రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 24, 2022

1195 : లైగర్

 

    రేపే పానిండియా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ థియేటర్స్ ని షేక్ చేస్తూ విడుదలవుతోంది. ఈలోగా దీని స్టోరీ లీక్ అయిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ లీక్ అవక పోయినా దీని స్టోరీ ఎలా వుంటుందో చెప్పొచ్చు. బాక్సర్ సినిమా కథలు కూడా మూసే కాబట్టి. గతంలో రవితేజతో పూరీజగన్నాథ్ తీసిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లో రవితేజ బాక్సరే. జయసుధ అతడి మదర్. మదర్ సెంటిమెంటుతో ఈ బాక్సర్ కథ. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గని అనే మరో బాక్సర్ మూవీ వచ్చింది. ఇందులోకూడా మదర్ సెంటిమెంటే. బాక్సింగ్ అంటే ఇష్టం లేని మదర్ నదియాతో వరుణ్ తేజ్ స్ట్రగుల్. ఇప్పుడు లైగర్ కథ లీక్ అయిందని విన్పిస్తున్న వెర్షన్లు కూడా ఇదే కోవలో వున్నాయి- రౌడీ స్టార్ కి మదర్ రమ్యకృష్ణతో సెంటిమెంటల్ డ్రామా.

        నాడెప్పుడో అమితాబ్ బచ్చన్ తో త్రిశూల్ అని వచ్చింది. ఇందులో అక్రమ సంతానమైన అమితాబ్ బచ్చన్, తల్లి వహిదా రెహమాన్ కి న్యాయం చేయడం కోసం, బిల్డర్ అయిన తండ్రి సంజీవ్ కుమార్ తో తలపడతాడు.

ఇదే యాంగిల్ లీకైన ఒక వెర్షన్లో కన్పిస్తుంది... ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ లైగర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, రౌడీ స్టార్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ వుంటుంది. లైగర్ సినిమా కథ నటి నీనా గుప్తా వ్యక్తిగత జీవితం నుంచి తీసుకున్నట్టు ఈ వెర్షన్. ఈమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్ ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోకుండానే కుమార్తె మసాబాకి జన్మనిచ్చింది. లైగర్ కూడా ఇదే స్టోరీ లైన్‌లో వుండబోతోందని వూహాగానాలు. ఇందులో రౌడీ స్టార్ తను అక్రమ సంతానమనే ఉక్రోషంతో సొంత తండ్రి మైక్ టైసన్‌తో తలపడతాడు- త్రిశూల్ లో అమితాబ్ లాగా అన్నమాట.

వైరల్ అవుతున్న ఇంకో వెర్షన్ ఏమిటంటే, ఇది మైక్ టైసన్ నిజ జీవిత కథ అని ఇన్‌సైడ్ టాక్. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా మైక్ టైసన్ బాల్యం చితికిపోయిన సంగతి తెలిసిందే. టైసన్‌ ని  అతని తల్లి పెంచింది. భర్తతో గొడవల కారణంగా  ఆమె డిప్రెషన్‌లో వుండేది. ఇంట్లో పరిస్థితులతో విసుగు చెంది కోపంతో వున్న మైక్ టైసన్ అనవసరమైన గొడవలకి దిగి స్కూల్లో తోటి స్టూడెంట్స్ ని కొట్టేవాడు. తల్లికి ఫిర్యాదులు రావడంతో, ఆమె చితగ్గొట్టేది. టైసన్ 13 ఏళ్లు దాటకముందే 38 సార్లు జైలుకు వెళ్లాడు. అతడి వార్తలు మీడియాలో కనిపించేవి. ఇది చూసి  న్యూయార్క్ కి చెందిన బాక్సింగ్ శిక్షకుడు టైసన్ కోపాన్ని బాక్సింగ్ వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మలుపు ప్రపంచానికి మైక్ టైసన్ రూపంలో బాక్సింగ్ లెజెండ్‌ ని  అందించింది. లైగర్ లో రౌడీ స్టార్- రమ్య కృష్ణ ల మధ్య ఈ కథే వుండబోతోందని వార్తలు.

ఈ వెర్షన్ ప్రకారం కరీంనగర్‌కి చెందిన రమ్యకృష్ణ  కొన్ని కారణాల వల్ల ముంబైకి వెళుతుంది. అక్కడ ఆమె ఒక మురికివాడలో టీ దుకాణం నడుపుతూ నివసిస్తుంది. ఆ మహానగరంలో ఒంటరి స్త్రీగా సమస్యల్ని ఎదుర్కొంటూ రౌడీ స్టార్ కి ధైర్యవంతురాలైన తల్లిగా మారుతుంది. అయితే రౌడీ స్టార్ ఆమెకి తెలియకుండా ఫైటర్ గా మారతాడు. కొడుకు ఫైటర్ కావడం రమ్యకృష్ణకి అస్సలు ఇష్టముండదు. కానీ రౌడీ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గొప్ప ఫైటర్‌గా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అవుతాడు.

లీకులు తెలుగు సినిమాలకి కొత్త కాదు. ఆచార్య కథని మెగా స్టార్ చిరంజీవి కూడా ఈవెంట్స్ లో వాయిదాల పద్ధతిన లీక్ చేస్తూ పోయారు. అల్లు అర్జున్ పుష్ప’, మహేష్ బాబు సర్కారువారి పాట’, నాగార్జున-నాగ ఛైతన్య ల బంగార్రాజు’, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, ప్రభాస్ రాధేశ్యామ్ కథలు కూడా లీకయ్యాయి.

ఇంకా నిర్మాణం ప్రారంభం కానీ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కథ కూడా లీక్... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న బాలాయ మూవీ కథ గురించి జోరుగా చెప్పుకుంటున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం. ఒకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యపు కథ. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన  కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అనంతపూర్ కి ఓ భారీ పరిశ్రమ రావాల్సి వుంది. అది వేరే రాష్ట్రానికి తరలిపోయింది.. ఇలా వుంటుంది ఈ కథ అని లీకులిస్తున్నారు.

ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అయితే ఏకంగా సినిమాలోని దృశ్యాలే సోషల్ మీడియాలో దర్శన మిచ్చాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట  ట్రైలర్ తో బాటు, అల్లు అర్జున్ పుష్ప లోని దాక్కో దాక్కో పాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.

ఇంకా గమ్మత్తేమిటంటే, కథా రచయితే కథని లీక్ చెయ్యడం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్- కథేమిటో చెప్పేశారు. రాజ‌మౌళికి జంతువులంటే చాలా ఇష్టం కాబ‌ట్టి ఆఫ్రికా అడ‌వుల నేపథ్యంలో కథ వుంటుందని చెప్పేశారు. ప్రసిద్ధ అమెరికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఒక హిస్టారికల్ థ్రిల్లర్ ని కథ కోసం తీసుకున్నట్టు కూడా చెప్పేశారు...ఉండుండి ఆ మధ్య పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కథ కూడా లీకైందని వార్తలొచ్చాయి.

ఈ విధంగా టాలీవుడ్ లో లీకుల పరిశ్రమ వెలసి దాని పని అది చేసుకు పోతోంది. సంతోషించాల్సిందేమిటంటే, లీకులు పాజిటివ్ గానే వుంటున్నాయి. సినిమాలు డ్యామేజ్ అయ్యేలా కథల్ని చెత్తగా మార్చి విష ప్రచారాలు చేయడం లేదు.
***