకూ సిట్యుయేషన్స్, సిట్ కామ్, జొన్నలగడ్డ వన్ మాన్ షోగా బాగానే వున్నాయి. లాజిక్, అర్ధం పర్ధం ఏమీ చూడకూడదు. జొన్నలగడ్డ గిమ్మిక్స్ కి నవ్వుతూ వుండాలి. హీరోయిన్ అచేతనంగా వుండిపోతుంది- ఓకే- కానీ సెకండాఫ్ ఓపెన్ చేయగానే హీరోయిన్ తడాఖాతో కథ నడుపుకుని వుంటే కథ వుండేది. చిక్ లిట్ లో, రోమాంటిక్ కామెడీల్లో,  హీరో హీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులుగా వుంటారు. ఇక్కడ ప్రత్యర్ధి అయిన రాధిక క్యారక్టర్ని ఆమెకో హిడెన్ ఎజెండా కల్పించి యాక్టివేట్ చేసి వుంటే- హీరోకి కష్టాలూ తిప్పలూ పెరిగిపోయి క్యారక్టర్ నిలబడేది, కథ వుండేది. యువప్రేక్షకుల్లో భాగమైన యువతులు కూడా తరలివచ్చి హారతులు పట్టేవాళ్లు.

        కానీ సెకండాఫ్ ఓపెన్ చేస్తే కథేమీ లేదు సినిమాలో. అంటే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే, సినిమా, ఏదనుకుంటే అది. సెకండాఫ్ కథ ఎలా నడపాలో తెలియక- జొన్నలగడ్డ జ్ఞాపక శక్తిని కోల్పోయే  డ్రామా, కామెడీ, కోర్టు విచారణ డ్రామా, కామెడీ అనే రెండు అర్ధంపర్ధం లేని బ్లాకులు పెట్టుకుని సెకండాఫ్ ని నింపేశారు.  జొన్నలగడ్డ క్యారక్టర్ నడవడానికి బలవంతంగా కల్పించిన సిల్లీ సీన్లు ఇవి. ఆ మధ్య సినిమాల్లో సెకండాఫ్ లో బ్రహ్మానందం బకరా కామెడీ తప్పనిసరి టెంప్లెట్ అయినట్టు- ఆ టెంప్లెట్లు, పాత ఫార్ములా ట్రోప్స్ పెట్టుకుని- ఒక సోకాల్డ్ స్టయిలిష్ యూత్ మూవీ తీసేశారు. ఇక ముగింపయితే చెప్పకర్లేదు. చిక్ లిట్ సినిమాలు  ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వాలంటైన్స్ డే కి  విడుదలవుతూంటాయి. 'డీజే టిల్లు' కాకతాళీయంగానే వాలంటైన్స్ డే కి రెండ్రోజుల ముందు విడుదలైంది- బాయ్స్ కి తప్ప గర్ల్స్ కి చెందని   యూత్ సినిమాగా. 
        కానీ మూవీ హిట్, అంతే. దటీజ్ ది పాయింట్.

-సికిందర్

(అనివార్య కారణాల వల్ల రివ్యూలు
ఆలస్యమవుతున్నాయి
. వాట్సాపులు,
కాల్స్ చేయకుండా సహకరించగలరు)