రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, February 24, 2017

రివ్యూ!




స్క్రీన్ ప్లే –దర్శకత్వం : గోపీచంద్ మలినేని

తారాగణం : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కల్యాణి, జతిబాబు, అనూప్ సింగ్, ముఖేష్ రుషి, రఘుబాబు, ఆలీ, వెన్నెలకిశోర్ దితరులు

కథ :  శ్రీనివాస్ వెలిగొండ, మాటలు : రవి అబ్బూరి, సంగీతం : థమన్ ఎస్. ఎస్, ఛాయాగ్రహణం : నాయుడు ఛోటా కె 

బ్యానర్ :  క్ష్మీ సింహా ప్రొడక్షన్స్
నిర్మాతలుః  బుజ్జి ల్లలుపు,  ధు ఠాగూర్
విడుదల : ఫిబ్రవరి 24, 2017
***

       అనుబంధాల కథలతో సినిమాలు తీయడం పక్కన పెట్టి, దశాబ్దంన్నర కాలంగా కొత్త ట్రెండ్ లో యాక్షన్ సినిమాలు, యాక్షన్ కామెడీలూ తీస్తూ వుండిపోయిన టాలీవుడ్-  తీరా అనుబంధాల కథలో, లేదా ఫ్యామిలీ కథలో తీయాల్సి వచ్చేటప్పటికి - వాటిని  అదే పాత ఫార్ములాగా రొటీన్ యాక్షన్ సినిమాలకి కృత్రిమ భావోద్వేగాలతో నింపేసి  వదిలేస్తున్నారు. తాజాగా ‘విన్నర్’ కూడా ఇదే చట్రంలో ఇరుక్కుని ఈ కాలానికి తగ్గ అనుబంధాల పునర్నిర్వచనం రాసే అవకాశాన్ని పోగొట్టుకుంది. చూపించదల్చుకున్న  గుర్రప్పందాల నేపధ్యం ఆధునికమైనప్పుడు, అనుబంధాల కథ కూడా అంతే ఆధునికమై ఎందుకుండ కూడదన్న ప్రశ్న లేవనెత్తుతోంది ఈ మలినేని గోపీచంద్ తాజా ఆఫర్. 

          ఇందులో హీరో సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ గా ఆట తను నిర్ణయించాల్సింది పోయి,  ప్రత్యర్ధి చేతిలో పెడితే అది విన్నర్ లక్షణం ఎలా అవుతుందని ముందే ప్రశ్నించు కోవాల్సింది. ఆ రూల్స్ తాను  నిర్ణయించి వుంటే,  ఈ ‘విన్నర్’ అనుబంధాల కథలకి కొత్త రూట్ మ్యాప్ అయ్యేది.
          
         హంగూ ఆర్భాటాలతో అట్టహాసమైన దృశ్యాలు,  భారీ తారాగణం - ఇవుంటే చాలు   అదొక కుటుంబ అనుబంధాల కమర్షియల్ అయిపోతుందనుకుంటే, బాక్సాఫిసు వేరే  గళంలో దాని బాణీ అది విన్పిస్తుంది...

కథ
          సిద్ధార్థ్ రెడ్డి (సాయి ధరమ్ తేజ్) చిన్నప్పుడు తాత (ముఖేష్ రిషి) చేసిన కుట్ర కార ణంగా తండ్రి మహేంద్ర రెడ్డి (జగపతి బాబు) కి దూరమవుతాడు. తండ్రి అన్నా, తండ్రి చేసే గుర్రప్పందాల వ్యాపారమన్నా ద్వేషం పెంచుకుంటాడు. పెద్దవాడై ఒక పత్రికకి ఎడిటర్- కమ్ - ఓనర్ అవుతాడు. సితార (రకుల్ ప్రీత్ సింగ్) అనే ఒక అథ్లెట్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె అతణ్ణి తిరస్కరించి తండ్రి చూసిన వేరే సంబంధం చేసుకుంటూంటుంది. ఈ పెళ్లిని ఆ పాలని సిద్ధార్థ్ వెళ్తాడు. అతణ్ణి చూసి ఆమె తండ్రికి ఎదురు తిరుగుతుంది- సిద్ధార్థ్ నే చేసుకుంటానంటుంది. ఈ  పెళ్లి కొడుకు ఆది (అనూప్ సింగ్)  కంటే సిద్ధార్థ్ గొప్ప జాకీ అని చెప్పేస్తుంది. అక్కడికే వచ్చిన తండ్రి మహేంద్ర రెడ్డిని ఇరవై ఏళ్ల తర్వాత చూసి సిద్ధార్థ్ కలవరపడతాడు. ఆ తండ్రి మహేంద్ర రెడ్డి తన కొడుకు ఆదితోనే ఈ పెళ్లి జరుగుతుందనీ, రేసులో ఆది సిద్ధార్థ్ ని ఓడిస్తాడని ఛాలెంజి విసురుతాడు.

