రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, February 23, 2022

1134 : బుక్ రివ్యూ!

ఇరవై ఏళ్ళ క్రితం దర్శకుడు కె దశరథ్ హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ అన్న గ్రంథం పీడీఎఫ్ ఇచ్చినప్పుడు, సినిమా అవగాహన పట్ల అది కొత్త లోకాల్ని చూపించింది. సినిమాల్ని చూడడం కాదు, చదవాలని తెలిసిన విషయాన్నే ఎలా చదవాలో తెలియ చెప్పింది. సినిమా కళ పట్ల ప్రత్యేక ఆసక్తి గల వాళ్ళెవరూ సినిమాల్ని చూడరు, చదువుతారు (ఒక కొటేషన్ ప్రకారం సినిమాల్ని చదవాలట, నవలల్ని చూడాలట), చదివి చర్చిస్తారు. కొందరు వ్యాసాలు రాస్తారు. మరికొందరు అలా సినిమాలు తీస్తారు. సినిమా రివ్యూ రాయాలంటే, సాంకేతిక విషయాలు తెలియకపోయినా, కనీసార్హత స్క్రీన్ ప్లే శాస్త్రం తెలిసి వుండడమెలాగో, అలా సినిమా తీయాలంటే సినిమాల్ని చదవగల నేర్పూ అంతే అవసరం. రెగ్యులర్ కమర్షియల్లో చదవడానికేమీ వుండదు, వాటిని చూడడమే.

        కానీ శ్యామ్ బెనెగల్ తీసిన భూమిక లాంటివి చదవాలి. ఇంకెన్నో ప్రాంతీయ సినిమాల్ని చదవాల్సి వుంటుంది. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళకి ఈ చదవడాలెందు కనుకుంటే అది వేరు. కానీ చదవడాలనే అస్త్రం అమ్ముల పొదిలో గనుక వుంటే కమర్షియల్ సినిమాల్ని కమర్షియల్లాగా ఇంకా బాగా తీయొచ్చనుకుంటే ఇంకా వేరు. తీస్తున్న చాలా కమర్షియల్ సినిమాలు కమర్షియల్ సినిమాలా? విజువల్ సెన్స్ విస్తారమైనప్పుడు కమర్షియల్ సినిమాలకెంత తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో ప్రామాణికంగా తెలుసుకుని, కమర్షియల్ సినిమాల క్వాలిటీని పెంచ వచ్చు. 

      సరే, 1977లో వెలువడిన ఈ ప్రసిద్ధ పుస్తకం హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ తాజా ఎడిషన్లో మీడియా, మల్టీ మీడియాలపైనా కూడా అధ్యాయాల్ని చేర్చాడు రచయిత జేమ్స్ మొనాకో. ఇతను అమెరికన్ సినిమా విమర్శకుడు, రచయిత, ప్రచురణకర్త, విద్యా బోధకుడు. చలన చిత్రమనే డైనమిక్ మాధ్యమపు ప్రతి ప్రధాన అంశాన్నీ కలుపుతూ సవరించి, తిరగ వ్రాసి,మూడవ ఎడిషన్‌ ని అందించాడు. హౌ టు రీడ్ ఏ ఫిల్మ్ : మూవీస్, మీడియా, మల్టీ మీడియా అండ్ బియాండ్ అన్నది కొత్త టైటిల్. కళ, శిల్పం, సున్నితత్వం, శాస్త్రం, సాంప్రదాయం, సాంకేతిక విజ్ఞానం మొదలైన వాటిని తేలిక భాషలో వివరించాడు. నవల, చిత్రకళ, ఛాయాగ్రహణం, టీవీ, సంగీతం వంటి ఇతర కథన మాధ్యమాలతో సినిమాలకున్న దగ్గరి సంబంధాపరిశీలన చేశాడు. తర్వాత, చలనచిత్రాలు ఎలా అర్థాన్ని తెలియజేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి అవసరమైన సహాయక అంశాలని చర్చించాడు.

        ముఖ్యంగా, అసలు సినిమా దృశ్యం మనకేం చెబుతోందో, దాన్నెలా గుర్తించి అర్ధం జేసుకోవాలో వివరించాడు. నిరంతర అభివృద్ధి పథంలో పయనిస్తున్న డిజిటల్ టెక్నాలజీ ని జోడించి ఇప్పుడు సినిమాల్ని ఎలా చదవాలన్న దానిపై కూడా అర్ధమయ్యేలా చెప్పాడు. మల్టీమీడియాపై అధ్యాయంలో ఇరవై ఒకటో శతాబ్దంలో వర్చువల్ రియాలిటీ, సైబర్‌స్పేస్ లతో సినిమాలకున్న సామీప్యత వంటి అంశాల గురించి సమగ్ర చర్చతో ఈ పుస్తకాన్ని నింపాడు. ఫిల్మ్ అండ్ మీడియా: క్రోనాలజీ అని చేర్చిన అనుబంధం పుస్తకం పరిధిని కూడా రెట్టింపు చేసింది. ఈ పుస్తకంలో కొత్త పీఠిక, విస్తరించిన గ్రంథ పట్టిక, వందలాది తెలుపు-నలుపు సినిమా ఛాయాచిత్రాలతో సోదాహరణ వివరణ, రేఖాచిత్రాలూ పొందు పర్చాడు. ఎసెన్షియల్ లైబ్రరీ అన్న ప్రకరణంలో సినిమాలు, మీడియా -ఈ రెండిటి గురించి మీరు చదవాల్సిన వంద పుస్తకాలు అని జాబితా కూడా ఇచ్చి మనపైన భారం కూడా వేశాడు. మీరు చూసి తీరాల్సిన వంద సినిమాలు అని ఇంకో జాబితా కూడా ఇచ్చి మరింత భారాన్ని మోపాడు.

        పుస్తకం ధరకూడా పెను భారమే. అమెజాన్లో రెండు వేల రూపాయలు. రెండు వేలు పెట్టి పుస్తకం కొనాలా? అసిస్టెంట్ కి రెండు వేలు ఎక్కడ్నించి వస్తాయి? తెలివైన అసిస్టెంట్ ఉచిత పీడీఎఫ్ లింకులు చాలా వున్నాయి- డౌన్ లోడ్ చేసుకుని చదువుకుంటాడు. చదువుకుంటే ఆలోచనలో పడతాడు. ఇంత వుందా- ఐతే మనమేం పని కొస్తాం- అని కళ్ళు తెరిస్తే ఇంటికెళ్ళి పోతాడు. మనకి పనికొచ్చేదే ఇచ్చాడు- అనుకుంటే ఇక్కడే వుంటాడు. అప్పుడు అయోమయపు కమర్షియల్ సినిమాలు రావడం చాలా తగ్గి జీవితం బావుంటుంది.  చక్కటి వడబోత.

—సికిందర్

(సినిమాని చదవడం గురించి కింద
భూమిక లింక్ క్లిక్ చేయండి)