రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జనవరి 2019, శనివారం

731 : రివ్యూ



దర్శకత్వం : క్రిష్, కంగనా రణౌత్
తారాగణం : కంగనా రణౌత్, అతుల్ కులకర్ణి, జిష్షూ సేన్ గుప్తా, డానీ డాంగ్జోపా, మహమ్మద్ జీషాన్ ఆయుబ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : విజయేంద్ర ప్రసాద్; మాటలు, పాటలు : ప్రసూన్ జోషి; సంగీతం : శంకర్ –ఎహెసాన్- లాయ్, ఛాయాగ్రహణం : కిరణ్ ధియోన్స్, జ్ఞాన శేఖర్
బ్యానర్ : కైరోస్ కంటెంట్ స్టూడియోస్
నిర్మాతలు : జీ స్టూడియోస్, కమల్ జైన్,  నిశాంత్ పిట్టి
విడుదల : జనవరి 25, 2019
***
       వారం వారం బయోపిక్కులు విడుదలవుతూ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇన్ని చూడలేక కొన్ని మిస్సవుతున్నారు. ఇన్నాళ్ళూ కాలక్షేప సినిమాలు చూస్తూ అరగంటలో రివ్యూలు రాసేసే రివ్యూ రైటర్లు, బయోపిక్ చూసినప్పుడల్లా రివ్యూ రాయాలంటే చరిత్ర పుస్తకాలూ తిరగేయాల్సిన మోతబరువు మీద పడింది. ఎవరెవరి చరిత్రలు, ఎన్నెన్ని చరిత్రలు. ఇప్పుడు ‘మణికర్ణిక’ మరో చరిత్ర. ఈ చరిత్రలేవీ చరిత్ర లిఖించడం లేదు. ఒక కొత్త వ్యాపార వస్తువుగా సొమ్ముచేసుకునే స్వకార్యం తప్ప, స్వామి కార్యం కన్పించడం లేదు. ఈ తాజా బయోపిక్ కూడా ఇలాగే వుందా? ఇది తెల్సుకుందాం...

కథ 
      బాల్యంలోనే తల్లిని కోల్పోయిన మణికర్ణిక (కంగనా రణౌత్), తండ్రి పెంపకంలో  పోరాట విద్యల్లో ఆరితేరుతుంది. ఝాన్సీ సంస్థాన రాజగురువు ఆమె విద్యల్ని గమనించి కోడలిగా తెచ్చుకోవాలని రాజు తండ్రికి సలహా చెప్తాడు. ఆమె క్షత్రియ కాదని రాజు తండ్రి సంశయిస్తే, ఆమె బ్రాహ్మణ యువతి అయినప్పటికీ, పోరాట విద్యల్లో ఆరితేరిన ఆమె ఝాన్సీ రాజ్యానికి అవసరమని రాజగురువు నచ్చ జెప్తాడు. అలా ఝాన్సీ రాజుకి భార్యగా వస్తుంది మణికర్ణిక. ఆమె పేరుని లక్ష్మీబాయిగా మారుస్తారు. పుత్రుడ్ని ప్రసవిస్తుంది. ఆ పుత్రుడు నాలుగు నెలల్లో మరణిస్తాడు. రాజు మరొక పుత్రుడ్ని దత్తత తీసుకుని మరణిస్తాడు. రాజ్య భారం లక్ష్మీబాయి మీద పడుతుంది. అయితే ఇప్పటికే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దొరలు రాజ్యం మీద పెత్తనం చేస్తూంటారు. వాళ్ళు లక్ష్మీబాయి దత్తపుత్రుడ్ని వారసుడిగా ప్రకటించడానికి ఒప్పుకోరు. ఆమెని రాజ్యం విడిచి వెళ్లి పొమ్మని ఆదేశిస్తారు. రాజభవనం స్వాధీనం చేసుకుని వెళ్ళగొట్టేస్తారు. ఇక సామాన్య జనంలోంచే వచ్చిన లక్ష్మీబాయి, ఆ సామాన్య జనంతో కలిసి కంపెనీ సైన్యాల మీద ఎలా తిరగబడిందీ, తర్వాత 1857 లో మొదటి స్వాతంత్ర్య సమరం సిపాయిల తిరుగుబాటులో ఎలాటి ప్రముఖ పాత్ర పోషించి ప్రాణత్యాగం చేసిందనేదీ మిగతా కథ. 