          ఇప్పుడు సిద్ధార్థ్ ఏం చేస్తాడు? జాకీగా మారి ఆదిని ఓడించి సితారని చేపడతాడా?
చిన్నప్పుడు దూరమైన సిద్ధార్థ్ తానేనని తాతా తండ్రీ తెలుసుకునేలా చేస్తాడా? ...ఇవి తెలుసుకోవాలంటే మిగతా ఆట చూడాల్సిందే.

ఎలావుంది కథ
          తెగిపోయిన అనుబంధాలని అతికించే మరో పాత కథ ఇది. అనుబంధాలు తెగిపోవచ్చు- కానీ అతికించే విధానంలో ఎక్కడో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆగిపోయిన మరో కథ ఇది. కథకుడు వెలిగొండ శ్రీనివాస్ పాత కథలవైపే చూసి వాటిలోంచి ఈజీగా పది కథలు కన్పించే  కథ అల్లేస్తాడు. కాకపోతే ఈసారి గుర్రప్పందాలతో  హడావిడి చేశాడు. అనుబంధాల కంటే డబ్బే ప్రధానమైన ఈ కాలంలో కేవలం నాల్గు డైలాగులతో, రెండు కన్నీటి బొట్లతో, లేదా ఏదో ఓ ఛాలెంజితో  తిరిగి మనుషుల్ని కలిపేయడం ఇలాటి కథలు రాసేసినంత సులభమా? విడిపోవడానికి ఏది కారణమవుతుందో కలపడానికీ  అదే కారణమవుతుందనేది సింపుల్ లాజిక్, ట్రూత్. ఈ కోవలో ఆ లోచించి వుంటే గుర్రాలు కూడా ఒక పాత్ర వహించి ఈ కథ ఎక్కడికో వెళ్ళిపోయేది...

ఎవరెలా చేశారు
          సాయిధరమ్ తేజ్ నిజాయితీగా నటించాడు. గత సినిమాల్లోని ఓవరాక్షన్, మాస్ కోసం వూర యాక్షన్ ఈసారి చేయకుండా రక్షించాడు. కానీ  ఈ అనుబంధాల కథలో వున్న సీన్లలో కూడా తన బాధతో ఒక్క చోటా  ఏడ్పించలేక పోయాడు. రోమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లూ జస్ట్ వినోదం కోసమే వుండొచ్చు- బరువైన సీన్లు నటుడన్పించుకునేందుకు వుంటాయి.అలాటివి కొన్ని పెట్టించుకుని వుండాల్సింది- కనీసం ఎక్కడా కళ్ళల్లో నీళ్ళు కూడా తిరగనప్పుడు అనుబంధాల ప్రాకులాట ఎందుకు. కేవలం జాకీగా అందర్నీ జాయింటుగా కలిపేయ వచ్చనుకున్నాడా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా గుర్రపు స్వారీ చూసి గంతులేసి చంకనెక్కడానికి? పైగా వాళ్ళు చెప్తేనే  కదా తను క్లయిమాక్స్ లో జాకీ అవాల్సి వచ్చింది. ఇతరులు చెప్పకుండా ఏది ఎలా సాధించాలో తన ఎడిటర్ –కమ్- ఓనర్ బుర్రకి తెలియాలి కదా? ఎడిటర్ అనేవాడు ఇతరులకంటే పైస్థాయిలో ఆలోచిస్తాడు కదా? లేకపోతే పేపర్ని ఎవ్వరూ కొనరు కదా?  ఇలా పాత్ర పాసివ్ కాకుండా చూసుకోవడమే గాక, పాత్ర చిత్రణ కూడా సరి చూసుకున్నాకే  సినిమాలు ఒప్పుకుంటే బావుంటుంది. ఎందుకంటే, ఇంకో రెండు దశాబ్దాలు గడిచినా కథలు చెప్పే వాళ్లకి యాక్టివ్ – పాసివ్ తేడాలు తెలీవు. కేవలం స్టార్ తమని ఒడ్డున పడేస్తాడని ఏదో ఒకటి విన్పించేస్తారు.