ఎలావుంది కథ
       వీరవనిత ఝాన్సీ లక్ష్మిబాయి (1828 -58) బయోపిక్ ఇది. బయోపిక్ ని తప్పులో కాలేస్తూ డాక్యుమెంటరీయో, డైరీయో, ఉపోద్ఘాతమో చేయకుండా రక్షించి, సినిమా కథగా బాక్సాఫీసుకి పనికొచ్చేలా చేశారు. సినిమా కథగా పనికొచ్చే కథనమే ఆమె జీవితం. కథ, స్క్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. మొదటి దర్శకుడు క్రిష్, తర్వాతి దర్శకురాలు కంగన స్క్రీన్ ప్లే విషయంలో భాగస్వాములై వుంటారు. ఫైనల్ గా తెరమీద తేలిన స్క్రీన్ ప్లే మాత్రం బలహీనంగా వుంది. లక్ష్మీబాయి రెండిటికి ప్రసిద్ధురాలు : ఆమెకి మాతృభూమి అన్నా, పోరాటతంత్రమన్నా పంచప్రాణాలు. వీటి మీద ఫోకస్ చేసి కథ నడిపివుంటే,  క్యారెక్టర్ గా ఆమె భావోద్వేగం (మాతృభూమి) ఎమోషనల్ యాక్షన్ గానూ, ఆమె లక్ష్యం (పోరాటతంత్రం) ఫిజికల్ యాక్షన్ గానూ కన్పిస్తూ, అలాటి గొలుసుకట్టు దృశ్యాలతో  కథనం ఏకత్రాటిపై వుంటూ కట్టిపడేసేది. పాత్ర చిత్రణ సంబంధమైన ఈ రెండిటినీ పక్కన బెట్టి కథ నడపడం వల్ల ఆసక్తి కల్గించని ఏదో కథయితే నడించింది,  చివరి దృశ్యాల్లో ఆ భావోద్వేగం, పోరాటతంత్రం ఉన్నట్టుండి తెచ్చి ఎంత కలిపినా కృతకంగానే మిగిలాయి.  పక్క పాత్రలతో ఆమెని ఎంత కీర్తించినా అదీ కనెక్ట్ కాలేదు. 

ఎవరెలా చేశారు 
         కంగనా రణౌత్ పాత్ర, కథ ఎలా వున్నా, ఇంత భారీ  సినిమా మొత్తాన్నీ తానొక్కదాన్నీ భుజాల మీద మోసెయ్యగలనన్న ఆత్మనిశ్వాసం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇందులో పూర్తి విజయం సాధించింది కూడా. ఐతే ఈ ఆత్మ విశ్వాసమే పాత్రని డామినేట్ చేసేలా తయారైంది. ఎందుకని ప్రతీ సీనులో లక్ష్మీబాయి కన్పించక, కంగనానే కన్పిస్తోందని ఆలోచిస్తే కారణం ఇదీ. ఇంకో వైపున ఇండో – బ్రిటిష్ ప్రాజెక్టుగా ‘స్వోర్డ్స్ అండ్ సెప్ట్రే’ అనే ఇంకో ఝాన్సీ బయోపిక్ స్వాతీ భిసే దర్శకత్వంలో పూర్తయి విడుదలకి సిద్ధమౌతోంది. ఇందులో ఝాన్సీ గా నటించిన దర్శకురాలి కుమార్తె దేవికా భిసే, కట్టుబొట్టు ఆహార్యంతో, పీరియడ్ లుక్ తో, నేటివిటీతో అత్యంత సహజంగా కన్పిస్తోంది (స్టిల్స్ చూడండి). దీన్ని అచ్చమైన మట్టి కథగా తీశారు. కంగనాది గిల్టు కథ. అట్టహాస ఆహార్యంతో, కులీన స్త్రీ పోకడలతో, నేటివిటీ అంటని డిజైనర్ చరిత్రలా తీశారు. రాణి అయినప్పటికీ లక్ష్మీ బాయి, కోటలో వుండేది కాదు. బయట సామాన్య జీవితంలోంచి వచ్చిన తను, ఆ సామాన్యుల మధ్యే తిరుగుతూండేది. ఇలాగే చూపించారు. అత్తగారు ఎంతగా కట్టడి చేసినా ఆగేది కాదు. ఏదో రాణిగా వున్నప్పుడు వదిలేస్తే, దానికి ముందూ తర్వాతా ఆమెని  మాసిండియా ప్రేక్షకులకి దగ్గరగా తీసికెళ్ళే సీదాసాదా నేటివ్ లుక్ లోకి మార్పు చేయాల్సింది. 

       ఒకచోట శత్రు సైనికులకి దుర్గా మాతలా కన్పిస్తుంది. ఇక్కడ కూడా మెలో డ్రామా సృష్టించి లక్ష్మీ బాయిని ఎలివేట్ చేయలేదు. అసలు ఈ పాత్రతో మెలోడ్రామా ఎక్కడా కన్పించదు. లేనిపోని సినిమాల్లో దేశభక్తిని మారు మోగిస్తున్నప్పుడు, దేశభక్తితోనే ముడిపడి వున్న లక్ష్మీబాయిని కనీసం దేశభక్తి మెలో డ్రామాతో నైనా కనెక్ట్ చేయలేదు. ఫెమినిస్టుతో ఇలాటి సినిమా తీస్తే ఇలాగే వుంటుందేమో. తనకి వైధ్యవ్యమని గుర్తు చేసినప్పుడు, ఇంకో బాలిక వితంతువుగా ఎదురైనప్పుడు లాంటి సీన్లు మాత్రం కంగనా ఇష్టంతో పెట్టించుకున్నట్టుంది. ఆ ఫెమినిజం పరమైన డైలాగులు కొడుతుంది. మీ అమ్మ ఇచ్చిందాన్ని (బొట్టు) లాగేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ ఆ వితంతు బాలికకి కుంకుమ పూసేస్తుంది. ఈ డైలాగులో కావలసినంత మాతృస్వామ్య భావజాల ప్రకటన! డైరెక్షన్ లోకి కూడా ఇదే జొరబడి క్రిష్ వెళ్ళిపోవాల్సి వచ్చిందేమో. కానీ సినిమాకి కావాల్సింది లక్ష్మీ బాయి మాతృ భూమి ప్రేమ – దాని ప్రకటన! 