          రకుల్ ప్రీత్ సింగ్ ది అయోమయం పాత్ర. తన కేం కావాలో, అదెలా కావాలో తనకేం తెలీదు. అథ్లెట్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకునే తను, ఇందుకోసం హీరో ప్రేమనే ఛీకొట్టే తను- తీరా ఆ హీరోయే తీసికెళ్ళి స్టేడియంలో పడేస్తే గానీ పోటీలున్నాయని తెలియని తను, ఆ పోటీ గెలిచి గోల్డ్ మెడల్ అందుకుని- ఇపుడు మనమెలా లవ్ చేసుకుందాం? – అంటుంది సిగ్గుఎగ్గు లేకుండా.

          జగపతిబాబు పాత్రకి కొంత సస్పెన్స్, డెప్త్ వున్నాయి- వీటితో నటనకి- చివర్లో ఎమోట్ అవడానికీ అర్ధంపర్ధం వచ్చాయి. విలన్ తాతగా ముఖేష్ రుషి, విలన్ గా అనూప్ సింగ్ లది రొటీన్ విలనీ. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది ప్రేక్షకులకి. ట్రైనర్ గా అలీ కథలో సరీగ్గా ఇమడని కామెడీ. ఇలా అన్నీ ఇమడనివే వున్నాయి- అతుకులేస్తే కథ అతకదు, అల్లితే కథ అల్లుకుంటుంది. 

          థమన్ సంగీతం లో ‘సితారా...’ అనే సాంగ్ ఓకే. ఫాదర్ సెంటి మెంట్ మీద సాంగ్ కి సన్నివేశ బలం లేదు. ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ ఎప్పటిలాగే నీట్. ప్రొడక్షన్ విలువలు ఆర్భాటంగా వున్నాయి. అబ్బూరిరవి మాటలు మసాలా మాటలే. 

          దర్శకుడు మలినేని గోపీచంద్ ఈ కథని ఎప్పుడూ వుండే తెలుగు సినిమా పాత మూస ఫార్ములా టెంప్లెట్ లో పెట్టేసి సరిపెట్టేశారు. చూసిందే చూపించే ఈ వరసకన్నా ఇంకో విధానమే లేదా? అన్నికథలకీ ఒకే  సింగిల్ విండోనా? దీన్ని మార్చుకుంటే, అసలే కొత్త  కథలు చెయ్యలేని తమలాంటి వారికి  ఆ పాతవాటినే కాస్తయినా కొత్త  విధానంలో చెప్పే అవకాశం రాదా? ఇలా హీరో మాస్ డైలాగులతో ఎంట్రీ, ఓ ఫైట్, ఓ సాంగ్, ఆ వెంటనే హీరోయిన్ ని పడేసే ఓ లవ్ ట్రాక్, ఇదే  ఇంటర్వెల్ దాకా సాగిసాగి అప్పుడు- ఈ లవ్ తో సంబంధంలేని వేరే కథ- సెకండాఫ్ లో ఈ వేరే కథని కూడా పైకెత్త లేక నాన్చి నాన్చి అదే రొటీన్ ముగింపూ- ఇదే కొనసాగాలా? 

          ‘విన్నర్’ తీసిన కథనే తిరగేసి చెప్తే ఎలా విన్ అయ్యేదో రేపు ‘స్క్రీన్ ప్లే సంగతులు’ లో చూద్దాం.

- సికిందర్
http://www.cinemabazaar.in