         ఇందులో బ్రిటిషర్లుగా నటించిన నటులు ఏ మాత్రం ఎఫెక్టివ్ గా లేకపోగా,  బీగ్రేడ్ సినిమాల్లో వెర్రిమాలోకం విలన్స్ లా వున్నారు. వీళ్ళకంటే ‘అల్లూరి సీతారామరాజు’లో రూథర్ ఫర్డ్ గా నటించిన జగ్గయ్య ఏంతో బెటర్. ఒక్కరికీ నటన రాదు, డైలాగులు చెప్పడం రాదు. విగ్గులు మాత్రం ఆర్భాటంగా వుంటాయి. అందరూ ఒకేలా రివటల్లా వుంటారు. మెయిన్ విలనెవరో అర్ధంగాదు. ఇందులో కూడా ఆవిడ ఫెమినిజం దెబ్బ పడిందేమో తెలీదు. ఎవరెలా నటించాలో డైరెక్షన్ లిచ్చిన ఘనత ఆవిడదేనని క్రిష్ ఫిర్యాదు కదా? 

          లక్ష్మీ బాయి దళపతి గులాం గౌస్ ఖాన్ గా డానీ డాంగ్జోపా నటించాడు చాలా కాలానికి. ఆమె ఇతర ముఖ్య అనుచరులైన గుల్ మహ్మద్ గా రాజీవ్ కచ్చర్, ప్రాణ్ సుఖ్ యాదవ్ గా నిహార్ పాండ్యా, బ్రిటిషర్ లతో కుమ్మక్కయిన సదాశివ్ రావ్ గా మహ్మద్ జీషాన్ అయూబ్, రాజగురువుగా కుల్భూషణ్ కర్భందా నటించారు. తత్యా తోపే గా అతుల్ కులకర్ణి నటించాడు. 

          పాటల్లో హిట్స్ ఏమీ లేవు. ఛాయగ్రహణం, వీఎఫ్ఎక్స్ ఇతర సాంకేతికాలు 100 కోట్ల బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. ముందనుకున్న బడ్జెట్ 70 కోట్లే. క్రిష్ తప్పుకున్నాక కంగనా 30 పెంచి జీ ఫిలిమ్స్ మీద వేస్తే, జీ ఫిలిమ్స్ ఈ ప్రాజెక్టు బాధ్యుడ్నిడిస్మిస్ చేసి ఆమెకి జవాబు చెప్పింది. ఆమె నవ్వుతూ ఈ విషయాలు చెప్పింది. 

చివరికేమిటి 
        ఎప్పుడో 1953 లో షోరాబ్ మోడీ దర్శకత్వంలో ‘ఝాన్సీకీ రాణి’ తీశారు. అందులో ఆయన భార్య, 53 సినిమాల హీరోయిన్, మెహతాబ్ అలియాస్ నజ్మాఖాన్ లక్ష్మీబాయిగా నటించింది. ఆ తర్వాత బయోపిక్ ఇదే. ఇంకోటి ఇండో - బ్రిటిష్ ప్రాజెక్టుగా రాబోతోది. రెండు టీవీ సీరియల్స్ పూర్వం వచ్చాయి. ‘మణికర్ణిక’ లో యాక్షన్ దృశ్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టి, మొదట్నుంచీ ఆమె నేర్చున్న వేట, గుర్రపు స్వారీ, కత్తి సాము, తుపాకీ కాల్పులు, జిమ్నాస్టిక్స్  వంటి పోరాట విద్యల ప్రదర్శనకి ఎక్కువ స్కోప్ ఇస్తూ, యాక్షన్ పాత్రగా మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక ఉదాత్త కాన్సెప్ట్ తో ఎమోషనల్ చారిత్రక పాత్రగా చూపించ లేకపోయారు. పాత్ర ఎంట్రీ కూడా ‘పద్మావతి’ లో దీపికా పడుకొనే పాత్ర ఎంట్రీ లాగే చూపించడంతో, సినిమా ప్రారంభమే ఉస్సూరనిపిస్తుంది.  కంగనా పలికే ఒక డైలాగు కూడా ‘మొహెంజో- దారో’ లో హృతిక్ రోషన్ డైలాగుకి మక్కీకి మక్కీ కాపీ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హృతిక్ తో తనకి అసలే పడదు మరి. 

          ‘మణికర్ణిక’ బయోపిక్ ని, ఒక మంచి యాక్షన్ కొరియో గ్రఫీ కోసం చూడొచ్చు, క్లయిమాక్స్ దృశ్యాలతో కలుపుకుని. 

సికిందర్
    telugurajyam.com